అమ్మ ఈమెయిల్ ఎప్పట్లాగే మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను. ప్రతీ సారీ అదే వాక్యం దగ్గర ఆగిపోతున్నాను.
“జయత్తకి ఈ మధ్య గుండె పోటు రావటంతో ఆస్పత్రిలో చేర్పించారు.”
అంతే వుంది. ఇంకేమీ వివరాలు లేవు. నిజమే మరి. మాకావిడ దగ్గరి బంధువు కూడా
కాదు. కానీ చాలా యేళ్ళు మా ఇంట్లోనే వున్నారు. నాకామెతో ఎవరికీ లేని, ఎవరికీ అర్ధం కాని అనుబంధం వుండేది.
పడుకున్న వాణ్ణల్లా లేచి హైదరాబాదులో అమ్మకి ఫోన్ చేసాను.
” ఎందుకురా నాన్నా ఎప్పుడూ లేనిది సోమ వారం చేసావు? కోడలూ పిల్లలూ అంతా బాగే కదా?” అమ్మ
అడుగుతోంది ఆదుర్దాగా.
“అంతా బాగేలే. ఊరికే నిద్ర పట్టక ఫోన్ చేసా. సరే కానీ, జయత్తకి గుండెపోటేమిటి?వివరాలేమీ రాయలేదు నువ్వు!”
“అదా! వివరాలేముంది, ఏమీ లేవు. పెద్దతనం, అంతే! రాజా ఆ మధ్య ఫోన్ చేసి ఒంట్లో బాగా లేదని చెప్పాడు. హార్ట్ ఎటాక్
అని చెప్పి హాస్పిటల్లో చేర్చారట.” నిరాసక్తంగా చెప్పుకు పోతుంది అమ్మ.
“శశి వచ్చిందా?”
“ఏమోరా! నేను వెళ్ళలేదు. పిల్లలిద్దరికీ పరీక్షలు. అన్నయ్యా వదినలకేమో ఆఫీసులో సెలవు పెట్టే వీలు లేదు. అందుకే మీ నాన్నొక్కరే వెళ్ళారు.”
“సరే! దసరా పండగప్పుడు ఇంటికొచ్చి అట్నుంచి నేనూ ఇబ్రహీం పట్నం వెళ్ళీ రాజాని ఒకసారి చూసొస్తాను.”
***********
మంచం మీద పడుకున్నానే కానీ నా ఆలోచనలన్నీ జయ అత్త చుట్టే తిరుగుతున్నాయి. విచిత్రమైన, అసహజమైన పరిస్థితులలోకి జీవితం నెట్టినా, ఎవరినీ ఏమీ ప్రశ్నించకుండా, ఎవరి నిర్ణయాలూ ఎదిరించకుండా బ్రతకడానికే ప్రయత్నించింది పాపం. నాకు అలాటి నిస్సహాయుల్ని చూస్తే జాలి.
ఆమె మా మేనత్త రుక్మిణికి స్వయానా సవతి! వినటానికి ఈ రోజుల్లో అసహ్యంగా అనిపించొచ్చు కానీ అప్పట్లో అది మామూలేనేమో.
మా మేనత్త రుక్మిణికి చిన్నప్పట్నించీ మతి స్థిమితం వుండేది కాదట. ముగ్గురన్నదమ్ముల మధ్య పుట్టినా ఆమె భవిష్యత్తు గురించి మా తాతగారు భయపడేవారు. అందుకే ఆయన ఒక నిర్ణయానికొచ్చారు.
బంధువర్గంలోని శ్రీనివాస రావుకి కబురు చేసారు. తన బిడ్డని పెళ్ళాడి సంఘంలో ఒక స్థానం కలిపిస్తే ఆయన బ్రతికినన్నాళ్ళూ ఆయన్నీ ఆయన కుటుంబాన్నీ పోషిస్తానని బేరం పెట్టాడు. ఎందుకంటే శ్రీనివాస రావు గారికి అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు!
