భావ కవిత్వం పై తిరుగుబాటుతో ఆవిర్భవించిందే అభ్యుదయ కవిత్వం. భావ కవుల స్వేచ్చా ప్రియత్వాన్ని , ప్రణయ తత్త్వాన్ని , సౌందర్య కాంక్షని , పలాయన తత్వాన్ని నిరసిస్తూ సామాజిక స్పృహకి ప్రాతినిధ్యం ఇస్తూ సామాజిక చైతన్యాన్ని రగిలించడానికి అభ్యుదయ కవులు ప్రయోగాలు చేశారు.
అభ్యుదయం అనే మాటకు మంగళం శుభం అనే నైఘంటికార్ధాలు ఉన్నప్పటికీ ఆధునిక సందర్భంలో “ప్రోగ్రెస్ “ అన్న ఆంగ్ల పదానికి సమానార్ధకంగా “అభ్యుదయ “ అన్న పదాన్ని వాడుతున్నాం “1 అభ్యుదయ కవిత్వం భౌతిక పునాదులపైన నిర్మించబడి సామాజిక శ్రేయస్సుకు ఉపకరించే సౌధం. తాజా మహల్ నిర్మాణానికి రాళ్ళు మోసిన కూలీలను వీధిని అడుక్కోవడానికి కూడా శక్తిలేని బిక్షువర్షీయసి “ ని కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకు సాగిద్దామని తల్లి మాట పెడచెవిన పెట్టి వచ్చిన బాటసారినీ , గుమాస్తాలనీ , మధ్య తరగతి ప్రజల్నీ కావ్య వస్తువులుగా స్వీకరించి రచనలు చేశారు. వారు ఎన్నుకున్న కావ్య వస్తువుని గూర్చి చెప్పి చదువరుల సానుభూతిని అభ్యుదయ కవులు ఆశించారు.
ఆభ్యుదయ కవిత్వం పెట్టుబడి దారీ వ్యవస్థ పైనా బూర్జువా వ్యవస్థపైనా , పాలకుల పాలితులను పీడించే విధానం పైనా , ధ్వజమెత్తిన కవిత్వ ఉద్యమం. అభ్యుదయ కవిత్వ యుగంలో శ్రీ శ్రీ , నారాయణబాబు , శిష్టా , పురిపండా , పఠాభి ప్రారంభకులుగా ప్రసిద్ధి పొందగా తిలక్ , సోమసుందర్ , ఆరుద్ర, దాశరధి , నారాయణరెడ్డి , కుందుర్తి, శేషేంద్ర శర్మ మొదలైనవారు అభ్యుదయ కవిత్వ ప్రచారకులుగా ప్రసిద్ధి పొందారు.
శ్రీశ్రీ తొలినాటి రచన అయిన ప్రభవ సంకలనం ప్రకృతి గీతాలతోను , ప్రణయ గీతాలతోనూ , నిండి ఉంది. భావ కవుల్లాగే శ్రీశ్రీ ప్రారంభపు యవ్వనంలో ప్రకృతిలో లీనమై ప్రణయ జలధిలో ఓలలాడాలనుకున్నాడు.
“ఆ మహోన్నత దివ్య వృక్షాగ్రమందు
నూతన చైతన్య రాగ సన్నుతములగుచు
గదలి యాడెడు ప్రతి సంఘముల నడుమ
నేను సైతమొక్కాకునై యెనయుదేని “ 2
అని అంటూ అన్ని ఆగుల్లాగా జీవించినంత కాలం జీవించి చివరకు రాలిపడి పోయే కాలంలో పాంథ జనుల త్రొక్కిళ్ళలో సొక్కి పోకుండా స్వేచ్చా ప్రవ్రుత్తినే కోరుకున్నాడు. శ్రీ శ్రీ కవిత్వాన్ని అనుభవించి , ఈ వృద్ధ ప్రపంచానికి నెత్తురు కన్నీళ్లు తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు అంటాడు చలం. కృష్ణశాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు.
