వర్షాల బీభత్సపరిస్థితులనుంచి జనజీవనం కుదుటపడి మళ్లీ తమతమ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఎవరికివారు అనుకోని విరామంనుంచి బయటపడి మళ్లీ పరుగందుకుంటున్నారు.మేమూ మళ్ళీ పరుగందుకున్నాం. పస్రా అవతల కొంతదూరంలో ఈ ఏడు కొత్తగా ప్రత్యేకంగా ఫలవృక్షాలకోసమే కొండమామిడిచెట్లు మరికొన్ని స్థానిక జాతులతోకలిపి పెట్టిన ప్లాంటేషన్ చూడ్డానికి వెళ్ళాం. ఉమ్మడి అటవీయాజమాన్యం మొదలైన కొత్తలో తొందరగా లాభాలను చూపించడం, ఆర్థిక వనరులు సమకూర్చడం ద్వారా వనసంరక్షణ సమితులను బలోపేతం చేయడం కోసం త్వరితగతిన పెరిగే యూకలిప్టస ప్లాంటేషన్స్ని పెంచేవాళ్ళు. యూకలిప్టస్ ప్లాంటేషన్లలో వచ్చిన కలప పేపరు తయారీ పరిశ్రమకు తరలించబడుతుంది.నాలుగైదేళ్లలో వీటిని కోతకోసుకోవచ్చు.అయితే గతకొంతకాలంగా ఈ మోనోకల్చర్ అంటే ఒకేపంటను పండించడమనే విధానానికి స్వస్తి చెప్పారు. అందులోనూ అడవి అంటేనే సహజంగా ఉండే వృక్షాలతో స్వచ్చంగా ఉండాలి, అలాకాకుండా ఒకే తరహా పంటను పండించడం అటవీకరణ లక్ష్యాలకు విరుద్ధం. అదేగాక స్థానీయ జాతులకి ఎటువంటి అవకాశం లేకుండా అడవుల్లో ఇలాంటి పంటలుపెంచడం పర్యావరణ సమతుల్యతకి,జీవవైవిద్యానికి గొడ్డలిపెట్టు. దీన్ని గుర్తించిన అటవీశాఖ ప్లాంటేషన్లను పెంచడంలో సమూల మార్పులు చేసింది. యూక్లిప్టస్ ప్లాంటేషన్స్ నిలిపివేసి ఎక్కడికక్కడ స్థానికంగా పెరిగేటువంటి జాతులని నర్సరీలో పెంచి ఆయా అడవుల్లోనే నాటే విధమైన చర్యలను తీసుకుంది. అందులో భాగంగానే ఇలాగా కొండ మామిడిచెట్లు మరికొన్ని ఫలాలను కలపను ఇచ్చే జాతుల్ని కలిపి నాటడం జరిగింది. అవన్నీ చక్కగా నాటుకున్నాయి కూడా. ఇక్కడి భూమి అంతాకూడా ఇసుకపాలు ఎక్కువఉన్న నల్లరేగడిది. వర్షాలకు బాగామెత్తబడి నానింది. ప్లాంటేషనలకోసం భూమి వ్యవసాయ క్షేత్రంలాగా మరీనున్నగా చేయరు, సాధ్యమైనంత శుబ్రం చేసి పెద్దపెద్ద గుంతలు తీసి పెద్ద మొక్కలే నాటుతారు. గుంతల చుట్టూ శుభ్రంగా ఉంటే మొక్కలు త్వరగా పెరుగుతాయి. ఒకసారి పెరిగి నీడ పట్టిందంటే కలుపు దానంతట అదే పోతుంది.
నేలపూర్తిగా నల్లరేగడిగాకూడాలేదు ఇసుకపాలు ఎక్కువఉండడం వల్ల పల్లం ఉన్నదగ్గర నీరుచేరి ఒకలాంటి మెత్తటి గుజ్జులాగా తయారయింది.ప్లాంటేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు అవి ఎంతఎత్తు ఉన్నాయి, మొక్కల ఆరోగ్యంగా ఉన్నాయా లేవా, ఏవైనా సమస్యలున్నాయా అనిచూస్తాము కాబట్టి లోపలిదాకా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడక్కడ పైకి చూస్తే మట్టిగట్టిగాఉన్నా అడుగుపెట్టగానే దిగబడిపోతుంది.