పశ్చిమ గోదావరిజిల్లా తణుకు తాలూకా ఖండవల్లి గ్రామం లో రామ సుందరమ్మ 1915లోజన్మించింది .తండ్రి . గ్రామకరణం చిర్రావూరి కనకయ్య .ఏకైక సంతానం .పుట్టిన చోటే ప్రాధమిక విద్య నేర్చి ,1926లో ఫిబ్రవరి17న తండ్రి కుదిర్చిన మానాప్రగడ వేంకట కృష్ణారావు అనే దేశ భక్తుని వివాహం చేసుకొన్నది .ఆయన సీతానగరం లోని గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం లో పని చేసేవాడు .శ్రీ బ్రహ్మాజోశ్యుల సుబ్రహ్మణ్య౦ ఈ ఆశ్రమాన్నిసత్యాగ్రహ ఉద్యమ వ్యాప్తికి స్థాపించారు .అభిమానులెందరో భూదానం చేయగా ఆశ్రమానికి నాలుగు వేల ఎకరాల భూమి చేకూరింది .దానిపై వచ్చే ఆదాయంతో సత్యాగ్రహులకు శాంతి సమరం లో పాల్గొనటానికి క్రమశిక్షణ నిచ్చి పంపేవారు .వడ్రంగం ,కమ్మరం నేర్పేవారు .కాంగ్రెస్ అనే పత్రిక స్థాపించి నడిపేవారు .ఖాదీ ఉత్పత్తి ఆశ్రమం లో ప్రధాన పరిశ్రమ .పట్టు ,జరీలతో నాణ్యమైన ఖాదీ వస్త్రాలు ఆశ్రమం లోని మగ్గాల మీద నేయించే వారు . గాంధీజీ ఇక్కడికే వచ్చి ఉంటూ చుట్టుప్రక్కల పర్యటన చేసే వారు .
మానాప్రగడ కృష్ణారావు ఆశ్రమ కార్యక్రమాలాలో ఉత్సాహంగా పాల్గొంటూ ,నిర్వహణకు తోడ్పడే వాడు భార్య రామ సుందరమ్మ 12ఏళ్ళ వయసులో కాపురానికి వచ్చి ,భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది .ఆమెలో దేశాభిమానం ,దేశభక్తి ఆవాతావరణం రగుల్కొల్పింది .ఆశ్రమ విశేషాలు తనవూరు ఖండవల్లి వారికి ఉత్సాహంగా చెబుతూ వారిలో దేశభక్తి కలిగించింది .రాట్నం పై నూలు వడుకుతూ,ఖాదీ ధరిస్తూ మహదానందంగా ఉండేది .తలిదండ్రులు వారించినా లెక్క చేసేదికాదు . 15వ ఏట భర్తతో కలిసి జాతీయోద్యమం లో మహోత్సాహంగా పాల్గొన్నది .ఆశ్రమం లో రాష్ట్రభాష హిందీ నేర్చింది .పోలీసులు అప్పుడప్పుడు వచ్చి ఆశ్రమ వాసుల్ని బాధిస్తూ లాఠీచార్జి చేసేవారు .1932లో ఆశ్రమాన్ని చిన్నాభిన్నం చేసి సీలు కూడా వేసి ఆశ్రమం మూయించేశారు పోలీసులు .ఈ కష్టాలన్నీ ఆమె దేశ సేవగా చిరునవ్వుతో స్వీకరించింది .
15-1-1938 న గుంటూరులో ఆంధ్రరాష్ట్ర నియంతల సభ జరిగింది .రామ సుందరమ్మ నైజాం రాష్ట్ర నియంతగా ఎన్నికై,దానికారణంగా అరెస్ట్ అయి ఆరునెలలు విడి ఖైదు అనుభవించింది .రెండు వేలరూపాయలు జరిమానా వేశారు.చెల్లించకపోతే మరో మూడు నెలలు జైల్లోనే ఉండాలి .దేశాభిమానంతో జరిమానా చెల్లించ కుండా మొత్తం 9నెలలు జైలు సి క్లాస్ శిక్ష కన్ననూరు ,రాయవెల్లూరు లలో అనుభవించిన త్యాగమూర్తి ఆమె .ఆమెతో బాటు ప్రముఖ దేశ భక్తురాలు శ్రీమతి పెరంబుదూరు సుభద్రమ్మ గారు కూడా ఉన్నారు .అసలే అతి పిన్నవయసు. దుర్బల శరీరం .అనారోగ్యజైలు జీవితం .ఆమె ఆరోగ్యాన్ని కుంగదీశాయి .తట్టుకోలేక పోయింది .
శిక్షాకాలం పూర్తి అయి విడుదలై సీతానగరం చేరింది .క్షయ వ్యాధి గ్రస్త అయి ఆశ్రమం లోనే ఉండి పోయింది .వంగల దీక్షితులు గారు , సుబ్రహ్మణ్యం గారు ఆమెను కన్న బిడ్దలా కంటికి రెప్పలా కాపాడారు . 15నెలలు ఆమె విపరీతమైన బాధ అనుభవించింది .జబ్బు ఏమాత్రం తగ్గలేదు .సుబ్రహ్మణ్యం గారు పోలీసు లాఠీ చార్జీలతో అరెస్ట్ అయి జైలులోనే వ్యాధిగ్రస్తులై మరణించారు .ఆకాలం లో రాజయక్ష్మ అనబడే క్షయ వ్యాధికి మందులు లేనేలేవు .19-12-1934 న శ్రీమతి మానాప్రగడ రామ సుందరమ్మ 19ఏళ్ళ లేతవయసులో మరణించింది .జీవించింది కొద్దికాలమే అయినా ,దేశభక్తిలో త్యాగనిరతిలో ,సేవానురక్తులలో ఉజ్వల తారగా వెలిగి యశః కాయురాలైంది .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~