వచ్చి అరగంట దాటింది. కొమ్మలు నీడలు కమ్మిన సన్నని కాలిబాట మొక్కలునాటడంకోసం దున్ని, గుంతలు చేసి పెట్టిన ప్రాంతానికి దారి ఇస్తుంది. ఆక్రమితప్రాంతాన్ని స్వాదీనం చేసుకోవడంకోసం అన్ని విధాలుగా ప్రయత్నించి ఈ నాడు మొక్కలు నాటే పనిపెట్టుకున్నాం.రెండు వానలు పడ్డాక నేల మెత్తబడి మొక్కలు నాటడానికి అనుకూలంగా తయారయ్యింది.మొక్కలు నర్సరీనుంచి ముందురోజే తరలించడంవల్ల,నాటడం,వెంటనే నీళ్ళు పట్టడంవంటి పనులే ఉన్నాయి.వర్షంవస్తే నీళ్ళు పట్టవలసిన పనిలేదు.ఇంకా మొక్కకూడా బాగానాటుకుంటుంది.తుంపరవాన,నీలం,బూడిద రంగుల్లో ఆకాశం,చల్లనిగాలి. రంగురంగుల దుస్తులతోఉన్న స్త్రీ పరుషులు అరుపులాంటి మాటలతో మొక్కలునాటే పనిలో నిమగ్నమయ్యారు.ఆక్రమితస్థలంలోచేస్తున్న పనిగనుక ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశాము. వర్షం అడ్డుపడకుండా ఉంటే నాలుగు రోజుల్లో అయిపోవచ్చు. వర్షం రాకడ చెప్పలేము కనుక రెండు రోజులు అటూ ఇటూ అయ్యేఅవకాశమూ ఉంది. పనులు చేస్తూ పాటలు పాడతారని తెలుసు కానీ ఇక్కడ ఎవరూ పాటలు వచ్చని చెప్పలేదు. ఒక్క పాటైనా ఎపుడూ చుట్టుపక్కల కూడా వినలేదు. ఎంతసేపు ఉన్నా అటుతే ఇటుతే అన్నమాటలే. ఒక వేళ మేమంతా ఉన్నామని పాడలేదేమో లేక నిజంగానే ఇక్కడి వాళ్ళకి పాడే అలవాటు లేదో తెలియలేదు.
మధ్యాహ్నంవరకు అక్కడే ఉండి పని చూసుకున్నాము.ఫరవాలేదు అనుకున్నాక అక్కడనుంచి వెళ్ళే సమయానికి వర్షంసూచన కనబడుతోంది. ఇప్పటికిపడ్డ వానకి షూస్ నేలలో దిగబడిపోతున్నాయి.మరీమెత్తగా ఉన్నచోటు కాకుండా కాస్త గట్టిగా ఉన్న చోటున పాదంపెట్టి జారిపోకుండా జాగ్రత్తగా నడిచి బయటకువచ్చాము. ఉదయం తీతువులు అరుస్తూ అప్పుడే బయలుదేరుతున్న మాపైనుంచి ఎగిరివెల్లిపోయినప్పుడు చిన్నప్పుడు మాఇంటి వాడకట్టుమీద తరచూ పిట్టఒర్రుతుంది ఈ రోజు ఏం లొల్లులు(గొడవలు) అవుతాయో యేమో అని విన్నమాట, నమ్మిన సంధర్భాలు తలుచుకొని ప్లాంటేషన్ వద్ద ఎటువంటి గొడవలు జరగకూడదని అంతా సాఫీగా జరగాలని మనస్పూర్తిగా అడవినే ప్రార్థించాను. ఏదైనా జరిగితే మొత్తం చిందరవందర అయిపోతుందని భయపడ్డాను కూడా. అయితే మా పనికోసం స్థానిక పోలీసులుకూడా సహకరించినందువల్ల ఏమీ జరగలేదు. ప్లాంటేషన్ పని చేస్తున్నంతసేపు అక్కడ స్థానిక పోలీసులు ఉన్నారు.ఇంతకుముందు అటవీ అధికారుల పనికి అడ్డురాకూడదని ఆక్రమణదారులను హెచ్చరించారు. కనుక ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులూ ఏర్పడలేదు. వర్షం మొదలయ్యేటప్పటికి వచ్చేశాం కనుక మధ్యాహ్న భోజనం తర్వాత మొక్కలు నాటడం ఈ రోజుకి ఆగిపోవచ్చు . రేపు మళ్ళీ పని మొదలైతే మళ్ళీ ఒకసారి వచ్చి వెళ్ళాలి.