ఎప్పుడు జాలువారి ఉంటాయి కొని చోట్లు. అడుగుపడి దిగబడి పోతే తప్ప తెలియదు. ప్లాంటేషన్లో పెద్దగా వేరే కలుపేది లేకపోయినా చాలా చిన్నచిన్నమొక్కలు ఎంత చిన్నవి అంటే ఒకటి రెండు ఇంచులకు మించనివి గుండ్రంగా దగ్గర దగ్గరగా అమరిన కిరణాల వంటి చిన్ని ఆకులఅంచు మీద మంచు బిందువులన్నీ నిలబడగా ఈ జాలువారే నేలమీదనే అతుక్కొని దగ్గరదగ్గరగా చల్లిన ఎరుపు గోధుమరంగు కొనలున్న ఆకుపచ్చ పూవుల్లా ఉన్నాయి. కాళ్ల కింద పడుతున్నాయి. బురదకాని బురద. రెండుమూడు తీసుకుని నా అరచేతుల్లో వేసుకుని గట్టుమీదకు వచ్చి చూశాను. ఇలాంటివే పాకాల్లో కూడా చూశాను. పాకాల దగ్గర కూడా నీటి తావుల దగ్గర కాస్త పెరిగి పెద్దవై లావెండర్ రంగు పూలను కలిగి ఉన్నాయి. అవి పూలను కలిగి ఉన్నప్పుడు ఆకులకాడలమధ్య పొడవు పెరిగింది కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి నాచేతిలోని మొక్కలు చిన్నవి ఆకులన్నీ దగ్గరగా గుచ్చినట్టుగా ఉండి చిట్టి పూలలగా కనిపిస్తున్నాయి.ఇవి కీటకాహార మొక్కలు. డ్రాసిరా జాతులని పిలుస్తారు.వీటి ఆకులమీద మెరుస్తున్నటువంటి నీటిబిందువులవల్ల ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. డ్రాసిరా మొక్కలువాటి ఆకులపరిసరాల్లోకి ఏదైనాచీమనో,ఈగనో మరేదైనా పురుగో వచ్చినప్పుడు పట్టేసుకుంటాయి. పట్టేసుకొని జీర్ణరసాలని విడుదల చేస్తాయి. దీనివల్ల ఆయాకీటకాల్లో ఉన్నటువంటి నత్రజని సంబంధపదార్థాలను స్వీకరిస్తాయి. మురుగు ఉండేటటువంటి నేలల్లో నత్రజని తక్కువ ఉంటుంది కాబట్టి కీటకాహార మొక్కలు కీటకాలనుంచి నత్రజని సంబంధ పదార్థాలు పొందడానికి ఇటువంటి సర్దుబాటు చేసుకున్నాయి.
మురుగు, బురద ఉండే చోట్ల పెరిగే మొక్కలు మిగిలిన మొక్కలకన్న ప్రత్యేకమైన సర్దుబాట్లు ఉంటే తప్ప బతకలేవు. సముద్రాన్ని కలుపుతూ ఉండే భూభాగంలో పెరిగే అడవులలో ఉప్పుశాతం ఎక్కువ.ఆమ్లజని తక్కువ, ఆకొరతతీర్చడంకోసం వాటి వేర్లు భూమిపైకి పెరుగుతాయి. అదొక ఆవరణ అనుకూలతా ఏర్పాటు.అట్లా పైకి పెరిగే వేర్లను శ్వాసవేర్లు అంటారు. అవి శ్వాస తీసుకుంటాయన్నమాట. అవి చాలాగట్టిగా పొడుచుకొచ్చునట్టు ఉంటాయి. తెలంగాణలోఈ మొక్కలు లేవు, ఆంద్రా తీరప్రాంతంలో ఉన్నాయి. కానీ ఈ డ్రాసిరావంటి మొక్కలు చాలా చిన్నవి, ఒక రకంగా ఇవికూడా తామున్న ఆవరణకు అనుకూలంగా కీటకాలనుంచి పోషకాలను పొందేవిధంగా మార్పు చేసుకున్నాయి.జీవపరిమాణ సిద్ధాంతకర్త డార్విన్, కీటకహార మొక్కల మీద ఈ Insectivorous plants పేరుతో పుస్తకం వేస్తే అందులో ఈ డ్రాసెరాగురించి రాశాడు. ఆయన రాసింది డ్రాసెరా రొటెండిఫోలియ (Drocera rotendifolia) గురించి. దానికి కామన్ సన్ డ్యూ అని పేరు. డ్యూ అంటే మంచుబిందు అనేకదా అంటాం. ఇది సన్ డ్యూ,సూర్యబిందు అనాలేమో, ఎందుకంటే ఆకునుంచి సూర్యకిరణాలలాగానే పొడుకొచ్చేసూదులవంటి నిర్మాణాలుండి చివరన మంచుబిందువులుంటాయి. వీటికొసనఉండే మంచుబిందువులు నిజమైన మంచు బిందువులు కాదు, అవి జీర్ణరసాలు, ఇంకా కీటకాన్ని అంటుకుపోయేలా చేసే కొన్ని రసాయనాలు కలిసిన రసాయన బిందువు! నాకే పేరు పెట్టె అవకాశం ఉంటే ఏం పేరు పెట్టాలా అనుకున్నాను. నా చేతిలోని మొక్క డార్విన్ రాసినది కాదు, ఇంకో జాతి ఏదైనా అయ్యుండాలని మితృలకి పంపితే డ్రాసెరా బ్రెవిఫోలియా (Drocera brevifolia) అని చెప్పారు. ఆ మధ్య బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సంచికమీద చూసిందికూడా ఇదేనేమో అనిపించింది. ఏమైనా పస్రాలో వీటిని చూడగలగడం మంచి విషయమే.