ఆయనా, ఆయన భార్య జయ అత్తయ్యా ఆ షరతుకి ఒప్పుకోవటంతో పెళ్ళి జరిగిపోయింది. అన్న మాట ప్రకారం ఆ కుటుంబం బాధ్యతంతా తాతగారే పైన వేసుకున్నారు. వాళ్ళంతా మాతోటే ఉమ్మడి కుటుంబంలో వుండే వారు. వాళ్ళ పిల్లలు శశీ, రాజూ మాతో పాటే స్కూలుకొచ్చేవాళ్ళు.
ఈ బేరంలో అందరూ లాభ పడ్డారు. మా మేనత్త రుక్మిణమ్మకి జీవితాంతం సేవలు చేసే సేవకురాలు దొరికింది. తాతయ్యకి తన బిడ్డని గురించిన బెంగా వదిలింది. శ్రీనివాస రావు మావయ్యకి బార్యా పిల్లలని చూసుకోవటం లాటి చికాకు పెట్టే బాధ్యతలు తప్పి హాయిగా సంగీత సాహిత్యాల చుట్టూ తిరుగుతూ సిగరెట్లు కాల్చుకోవటానికి వీలు దొరికింది. మా నానమ్మకి తను నోటికొచ్చినట్టూ తిట్టినా పడి, వంటింట్లో తన చేతికింద వుండే కుక్కిన పేను దొరికింది.
ఇంత మందిలో ఒక మనిషి పూర్తిగా తన వ్యక్తిత్వాన్నీ, ఆత్మాభిమానాన్నీ తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇలాటి ఏర్పాటుకి ఆవిడ ఎందుకు ఒప్పుకుంది? చిన్నప్పట్నించీ నన్ను తొలిచే ప్రశ్న అది.
సినిమాల్లో ఉమ్మడి కుటుంబాలను ప్రేమాభిమానాలూ, సిరి సంపదలూ కారి పోతున్నట్టు చూపిస్తారు కానీ, నాకైతే చిన్నప్పట్నించీ ఉమ్మడి కుటుంబాలంటే చాలా చిరాకు.
ఉమ్మడి కుటుంబాల్లో ఏ బాధ్యతా మగ వాళ్ళ దగ్గరికి రాదు. చిన్న పిల్లలవీ, వృద్ధులవీ, పని వాళ్ళవీ,ఏ సమస్యలూ అనారోగ్యాలూ ఏవీ వాళ్ళ దాకా రావు. అందుకే వాళ్ళకా ఏర్పాటూ నచ్చుతుందేమో మరి.
మా ఇంట్లోనే చూస్తే, మా నాన్న తరం వారి అన్న తమ్ములు ముగ్గురు. ముగ్గురన్నదమ్ములకీ డబ్బు సంపాదన తప్ప వేరే ఏ బాధ్యతా లేదు. వాళ్ళని పెళ్ళాడిన ముగ్గురు ఆడవాళ్ళూ వేరు వేరు ఊళ్ళనించీ వేరు వేరు కుటుంబాలనించీ వచ్చి ఇంట్లో సర్దుకున్నారు.
ముగ్గురన్నదమ్ములనీ, వాళ్ళ వాళ్ళ సంపాదనలనీ ఒక్క తాటి మీద వుంచేందుకూ, వాళ్ళ సంతతివీ, వాళ్ళ తల్లి తండ్రులవీ బాగోగులు చూడ్డం కోసం వాళ్ళు వంటా వార్పూ ఇంటి పనులూ తప్ప ఇంకే వ్యాపకమూ లేని వాళ్ళయ్యారు. స్త్రీ సహజమైన అసూయలనీ, పొసెసివ్ నెస్ నీ జయించి కుటుంబాన్ని కాపాడుకోవటానికి వాళ్ళకేవిధమైన ట్రెయినింగూ, కౌన్సెలింగూ లేదు. అసలే రకమైన సహాయమూ లేదు! పదహారు పదిహేడేళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మీ చావు మీరు చావండని అత్త వారింట్లో పడేసారు!