ఇంటికి వచ్చేటప్పుడు తిత్తిరి పిట్ట మళ్ళీ అరుస్తూ వెళ్ళిపోయింది. చిన్నప్పటి భావనలు మనసుమీద ఎంత బలంగా నాటుకుంటాయో కదా. ప్రేమగురించి రాయని భావకుడు ఉంటాడేమోగానీ బాల్యం గురించి రాయని కవి ఉండడని అంటారు.బాల్యం అంత ప్రభావశీలమైనది, మంచైనా చెడైనా అలా మనసులో నాటుకుపోతుంది. నామటుకు ఒంటి మీద బల్లి పడడాలు ఇదిగో ఈ తిత్తిరి పిట్ట అరపులూ మా ఇంట్లోనూ , వాడకట్టు మీదనూ సృష్టించిన అలజడులు అన్నీ ఇన్నీ కాదు.చుట్టుపక్కల మానాన్నమ్మ ఒక్కతే కంచి బల్లిని తాకి వచ్చిందని చుట్టుపక్కలవాళ్ళు బల్లి మీదపడ్డప్పుడు ఆమె కాళ్ళకి దండం పెట్టెవాళ్ళు. బల్లిమీద పడ్డప్పుడు నేనూ ఎన్నోసార్లు అలాగే చేశాను. ఆ బల్లులేమో పెద్దర్వాజ పైననే ఉండేవి, అక్కడ పెట్టిన లైటు చుట్టూ తిరుగుతూ పురుగుల్ని తింటూ ఉండేవి, తలుపు తీయగానే తపుక్కున మీద పడేవి. చాలా చిరాగ్గా ఉండేది. తర్వాత లైటును దూరంగా పెట్టాక వాటి బెడద తగ్గింది, కానీ తిత్తిరి పిట్ట మీదమాత్రం నానమ్మతో సహా ఎవరి అభిప్రాయంలోనూ భేధంలేదు. పొద్దున పిట్ట ఒర్రుకుంటూ పోయినప్పుడే అనుకున్న ఇయ్యాల ఏదో లొల్లి అవుతుందని అని నిట్టూర్చడం కూడా విని ఉన్నాను,అదే భావం ఈ రోజు ఉదయం తిత్తిరి పక్షి అరుపులు విన్నప్పుడు కలిగింది. కానీ అలాంటిదేమీ లేకుండానే ఈ రోజు గడవడంతో ఊపిరి పీల్చుకున్నాను.
జంతువుల పక్షుల అరువులూ, కదలికలువంటి విషయాలలో ఏటూరునాగారం ప్రజల నమ్మకాలు మిగిలిన తెలంగాణతో పోల్చుకునేలా ఉన్నా ఇంకా ముందుకువెళ్ళి వర్షం రాకడను పరిమాణాన్నీ ప్రమాదాలను సూచించేవిగానూ, పరిసరాలను అంచనా వేసేవిగానూ ఉన్నాయని ఇండీజీనస్ నాలెడ్జ్ ఆఫ్ ది కోయతూర్ ఆఫ్ కామారం చదివితే అర్థం అవుతుంది. అడవిలో ఉండే మానవ సమాజాలకు ఇటువంటి పరిశీలన ఇంకాఎక్కవ. కోయల నమ్మకాల్లో సైతం మైదాన ప్రాంతాల్లో లాగానే పెద్ద పెట్టలు అదే గుడ్లగూబలు రాత్రి కూస్తే అపశకునం అనే భావన ఉంది.
తిత్తిరిపిట్ట చాలా జాగ్రత్తపడే పిట్ట, పరిసరాలలో చిన్నమార్పు వచ్చినా పసిగట్టేస్తుంది. చుట్టుపక్కల తాను గమనించిన మార్పుని అరిచి చెప్తుంది.తిత్తిరిపిట్టను తీతువు అనికూడా అంటారు. తిత్తిరిపిట్టమీదనే తైత్తరేయ ఉపనిషద్ ఉంది. నాలుగు వేదాలలో యజుర్వేదం ఒకటి.యజ్ఞ యాగదుల గురించి చెప్తుంది. యాజ్ఞవల్క్య ఋషి తన గురువు వైశంపాయునుని వద్ద యజుర్వేదం అభ్యసించి మంచి విద్యార్థిగా ఉంటాడు. గురువుగారి ఆగ్రహానికి గురైన సంధర్భంలో గురువు తనవద్ద అభ్యసించిన యజుర్వేదాన్ని తిరిగి ఇవ్వమని శిష్యుణ్ణి ఆదేశిస్తాడు. యాజ్ఞవల్క్యుడు తాను పొందిన యజుర్వేదాన్ని వాంతి చేస్తే తిత్తిరి పిట్టలు గ్రహించి వ్యాప్తి చేసినందువల్ల తైత్తరీయ సంహిత పుట్టిందని చెప్తారు కానీ యాజ్ఞవల్క్యుని ఆశ్రమ నిష్క్రమణ తర్వాత అతని ఇతర శిష్యులు వ్యాప్తి చేసి ఉంటారనే హేతుబద్ధమైన వివరణ కృష్ణ యజుర్వేదాన్ని తెలుగు చేసిన దాశరథి రంగాచార్యులు రాశారు. (ఈ మధ్యే వచ్చిన వేలూరి కృష్ణమూర్తి గారు అనుసృజన చేసిన హెచ్ లక్ష్మీనరసింహశాస్త్రి కన్నడ పుస్తకం యాజ్ఞవల్క్య చక్కని వివరణ ఇచ్చింది. అదేమంటే వైశంపాయునిని అన్నగారైన తిత్తిరి అనే పేరుగల ఋషి, వైశంపాయునుని కోరిక మీదనే యాజ్ఞవల్క్యుని కృషిని వ్యాప్తి చేయడంవల్ల ఈ భాగం తైత్తరీయ సంహితగా పేరు వచ్చిందని తెలియజేస్తుంది.) గురువును వదిలిన యాజ్ఞవల్క్యుడు మాత్రం మరొక గురువునుంచి నేర్చుకోనని భావించి సూర్య ఆరాధన చేసి యజుర్వేద ఉపదేశం మరలా పొందుతాడు,అదే శుక్ల యజుర్వేదంగా పరిగణించబడుతుంది. అంటే యజుర్వేదంలో రెండు శాఖలు ఒకటి శుక్ల యజుర్వేదం, రెండవది కృష్ణ యజుర్వేదం లేదా తైత్తరీయ సంహిత. ఒక ఋషి లేదా పక్షి వేరుతో ఉన్న ఒకేఒక్క వేదం తైత్తరీయ సంహితనే. ఇందులోనిదే తైత్తరీయ ఉపనిషద్. తిత్తిరిపిట్టయొక్క జాగ్రత్తపడే లక్షణంవల్లనే యాజ్ఞవల్క్యుని వేదవిజ్ఞానం వృధా కాకూడదనే లక్ష్యంతో శిష్యులు తీతువులవలే జాగ్రత్తగా స్వీకరించారనే భావించవల్సి వస్తుంది. ఎప్పటి వేదం, ఎప్పటి వైశంపాయనుడు, ఎప్పటి తీతువు! పక్షి స్వభావాన్ని ఎంత పరిశీలనగా చూసి ఉంటే ఈ తైత్తరీయ శాఖకు ఇంత కథ పుట్టి ఉంటుంది. చరిత్ర పుట్టిన ఇన్నాళ్ళకు కూడా దేశ కాలాతీతంగా తిత్తిరిపిట్టమీద ఇటువంటి భావనే ఉంది.మొదటి నుంచి భారతీయ సాహిత్యం అంతా ప్రతీకాత్మకమే. ఇదీ అనేకానేక ప్రతీకాత్మకల్లో ఇదీ ఒకటి.