యూకలిప్టస్ ప్లాంటేషన్స్ చేపట్టడం మానేసినప్పటినుంచి అటవీశాఖ చాలా జాగ్రత్తగా అనేక స్థానికజాతుల్ని సేకరించడం పనిగా పెట్టుకుంది.అయితే ఒకప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ద్వారా ప్లస్ ట్రీస్ గా కొన్ని చెట్లని గుర్తించి వాటి మద ప్లస్ ఆకారంలో ఎర్రనిరంగుగుర్తుగావేసి ఉంచేవాళ్ళు.వాటినుంచి విత్తనం సేకరించుకోవడానికి అది గుర్తన్నమాట. మంచి లక్షణాలున్నవాటిని ఇందుకోసం ఎంపిక చేసేవాళ్ళు.అలాంటి ప్లస్ ట్రీస్ ఏవి నాకు తెలిసినంతలో ఇప్పుడు అందుబాటులోలేవు లేదా అలాంటి అలవాటు వాడుకలో లేకుండా చేయబడింది. విత్తనం సేకరించుకోవడం చాలా ముఖ్యమయిన పని. దానిమీదనే మిగిలిన వృక్షభవిష్యత్తు అంతా ఆధారపడేది. మనకు భారీలక్ష్యాలున్నప్పుడు ఆ లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను సేకరించడంమీద దృష్టి పెట్టవలసి వస్తుంది కానీ వాటియొక్క జన్యుపరమైన నాణ్యత, ముందు ముందు ఆయా ఆవరణ వ్యవస్థల మీద చూపే ప్రభావాలకు పొంతన లేకపోతే ఇంత చేసిందీ వృధా అవుతుంది.
కొన్నిమొక్కలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి,కొన్ని చాలావేగంగా పెరుగుతాయి, వేగంగా పెరగడం వల్ల తొందరగా ప్లాంటేషన్ విజయవంతమైనదని ప్రకటించుకునే అవకాశం ఉంటుంది.కేవలం నెమ్మదిగా పెరగడం, వేగంగా పెరగడంఅనేదిమాత్రమే అడవి విలువని పెంచదు. భారీలక్ష్యాలున్నప్పుడు పెట్టిన మొక్కలలో ఎన్ని బతికున్నాయన్న విషయమే ముఖ్యమైందవుతుంది. దీని కారణంగా మొదట్లోకఠినపరిస్థుతులను తట్టుకొని నిలబడే జాతుల్ని అనుకోనివిధంగా ప్రోత్సహించడం అనివార్యమైంది.కానీ ఇప్పుడుపరిస్థితిమారింది. కనీసం పాతిక స్థానికజాతులనైనా ప్రతినర్సరీలో ఉండాలనే నియమంపెట్టారు. అయినప్పటికీ ఇంకా కొన్నినర్సరీలకు దూరంగానే ఉన్నాయి. జీడి, సోమిడి, సండ్ర వంటివి ఒకప్పుడైతే అడవిలో విరివిగా ఉండేవి. ఇప్పుడు వాటిని చూడడం కష్టమే. ఉన్నా ఎక్కడో ఒక చోట ఉండిఉండవచ్చు. వరంగల్లో ఉన్న ప్రముఖ ప్రాంతం ఖాజీపేట పేరు ఒకప్పుడు సోమిడి అని విన్నాను. ఇప్పుడు ఖాజీపేట పక్కన ఉన్న మరో చిన్న గ్రామానికి ఆ పేరు పరిమితమైంది. చెట్లవల్ల ఊర్లకు పేర్లు రావడం మనదేశంలో కొత్తేమీ కాదు. ఎన్నోఊర్లు చెట్లపేరుమీదనే వెలిశాయంటే ఆశ్చర్యపడవల్సింది లేదు. కాలక్రమేణా పేర్లు మారిపోయాయి. ఆయా జాతుల సహజత్వమూ మారిపోయింది. మానవుని ప్రమేయంలేకుండా ఇప్పుడు ఎక్కడా యే చెట్లూ పెరిగే పరిస్థితి లేదు. ఏదేమైనా ఇప్పుడు నాటిన కొండమామిడిమొక్కలు, నేరేడుచెట్లు,నేరేడుచెట్లు, ఉసిరిచెట్లు, సీతాఫలాలతో కలిసి ఒక ఫ్రూట్ ప్లాంటేషన్. వన్యప్రాణులకు అడవిలోనే ఆహారం అందించే ప్రణాళకలో భాగంగా పెంచబడుతున్నది.
