“బుట్ట బొమ్మ” (కథ ) – మజ్జి భారతి

“శైలూ! ఇక్కడ బొమ్మ ఏది” కోపంగా అడిగాడు రాజేంద్ర.
“రంగు వెలిసిపోయిన ఆ పాతబొమ్మ దేనికండి? బయటపడేసాను” వంటగదిలో నుండి వచ్చిన శైలజ చాలా మామూలుగా అంది.
“ఎన్నిసార్లు చెప్పాను నీకు? అక్కడ బొమ్మను కదపవద్దని” అరిచాడు రాజేంద్ర.
రాజేంద్రని చూసి ఆశ్చర్యపోయింది శైలజ. కోపంతో ముఖం జేవురించుకు పోయింది. పెళ్లయిన ఆరు నెలలలోనూ రాజేంద్రని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు.
అప్పుడప్పుడు ఆ పాతబొమ్మను “బయట పడేస్తానని” అంటే నవ్వుతూ “ఇది నా ప్రాణం. నా ప్రాణాన్ని ఎక్కడ పడేస్తావు?” అని నవ్వుతూ అనేవాడు.
ఇంతకీ ఆ బొమ్మ ఏమిటని కదా మీ సందేహం. అది ఒక బుట్టబొమ్మ. ఇలా చేత్తో కదిపితే చాలు ఊగుకుంటూ ఉంటుంది. రోజూ ఆఫీసునుండి రాగానే, ఒకసారి ఆ బొమ్మను చేతితో సుతారంగా తాకి, దాని బుగ్గమీద వేలితో ముద్దు పెట్టేవాడు.
“ఏమిటండీ ఇది” అంటే ” ఈ బుట్టబొమ్మ లాంటి అమ్మాయే నాకు భార్యగా వచ్చింది. ఇక ఈ బొమ్మను ముద్దు పెట్టాల్సిన అవసరమేముంది? ఎదురుగా ఉన్న ముద్దుగుమ్మకు ముద్దు పెట్టుకోవాలి గాని” అని శైలజ బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించేవాడు.
చిన్నప్పటి జ్ఞాపకమేమో! అందుకే ఆ బొమ్మంటే అంత ఇష్టమేమో!” అని అనుకునేది శైలజ. అంతేగాని ఆ బొమ్మ లేకపోతే ఇంత రాద్ధాంతం చేస్తాడని ఊహించలేదెప్పుడూ. పెళ్లయ్యాక మొదటిసారిగా ఇంటికి వచ్చిన తన ఫ్రెండ్, పడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ఈ బొమ్మను చూసి, ఈ పాత డొక్కుబొమ్మ ఏమిటి? ఇంటిఅందం పోతుంది. బయటపడేసెయ్” అని బయటపడేసిన వరకూ ఒప్పుకోలేదు. అప్పటికీ రాజేంద్రకు ఆ బొమ్మతో ఉన్న అనుబంధం తెలుసు కాబట్టి, దానిని బయట పారేయకుండా, ఒక పక్కగా దాచిపెట్టింది తాను. కానీ ఆ బొమ్మ కనిపించకపోయేసరికి ఇంతలా స్పందిస్తాడని ఊహించలేదు.
స్పైడర్ మాన్లు, మిలిటరీ టాయ్స్, కార్లు, బైకులతో మగ పిల్లలు ఆడడం చూసింది గాని, పెళ్లై ఉద్యోగం చేస్తున్న మగవాడు ఇలా బుట్టబొమ్మతో ఆడడం… ఇదిగో… ఇదే మొదటిసారి చూడడం. కొంపదీసి… పెళ్లికి ముందు ఈయన ఎవరినైనా ప్రేమించి…. ఆ అమ్మాయి కానుకగా ఇచ్చిన బొమ్మా ఇది? అయినా అమ్మాయిలు అబ్బాయిలకు బుట్ట బొమ్మల్ని కానుకగా ఇస్తారా ఏమిటి? అది అయిఉండదులే! అది కాకపోతే మరి ఏమై ఉంటుంది? రోజూ రాగానే దానిని ముద్దుకూడా పెట్టుకుంటాడు. తీసి పక్కనకూడా పెట్టుకుంటాడు. ఆ బొమ్మని చూసి మురిసిపోతుంటాడు. అంటే ఒకవేళ ఆ అమ్మాయిని మర్చిపోలేక…. ఈ బొమ్మని ఆ అమ్మాయిగా అనుకుంటున్నాడా? అందుకే ఆ బొమ్మంటే అంత ఇష్టమా?