రామాయణం నుంచి మహాభారతందాకా కనిపించే ముఖ్యపాత్రలు హనుమంతుడు, జాంబవంతుడు, మార్కండేయుడే కాదు తిత్తిరి,యాజ్ఞవల్క్యులు కూడా. ధర్మరాజుఆస్థానంలో వీరు ఇరువురూ ఉన్నట్టు ఆధారాలుంటాయి. వ్యాస పరంపరలాగా యాజ్ఞవల్క్యపరంపరకూడా ఉండవచ్చుననే నమ్మకమూ ఉంది. రామాయణంలో జనకమహారాజు యాజ్ఞవల్క్యుడు అధ్యక్షుడుగా పండిత పరిషత్ నిర్వహిస్తాడు. యాజ్ఞవల్క్యమహర్షి వేదం, ఉపనిషద్ మాత్రమే కాకుండా యాజ్ఞవల్క్య స్మృతినీ అందించారు. స్మృతి అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నమాట. మొట్టమొదటిసారి లీగల్ డాక్యుమెంట్ను లేఖ్య అనే సాంకేతిక పదం వాడిన వారు యాజ్ఞవల్క్యుడేనని,కాంట్రాక్టుల విషయంలోనూ రుణాల విషయంలోనూ సాక్షి సంతకంతో కూడిన వ్రాతప్రతులు ఉండాలని (డాక్యుమెంట్స్) ప్రతిపాదించినది ఈ స్మృతేనేని పాట్రిక్ ఒలివీల్లే రాసిన యాజ్ఞవల్క్య ఎ ట్రీటిస్ ఆన్ ధర్మ వల్ల తెలుస్తున్నది. పాట్రిక్ ప్రముఖ భారతీయ చారిత్రకాన్వేషకుడు. ఈ పుస్తకం యాజ్ఞవల్క్యస్మృతిని అర్థంచేసుకోవడానికి తగిన విధంగా ఒకవైపు సంస్కృతంలోనూ మరోవైపు ఇంగ్లిష్లోనూ ప్రచురించారు. పంచాయతనం అంటే ఐదుగురు దేవతామూర్తులను ఒకేవేదికమీద ఏర్పరచి ఆరాధించే విధానం, ఇది ఆదిశంకరాచార్యులవల్ల బాగా ప్రాచుర్యంలోనికి వచ్చింది అయితే మొట్టమొదట పంచాయతన పూజ ద్వారా గణేషుని ఉపాసనను సూచించినది యాజ్ఞవల్క్య స్మృతేనని, ఇంకా నవగ్రహ శాంతి విధానం, లక్ష్మీ ఆరాధన సూచించినది కూడా ఈస్మృతేనని పాట్రిక్ రాశారు.
స్మృతులు విధి విధానాలు మాత్రమే. ఉపనిషద్లు తాత్వికమైనవి, లోతైనవి, మానవీయమైనవి, సార్వత్రికమైనవి. యాజ్ఞవల్క్యుని స్మృతికన్నా తైత్తరీయఉపనిషద్ ఎంతో విలువైన విషయాలు చెప్తుంది. ప్రఖ్యాత శాంతిమంత్రం, చిన్నప్పటినుంచి మనం వింటున్న మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ అన్న శ్లోకమూ ఈ ఉపనిషద్ లోనివే. అసతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా, మృత్యోర్మా అమృతంగమయా అని అడిగిన తన భార్య మైత్రీయికి ఆత్మజ్ఞానం కలిగి ఉండడమే అమృతత్వమని మరే విధంగానూ అమృతత్వం సాధ్యం కాదని విడమరిచి చెప్పిన వారూ యాజ్ఞవల్క్యుడే. ఇవన్నీ ఎంత గొప్ప మాటలో కదా!