ప్లాంటేషన్ చూసుకొని మరోచోట సరిహద్దు రాళ్ళను( బౌండరీ పిల్లర్స్) చూసుకోవాల్సిఉంది. అంచులవెంట అడవిపత్తిచెట్లు, అడవిబెండచెట్లు పెరుగుతున్నాయి. మొన్నామధ్య అడవిలో సేకరించిన పత్తిగింజలతో ఒకతను ఖమ్మంలో పట్టుబడ్డాడు. మనదేశంలో జరుగుతున్నంత వన్యజన్యువుల వ్యాపార వినియోగం మరెక్కడా జరగదేమో. ఇలా ఎందుకు అంటున్నానంటే మన చుట్టుపక్కలజరిగే విషయాలమీద మనప్రజలకు యే మాత్రం అవగాహన ఉండదు. దశాబ్దంకిందట జన్యుమార్పిడిచేసిన పత్తివిత్తనాలమీద అంతర్జాతీయస్థాయిలో చర్చజరిగింది. అదే బీటీ పత్తి విత్తనాల గురించి. అందులో బాసిల్లస్ తురంజెనసిస్ అనే బాక్టీరియానుంచి వేరు చేసిన ఒక జన్యువును పత్తి విత్తనాల్లో ప్రవేశపెట్టడంవల్ల పత్తిపంటలో గులాబీరంగు కాయతొలుచు(తామర పురుగు)నివారించవచ్చని కనిపెట్టి మార్కెట్లోకి వదిలారు మోన్సంటొ అనే అంతర్జాతీయ కంపనీవారు. ఆ సాంకేతిక పరిజ్ఞానం వివాదాస్పదం అయింది. అయితే అటువంటి సాంకేతిక పరిజ్ఞానంతోనూ, వివిధరకాలైన హైబ్రిడ్వంగడాలను సృష్టించడంలోనూ వన్యజాతులనుంచి విత్తనాలు సేకరించి ప్రయోగాలు చేస్తుంటారు. అవి విజయవంతమైనప్పుడు సృస్థించే సంపద విలువ ఊహకు అందనిది. అయితే వన్యప్రాణి చట్టం ప్రకారం కొన్ని మాత్రమే నియంత్రణలు ఉండగా ఈ మధ్యే వచ్చిన జీవవైవిధ్యచట్టం,వన్య ఉత్పత్తులను,అవి సృష్టించే సంపద స్థానిక సమాజాలకు ఉండే సంబంధాన్ని లోతుగా చర్చించింది. ఇదివరకు ఇట్లా అడవినుంచి విత్తనాలు సేకరించే వ్యక్తులమీద పెద్దగా కేసులు లేవు. కానీ ఇకముందు వాటిమీదా నిఘా ఉంచవలసిన అవసరంఉంది. అక్కడక్కడా గట్ల వెంటనో, అడవిలోనో కనిపించే వనీయజాతులను గుర్తించి విత్తన సేకరణచేసి ప్రయోగాలు చేస్తుంటారు. వన్యజాతులకు వివిధ తెగుళ్ళను, పురుగులను, కఠినమైన పరిస్థితులను తట్టుకొని పెరిగేశక్తి ఉంటుంది. మంచి దిగుబడిని ఇచ్చే రకాలతో వీటిని సంపర్కం కల్పించి కొత్త వంగడాలను సృష్టిస్తారు.
ప్లాంటేషన్నుంచి మరోచోట సరిహద్దురాళ్ళను(బౌండరీ పిల్లర్స్) చూసుకొని వెళ్ళవలసి ఉంది. అటవీప్రాంతాల సరిహద్దుల్లో నిర్ణీత దూరానికి ఒకటీ చొప్పున మైలురాళ్ళవంటివి ఏర్పాటుచేసి సరహద్దుల నిఘా పెడతారు. అన్నీ ఒకేసారి పూర్తికావు. కేటాయింపులకు అనుగుణంగా ఏర్పాటుచేయడమూ ఉంటుంది. ఇవి రెండుమూడు రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు అటవీభూమి వేరే అభివృద్ధికార్యక్రమాలకు ఇవ్వడం ఉంటుంది.అటువంటప్పుడుకూడా రాళ్ళను ఏర్పాటు చేస్తారు.గతంలో కట్టినవి ఇప్పుడు ఒకసారి పరశీలించవల్సి ఉంది కనుక వెళ్లడం. ఇంకా వీలైతే తాడ్వాయి రేంజి పరిధిలో వచ్చే దేవునిగుట్ట చూడాలి. అటవీవిభాగాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తాడ్వాయి పేరుతో రెండు రేంజులు ఏర్పడ్డాయి. ఒకటి వన్యప్రాణి విభాగానికి చెందినది, మరొకటి సాధారణ అటవీ విభాగానికి చెందినది. దేవునిగుట్ట సాధారణ అటవీ విభాగానికి చెందిన అడవిలో ఉంది. దేవునిగుట్టగురించి మొదట అరవింద్ పాకిడే ద్వారావిన్నాను. అరవింద్ కొత్తతెలంగాణచరిత్ర పరిశోధక బృందంలో ఒకరు. దేవునిగుట్టగురించి ఈమధ్యనే చాలా విశేషాలు తెలిశాయి.దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మామూలుగా మందిరాల్లో శిల్పాలు, స్థంభాలు దేనికవే ఒకటే శిలతో చెక్కి ఉంటాయి, కానీ దేవుని గుట్టలో మాత్రం ఒకశిల్పరూపాన్ని వివిధ రాళ్ల మీద చెక్కి వాటిని ఒకదానిమీద ఒకటి పేర్చి ఒక రూపాన్ని ఇచ్చారు. అది చాలా పాతది క్రీస్తు శకం ఆరో శతాబ్దానికి సంబంధించిందని అంటున్నారు. ముఖ్యంగా బోధిసత్వని శిల్పం. అది ఫోటోలో చూస్తేనే శిల్ప నిర్మాణం కొట్టొచ్చినట్టు కనిపిస్తూంది. రాళ్ళని పేర్చి రూపం తేవడం గొప్పవిషయమే. చుట్టుపక్కలా ఎక్కడా అలాంటి నిర్మాణ శైలి లేదని అంటున్నారు.