ప్రపంచమంతా ఆర్ధిక మాంద్యంతో కుంగిపోతుంది. నిరుద్యోగి అయిన యువకుడి మానసిక స్థితి అస్తవ్యస్తంగా ఉంది. అంతకు ముందు వరకు భావకవిత్వం రాశారు కానీ అది తన సొంత గొంతు కాదని క్షణక్షణం భావిస్తూ బాధపడ్డాడు.
“నేను సైతంప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం
విశ్వ సృష్టికి
అశ్రువునొక్కటి ధారపోశాను “3
శ్రీశ్రీ వ్యావహారిక భాషలో రచించిన మొదటి గేయం. బ్రతుకు బరువు మోయలేని ఈ ప్రపంచంలో ఎందరిలోనో తనూ ఒకడు. ప్రపంచంలో ఉన్న బాధ తనూ అనుభవిస్తున్నా అందరితో బాటు ఈ ఖండికలో ఒక వైపు “ నేను సైతం “ అంటూ ఆత్మార్పణ , సహనం , త్యాగం కనపర్చడం బావుటానాయి పైకి లేస్తాను అనటం రెండు పరస్పర భావాల సమ్మిళితం కనిపిస్తుంది.
కమ్యునిస్టు దృక్పధంతో సామ్యవాద సిద్ధాంతాల్ని వర్గ పోరాటాన్ని చిత్రించటంతోనూ , దేశభక్తిని ప్రబోదించటంలోనూ ఆరుద్ర రచనలు చేశారు. సినీవాలి , పంచిన పద్యాలు , ఇంటింటి పద్యాలు , గాయాలు –గేయాలు , కూనలమ్మ పదాలు వ్నటి రచనలు ఆరుద్ర చేసారు.
“వెలగమంటే వేలుగుతాను
వెన్నెలల కరుగు
వెళ్ళమంటే పోతాను
వీధిలాగా పరుచుకో
నన్ను నీ రక్తం పిలిచినపుడు
కన్ను పరధ్యానంగా వుంది
మొన్న నీ మౌనం పగలనపుడు
పొద్దు పొగచూరింది” 4
అభ్యుదయం, కమ్యునిస్టు ఉద్యమాల నేపధ్యంలోప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఈ కవిత సాగుతుంది.
ఆదునిక కవుల్లో నూతన పోకడలలో కవిత్వం రాస్తూ తన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న కవి దాశరధి . అభ్యుదయ దృక్పధంతో తెలంగాణా పోరాటంలో పాల్గొని నిజాం బూజును దులపడానికి కృషి చేసిన దాశరధి రచనలన్నీ యితర అబ్యుదయ కవుల్లాగే సాగాయి. దాశరధి ‘అగ్నిధార’ కురిపించి ‘’రుద్రవీణ ను మీటి ‘అమృతాభిషేకం’ చేసుకున్నారు. ‘మహోంద్రోదయాన్ని’ కవితా పుష్పకంగా వెలువరించాడు. అంధకారంలో కూరుకుపోయిన , పోతున్న మానవ సమాజం కోసం ‘తిమిరంతో సమరం’ జరిపి కాంతి కవాటాన్ని తెరిచాడు.
“ఓ నిజాము పిశాచమా , కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తేనెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ “5
ఇది దాశరధి జాలి గోడపై బొగ్గుతో రాసిన పద్యం. దీన్ని ఆళ్వారు స్వామీ కంఠస్థం చేయడమేకాక జైలు గోడల మీదంతా రాశాడు. తెలంగాణా పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించిన దాశరధి కావడంతో అభ్యుదయ కవితా ధోరణిలో “అగ్నిధార “లో కవితలు వెలువడ్డాయి. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం పెట్టుబడి దారీ వ్యవస్థను , సామ్రాజ్య వాడ తత్వాన్ని , యుద్ధ వాంచను వ్యతిరేకించింది. ఆకలి , అన్యాయం ,అసమానత , దారిద్ర్యం లాంటి వాటిని ఎదిర్న్చి దాశరధి ఇటువంటి పరిస్తితులోనే తన ఆకలానికి పడునుపెట్టాడు.