ప్రాచీన స్మృతులలో న్యాయ సంబంధ, పరిపాలన సంబంధ విషయాల పట్ల ఆసక్తి కలగడానికి కారణం భారతీయ చట్టాల రూపకల్పనలో వాటిలోని అంశాలను యథాతధంగానాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నదని తెలియడమే. మన దేశంలో 1757లో ప్లాసీ యుద్దపు ఓటమి ఈస్ట్ ఇండియా కంపనీకి అధికారం కట్టబెడితే 1857 లో మొదటి స్వతంత్ర సంగ్రామంలో ఓటమి బ్రిటిష్ అధికారాన్ని స్థాపించింది. ఆ వెనువెంటనే 1860 లో ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది.అయితే దీన్ని రూపొందించడానికి 1835 నాటి లా కమిషన్ భారతీయుల న్యాయ స్మృతులను అధ్యయనం చేసింది.అప్పటికే మనుస్మృతి,యాజ్ఞవల్క్యస్మృతి వంటి న్యాయసంహితలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. భారతీయుల వివాహం, ఆస్తిపంపకాలవంటివాటిలో న్యాయవిషయాలను యథాతధంగా ఈరెండు స్మృతులనుంచే గ్రహించారు. ఆ వెనువెంటనే 1865లో మొదటి అటవీ చట్టమూ వచ్చింది.అయితే అటవీచట్టాల రూపకల్పనలో భారతీయుల సంప్రదాయ అలవాట్లను, అటవీ పరిరక్షణ విధానాలను ఎంతవరకు స్వీకరించారు అన్న విషయంలో కేవలం దట్టమైన అడవుల్ని ప్రభుత్వ ఆస్తిగా పరగణిస్తూ, ప్రకటిస్తూ నిర్వహించే అధికారం కట్టబెట్టడం తప్ప మరొకటేదీ కనిపించదు. అప్పటికే కౌటిల్యుని అర్థశాస్త్రం, యాజ్ఞవల్క్య స్మృతి(2వ భాగం 31 అంశం :232-234 శ్లోకాలు ), ఇతర స్మృతులు చెట్లను నరకడం నిషేదించాయి.కాసే పూసే చెట్లను నరికిన వారికి జరిమానా విధించడమూ ఉంది. అవేవీ మొదటి అటవీచట్ట రూపకల్పనలో కనిపించవు. ఆనాటి బ్రిటిష్ అటవీచట్టం రూపకల్పన కేవలం స్థానిక అధికారంనుంచి అడవుల్ని బ్రిటిష్ చట్ట పరిధిలోకి తెచ్చి కలపను సంగ్రహించడమే. అలా అయినప్పుడే ఎంత కావాలని అనుకుంటే అంతా నరికి రైల్వే లైన్ల నిర్మాణానికి తరలించగలగడం సాధ్యమౌతుంది.కనుక అడవులమీద ఆధిపత్యం కోసం తప్ప మరో ప్రయోజనం ఏదీ అటవీ చట్ట రూపకల్పనలో లేదు.అడవినుంచి కలప సేకరణ విషయంలో నిర్ణీత స్థలంలోఉన్న పంటను ఎప్పటికప్పుడు తీసేసి ఫలసాయం తీసుకోవడం వల్లనే భూ వినియోగం సమర్ధవంతంగా ఉపయోగించుకోగలమనే వాదనా ఉంది. ఉదాహరణకు ఒక చెట్టు అరవయ్యేళ్ళవరకు సమర్ధవంతగా పెరిగి తర్వాత పెరుగుదల రేటు తగ్గిపోతుంది అనుకుంటే ఆ చెట్టును మరో అరవైయేళ్లు అలాగే ఉంచడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, అందుకు బదులుగా అరవేయళ్ళకు ఆ చెట్టును ఫలసాయంగా గ్రహించి మరోసారి నాటడంవల్ల ఆ భూమి నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందవచ్చును కదా అన్న భావన. ఇది కూడా నిజమే, మన అవసరాలకు తగిన కలపవంటి అటవీఉత్పత్తులనుపొందడానికి ఇదే మార్గం. అయితే మనం చెట్లను ఫలసాయంకోసం గ్రహించినప్పుడు తిరిగి యథావిధి ఆవరణాన్ని సృస్థించలేము. అడవి అంటే ఆవరణవ్యవస్థగా తప్ప ఏకపక్షంగా కలప ఒకటే ప్రయోజనాన్ని చూడలేము. కేవలం ఒకేఒక అవసరంకోసం అటవీ ఆవరణవ్యవస్థలో ఒక మూల స్తంభాన్ని తీసివేయడం సరియైనది కాదు. పక్షులు,సరీసృపాలు,కీటకాలువంటి జీవజాలం చెట్లను ఆధారంగా చేసుకొని మనగలిగేవి. ఒకటి తీసేవేస్తే మరొకటి మనలేదు. మరైతే పరిష్కారం లేదా అంటే ప్రత్యామ్నాయాలు వెతకడం, తప్పనిసరి అవసరాలకు పరిమితంఅవడంవంటివి డిమాండ్ను అధిగమించేదుకు సహకరించే పద్దతులు. అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పట్లో అంత వెసులుబాటు లేదు కనుకనే మన అడవులనుంచి కలపను సేకరించే పని పెట్టుకుంది. అందుకే మొదటి అటవీ చట్టం రూపొందింది.