ఈ ఆలోచన రాగానే… ఈసారి శైలజ ముఖం జేవురించుకుపోయింది. ఏదేమైనా సరే ఈరోజు యీ బుట్టబొమ్మ కథ ఏమిటో తేల్చేయాల్సిందే! కోపంగా అనుకుంటూ బయటపడేసిన బొమ్మను, తెచ్చి యధాస్థానంలో పెట్టేసింది శైలజ.
తప్పిపోయిన కన్నబిడ్డను గుండెలకు హత్తుకున్నట్టు ఆ బొమ్మను హత్తుకున్నాడు రాజేంద్ర. అది చూసి ఇంకేమీ మాట్లాడలేకపోయింది శైలజ. ఇంకోసారి దీని విషయమేమిటో కనుక్కుందామని అప్పటికి గమ్మున ఊరుకుంది.
బొమ్మ బుగ్గలపై వేలితో తడుతూ ముద్దు పెట్టుకున్నాడు రాజేంద్ర. “ఈ బుట్టబొమ్మ లాంటి అమ్మాయి నీకు భార్యగా వస్తుంది బాబు. నీ జీవితాన్ని నందనవనం చేస్తుంది. చల్లగా ఉండు బాబు” ఆమె మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆరేళ్ల క్రిందట తిరుపతి నుండి విశాఖపట్నం వెళ్లే రైలులో అన్నవరం దాటాక, ఏటికొప్పాక బొమ్మలు బుట్టనిండా పెట్టుకొని, తనున్న పెట్టెలో ఎక్కింది ఆమె.
మంచి వేసవి. ఆ బుట్ట బరువును ఆమె వయసు మోయలేకపోతుంది. బుట్ట బరువునా? బ్రతుకు బరువునా? కారుతున్న చెమటను ఒకపక్క తుడుచుకుంటూ, బరువును కాచుకోలేక ఒకపక్క అవస్థ పడుతూ, “బాబూ బొమ్మలు… అమ్మా బొమ్మలు..” అని ఆమె రైలు ఈ చివర నుండి ఆ చివరవరకు తిరగడం చూస్తూనేఉన్నాడు. ఒక గంట పోయాక ఖాళీగా ఉన్న తనున్న పెట్టెలో ఎక్కింది ఆమె. బుట్ట బరువు ఏమీ తగ్గలేదు. అలుపు తీర్చుకోవడానికి బుట్టను దించి కాస్సేపు కూర్చుందామె. వయసు యేభైపైనే ఉంటాయి. ఆమెను చూస్తున్న తనను, ఆశగా చూసిందామె ఏమైనా కొంటానేమోనని. కొనే పరిస్థితుల్లో తను లేడు. ఇంకేమీ చేయలేక తన దగ్గర ఉన్న మజ్జిగ ప్యాకెట్ “మామ్మా! అలసిపోయినట్టున్నావు. తీసుకో” అని ఇచ్చాడు.
“వద్దు నాయనా! పర్వాలేదు. నాకలవాటే. వైజాగ్ వెళ్లడానికి ఇంకో రెండుగంటలు పడుతుంది. నువ్వుంచుకో” అని సున్నితంగా నా సాయాన్ని తిరస్కరించింది. బుట్టను నెత్తిమీద పెట్టుకొని “బొమ్మలమ్మా! బొమ్మలు… ” అనుకుంటూ మరలా అమ్మడానికి వెళ్ళింది.