అలాగే అంగోర్ వాట్లోని మందిరానికి ఒక మినియేచర్లాగా ఉంటుందనడం ఆశ్చర్యమే. మనకు కాకతీయులవరకే వరంగల్ చరిత్ర ప్రాచుర్యంలో ఉంది.కాకతీయులకుముందు ఎలా ఉండేదన్న చరిత్ర ఉనికితక్కువ. తెలుగు రాష్ట్రాలలో విష్ణుకుండినుల తర్వాత బౌద్దం నిరాదరణకు గురైంది. అటుతర్వాత చాళుక్యుల నుంచి శైవం వికసించడం మొదలైంది. కాకతీయులు శైవారాధకులు. అంటే ఈ మందిరంలోని బోధిసత్వని విగ్రహాలుండడం మహాయాన బౌద్ధానికి సూచిక. విష్ణుకుండునిల కాలానికి మహాయానమే ఆంధ్రదేశమంతటా ఉంది. చుట్టూ పక్కల యే సంబంధమూ లేకుండా ఉండి ఉండదు. భూపాలపల్లి, పాండవులగుట్టతో సంబంధాలు ఉండి ఉండవచ్చునేమో. ఇన్నాళ్ళూ గ్రామస్తులకు తప్ప ఎవరికీ తెలియకుండా పడిఉంది. ఈ మందిరశిథిల ఆనవాళ్లు మరో చారిత్రక అధ్యాయనానికి తెర తీయవచ్చునేమో. ఈరోజు చూడడం వీలవుతుందా అనేది పనిలో ఉన్నవెసులుబాటును బట్టి ఉంటుంది. ముందుగా వచ్చిన పని చూసుకుని అది కూడా చూసుకుంటే బాగుండనే అనుకుంటున్నాను. అది నా పరిధిలోకి రాదు అది మరో అధికార పరిధిలో ఉంటుంది అయినా సరే అక్కడికి వెళ్లడానికి వీలు చూసుకోవాలని ఎప్పటినుంచి అనుకుని ఈరోజు పెట్టుకున్నాను.
భారతీయ మందిరాలు విశిష్టమైనవి. భారతీయులు మందిరాలు నిర్మించకపోయి ఉండుంటే వారి నిర్మాణ కౌశలమూ, వాస్తుశిల్పం, చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమీ ఉండేవి కాదు. మన పూర్వీకులు ఎంతంటి విజ్ఞులో కదా. రాతిమీదనే తమభావాలను, జీవితాలను రాసిపెట్టారు.చెరగని రాతిపుస్తకాలవి.ఎవరు చెరిపివేయలేని విశిష్ట జ్ఞానమది.ఒక పుస్తకమైతే కొన్నాళ్ళకి పోతుంది,ఎక్కువకాలం భద్రపరచలేం, రాతి మీద రాసిపెట్టిన ఈ పుస్తకాలు శాశ్వత జ్ఞానబండాగారాలు.ఈనాడు ఒక్క రాయినో రూపాన్నో పట్టుకొని మనం ఎంత చరిత్రనైనా వెలికి తీయవచ్చు., మొహంజదారోలోని నృత్య సుందరిలాగా.
మధ్యాహ్నానికన్నాముందే బౌండరీ పిల్లర్స్ చూసేసాము. ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. చిత్తడి చిత్తడి అడవి. పెద్ద వృక్షాలు తక్కువ. ముందున్న వృక్షాలు పోతే మళ్లీ ఎదుగుతున్న అడవి. కొన్ని వృక్షాలు గర్డిలింగ్ చేశారు. అంటే భూమినుంచి పదిలించులపైన కాండంమీద బెరడు నాలుగించులమేర తొలగించారు. మరికొన్ని రోజుల్లో ఆ చెట్లు చచ్చిపోతాయి. ఇలాంటప్పుడు ఎవరిమీద కేసులు పెట్టలేము. అప్పుడే తొలగించిన బెరడువద్ద ఆవుపేడ, బంకమట్టి కలిపి కట్టు వేస్తే చెట్టు బతుకుతుందని సీనియర్ అధికారి ఒకరు అన్నారు.నేనైతే దానిగురించి యే ప్రయోగమూ చేయలేదు. ఇది గనుక నిజంగా విజయవంతం అయితే కొన్నింటినైనా కాపాడుకోవచ్చు. పిల్లర్స్ కొన్ని వాలుగా ఉన్న చోట పడ్డాయి. జారిపోయేలా ఉంది. అయినా పడిపోకుండా కిందఉన్న గడ్డికొంత కాపాడింది. గడ్డి మీద అక్కడక్కడా చీమలు ఎక్కడికో వెళుతూ అటూఇటూ పరుగెత్తుతున్నాయి.పచ్చినేలమీద మట్టిని ఉండలు చుట్టి దొరలించుకుపోతున్న కీటకాలు వాటిపనిలో అవి నిమగ్నమైపోయాయి. వరుసగా కురిసిన వర్షాలవల్ల ఏర్పడిన చీదర ఇక్కడా కనిపిస్తున్నది. ఆగితే కుట్టే పసరిక దోమలు, ఒక్క క్షణం ఆగకుండా వెళ్లిపోయేలా చేశాయి. ఇంకో విషయం మానవులకు విష జ్వరాలను అంటించే రక్తం పీల్చే దోమలన్నీ ఆడదోమలే. మగ దోమలు చెట్ల రసాలు పీల్చి బతుకుతాయి.కానీ అడవిలోకివెళ్తే మాత్రం మనల్ని కుట్టేస్తాయి.కుట్టినచోట దద్దుర్లు అప్పటికప్పుడే వచ్చేస్తుంటాయి.అప్పుడనిపిస్తుంది మానవుడు ఎన్ని జీవాలను జయించి ఈ మాత్రం నిద్ర పోగలుగుతున్నాడని. అయినా ఇప్పటికీ దోమలనుంచి మాత్రం నిజంగా రక్షించబడలేదనడాకి నాటి మలేరియా నుంచి ఇప్పటి డెంగ్యూ దాకా ఎన్ని నిదర్శనాలు!