ఇంతా చేసి పిల్లలు పెద్దయి ప్రయోజకులైన తరువాతా, పెద్దలు ప్రశాంతంగా కన్ను మూసింతరువాతా సంఘం నించి దక్కిన ప్రశంసలూ ముగ్గురన్నదమ్ములకే. ఆ క్రమంలో ఆ ఆడవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వంటింట్లో అనుకున్న మాటలూ, ఆ మాటలతో చేసుకున్న గాయాలూ, ఆ గాయలనించి స్రవించిన రక్తమూ, అమాయకత్వంతో వాళ్ళు కార్చిన కన్నీళ్ళూ ఎవరికి పట్టింది?
గయ్యాళి అత్తగార్నీ, రోగిష్ఠిదైన ఆడపడుచునీ ఏమీ అనలేని కసిని వాళ్ళు నిర్భాగ్యురాలై తమ ఇంట తల దాచుకున్న దిక్కులేని స్త్రీమీద తీర్చుకున్నారు. ఉమ్మడి కుటుంబంలో లేక పోతే వాళ్ళు మామూలు స్త్రీలలాగా ఒకళ్ళకొకళ్ళు కష్ట సుఖాల్లో సహాయం చేసుకుంటూ హుందాగా వుండే వారేమో!
నేను ఇంట్లో అందర్లోకీ చిన్నవాణ్ణవటం చేత అంతా, ముఖ్యంగా ఆడవాళ్ళు బాగా గారాబం చేసే వాళ్ళు. ఎప్పుడూ నానమ్మతో వంటింట్లోనే గడిపేవాణ్ణి. పొద్దున్నే నేను లేచి కళ్ళు నులుముకుంటూ వంటింట్లోకి వెళ్ళగానే తెల్లటి మొహం మీద ఎర్రటి కుంకుమ బొట్టుతో ఎదురొచ్చేది జయత్త. “మా బంగారు బాబు నిద్ర లేచాడే! పాలు తాగుతావా నాన్నా?” అంటు దగ్గరికి తీసి ముద్దు చేసేది. అప్పుడే స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించిన సువాసనా, ఆమె చేతుల్లో వెచ్చదనమూ నాకెంత హాయిగా వుండేదో, ఇప్పటికీ గుర్తుంది నాకు.
”వాణ్ణి ముద్దు చేసింది చాల్లే! ఇటొచ్చి ఈ గిన్నెలన్నీ సర్ది లోపల పెట్టు,” అని నానమ్మ కసిరినా ఆవిడ అలాగే నవ్వుతూ వుండేది. మన మీద ఆధార పడ్డ వారినీ, మనం తప్ప వేరే గతి లేని వాళ్ళనీ ఈసడించటం ఎంత తేలిక!
ఆ ఆధార పడటం ఆర్ధికంగా అయితే ఇక మనకి పట్ట పగ్గాలుండవు. ఆవిడ వంటింట్లో సాయానికొస్తే మడీ ఆచారం సరిపోలేదని పిల్లల పని చూడమనే వారు. పిల్లల పని చూస్తే “హాయిగా పిల్లలతో ఆడుకుంటూందని” గొణిగేవారు.
తన భర్తే అందరు మగవాళ్ళలా సంపదనాపరుడూ, బాధ్యత గలవాడూ అయి వుంటే అవిడ ఇలా ఇంకొకరి పంచన చాకిరీ చేస్తూ పడి వుండటానికి ఒప్పుకునేదా? అసలావిడకి ఎప్పుడూ తనని ఇలాటి పరిస్థితిలోకి నెట్టిన భర్తని తలుచుకుంటే కోపం రాదా?
