ఆడి పాడే అమాయకపు బాల్య దేహం పై..
మొగ్గలా పొడుచుకు వస్తున్నప్పుడు..
బలవంతంగా జొప్పించిన ఆడపిల్లననే జ్ఞానం
పదమూడేళ్ళ ప్రాయంలో..యవ్వనపు దేహం పై..
వసంతం విరిసినప్పుడు…. వీడని అమాయకత్వం
నువ్వు ఆడదానివే సుమా అన్నట్లు
నఖశిఖ పర్యంత చూపులతో..
గుచ్చి గుచ్చి తడిమినప్పుడు..
లోలోపల భయం, గగుర్పాటు తో
అప్పటిదాకా లేని సిగ్గు తెర పైట అయి
తనువంతా చుట్టుకునే ముగ్ధత్వం
కాంక్షల కౌగిలిలో నలిగిపోతున్నా
మోహపు పరవశంతో ఉప్పొంగినా ..
నలిగిన మేనుకు అవే తరగని
అలంకారమని సగభాగం నిర్ధారించాక
అనంత సృష్టి రహస్యపుఅంచులు తాకే
కేళీ విలాసంలో ముఖ్య భూమిక గా
కామ్య వస్తువుగా..భోగ వస్తువుగా
మారిన కుచ ద్వయాలకి
అన్నీ గరళమైన అనుభావాలే !
చిన్ని చేతులతో ..తడిమి తడిమి ..
ఆకలికి తడుముకుంటూ న్నప్పుడు ..
ఆ పాలగుండెలు బిడ్డ ఆకలిని తీర్చే
అమృత భాండా లని …
ఆ గుండెలు పరిపూర్ణ స్త్రీత్వపు చిహ్నాలని
తన్మయత్వం తో..తెలుసుకున్న క్షణాలు
మాత్రం స్వీయానుభావాలు.
అసహజపు అందాలను ఆబగా చూసే వారికి..
సహజం అసహజమైనా,అసహజం సహజమైనా..
ఆ దేహం పై క్రీడలాడునది..ఈ నరజాతి వారసుడు
చనుబాలు కుడిచిన నాటిని మరచిన బిడ్డడే కదా..
అసహజంగా పెరిగిన కణ సముదాయాలని
కుతికలోకి.. కోసి.. ఓ..సగ భాగాన్ని
పనలని పక్కన పడేసినట్లు పడేసాక..
అయ్యో అనే జాలిచూపులు భరించడం,.
నువ్విక పనికరావనే..వెలివేతలు..సహించడం కన్నా
ప్రాణం పోతే బాగుండునన్న భావనే అధికం. .
అమ్మ – అమృత భాండం..
స్త్రీ-సౌందర్యం..ఉద్దీపనం సారూప్యమైనవే !
దేహం నదిలో
ఎత్తు పల్లాలు,ఒంపు సొంపులు ,సొగసులును
ఆబగా కొలుచుకునే కామచిత్తులకి
ప్రవాహించినంత మేరా… పచ్చదన్నాని నింపే
ఆ నది అంతరంగం అర్ధమయ్యేది ఎన్నడు?
పరచిన నగ్న దేహం పై మిగిలిన సగం పై
విశృంఖలం చేసిన గాయం స్రవిస్తూనే ఉంది.
అంతః చక్షువుతో .సౌందర్యపు ఝడిని కనలేని
వికృతమైన ఆలోచనల కురుపు
రాచ పుండు కన్నా భయంకర మైనది.
