ఒళ్ళంతా బక్కచిక్కిపోయింది
ఉదయాన్నే పలకరించే ఆ సూరీడు
నడినెత్తిమీదికి వచ్చేసరికి
ఒంట్లోని సత్తువనంతా పీల్చేసాడు కనుకనేమో
ఒళ్ళంతా బక్కచిక్కిపోయింది
మెత్తగా గ్రీన్ కార్పెటులా
పరిచినట్లు ఉన్నంత మాత్రాన,
ఒడ్డు దానిలోని రాళ్ళను కప్పలేక పోయింది
కాళ్ళను కోస్తూ రక్తాన్ని రుచి చూసే పనిలో
ఒళ్ళంతా బక్కచిక్కిపోయింది
చల్లగా నీటి బురదలో తిరుగుతున్నాడు కావొచ్చు
కాని ఒంట్లోకి చేరలేని అందులోని ఒక్క నీటి చుక్క,
కారణమై మిగిలిపోయింది
ఒళ్ళంతా బక్కచిక్కిపోయింది
సారవంతమైన నేలే కావొచ్చు
కాని
కాలి పగుళ్ళను ఆపలేకపోయింది
ఒళ్ళంతా బక్కచిక్కిపోయింది
మూటలు, బస్తాలు, గడ్డి కుప్పలు మోస్తూ
ధృడంగా కనపడే వీపు ఒక్కటే కాదు
భుజాలు వొంగిపోయి
వెన్నుపూస నిటారుగా నిలువలేక
ఒళ్ళంతా బక్కచిక్కిపోయింది
గాలికి జుట్టు రెపరెపలాడడానికి
కారణం అవుతుండొచ్చు
కాని అతడి ఒంటి నిండా ప్రవహించే
చెమటను దూరం చేయలేకపోయింది
ఒళ్ళంతా బక్కచిక్కిపోయింది
నేలమ్మను తడపలేని ఆకసాన్ని
చూసే కనుల కన్నీళ్ళు ఇనికి
ఇకనైనా రాకపోదా అని గుండెలో
ప్రవహించే నెత్తురువంటి ఆశ చచ్చి
కళ్ళ ఎదుటే కంటిపాపలా సాదుకున్న
పైరు అక్కరకు రాకపోయి
పురుగుమందుల నాణ్యత పురుగును కాకుండా
ఆరు మాసాల కష్టాన్ని సంపినందుకు
ఒళ్ళంతా బక్కచిక్కిపోయింది
మరో పంటకైనా ఆ స్వామి
కనుకరిస్తాడో లేడో అని
బుర్ర కోటి ఆలోచనలతో
తునాతునకలైపోతున్నప్పుడు
ఒళ్ళంతా బక్కచిక్కిపోయింది
అతడి పక్కటెముకలను
లెక్కపెట్టగలమా అంటే!
ప్రశ్నించాల్సిన
అవసరం లేనే లేదు
అతడి దేహమే ఉదాహరణ
దేహి! అనకపోయినా
నీకు అన్నం పెట్టేవాడు.
— పాలేటి శ్రావణ్ కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~