సమర్థుడైన భర్త లేకపోవటం ఆడదాన్నింత బలహీనురాల్ని చేస్తుందా? అయితే ఆడదానికి వచ్చే బలమూ, మర్యాదా అన్నీ భర్త నుంచేనా? ఇంతకన్నా అన్యాయం ఇంకేదైనా వుందా? ఇలాటి ప్రశ్నలతో నా చిన్న బుర్ర వేడెక్కి పోయేది. జీవితంలో మనక్కావాల్సిన దాన్ని మనం చేతులారా కష్టపడి గెలుచుకోకుండా ఇంకొక మనిషి వల్ల లభిస్తే కానీ వేరే మార్గం లేకపోవటం చాలా భరించలేని పరిస్థితి అనిపించేది నాకు. అందుకే ఆ తరం స్త్రీలంటే నాకు చాలా జాలి.
చాల యేళ్ళవరకు నాకు జయత్త మా ఇంట్లో వుండటంలో ఏమీ వింత అనిపించేది కాదు. కానీ పదేళ్ళు వచ్చింతరువాత ఆవిడ ఒక్కతీ పిల్లలతో పడుకోవటం, మిగతా ఆడవాళ్ళంతా వాళ్ళ వాళ్ళ భర్తలతో గదిలో పడుకోవటం చూసి, ఆవిడకి భర్త లేరా అని అనుమాన పడ్డాను. కానీ ఆవిడ అలా విధవరాలిలా కాకుండా చక్కగా పెద్ద కుంకుమ బొట్టూ, సిగ నిండా పూలూ పెట్టుకునేది. పైగా మావయ్యని “ఏవండీ” అని పిలుస్తూ ఆయన క్కావాల్సినవన్నీ అందిస్తుండేది.
పదేళ్ళ వయసులో పెద్దవాళ్ళ మాటల్లో ఒకరోజు అర్ధమైంది, ఆయనకిద్దరు భార్యలని. అసహ్యంతో ఆ రోజంతా ఆయనతో మాట్లాడలేదు. తరువాత మళ్ళీ మామూలయ్యాను. రాత్రుళ్ళు మా పక్కనే పడుకున్న అత్త ఏడుస్తుందని నాకనుమానం వొచ్చేది.
ఇంట్లో నానమ్మా, అమ్మా, పెద్దమ్మలిద్దరూ, శ్రీనివాసరావు మావయ్యా అంతా ఆమెని కష్ట పెడుతూ, నానా మాటలంటూ ఆమె చేత చాకిరీ చేయించుకుంటున్నారని నాకెందుకో అర్ధం కాని కోపంగా వుండేది. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు శశిని పెళ్ళాడి ఆవిడని దూరంగా తీసికెళ్ళాలని కూడా నిర్ణయించుకున్నాను. కానీ శశి పెళ్ళప్పుడు ఎవరూ నా అభిప్రాయం అడగలేదు! మా పెదనాన్న గారే సంబంధం చూసి చేసారు. తాతయ్య శ్రీనివాస రావు మావయ్య కిచ్చిన మాట తప్పే ఉద్దేశ్యం ఎవరికీ లేకపోవటం కొంత అదృష్టం. శశి పెళ్ళీ, రాజు చదువూ అన్నీ మా ఇంట్లోనే అయ్యాయి.
నాలాగే రాజు కూడా తల్లికి మా ఇంట్లో దక్కిన మర్యాద చూసాడు కాబోలు. ఉద్యోగం రాగానే ఆఫీసుకి దగ్గరవుతుందని వేరే ఇంట్లోకి మారిపోయి, ఇద్దరు తల్లులనీ, తండ్రినీ తనతో తీసికెళ్ళి పొయాడు. రాజుకీ తనని పెంచి పెద్ద చేసారన్న కృతఙ్ఞత మా కుటుంబం మీద బాగానే వుండేది. అందుకే రుక్మిణి అత్తయ్యని కూడా తనతోనే తీసికెళ్ళాడు. ఆవిడ చివరి రోజుల వరకూ రాజూ అతని భార్యా ఆవిడని కని పెట్టుకునే వున్నారు. రెండేళ్ళ క్రితం మావయ్య కూడా పోయారు.
