నగ్నంగా కలిసి తిరిగినా
దేవుడాజ్ఞ అయ్యేంత వరకూ
ఆడమ్ ఈవ్ ని తాకలేదు!
కలిసి ఫలించడంలోని స్వచ్ఛత
ఓ మధుర కావ్యం
బట్టల్లోంచి దేహాన్ని
స్కానింగ్ చేసే కళ్ళొచ్చాక
నడిచే ప్రతి ఈవ్ శరీరం నగ్నమైనదే
కసి ఫలించడమొకటే
కత్తిరాసే నెత్తుటి వాక్యం
ఎన్ని నిర్వచనాలు రాసినా
ఎన్ని నిఘంటువులు వచ్చినా
ఆమె కు అర్ధం అంగమే
కావాల్సిన అవయవాలను కోసిచ్చి
ఆమె స్వేచ్ఛగా నిలబడితే చాలు కదూ…
మిగిలిన అవయవాలైనా హింసకు గురికావు
తెగే ఒక్కో నరం,
విరిగే ఒక్కో ఎముకా
నోరు లేనివి కదూ
లేదంటే
వాటి ఆక్రోశం విన్న గుండెలన్నీ
డైనమేట్లయి పేలిపోవూ
అసలు అమ్మకు ఎవరైనా చెప్పొచ్చుకదా..
X క్రోమోజోముని తనలోనే సమాధి చేయమని
Y ని ‘వై’ అని ప్రశ్నించలేని భయంలో
కూరుకుపోయి ఉన్నాం
ఎక్కడ పలుగై మాంసపు ముద్దల్లో
జొరబడుతుందోనని
ఇంకెన్ని దుఃఖనదుల్ని తవ్వాలి…
ఇంకెన్ని కొవ్వొత్తులు కరగాలి…
ఇంకెన్ని మిల్లీల వీర్యాన్ని గర్భంలో మొయ్యాలి
సిగ్గుగా ఉంది
ముక్కలుగా కోయబడ్డ అమ్మతనాన్ని
లోకానికి చూపాలంటే
భయంగా ఉంది బ్రతికుండగానే
పోస్టుమార్టం కావడమంటే…
కోపంగా ఉంది
ఈవ్ ని సృష్టించిన దేవుడంటే
ఆడమ్ ని తిరిగి ఒంటరిని చేయి ప్రభూ!
–డి.నాగజ్యోతిశేఖర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~