– వనజ వనమాలి
(టాటా మెడికల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ కేన్సర్ (ముంబాయి) లో బ్రెస్ట్ కేన్సర్ విభాగంలో కొంతమంది అనుభవాలు విని విచలితమై వ్రాసుకున్న కవిత ఇది.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మనిషి జంతు ప్రపంచం నుండి ఇంకా పూర్తిగా బయటపడలేదు. సంస్కరించబడాలి అంటే సంస్కారం నేర్పే సమాజం కావాలి. నేరాలకు సమాజం కూడా బాధ్యత వహించాలి. మనిషిది పరిసరాలకనుంగా మారే తత్వం. తన చుట్టూ ఏలాంటి పరిసరాలుంటాయో-సమాజం- అందులో భాగంగానే ఉంటాడు. ఈ విషయం చాలా మందికి తెలియాల్సి వుంది. పితృస్వామిక అహంభావాన్ని సాంస్కృతికంగా అణచబడాలి లేక సమస్కిరించ బడాలి. అప్పుడే స్త్రీ మనిషి గా గుర్తించ బడుతుంది!
. తిరుపాల్ గారు ఈ కవితని చదివి బాగా స్పందిన్చినవారిలో స్త్రీల కన్నా పురుషులే ఎక్కువ ఉన్నారు . అంతమందిని ఆలోచింపజేస్తున్నందుకు ఆనందంగా ఉంది . ఈ కవిత వ్రాసినప్పటి నుండి ఎన్నో స్పందనలు అందుకుంటున్నాను. నెలకి నాలుగైదు ఫోన్ కాల్స్ ద్వారా వారి స్పందనని మరికొన్ని మెసేజెస్ .వస్తుంటాయి . ఇంత మంది హృదయాలకి చేరినందుకు ఆలోచింపజేస్తున్నందుకు సంతోషంగా ఉంటుంది. మనిషి అనాగరిక ప్రవర్తనని మార్చుకోలేనంతకారం స్త్రీ వ్యధ తీరనే తీరదు. స్త్రీల వ్యదలో ఇదొక వ్యధ . . మీ స్పందనకి ధన్యవాదములు .
ఈ కవితని ఒకసారి చదివాను. స్తబ్ధత ఆవరించింది . మళ్ళీ మళ్ళీ చదివాను. అక్షరం అక్షరం శూలాల్లా గుచ్చుకుంది తమ ప్రవర్తన తో వేదించే పురుషులకి ఈ కవిత ఓ గొప్ప పాఠం. కవిత్వం అంటే రుచి చూపిన కవిత్వం. వనజ గారు ఈ కవిత్వం మీ స్పందించే హృదయానికి ప్రతీక. అభినందనలు, ధన్యవాదములు .
ధన్యవాదములు సమీర్ గారు .
సున్నిత భావాల అద్భుత చిత్రణ …దేహ క్రీడ లో తెగిన సగం శీర్షక ఎంచు కోవడం లోనే మీ భావుకత స్పష్టం అవుతున్నది….
గాయాల అంత స్రవం అర్ధమయిన వారె ఇలా రాయ గలుగుతారు …వనజ గారికి అభినందనలు
ఉమ గారు .. మీ మెచ్చుకోలుకి హృదయపూర్వక ధన్యవాదములు .
గాయాల అంత స్రవం అర్ధమైనవారే… ఇలా వ్రాయగలరు . మీ వ్యాఖ్య కూడా లోతైనది ఉమ గారు. పైకి కనిపించే గాయం కన్నా అంతర్లీనంగా పదునైన గాయాల తో కోతని అనుభవిస్తున్న స్త్రీల బాధలు ఎన్నో .. నా కనుల ముందు తారట్లాడతాయి. సమాజాన్ని చూడ టానికి కన్ను ఎంత ముఖ్యమో .. హృదయం కూడా అంతకన్నా ముఖ్యమైనది.
హృదయంతో చూస్తున్నాం కాబట్టే .. ఈ కవిత మూలం అర్ధమైంది. ధన్యవాదములు ఉమ గారు .
ప్రియ గారు..
@రాజ్వీర్ గారు
@బెర్ట్ గారు
@మార్టిన్ గారు..
అందరికి ధన్యవాదములు. మీరు అందరూ..స్పందించినందుకు ధన్యవాదములు.
విజయ భాను గారు. ధన్యవాదములు.