మా ఇంట్లోనూ పెదనాన్నలిద్దరూ వాళ్ళ వాళ్ళ పిల్లలున్న వూళ్ళో సర్దుకున్నారు. ఇప్పుడా ఇంట్లో అమ్మా నాన్నా అన్నయ్య కుటుంబంతోకలిసి వుంటున్నారు.
నాటకంలో పాత్రధారులందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు ముగిసి స్తేజీ అంతా ఖాళీ అవుతున్న భావన! ఇప్పుడు జయత్త కి కూడా హార్టెటాక్. ఎలాగైనా ఆవిడని చూడాలి. చిన్నప్పణ్ణించీ నా మనసులో మెదిలే ప్రశ్నలకి సమాధానం రాబట్టుకోవాలి!
*****************
హైదరాబాదు వెళ్ళగానే ఇంట్లో బాగు పడేసి ఇబ్రహీం పట్నం వెళ్ళాను. రాజు ఇంటికి నేనింతకుముందు వెళ్ళింది నాలుగైదేళ్ళ కింద. అయినా ఇల్లు తేలిగ్గానే గుర్తు పట్టాను.
తలుపు తట్టబోయి లోపలినుండి వినిపిస్తున్న మాటలతో ఆగిపోయాను.
“ఇందాకేగా ఒక కప్పు కాఫీ అయింది. మళ్ళీ అప్పుడే రెండో కప్పు కాఫీకి వేళయిందా?”
ఆ స్వరంలో కటుత్వానికీ, వెటకారానికీ నివ్వెరపోయాను. కప్పు కాఫీ చిన్న విషయమే. అంత చిన్న విషయానికే ఎదుటి మనిషిని పాతాళంలోకి నెట్టెసేంత అవమానం చేయటం
బహుశా ఆడవాళ్ళకే చేతనైన విద్యా ఏమిటి? ఇంకా ఏమేం మాటలు వినాల్సొస్తుందో అని తలుపు నెట్టుకుని లోపలికెళ్ళాను.
హాల్లో దివాన్ మంచం మీద పడుకుని వుంది అత్త. అదే తెల్లటి అందమైన, అమాయకమైన మొహం, నన్ను చూడగానే ఒక్కసారి వెలిగింది.
“నువ్వెప్పుడొచ్చావురా కిరణ్? అమ్మా నాన్నా అంతా బాగున్నారా? అమ్మాయీ, పిల్లలు..” అడుగుతూనే లేచి సర్దుకుని కూచుంది.
“నిన్న రాత్రే వొచ్చానత్తా. అంతా బాగున్నారు. నీకే అరోగ్యం బాగా లేదన్నారు. ఏమయింది?”
అడుగుతూ పక్కనే కూర్చున్నాను.
“ఆ, ఏముందిరా! పోయే వయసే కానీ, వచ్చే వయసు కాదు కదా? ఏదో ఒకటి వస్తూనే వుంటాయి,” అంటూ నా చేయి ఆప్యాయంగా చేతిలోకి తీసుకుంది.
“ఎన్ని రోజులయిందిరా నిన్ను చూసి! పెద్ద ఉద్యోగం చేస్తున్నావటగా? మీ అమ్మ చెప్పిందిలే. పిల్లలకెంత వయసు? అందరినీ తీసుకు రావలిసింది. ఒక్క సారైనా చూసే దాన్ని.”
“నేనొచ్చిందీ అందుకే! ఈసారి నాతో పాటూ నిన్నూ తీసికెళ్తాను.”
“మా నాయనే! మా బాబే! నన్నెందుకురా తీసికెళ్ళటం. మళ్ళీ ఈ ముసలి ఘటానికి సేవలు చేయలేక మీ ఆవిడ చేత కూడా తిట్టించటానికా?” నవ్వుతూనే అన్నా ఆవిడ మాటలు అప్రయత్నంగా మనసు లోతుల్లోంచి వచ్చాయేమో అనిపించింది.
“అయినా నీతో నాకేమిటిలే! రాజు రానీ! వాడితోనే మాట్లాడి తీసికెళ్తాను. నాలుగే రోజుల్లో మన ప్రయాణం!”