అడవినుంచి కలప సేకరించడం తరలించడం సాధారణమైన పనులు కావు.దానికి ధృఢమైన మానవ వనరులు, పశువులు అవసరం. అందుచేత బ్రిటిష్ ప్రభుత్వం కావాల్సినమేర మానవ వనరులను అటవీ ఫలసాయం సేకరించడం కోసం అటవీపరిసర ప్రాంతాలకు తరలించింది. కాలక్రమేణా అవి అటవీగ్రామాలుగా స్థిరపడ్డాయి.ఆదివాసులుకాకుండా అటవీగ్రామాలలో ఇతర సామాజికవర్గాలు ఉండడానికి ఇదీ ఒకకారణమే.ఈపనుల్ని ప్రభుత్వం తరఫున నిర్వహించడానికే అటవీశాఖ ఏర్పడింది.స్వాతంత్ర్యంవచ్చాక మారిన అటవీవిధానం (1952) భూభాగంలో మైదాన ప్రాంతాల్లో 33 శాతం కొండ ప్రాంతాల్లో 60 శాతం ఉండాలని నిర్ధేశించి ఇబ్బడి ముబ్బడి కలప సేకరణకు అడ్డుకట్ట వేసింది. అటవీ వన్యప్రాణి సంరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణకోసం మరో అటవీ విధానం 1988 లోనూ,వివిధ చట్టాలను, నియంత్రణలను ఏర్పరచినా మానవవనరుల నిర్వహణా,నియంత్రణ మాత్రం ఇప్పటికీ ఇబ్బందికరంగానే మిగిలిపోయింది. ఒకవైపు అడవిమీదనే ఆధారపడిన సామాజికవర్గాలు, మరోవైపు వైయుక్తిక ఆక్రమణలు, రాజకీయ నేపథ్యంలో వచ్చిన భూపోరాటాలు మారిన భూ ఆధారిత లావాదేవీలు వెరసి ఒక సంక్లిష్ట స్థితిని ఏర్పరచాయి. ప్రభుత్వం మానవతాకోణం నుంచి ఆయా సామాజికవర్గాల చారిత్రకనేపథ్యంనుంచి పరిష్కరించాలని ప్రయత్నించినప్పుడల్లా దానికి భిన్నమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చింది.
అటవీ హక్కుల చట్టం -2006 కన్నా ముందు, 1980 నాటికిఉన్న అటవీ ఆక్రమణలను పరిష్కరించే ప్రయత్నం జరిగినప్పటికీ 1990లో వచ్చిన ఉమ్మడి అటవీ యాజమాన్య కార్యక్రమం ప్రాధాన్యంలోకి రావడంతో ఆక్రమిత అటవీ ప్రాంతాలు, అటవీ సరిహద్దు గ్రామాల భూసంభంధ అంశాలు మరుగునపడ్డాయి. మధుసరిన్, అన్ డూయింగ్ హిస్టారికల్ ఇన్ జస్టిస్ అన్న వ్యాసంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1987 ప్రభుత్వ మెమో ప్రకారం 77,661 ఎకరాల అటవీభూమిసాగులో ఉన్నదనీ ఉమ్మడి అటవీయాజమాన్యం అమలులోకివచ్చాక మొదటివిడతలో 37,000ఎకరాలను ఉమ్మడి యాజనమాన్యంలో తిరిగి స్వాదీనం చేసుకున్నట్టు అటవీశాఖ ప్రకటించుకున్నదని రాశారు. ఈ వ్యాసం Democratizing Forest Governance in India పుస్తకంలో ప్రచురితమైనది. అటవీహక్కుచట్టం నేపథ్యంలో ఈ పుస్తకం భారతదేశంలో అడవుల యాజమాన్యం,అటవీ నిర్వహణనుంచి అటవీపరిపాలన దిశగా పరివర్తన చెందిన అంశాలను అనేక కోణాల్లో పరిశీలిస్తుంది. అయితే అటవీచట్టాలపరిధి స్థానిక, దేశ, వ్యాపారాత్మక అవసరాలనుంచి, సామాజిక,రాజకీయాలను ప్రభావితంచేసేలా విస్తరించడాన్ని మానవ వనరుల నేపథ్యంలోనే ఎక్కువ వివరించడానికి ప్రయత్నించింది. అయితే ఈ పుస్తకానికివేసిన ముఖచిత్రంమాత్రం ఎంతో ఆలోచింపజేసె అంశం. ఆ ముఖచిత్రం కారణంగానే పుస్తకం గురించి నాలుగు మాటల ప్రస్తావన. అది పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గోండ్ చిత్రకారిణి దుర్గాబాయి వేసినది. ఒక సాధారణ గిరిజన స్త్రీ నుంచి గోండ్ చిత్రకళాకారిణిగా ఆమె ప్రస్థానం పద్మశ్రీదాకా కొనసాగడంలో ఆమె సంప్రదాయ కళానైపుణ్యంతో పాటు , ఆమెకు చెందిన ప్రత్యేక భావవ్యక్తీకరణనే కారణమని ఈ ముఖచిత్రం స్పష్టం చేస్తుంది. ఇంతకీ ముఖచిత్రం ఏమిటంటే చెట్టునుంచి ఫలసాయం పొందడానికి భిన్నంగా చెట్టును గొడ్డలితో నరుకుతూ ముక్కల్ని తలోవైపు లాగుతుంటారు. అక్కడ ఆహారం గ్రహిస్తూనే తుంటల్ని తరలిస్తుంటారు. చూడడానికి చెట్టును నరికి వాడుకుంటారని అనిపించదు, ముక్కలుముక్కలైన చెట్టుగా ఉంటుంది. అయితే భారతదేశంలో అటవీ పరిపాలనను ప్రజాస్వామికం చేయడం(Democratizing Forest Governance in India అన్న పుస్తక శీర్షిక ) అంటే అడవిని తలా ఇంత పంచడమే అన్నట్టు అనిపించింది. 2008లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మొదటివిడత అటవీహక్కుచట్టం అమలు చేసినప్పుడు అమలు ఎలా జరుగుతుందో గమనించిన సామాన్యుని మనసులో యే బొమ్మ రూపుకడుతుందో అదే ముఖచిత్రంగా ఉన్నట్టు భావన కలిగింది. ఈ మాటే ఎంతోమంది వ్యక్తం చేశారు కూడా.