Dadala వెంకటేశ్వర రావు గారు
మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు. సమాంతర కవిత ని అందించారు. చాలా సంతోషం.
వనజ వనమాలి గారూ! ఆలస్యంగా స్పందిచినదుకు క్షమించండి.
మీ కవితకు స్పందించి వ్రాసిన నా చిన్న ప్రయత్నాన్ని పెద్ద మనసుతో సమాంతర కవితగా సూచించినందుకు
ఏ విధంగా ధన్యవాదాలు తెలుపుకోవాలో తెలియడం లేదు. చాలా సంతోషంగా ఉంది. కాని మీ కవితకు సమాంతర
కవిత వేరొకటి ఉండదు అని నా అభిప్రాయం. చాలామంది అనుభవాలను చదివి విచలితమై వ్రాసిన గొప్ప కవిత మీది
వేరెవరూ మీలా స్పందిచలేరు. మీ కవితాలోచనా సరళి అమోఘం. మీరు ఇలా వ్రాస్తూనే ఉండండి……. ధన్యవాదాలు
ఇట్లు
దడాల వెంకటేశ్వర రావు …
మీకు మరొకమారు.. ధన్యవాదములు
చాలా బాగా రాసారు మేడం
కళ్ళకు కనిపించే యవ్వన సౌందర్యం
సహజసిద్ధంగా ఉండే కణ సముదాయం
కాలంతో కరిగిపోయే ఉద్దీపనల సారూప్యం
పాల సంద్రంలోని అమృత భాండాగారం
అశాశ్వతమని వేదాంత సారం
దేహం నదిలో అలల ప్రవాహం
మనో జగమంతా సస్యశ్యామలం
కలుషితాన్ని సుద్దిచేసే కరుణ జలం
నిత్యం ప్రకాశించే అంతరంగ సౌందర్యం
శాశ్వతమని పకృతి సిద్దాంతం
కళ్ళతో మనసుని చూడు
మనసుతో మనిషిని చూడు
ప్రేమిస్తూ బ్రతికి చూడు
బ్రతుకును ప్రేమించి చూడు
సగం లేదనుకున్న నీవు
ఈ మగనిలోనేసగమైన నీవు
అబలవు కానే కావు
మరపురాని మహిమ నీవు
ఇలలో ఇలవేల్పు నీవు
నువ్వు నవ్వుతూ బ్రతికితే చాలు నాకు
కేన్సర్ పేషంట్ల మనసులో మెదిలే భావాలకు, కన్నీటినీ ఎంత బాగా కవితరూపం అందించారో! మనసు చాలా భారంగా ఉంది వనజ గారు. ఇలాంటి కవిత రాసేందుకు ఎంత సున్నిత మనసుండాలో.
అద్భుతమైన ఫీల్ నిండుంది కవితలో.
అవినేని భాస్కర్ గారు..కవిత ని చదివి స్పందించినందుకు .. ధన్యవాదములు. చాలా కాలం నుండి గుండెల్లో వేదనగా తడిమి తడిమే భావాలకి అక్షరీకరణ ఈ కవిత.
సుకుమారమైన స్త్రీ అంతరంగానికి అక్షర రూపం ఈ కవిత. నచ్చినండులకు,వ్యాఖ్య చేసినందులకు ధన్యవాదములు.
నేను చదివిన కవితలలో దీనిని అగ్రభాగాన ఉంచుతాను .ఇందులో భాషా సౌందర్యం కంటే భావ సౌందర్యం ఉట్టి పడుతుంది .చదివినంతసేపూ అమ్మ ,మన బిడ్డలు గుర్తుకొస్తారు .వనమాలిగారికి ఎలాంటి పదాలతో అభినందనలు తెలపాలో తెలీటం లేదు .అద్భుతమయిన కవిత్వం.
రవి శేఖర్ గారు.. కవిత మీకు నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు.