రాజు భార్య మీరా బయటికొచ్చింది, నవ్వు మొహంతో. ”మీరెప్పుడొచ్చారన్నయ్యా? లోపలేదో పనిలో వుండి అలికిడే వినబడలేదు. మంచినీళ్ళేమైనా తీసుకురానా?”
“పది నిమిషాలయింది మీరా! మంచినీళ్ళ తో పాటు ఒక కప్పు కాఫీ కూడా పెట్టిస్తావా? పొద్దునే బయల్దేరానేమో, భలే అలసటగా వుంది.”
పది నిమిషాల్లో రెండు కప్పుల కాఫీతో వచ్చింది మీరా.
“అన్నయ్యా! నేనిప్పుడే బాంకు దాకా వెళ్ళొస్తాను. మీరు కొంచెం అత్తయ్య గార్ని చూస్తూ వుంటారా? రాగానే ముగ్గురమూ కలిసి భోంచేద్దాం. తరువాత వెళ్దామంటే మళ్ళీ బాంకు మూసే వేళవుతుంది.”
“ష్యూర్! నువ్వెళ్ళి రా! నేనుంటాగా!”
తలుపేసి వొచ్చి మళ్ళీ అత్త దగ్గర కూర్చున్నాను.
“మీరా ఎందుకో చిరాగ్గా వున్నట్టుంది?” ఉండబట్టలేక అడిగాను.
“అయ్యో పాపం! ఆ పిల్ల కూడా ఇంటా బయటా చాకిరీతో నలిగిపోతుందిరా. నాకూ ఆరోగ్యం పాడయేసరికి సహాయం చేసే వాళ్ళే లేరు. వచ్చే వారం నించి ఆఫీసుకెళ్ళాలట. నాకూ ఇప్పుడు బానే వుంది. వెళ్ళమన్నాను. ఎన్ని రోజులని నా కొరకు వాళ్ళు ఉద్యోగాలు మానుకుని కూర్చుంటారు?”
నిజమే! ఎవరినీ ఏమీ తప్పు పట్టలేని స్థితి.
అసలావిడ ఎవరినీ ఎప్పుడూ తప్పు పట్టలేదేమో.
“నీకు మా వాళ్ళ మీద ఎప్పుడూ కోపం రాదా అత్తా?” ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలని నాకెందుకంత కుతూహలమో నాకిప్పటికీ తెలియదు.
“కోపమా?” ఆశ్చర్యంగా చూసింది నా వైపు. “ఎందుకు?”
“ఎందుకా? నీ భర్తని నీ నించి లాక్కున్నారు. నీ ప్రాణానికొక సవతిని తెచ్చి పెట్టారు. నీతో గొడ్డు చాకిరీ చేయించుకుని నిన్ను నానా మాటలూ అన్నారు.”
“కానీ, నాకూ నా పిల్లలకీ తిండి పెట్టి, మా బాగోగులన్నీ చూసారు కదా? నా భర్తని మాత్రం వుండనిచ్చి మా ముగ్గురినీ తరిమేస్తే నేనేం చేయగలిగేదాన్ని?”
“అయినా అసలు నువ్వు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోకుండా వుండాల్సింది!”
“ఎంత పిచ్చి వాడివిరా? అయినా నా అభిప్రాయం ఎవరడిగారని?”
నిజమే. ఆటల్లో పావులని కదల్చటమే కానీ, వాటి అభిప్రాయం అడుగుతూ కూర్చోం కదా?
*************
సాయంత్రం రాజు రాగానే భోజనాలు చేసి కాస్త అలా చల్ల గాలికి తిరిగొద్దామని బయటికెళ్ళాం. అప్పుడే నా మనసులో మాట బయట పెట్టాను. రాజు వెంటనే ఒప్పుకోలేదు, నేనూహించినట్టుగానే.
“ఎందుకు? అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. మాతోనే వుండనీ!” అన్నాడు.
