అవసరాల తక్కెడలో
స్వార్ధపు రంగులు
మంచితనాన్ని పూసుకొని
బాగానే తూగుతున్నాయి.
ఇక్కడ బలయ్యేది
నిజాయితీ మాత్రమే.
మనసు స్వార్ధ చింతనకు గురై..
మూలాన్ని మరచి..
నైతిక విలువలు వదలి..
అరాచకాలకు పాల్పడుతూ..
ఆశామోహాలను వదలక
అధోగతి పాలవుతుంది.. !!
స్వార్ధం దిగమింగిన బతుకులెన్నో
బజారున పడ్డాయి.
పక్కవాడిని తొక్కి పైకీ రావాలనే
ఆలోచన విచక్షణనీ, వ్యక్తిత్వాన్ని
బలి తీసుకుంటుంది.
నీదైన ఆలోచనని చంపుతుంది.
కలలు విరిగిన శబ్దం
ప్రశాంతతని భగ్నం చేస్తుంది
చేరుకోలేని గమ్యమేదో
బాధను రెట్టింపు చేస్తుంది.
నిషేధించబడ్డ నిజంలా
నీ వెంటే ఉంటూ..
శూన్యాన్ని ఆవహించిన
దేహాన్ని
గెలిచి, ఓడినతనం
పీడిస్తుంది.
నేనూ.. నాదను.. స్వార్ధం
ఆణువణువునా పెంచుకొని..
ఒంటరైన జీవితాలెన్నో..!
ఆ మనోవ్యధను మోయలేక
అస్థిమితమైన మనసు
పశ్చాత్తాపం వైపు పరిగెడుతుంది.
కన్నీళ్లు తెప్పించే
ఆ నిశ్శబ్దాన్ని
నిస్వార్ధంతో జయించు.
విషాదరాత్రిలో విజయాన్ని
పొందిన మిణుగురులా
ఓ వెలుగు నీదవుతుంది.
సమాజమంతా కలుపు మొక్కై
వ్యాపిస్తున్న స్వార్ధమనే
పిచ్చిమొక్కను పెకిలించు.
మనిషి ఎదగాలి మొక్కలా ..
స్వార్థం ఎరుగని మనిషిలా..!
దూర తీరాలకి తరలి వెళ్లిన స్వార్ధానికి
ఓ విముఖతా లేఖ రాయి.
ఎప్పటికీ తిరిగి రావొద్దని..!!
-జయసుధ కోసూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~