అనకాపల్లి వచ్చేసరికి, నేను ఉన్న బోగి మొత్తం ఖాళీ అయిపోయింది. అప్పుడు వచ్చింది మరలా ఆమె. సగము ఖాళీ అయిన బుట్టను దించి, ఒంటికి పట్టిన చెమటను తుడుచుకొని, తీరికగా కూర్చుని, పలకరింపుగా నవ్వింది. మనిషి వడలిపోయినా, శ్రమతో అలసిపోయినా, ముఖములో చిరునవ్వు చెదరలేదు. ఆమె… నేను… ఎదురెదురుగా…. ఇంకెవరూ లేరు. మామూలుగా అయితే నేను మాట కలుపుతాను. కానీ ఇప్పుడా పరిస్థితిలో నేనులేను. ముఖంపక్కకు తిప్పుకున్నాను. కానీ నా కనుకొసల నుండి ఆమె కనిపిస్తూనే ఉంది. కిటికీకి చేరబడి కళ్ళు మూసుకుంది. ఎంత అలసిపోయిందో! ఆమెను చూస్తుంటే తెలుస్తూనే ఉంది. ఈ వయసులో ఆమెకు ఈ కష్టం ఏమిటో? ఇంక మాట కలపకుండా ఆగలేకపోయాను.
సాఫీగా సాగిపోతున్న జీవితంలో అర్ధాంతరంగా యాక్సిడెంట్లో భర్త చనిపోతే, కష్టపడి ఇద్దరు పిల్లలను, ఒక కూతురు, ఒక కొడుకు…. పెంచి వాళ్లకు పెళ్లిళ్లు చేసింది. మరలా మంచి రోజులు వచ్చాయన్న సంతోషం ఎక్కువ కాలం మిగలకుండానే…. కూతురికి క్యాన్సర్…. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కొడుకుకి యాక్సిడెంట్లో కాలు పోతే, ఉన్న ఉద్యోగం పోయి… ఆ బాధతో మద్యానికి బానిసై…. తాగిన మైకంలో…. అడిగినది ఇవ్వకపోతే తల్లిని, భార్యను తిట్టి,కొట్టి…. ఆ బాధలు పడలేక కోడలు ఆత్మహత్య చేసుకుంటానని ఇల్లు వదిలిపోతే…. చుట్టూచూసి….. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక…. “అది చచ్చిపోలేదు. నేనే పంపించేసాను. దానికి నచ్చినవాడితో బ్రతకమని. ఇప్పుడది సుఖంగా ఉంది. వీడికి ఆ విషయం తెలిస్తే ఎక్కడున్నా దానిని బ్రతకనివ్వడు. అందుకే అది చచ్చిపోయిందని చెప్తాను అందరితో” అంటూ రహస్యంగా చెప్పింది. వాళ్ల ఇద్దరు పిల్లలను సాకడానికి, తాగుబోతు కొడుకుతో అవస్థలు పడుతూ, బొమ్మలమ్ముకుంటూ… ఎక్కేరైలు… దిగే రైలు… యీ వయసులో ఇదీ ఆమె జీవితం. మనవలు పెద్దై బాగా చదువుకుంటారని ఆశగా బ్రతుకుతుంది. నిరాశను తరిమికొడుతుంది.
బలవంతంగా మజ్జిగ ప్యాకెట్ ఇచ్చాను తాగమని. రైలు ప్రయాణానికి అమ్మ పెట్టిన పూరి, కూర… మనసు బాగోలేక ఉదయం తినలేదు… బయటకు తీశాను… నాతో పాటు తినమని. మొహమాటపడుతూనే తీసుకుంది. ఎప్పుడు తిన్నాదో ఏమో? చేతులు, ముఖము కడుక్కొని వచ్చి, బుట్టలో నుండి ఈ బొమ్మ తీసి “మంచి మనసున్న నీకు, ఇలాంటి చక్కనిపిల్ల భార్యగా వస్తుంది. చల్లగా పదికాలాలపాటు హాయిగా ఉండు బాబు” అంటూ నాకిచ్చింది.