“చిన్నమ్మా
వీళ్ళందరూ తోకలు తెగిన ఎలుకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
మౌడ్యం వాళ్ళ బలాడ్యులు
అవివేకం వాళ్ళ అవినాశులు
సంఘపు కట్టుబాట్లకి రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్చావర్తనకి నైతిక భాష్యకారులు
శిథిలాలయానికి పూజారులు “6
“అమృతం కురిసిన రాత్రి “లో 64 ఖండికలున్నాయి.అవి అన్నీ సమాజంలో ఉన్న ప్రతివారినీ ఏదో వంకతో పలకరిస్తాయి. ప్రతివారి రూపాన్ని ఏదో విధంగా ప్రతిబింబింపచేస్తాయి. ప్రతి వారినీ ఆలోచింప చేస్తాయి. ఆనందపరుస్తాయి. కొన్ని సందర్బాలలో మనసులో ఉన్న విసయాన్ని నిర్భయంగా బయటకు అనేస్తాడు.
తిలక్ ను మాహాకవిగా నిలబెట్టి అమరుణ్ణి చేసిన మరో అభ్యుదయ గీతం “ఆర్తగీతం”. తిలక్ అంటే ఆర్తగీతం , ఆర్తగీతం అంటే తిలక్ గా ప్రసిద్ధమైన ఆ గీతం ఎందరు ఎన్ని సార్లు ఎన్ని విధాల చదివినా , అన్వయించినా గుండె కదలికలలో కలిసిపోయిన గీతం ఆర్త గీతం , ప్రార్ధన , ఆర్త గీతం వంటి మహత్తర గేయ కావ్యాలు తిలక్ రచనలు.
“చిచ్చు బుడ్డీ పేలుతుంది – చిచ్చరకెన్నూ పేలుతుంది
పాడు గడ్డీ మండుతుంది – బడబాగ్ని మండుతుంది
జాతర చూపేదొకటి – చైతన్యం రేపెదోకటి
క్షణ మాత్రం ఒకటి – అనంత కాల సందీప్తం ఒకటి “ 7
“మంటలూ – మానవుడు “లో 30 ఖండికలున్నాయి. సృజనాత్మకత సుష్టుగా ఉన్న సి.నా.రె ఈ కావ్య సంపుటిని వైశిష్ట్యాన్ని వివరించారు. ఈ కావ్యంలో ఉద్వేగ జనకమిన గమనం కంటే ఉత్తేజకరమైన ఉక్తి నైపుణ్యం హెచ్చు. మధ్యతరగతి అభివ్యక్తిలోనూ , వస్తువులోనూ నేర్పు గల కవితల సంపుటి ఇది. సి.నా.రె మానవత దృక్పధానికి , అభ్యుదయ ధోరణికి దర్పణం పడుతుంది ఈ కవిత.
నేటి దళిత , స్త్రీ వాదులు కూడా అభ్యుదయోద్యమం దళితుల్ని , మహిళల్ని పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. అయినా దిగంబర, విప్లవ, దళిత ఉద్యమాలకు దారి చూపింది అభ్యుదయ కవిత్వం అని చెప్పవచ్చు. రూపంలోనూ, వస్తువులోని , భాషలోనూ విప్లవం తీసుకువచ్చిన అభ్యుదయ ఉద్యమం తరువాతి ఉద్యమాలకు కరదీపిక అయ్యింది.
–జె.ప్రతిభ,
పరిశోధక విద్యార్ధిని,
కాకతీయ విశ్వవిద్యాలయం,
హన్మకొండ,
ఆధార గ్రంధాలు :
1.తెలుగు అకాడమీ – తెలుగులో కవిత్యోద్యామలు – పుట : 110
1.శ్రీ శ్రీ – సుభాషి మాస పత్రిక , నవంబర్1927
(శ్రీ శ్రీ – ప్రభవ – పుట: 13 )
3.శ్రీ శ్రీ – మహాప్రస్థానం – పుట : 04
4.ఆరుద్ర – గాయాలు – గేయాలు – పుట : 97
5.దాశరధి – అగ్నిధార – పుట : 3
6.దేవరకొండ బాలగంగాధర్ తిలక్ – అమృత కురిసిన రాత్రి – పుట: 15