మధ్యాహ్ననానికి ముగించుకొని వెల్లవలసి ఉండగా మధ్యలో నర్సరీవద్ద కాసేపు ఆగాము. దోమలు అప్పటికే దద్దుర్ల అచ్చులు వేసేసాయి. మంట మండుతోంది. నర్సరీవద్ద నీళ్ళతో కడిగినా మంట పోలేదు. అడవిలో ఉండడం పెద్ద సవాలు. ఒక్కోసారి నాటి వానప్రస్థం ఎలా గడిచి ఉండేదో పాపం అనిపిస్తుంది. నదిలో స్నానం చేసేక ఏనుగు మట్టిని చల్లుకున్నట్టు ఏదైనా రాసుకున్నారో, చల్లుకున్నారో ఎక్కడా చదవలేదు, ఎవరూ చెప్పలేదు. హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు దోమదండకం రాస్తూ మహా చక్రవర్తులను రాజ్యానికి దూరం చేసినదానివని దోమను పొగడ్తలాంటి తెగడ్తను రాసింది అలెగ్జాండర్ గురించి.అది మానవవిజయంలోని పరిమితులు ఇంకా ఉన్నాయంటూ చేతులమీద వచ్చిన దద్దుర్లు గుర్తుచేసిన వేళ తల అడ్డంగా ఊపి నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేము కదా.
దేవునిగుట్ట వెళ్లాలంటే కొత్తూరుమీదుగా వెళ్ళాలి. పక్కనచెరువు ఉంటుందని చెప్పారు. అడవి కనుక మట్టిరోడ్డె ఉంది.అవడానికి బోధిసత్వుని మందిరమైనా ఎవరోఅక్కడ నరసింహుని ప్రతిష్టించారు. దేవునిగుట్ట మందిరం ఇప్పుడిలా అడవిలో ఉందిగానీ ఇంతకుముందు ఏదైనా పేరున్న గ్రామమే ఉండి ఉండవచ్చు. మనకు మందిరం చూడడంతప్ప ఏమీ తెలిసే అవకాశంలేదు. ఇప్పటికి పదిహేను శతాబ్దాలు గడిచిపోయాయి. గతంనుంచి ఏదైనా మిగిలింది అనుకుంటే మిగిలినట్టే.
బోధిసత్వుడు బుద్దుడి పూర్వరూపం, అంటే బోధిసత్వుడు తీసుకున్న అనేక అవతారాలలో బుద్దుడు ఒకటి. బౌద్దంగురించిన అనేక పోకడల్లో బుద్దుడి పూర్వఅవతారాల భావన ఒకటి.మావూరికిపక్కన ధూళికట్టఅనే చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ బౌద్ధస్తూపంఉంది. బౌద్ధంగురించిన ఉత్సుకత కలగడానికి అదో కారణం. చాన్నాళ్ళ క్రితం నాకు మిలరేప పుస్తకం దొరికింది.తెలుగులో శార్వరిగారు రాశారు.ఇంగ్లీష్ల్ ఎపుడో 1962 లోనే వచ్చింది. నేను చదివిన పుస్తకాల్లో ఇప్పటివరకు వెంటాడిన రెండు, మూడు పాత్రలలో ఒకటి ఏడు తరాల్లోని కుంటా, రెండవది ధర్మభిక్షువు మిలరేప. టిబెట్లో ప్రసిద్ద బౌద్ద సన్యాసి. మనదేశంనుంచి బౌద్దం మార్పా లోత్సవా ద్వారా టిబెట్ చేరింది. అతని శిష్యుడు మిలరేప. 12వ శతాబ్దానికి చెందినవాడు.అతను జీవించిన కాలం క్రీ.శ. 1052-1135 అని తేల్చారు. కైలాస పర్వతాన్ని అధిరోహించిన మొదటివ్యక్తి అనికూడా చెప్తారు. కుటుంబ కలహాల్లో పినతండ్రిమీద పగతీర్చుకోవడం కోసం తాంత్రికవిద్యల్ని నేర్చుకొని తర్వాత వాటిని వదిలి మార్పా వద్ద శిష్యుడిగా చేరతాడు. మొదట మార్పా అతనికి చేసిన ప్రత్యేక ఉపదేశం ఏమీ ఉండదు. కొండమీద ఉండి అక్కడ ఉన్న రాళ్ళతో ఇల్లు కట్టమని చెప్తాడు. ఆ కట్టడమే తన