“మీతోనే వుంటుంది లేరా! నేనేమైనా పర్మనెంటుగా తీసికెళ్తున్నానా? ఒక నెలా, రెణ్ణెల్లు, అంతే! మీ అమ్మని నేనేం ఎత్తుకెళ్ళనులే! మీరా కూడా ఇంట్లో బయటా చాకిరీతో అలిసిపోతుంది. తనకి మాత్రం కొంచెం విశ్రాంతి ఒద్దా? కొన్ని రోజులు నాతో వుంచుకున్నాననుకో, అత్తకి కొంచెం మార్పు, మీక్కొంచెం విశ్రాంతీ, నాక్కొంచెం సంతోషం, అంతే!”
మొత్తానికి ఒప్పించాను.
ఆ రాత్రంతా నాకు సంతోషంతో నిద్ర పట్టలేదు. ఆవిడకి మా కుటుంబం వల్ల జరిగిన అన్యాయానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానిపించింది. ఆవిడ భర్త ఇంకొక స్త్రీతో పడక గదిలో తలుపేసుకుని వుంటే మా పక్కనే పడుకుని కార్చిన కన్నీటికి నేనే సాక్ష్యం మరి.
********************
రైలు బయల్దేరటానికి సిధ్ధంగా వుంది. నేను రాజుకి బై చెప్పి కంపార్ట్మెంట్ ఎక్కాను. లోపల్నించి మాటలు వినిపిస్తున్నాయి.
“అత్తయ్యా! నా మాటలేవీ మనసులో పెట్టుకోకండి. వీలైనంత తొందరగా వచ్చేయండి. మీరు లేకపోతే నాకెలాగో వుంటుంది.” మీరా గొంతులో వినిపిస్తున్న ఏడుపు వింతగా వుంది.
“పిచ్చిదానా! నెల రోజుల్లో మళ్ళీ వస్తాగా! నువ్వూ రాజూ ఆరోగ్యం జాగ్రత్త. దిగు మరి. రైలు బయల్దేరుతుంది.” తలుపు తెరుచుకుని మీరా బయటికొచ్చి, రైలు దిగింది.
నేను లోపలికెళ్ళి అత్త పక్కనే కూర్చున్నాను. రైలు బయల్దేరింది. ఎప్పుడూ ప్రశ్నలకి సమాధానం వెతుక్కునే మనిషి మనసులా ఆగకుండా పరిగెత్తుతూనే వుంది.
– శారద
********************
పరిచయం-
ఆస్ట్రేలియా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. నివాసం అడిలైడ్ నగరం.
(అంతకంటే చెప్పుకోవటానికింకేమీ లేదు
)



















చాలా బాగుంది.వుమ్మడి కుటుంబాల రెండో కోణం చూపించారు.అవును ఆడవారి అభిప్రాయాలకు విలువ ఎక్కడ వుంది?జీవితాంతం సర్డుకుపోవదమే.పుట్టినక్షణం నుంచి పోయే క్షణం దాక సర్దుకుపోవడం తప్ప వేరే ఏమీ లేదు. ఎంత చదువుకున్నా,జీవితంలో ఎంత పై ఎత్తుకు ఎదిగినా ఈ సర్దుకుపోవడం అనేది స్త్రీ జీవితం లో తప్పదేమో మరి.
e
కథనం బావుంది. ఉమ్మడి కుటుంబాల గురించి ఓ కోణం చూపించారు.
కథ చాలా బాగుంది.
అవును ఆడవారి అభిప్రాయం తో పని ఏముంది?, పదహారు,పదిహేడే ళ్ళకే పెళ్ళిళ్ళు చేసి పడేసి మీ చావు మీరు చావండని ఒదిలేసేవారు. చాలా విలువైన మాటలు .
వృద్దాప్యం లోను స్త్రీల రోల్ మారకపోవడంకి ఈ కథ అడ్డం పట్టింది.
ప్రహేళిక ..కథకి తగినపేరు.