Good to see real epxertsie on display. Your contribution is most welcome.
దేహం నదిలో
ఎత్తు పల్లాలు,ఒంపు సొంపులు ,సొగసులును
ఆబగా కొలుచుకునే కామచిత్తులకి
ప్రవాహించినంత మేరా… పచ్చదన్నాని నింపే
ఆ నది అంతరంగం అర్ధమయ్యేది ఎన్నడు?
అధ్బుతమైన పద చిత్రం -కవిత చాల బాగుంది .
వెంకట్రావు గారు.. చాలా సంతోషం అండీ! కవిత లోని ఆయువు పట్టుని గుర్తించి.. మెచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు
రేణుక అయోల గారు.. ఈ కవిత నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు.
Well done to think of smoteihng like that
వనజ గారు
మీకవిత చాల బాగుంది ……
రేణుక అయోల గారు.. ఈ కవిత నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు.
“విహంగ” సంపాదక విభాగానికి నమఃస్సుమాంజలి.
నా ఈ కవితని విహంగ లో చూసుకోవడం ఆనందం.
కవితా వస్తువు మహిళలకి సంబంధించినది కావడం వల్ల… మహిళ ల ఆలోచనలు అభిప్రాయాలు పంచుకునే వేదిక..అలాగే అందరు వీక్షించే విహంగ లో ఈ కవిత రావాలని నేను ఆకాంక్షించాను.
నేను వ్రాసుకున్న ఎన్నో కవితల మధ్య నాకు బాగా నచ్చిన కవిత ఇది. దాదాపు నాలుగేళ్ళుగా నా ఆలోచనలో నలిగి,నాని బయటకి వచ్చిన కవిత.
ఆ కవితని ఇక్కడ చూస్తున్నందుకు ఆనందం..
విహంగ లో నన్ను పరిచయం చేసినందుకు,ఈ కవిత పై స్పందించిన వారందర కి ధన్యవాదములు.
ఇది చాలా గొప్ప కవిత. యెంత స్ట్రాంగ్ గా బాగా వ్రాసారు.ఇలాంటి ఎక్స్ ప్రేషన్స్ తో బలంగా వ్యక్తపరచడం సామాన్య విషయం కాదు . ఇంత మంచి కవిత వల్ల సౌందర్య సృహ తగ్గి మానవత్వ కోణంలో చూస్తే బాగుంటుంది. వనజవనమాలి గారికి అభినందనలు. మీకు కృతఙ్ఞతలు.
వైష్ణవి ధన్యవాదములు.
మీ భావావేశానికి, ఈ కవితలోని తీవ్రతకీ జోహార్లందించకుండా ఉండలేకపోతున్నాను.
వారి అనుభవాల తాలూకు బాధ, మథన మీ అక్షరాల్లో అణువణువునా కనపడి, మమ్మల్నీ కదిలించింది. అంతర్జాలంలో కవిత చదువుతుంటే రాలిపడిన ఈ కన్నీటిబొట్లు వారికే విథంగానూ సాయపడకపోవచ్చు గాక, కానీ మన దృక్పథాల్లో కలుగవలసిన మార్పు మాత్రం – తప్పకుండా ఆహ్వానింపదగ్గదే!
విహంగ సంపాదక వర్గం అభిరుచికి ఇదొక మచ్చుతునకగా భావిస్తూ – వారికీ, వనజ గారికీ శుభాభినందనలు.
మానస గారు మీ స్పందనకి ధన్యవాదములు. శరీరానికి తగిలిన గాయం కన్నా మదిని గ్రుచ్చిన గాయం మాన్పలేనిది. సౌందర్య సృహ Vs అమ్మ తనం త్రాసులో కొలవబడతాయి. అమ్మ ఒక బొమ్మ కాకూడదని ..అమ్మ కన్నా కూడా ఓ.. మనిషి మనసుని సృశించ గల్గడమే అన్నది గుర్తించాలని నా భావన.