గురుదక్షిణ అంటాడు. మిలారేప ఇల్లు కడతాడు, తీరా కట్టినతర్వాత ఈస్థలం తనది కాదని, తన తమ్ముడిదని కూల్చేయమనీ అంటాడు. హతాశుడైన మిలారేపా దాన్ని కూల్చేస్తాడు. మరో కొండ మీద మళ్ళీ కట్టమంటాడు. మళ్ళీ కట్టడం మొదలుపెడతాడు. గురువుగారు మళ్ళీ కూల్చేయమంటాడు. నువు మొదటిసారి కట్టినప్పుడు ద్వేషంతో కట్టావు, రెండవసారి కొంత కట్టినప్పుడునప్రతికూల భావాలతోనే కట్టావు కనుక కూల్చేయమనే ఆదేశం ఇచ్చానని అంటాడు. మూడోసారి మళ్ళీ ఇల్లుకట్టడం మొదలుపెడతాడు. ఈసారి యేభావాలు లేకుండా. సంవత్సరంపాటు కష్టపడి తొమ్మిది అంతస్తుల భవనం కడతాడు. గురుపత్ని ఇచ్చిన దుప్పటి జెండాగా కడతాడు. ఏడాది కాలానికి అది చిరిగిపోతుంది. గురువుకు బహుమానంగా ఇవ్వడానికి తనతల్లి ఇచ్చిన మణికన్నాఈ చిరిగినజెండానే గురువుగారికి తగిన బహుమతిగా భావిస్తాడు. దానిమీద తాను మొదటిసారి చూసిన తలలేని బుద్దుడి బొమ్మని చిత్రించి చూపిస్తాడు. గురువు ఇప్పుడు ఉపదేశానికి తగినవాడివని ప్రశంసిస్తాడు. ఉపదేశం చేస్తాడు. మిలరేప పన్నెండేళ్ళు గుహలో ధ్యానంలో ఉండిపోతాడు. ఎన్నో పరీక్షలకు గురవుతాడు.శరీరం అంతా ఆకుపచ్చరంగులో మారిపోతుంది. మిలరేపా సిద్ధుడవుతాడు, అనంత ప్రకృతిలో కలిసిపోతాడు. ఎలా ఉండిపోయాడో ఆ గుహలో, అడవిలో ఒక్కడే, ఎంతకాలమో! ఎవరికీ తెలియదు. అతనికికూడా తెలియదు. మట్టిలో మట్టిగా,రాయిలో రాయిగా,చెట్టులో చెట్టుగా,పక్షిలో పక్షిగా,అన్నింటిలో తానుగా, తనలోని అనంతంగా… బోధి సత్వునిగా.
మిలరేప తన ఆధ్యాత్మిక అనుభవాలను కూర్చిన పద్యాలను పాడాడు, అవి లక్ష దాకా ఉండవచ్చునని మాట. అవన్నీ మిలరేప తన శిష్యుడైన రేచుంగ్ పా ద్వారా పలికించాడట. అతని శిష్య పరంపరద్వారా జనసామాన్యంలో ఉన్న వాటిని కూర్చి టిబెటన్ భాషలో ఉన్న పుస్తకాన్ని 1962లోనే ది హండ్రెడ్ థౌసండ్ సాంగ్స్ ఆఫ్ మిలరేప గా తెచ్చారు ఓరియంటల్ స్టడీస్ ఫౌండేషన్ వాళ్ళు. మనల్ని మరో శాంతి ప్రపంచంలోకి చూడమనే పాటలవి.
మనిషి అనంతకాలాలనుంచీ అనేక అనుభవాలను మోసుకుతిరుగుతున్నాడు. మనరక్తంలో మన పూర్వీకలున్నారు, వారి అంశాల ఆనవాళ్ళున్నాయి, వేల ఏళ్ల ప్రయాణపు అణువులున్నాయి, అనుభూతులున్నాయి. మనలో కొందరు తాము దర్శించిన వాటిని రాళ్ళమీదకో, పద్యాలకో అనువదించారు. అవి తమను స్పృశించే వారిపట్ల దయతోవాటి విశేషాలను చెబుతాయి. కాలాతీతమైనదేదో ఉంటుందని, దానిని అందిపుచ్చుకోవడానికి జీవితానికిమించిన దృశ్య కటకమేదీలేదనీ ఆఅనంత ప్రకృతిమర్మాలను ఎవరికి అందినంతమేరవారు చెప్పుకుపోయారనీ ఇట్లాంటి మహానుభావులవల్ల తెలుసుకుంటాము. ఇట్లా తెలియజేయడానికివాళ్ళు తమ అపురూప జీవితాలన్ని అర్పించారు. అది భూమిమీద ఆధ్యాత్మిక వైవిధ్యం అయింది.