1994-2007నాటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి అటవీ యాజమాన్యంలో అటవీశాఖ, స్థానికప్రజలు కలిసి ఉమ్మడి ఆస్తుల అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్లాంటేషన్ పనులు, నీటి కుంటలు, వాటర్ షెడ్ పనులు చేశారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో నడిచిన ఈ బృహత్ కార్యక్రమం 2007లో ఆగిపోవడంతో అటవీ భూముల పంచాయితీ తిరగబెట్టింది. దానికి తోడు అటవీ హక్కుల చట్టం అమలులోకి రావడంతో పెద్ద ఎత్తున అడవులు నరకడం మొదలయి ఇదివరకు స్వాధీనం చేసుకున్న అటవీ భూభాగాలు సైతం తిరిగి ఆక్రమణకు గురయ్యాయి. అటవీ హక్కుల చట్టం -2006 ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి ఇరవై ఐదు సంవత్సరాలుగా సాగులో ఉన్న గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు జారీ చేయాలి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 1980 నాటికి 77,661 ఎకరాలు పరిష్కరించవల్సిన అటవీభూమి(పైన చెప్పిన వ్యాసం ప్రకారం ) ఉంటే మొదటి దశలో అటవీహక్కుల చట్టం, 2008 లో అమలు చేసినప్పుడు ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే 99వేల మందికి 3.31 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కు పత్రాలు జారీ చేసినట్టు రికార్డులు( Tribal welfare Department , July 2016) చెబుతున్నాయి. ఇది తెలంగాణకు మాత్రం చెందిన వివరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కలిపితే ఇది రెండింతలుగా ఉంటుంది. ఈ చట్టం ప్రకారం వ్యక్తికి ఇవ్వబడిన హక్కుల పత్రాల వివరాలు ఇవి. ఇవి కాక ఇదే చట్టం కొన్ని సామాజిక హక్కులను(కమ్యూనిటి రైట్స్) కూడా కల్పిస్తుంది. అది కూడా కలుపుకుంటే మరెంతో అటవీవిస్తీర్ణం చట్టప్రకారమే ఇతర అంశాలకు మళ్లించబడింది. అంతేకాకుండా చాలావరకు అటవీ భూభాగం అటవీహక్కు చట్టం నేపథ్యంలో కొత్తగా ఆక్రమించే ప్రయత్నం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది.
అటవీభూభాగాలను అటవీయేతర కార్యక్రమాలకు మళ్లించాలంటే 1980నాటి అటవీసంరక్షణచట్టం, ప్రభుత్వాలకు అనేక పరిమితులు విధించింది. మళ్లించబడిన అటవీ భూభాగానికి సమానమైన విలువను ఆయా శాఖలు అటవీశాఖకు అందించాలనే నిభందన ఉంది. అయితే అటవీ హక్కు చట్టం -2006 ద్వారా మళ్లించబడే అటవీ భూమి హక్కుపత్రం జారీ నుంచి ఈ చట్టాన్ని మినహాయించడం వల్ల ఎంత మొత్తం అడవిని హక్కుగా జారీ చేసినా ప్రభుత్వాలపై భారం లేదు కనుక ప్రభుత్వాలు తరచూ హక్కు పత్రాలవిషయంలో సానుకూలంగా ఉండడం, ప్రజలలో ఎప్పటికైనా అటవీభూమిపై హక్కుపత్రం రాకపోతుందా అనే ఆలోచన తరచుగా అటవీ భూఆక్రమణలకు కారణమవుతున్నది. ఒకవేళ అటవీహక్కుల చట్టాన్ని, అటవీ సంరక్షణ చట్టం-1980 లోకి కనీస విలువతోనైనా చేర్చినా ఈ ఆక్రమణలను ప్రభుత్వాలు కఠినంగా తీసుకుంటాయి. అటవీహక్కుచట్టం యొక్క మరో ముఖ్యమైన అంశం ఇది అభయారణ్యాలలోనూ అమలు చేయవలిసి ఉండడం.అభయారణ్యాలు పర్యావరణపరంగా మరెంతో సున్నితమైనవి. అటువంటి సంధర్భాలలో కనీసం పర్యావరణ సంరక్షణ చట్టం-1986 లోని పర్యావరణ ప్రభావ నివేదిక పరిధిలోకి తెచ్చినా హానికారక వ్యవసాయ ఉత్పత్తి సాధనలైన గడ్డి మందులు, క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువులు వాడకుండానో లేక మరింత పర్యావరణహిత వ్యవసాయ పద్దతులను సూచిస్తూనో మార్గనిర్ధేశనం చేయవచ్చు.