అంతకుముందు ఆ బొమ్మ ఐదువందలకు అమ్మడం నేను చూశాను. ఆర్థికంగా ఆ ఐదువందలు ఆమెకు ఎంతో అవసరం. కానీ ఆమెతో మాట కలిపి, “మామ్మా” అని పిలిచినందుకు నాకు బహుమానం…. నేనది ఊహించలేదు. ఇంతటి కష్టపరిస్థితులలో కూడా, ఆమె పెద్దమనసుకు నేను ఫిదా అయిపోయాను.
దువ్వాడలో ఆమె దిగిపోతుంటే ఒక్కమాట… ఒకే ఒక్కమాట అడిగాను “మామ్మా! ఇన్నికష్టాలు పడ్డావు కదా! ఎప్పుడైనా ఈ బాధలు పడలేక చనిపోవాలనిపించిందా అని?”.
“దేవుడు ఒకటి తీసుకుంటే, ఇంకొకటి మనకు ఇస్తాడు. కొంచెం ఓపిక పట్టాలంతే. అయినా నాకు తెలీకడుగుతాను? మనము పోయని ప్రాణాన్ని తీసుకునే హక్కు మనకి ఎక్కడుంది బాబూ?” ప్రశ్న నాకే వేసి దిగిపోయింది.
ఆమె వెళ్లిపోయింది గాని, ఆమె ఇచ్చిన ఈ బొమ్మ నా చేతిలో… తల ఊపుతూ “ఇప్పుడేమి చేస్తావని” నన్ను అడుగుతున్నట్లు.
వైజాగ్ ఊరి బయట ఆగి,ఆగి వెళుతూ రైలు… నా నిర్ణయమేమిటి? మనసు గందరగోళంలో పడింది. ఏ నిర్ణయం తీసుకొని నేను ఈ రైలు ప్రయాణం చేస్తున్నానో…. ఆమె జీవితం గురించి విన్నాక… నా నిర్ణయం తప్పేమోనన్న ఆలోచన… “పోయని ప్రాణాన్ని తీసుకునే హక్కు మనకెక్కడిది” ఆమె మాటలు నన్ను ప్రశ్నిస్తున్నాయి.
ఇప్పుడు నా పయనమెటు? ఫ్రెండ్ దగ్గరికా! లేక తిన్నగా సాగరతీరానికా?
బుట్టబొమ్మ గాలికి తల అటు,ఇటు ఊపుతుంది, నేనున్నాను కదా అంటూ!
“చక్కనిపిల్ల నీకు భార్యగా వస్తుంది”… “పోయని, ప్రాణం తీసుకునే హక్కు ఎక్కడుంది?” ఆ రెండు మాటలూ నా చెవులలో గింగురుమంటున్నాయి.
ఈ మామ్మ నాకు పరిచయం కాకపోయి ఉంటే, “సాగర తీరంలో, నీటిలో ఆడుకుంటూ కెరటాలకు బలైన ఇంకో యువకుడు” అని ఆ మరుచటిరోజు పేపర్లలో వచ్చేది.
దానికి కారణమేమని అడుగుతారా? మామ్మ కష్టాలతో పోల్చుకుంటే, నా కష్టం పెద్దదేమి కాదు. నన్ను ప్రేమించానన్న అమ్మాయి, ఇన్నాళ్లూ వేచి చూసి నాకు ఉద్యోగం లేదని ఇంకో అబ్బాయితో పెళ్లికి సిద్ధపడింది.
ముందు ఆ పెళ్లికొడుకుని చంపాలన్నంత కోపం వచ్చింది. వాడినుండే కదా నా ప్రేమ నాకు దక్కలేదు. కానీ ఆలోచిస్తే… వాడికి మా ప్రేమ సంగతి ఏమి తెలుసు? ఇంకొకడిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. పాపం! అమాయకుడు.