దేవునిగుట్టమీద బోధిసత్వుడిని పరిశోధించే పనిలో దానికై నిర్ధేశించిన సంస్థలు కృషిచేస్తున్నాయి. ముందుముందు ఈ తాడ్వాయి యే చారిత్రక విశేషాలను జోడించనుందో ఎవరికి తెలుసు! యే స్థపతులు భోధిసత్వులయ్యారో, యే జెండాలనుకట్టి కిరణాలై విస్తరించారో కాలం వెలికితీస్తుంది.చూసుకొని తరంచడమే మనకు దొరికింది.
నర్సరీలోనే మధ్యాహ్నం దాటి పోయింది. మబ్బులు కూడుతున్నాయి, దేవునిగుట్ట వద్దన్నారు. ఇంతలో మొన్నామధ్య ఆక్రమణనుంచి స్వాధీనం చేసుకున్న భూమిలోవేసిన ప్లాంటేషన్ ను కొంచం కొంచంగా ఇదివరకు ఆక్రమించిన వాళ్ళు తొలగిస్తున్నారనే సమాచారం వచ్చింది. ఈసారి కొత్తగా బ్లేడుతో రోజుకు కొన్ని మొక్కలను భూమికి దగ్గరగానో లేక పైన మొవ్వనో తెగ్గోస్తున్నారనీ అందువల్ల ఇప్పటికే మొక్కలు చాలా మొక్కలు ఎండిపోతున్నాయని చెప్పారు. తిరగి వెళ్ళే దారిలో ప్లాంటేషన్ పరిస్థితి చూసి వెళ్ళవచ్చు. ముందే రిపోర్ట్ చేసి , నష్ట పోయిన మొక్కలని భారతీ చేస్తే మేలు. రోజుకు కొన్ని ,మొక్కలను తీస్తూ పోతే యే ప్లాంటేషన్ మిగులుతుంది ?మొవ్వలూ , మొదళ్ళూ కత్తిరించిన విషయం ఎవరుమాత్రం గుర్తించగలరు, ఏదో ఒక నిర్లక్ష్యంవల్ల పోయిందని వేటు పడుతుంది. అందునా ప్లాంటేషన్లు విజయవంతం కాకపోతే ఆ పెట్టుబడిని సదరు అధికారులనుంచి రికవరీ చేసే పద్దతి ఒకటి ఉంది కదా, దానివల్ల అధికారులు తమ ప్రమేయం లేకపోయినా ఆర్థికంగాకూడా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకైనా మంచిదని అటువైపే వెళ్ళాలనుకుని బయలుదేరాం.
పొద్దున్నుంచి తిరుగుతున్నందుకు వెహికల్లో కూర్చుంటే అలసట అనిపించింది. తాడ్వాయి నుంచి ఆహ్లాదకరమైన దోవ. ఎండపడకుండా ఎదిగిన చెట్లుచేతులు కలుపుకుంటాయి. ఏదో మార్మికమైన శబ్దం గాలితోపాటు తిరుగుతుంటుంది. ఆగి నిలుచుని దోవనుంచి లోపాలకి చూస్తామా అదో ప్రపంచం. చిన్నచిన్న జీవుల పెద్ద ప్రయాణం. నేనుకూడా గలీవర్,లిల్లీపుట్ రాజ్యంలో ప్రవేశించినట్టు వాటి సూక్ష్మప్రపంచాలలోకి వెళితే బాగుండునని ఊహ. ఊహాలని భగ్నంచేస్తూ మరోచోట భూమికోసం స్థానికులు అడవినరుకుతున్నారన్న సమాచారం. ఎటువెళ్ళాలి.,అంతటా విధ్వంసమే. మిలరేప తన పద్యంలో అంటాడొకచోట
I see people fighting over land
Then they quarrel over water
In the end blows are exchanged
Thinking thus ,I feel sick at heart
Now I shall farm the land of self discipline,
Now I shall devote myself to practicing the Dharma
నేనీ మనుషులు నేలమీద పోరాడటం చూస్తున్నాను
తదుపరి నీటికోసం దెబ్బలాడారు
చివరిన గాయాలు మార్చబడ్డాయి
ఆలోచిస్తే హృదయం శల్యమైంది
ఇప్పుడు నేను స్వీయ క్రమ శిక్షణను సాగుచేస్తాను
ధర్మాచారణకోసం నన్ను నేను అంకితమిచ్చుకుంటాను
ఏదైనా అధర్మం మొదలు పెట్టేటప్పుడే నష్టమేమిటొ అర్థంచేసుకోగలిగితే చివరన గాయాలు మార్చబడవు. హృదయాన్ని శల్యం చేసే శూలాలూ బాధించవు. ఎంత చెప్పినా వినపించుకోని మనుషులున్నప్పుడు క్రమశిక్షణ సాగు చేయవలసి ఉంటుంది, అందుకు అంకితం అవ్వవలసీ ఉంటుంది.
-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~