అటవీహక్కు జారీ చేయడంలో ముఖ్యమైన అంశం ,హక్కును అడిగే వ్యక్తికి ఆ భూమి జీవనాధారంగా ఉండడం. అయితే ఒకవేళ హక్కు పత్రంపొందిన వ్యక్తి లేదా అతని తరువాత తరం మరొక జీవనాధారాన్ని కలిగి ఉన్నప్పుడు హక్కు పత్రం రద్దు చేయబడుతుందా అన్న అంశం చట్టంలో లేదు. హక్కుపత్రం జారీవరకే చట్టం పేర్కొన్నది. అలాగే హక్కుపత్రం యొక్క కాల పరిమితీ చట్టంలో లేదు. అందువల్ల అటవీభూమిగా ఉన్న రిజర్వుఅటవీప్రాంతం యొక్క చట్టపరమైన స్థితి యథాతంగా ఉంచి వాస్తవ అధీనంలో హక్కు పత్రాలుగానూ, సామాజిక హక్కులుగానూ ఉంది. భూమి మీద భారతీయుల తరతరాల మక్కువ , అందునా నాలుగు నుంచి గరిష్టంగా పది ఎకరాల భూమి కేటాయించబడే అవకాశం ఉంది కనుక ఎలాగైనా చట్టపరిధిలోకి రావలనే ప్రయత్నంలో ఆక్రమణలు ఎక్కువయ్యాయి. మొదటివిడత అటవీహక్కుపత్రాల జారీ విషయంలో ఆదిలాబాద్, ఖమ్మం తర్వాత వరంగల్ జిల్లానే మూడో స్థానంలో ఉంది. ఇప్పుడున్న ఏటూరునాగారమూ,ములుగు, తాడ్వాయి నాటి ఉమ్మడి వరంగల్ లోనివే. ఇక్కడా ఆక్రమణలకు అవే కారణాలు, అదనంగా ఛత్తీస్గడ్ వలసలు. ఏదేమైనా అటవీప్రాంతాల పరిరక్షణ ఖచ్ఛితమైన విధి కనుక సాధ్యమైనన్ని విధాలుగా పరిరక్షించే పనే మేమిప్పుడు చేస్తున్నది.
సాయంత్రం మరోచోటుకు వెళ్ళవలసి ఉంది. అక్కడా కొత్తగా పనులు మొదలుపెట్టేదుంది. భోజనాలదీ ముగించాక వెళ్ళేటప్పటికి సాయంత్రం నాలుగు గంటలు దాటింది. మరింత చీకటి, ఇంకా వర్షం వస్తుందని వెళ్ళేటప్పటికి చిన్న చిన్న పొదలున్నచోట ఊడుగు చెట్లు , తీగలు , కంప జిగిబిగి అల్లుకొని నడవరాకుండా ఉంది. ఒక చోట వెలుతురు చెట్టు కనిపించింది. తుమ్మ జాతిదే అయినా చాలా అందమయిన గులాబీ రంగు పూవులు పూసి పూవు మధ్యలో పసుపు ముద్ద అతికినట్టు ఉంటుంది. రేచీకటికి పనిచేస్తుందని కోయలు నమ్ముతారు. ఈ చెట్టు పేరుకూడా అందుకు సరిపోయింది. మేము ముగ్గురం ఉన్నాము , చక చకా ముందుకు పోయేలా లేదు. అయితే గొడ్డలి దెబ్బలు వినబడితే మా షూ చప్పుడు కాకుండా మెల్లిగా ఆగి ఎటువైపు నుంచి శబ్ధం వస్తూందో అటు వెళ్ళాము. మా మాటలు వింటే గొడ్డలివాడే వ్యక్తులు పారిపోతారని మాట్లాడకుండా మాకు మేము సైగ చేసుకొని మెల్ల మెల్లగా అడుగులు వేస్తూ శబ్ధం వచ్చే వైపు వెళ్ళాం . దగ్గరకు వచ్చేటప్పకి వ్యక్తి ఒక్కడే , కుక్కలు మూడు. మమ్మల్ని చూసి ఆ తుప్పలని దాటి పరుగి పరుగున వెళ్ళిపోయాడు. మాకు దొరకలేదు. మెరుపువేగంతో అతను పారిపోయాడు. అతను తిరుమాను చెట్టును కొడుతున్నాడు, తిరుమాన్ చెట్టు కలపనిచ్చేది కాదు. కాండం చేవతోనూ బలిష్టంగానూ ఉండదు. తొర్రలు చాలా సాధారణంగా ఉంటాయి. ఇంతకీ ఎందుకు కొట్టాడంటే ఉడుమును పట్టుకోవడానికి. నాకూ మొదట అర్థం కాలేదు.ఈ వేట ఇంతకు ముందు చూడలేదు. మా డ్రైవరు ఇక్కడి వాడే. అతనికి ఈ వేట ఎలా చేస్తారో తెలుసు. డ్రైవరు చెట్టు కింద స్పష్టంగా కనిపిస్తున్న ఉడుము తోడిన మట్టి, వ్యర్థాలు చూపించాడు. వంగి పోయి ఉన్న చెట్టు తొర్రలో సెల్ ఫోన్ టార్చ్ వేసి చూస్తే నిజంగానే ఉడుము తోక ఉన్నది. చెట్టు తొర్ర లోపలి రంగులో సిమెంటు రంగు తోక భాగం స్పష్టంగానే ఉంది. వేటగాడు అప్పటికే తొర్ర భాగం, అది చెట్టు మొదలునుంచి నాలుగు అడుగులఎత్తులో ఉన్నచోట బలమైన దెబ్బలు వేశాడు. తొర్రగా నరికి ఉడుమును పట్టుకోవడం కోసం చెట్టునరుకుతున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఉడుములు అడవిలో ఎక్కడ ఉంటాయో కుక్కలు గుర్తుపడతాయనీ కుక్కలకు అలా శిక్షణనిస్తారనీ అర్థం చేసుకున్నాం. ఆ కుక్క కూడా మన ఊరకుక్కలగా అనిపించలేదు. కాళ్ళు పొడవుగా ఉన్నట్టూ బక్కగా ఉన్నట్టూ అనిపించింది. ఇంకేముంది యే సాయంత్రం పూటనో అడవిలో తిరిగి ఎక్కడ కుక్కలు గుర్తుపట్టి చూపిస్తే అక్కడ ఇలాగా ఉడుములు పడతారు.