ఆ తర్వాత ఆ అమ్మాయిని చంపాలనిపించింది. కాని తనదేమి తప్పు? ఇన్నాళ్లూ వేచి చూసింది. తల్లిదండ్రుల బలవంతంతో ఇప్పుడిక పెళ్లి చేసుకోక తప్పలేదు.
చివరికి… ఉద్యోగం సంపాదించుకోలేక పోయినందుకు… ప్రేమను పోగొట్టుకున్నందుకు…. నామీద నాకే కోపం వచ్చింది. చనిపోవాలనుకున్నాను.
అందుకే ఈ వైజాగ్ ప్రయాణం.
మధ్యలో వైజాగ్ ఏమిటా అని మీ సందేహమా? వైజాగ్ బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకిష్టమైన కెరటాలలో ఆడుతూ… అలా ప్రాణాలు పోవాలని. ఇంకొక కారణం కూడా ఉంది. ఆత్మహత్య చేసుకుంటే, పోలీసులు… కేసులు… దానికి కారణాలు… ఆ అమ్మాయి పేరు బయటకు రావడం…. కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే తన తల్లిదండ్రుల పరిస్థితి? అదే… ప్రమాదవశాత్తూ చనిపోయాడంటే కొన్నాళ్లు బాధపడి మర్చిపోవచ్చు. కానీ ఆత్మహత్య అంటే ఆ మచ్చ వాళ్లకు జీవితాంతం ఉండిపోతుంది. ఇవన్నీ ఆలోచించి తాను వైజాగ్ బయలుదేరాడు.
కానీ మామ్మతో పరిచయం… ఆ పరిచయానికి గుర్తు, చేతిలో ఈ బుట్టబొమ్మ…. తల ఊపుతూ “నేనున్నాను కదా!” అంటూ. అంతే! నా నిర్ణయం సడలిపోయింది.
ఆ తర్వాత, ఉద్యోగం వచ్చాక చాలాసార్లు అదే రైలులో ప్రయాణించాడు, మరలా మామ్మను కలుసుకోవచ్చన్న ఆశతో. తన ఆశ తీరలేదు. మామ్మ ఎందుకు రాలేదో? బహుశా మనవలు పెద్దయి ఏదో ఉద్యోగంలో కుదురుకొని ఉంటారు. అంతే అయ్యుంటుంది అని మనసును సమాధానపరుచుకుంటాడు.
ఈ బుట్టబొమ్మ మామ్మను గుర్తు చేస్తుంటుంది. మామ్మే లేకపోతే తనుండేవాడు కాదు. మామ్మ ఆశీర్వాదం. బుట్టబొమ్మ లాంటి శైలజ తన జీవితంలో. అందుకే ఈ బుట్టబొమ్మంటే తనకి ప్రాణం. వేలితో ముద్దు పెట్టుకున్నాడు బుట్టబొమ్మను.
చెవిలో రింగులు ఊగుతుంటే, తన మనసులోని మాటలకు తల ఊపుతుంది యీ బొమ్మ. మామ్మ ఇచ్చిన బుట్టబొమ్మ. ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు.
ఆ రాత్రి పడకమంచం మీద, “ఈ బుట్టబొమ్మ లాంటి అమ్మాయి నీకు భార్యగా వస్తుందని, మంచి మనసున్న ఒక తల్లి ఈ బొమ్మను నాకు ఇచ్చింది. అప్పటినుండి నా జీవితమే మారిపోయింది. ఆ తర్వాత నువ్వు నా జీవితంలోకి వచ్చావు. ఊహించని విధంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషాన్ని నాకు దూరం చెయ్యకు శైలూ!” శైలజను గుండెలకు హత్తుకున్నాడు రాజేంద్ర. దాంతో అనుమానాలన్నీ పటాపంచలైపోగా, రాజేంద్ర ప్రేమలో కరిగిపోయింది శైలజ.

— మజ్జి భారతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో