కాలమనే త్రాసులో
బాధ్యతల బరువుల
విలువలను తూచేటప్పుడు
వయసు కుదుపుల మధ్య మనసుకు పరీక్షే…
కిక్కిరిసిన ఒంటరిలో
ప్రవహించే మాటల్లో బొట్టు పదం కరువై
ప్రతి క్షణం పడే బాధలో
భరించే సహనమే పెద్ద శిక్ష.
తనకు తానుగా చీలిపోయి
అనుభవాలని కరచుకుని
స్రవించే ఆలోచనలు
అనివార్యమైన సమరాలే
జీవితంలో తప్పులని తొలగించుకునే శక్తి తగ్గి
బతుకు దినపత్రికలో ఊహించని వార్తలా
వయసు పొలిమేరలో
మనసును విడచిపెట్టిన ఒక్కో నిజంపై
కాల స్వారీకి మనసు ధరించే
బ్రతుకు చిత్రంలో చివరి పాత్ర వరకూ
మించిన ఏన్నో బరువులతో
జీవితమెప్పుడూ రంగురంగుల ఇష్టమే…
– చందలూరి నారాయణరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~