ఒక్క పది నిమిషాలు ఏం చేయాలో ఆలోచించాము. ఉడుమును వదిలేసి వెళితే అతను మళ్ళీ వచ్చి దాన్ని పట్టుకునే అవకాశం ఉంది కనుక తొర్రలో నుంచి తీసి వేరే చోట వేయాలని అనుకున్నాము. నాతో పాటు ఉన్న మరో అధికారి , డ్రైవరూ కలిసి ఉడుమును బయటకులాగే ప్రయత్నం చేశారు. ఎంతకీ రాదే అది. ఉడుము పట్టు అంటే ఉడుము పట్టే. తనను రక్షించడానికే బయటకు తీస్తున్నామని దానికి తెలియదు కదా , తోకను పట్టుకుంటే అది మరింత లోపలికి వెళ్ళిపోతుంది. అరగంట దాటినా దాన్ని బయటకు లాగడం సాధ్యం కాలేదు. సంధ్యాసమయం దాటి చీకటి ముసురుకుంటుంది. తుప్పలు ఉన్నాయి కనుక పాములూ ఉoటాయి. మళ్ళా మళ్ళా ప్రయత్నిం చడం అది జారి పోవడం. ఇక తప్పదనుకొని బిల్ హుక్ తో చెట్టు తొర్రను పెద్దది చేసి, రుమాలును పట్టుకొని ఇద్దరూ వారి శక్తిని అంతా పెట్టి గట్టిగా బయటకు లాగారు. ఇద్దరు యువకులు, తమ బలం మొత్తం పెడితేగానీ దాన్ని బయటకు లాగలేకపోయారు. లాగడం లాగడం అది భయపడి ముడుచుకుపోయింది. అలాగే పట్టుకొని గబగబా నడిచి దగ్గరల్లో ఉన్న పుట్టపక్కన పెట్టారు. పెట్టడం పెట్టడం ఒక సెకనులో పుట్టలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు మా కళ్ళ బడి బతికిపోయింది. ఇకముందూ అది ప్రాణాలతో ఉండాలని ముగ్గురం కోరుకున్నాం. అయితే కుక్కలతో జరిపే ఉడుముల వేటను నిరోధించే విషయాన్ని లోతుగా పరిశీలించాలనీ అనుకున్నాము. ఇదైతే పూర్తిగా కొత్త విషయం. ఏటూరు నాగారం చుట్టుపక్కల ప్రజలకు తినే అలవాటు అతి సాధారణం అయితే వేట కూడా అంతే సాధారణంగా జరగుతుండాలి. ఉడుము తింటారని తెలుసుగానీ ఎప్పుడూ ఉడుము మాంసం చూడలేదు.ఉడుమును నడుము నొప్పి తగ్గడానికి వాడతారని నరవర్గ శాస్త్రంలో కూడా పేర్కొన్నారు కానీ విచ్చలవిడి వేటవల్ల వాటి సంఖ్య బాగా తగ్గిపోవడం చేత వన్యప్రాణి చట్టంలో ఉడుమును చంపడం నేరంగా పరిగణించారు . అయినా ఇలా వేటను చేస్తూనే ఉంటారు. తినే వాళ్ళకు తినడమే ముఖ్యం , చట్టంతో వాళ్ళకు పనిలేదు.
మబ్బులు , చీకట్లు కలిసి ముసురుకొని ఇంటిదోవ చూపించాయి. ఉడుమును రక్షించడంలోనే మా సమయం అంతా గడిచిపోయింది.మరలా రావలసిందే.చీకటి చిక్కబడక ముందే వెళ్లిపోవడం మంచిదనుకొని వెనక్కి మరలాము. చేసింది చిన్నపనైనా కొంచం సంతోషం కూడా కలిగింది. అల్పప్రాణి. గంటసేపు లాగబడింది. వేటగాడైతే అక్కడే రెండు ముక్కలు చేసేవాడేమో. మరెప్పుడైనా ఈ భూమి కూడా ఆక్రమణ కోసం దాడిచేయబడితే ఉడుములు దాక్కునే చెట్టు తొర్రలూ, పుట్ట అర్రలూ కూడా ఆక్రమించబడినట్టే కదా. మిగిలిన ప్రాణులతో పోలిస్తే మానవుడు ఒక్కడే మిగిలిన వాటికోసం ఏదైనా చేయగలడు, అది మంచిదైనా, చెడ్డదైనా. మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉంటే చాలుకదా.
-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~