ఆ పలకరింపులు లేవు
ఆ నవ్వులు లేవు
ఆ స్పందనలు లేవు
ఆ చెతురులు లేవు అనుభూతులూ లేవు
దొర్లిన కాలంలో సమాధి
దొర్ల బోతున్న కాలం చిన్న బుచ్చుకుంది
నవ్వులు పోయి కన్నీళ్ళు బొట్లు గా రాలుతుంటే
గతం తాలూకు తీపి గుర్తులు నెమరు
బతుకుటకు వేట
వేటలో విరామం లేదు
బంధాలు తెగి దారీ తెన్నూ లేక
ప్రపంచీకరణ మాటున కొలువు
వేగంగా మనిషి ఒక్కో అవయవం తెగ నరుకుతుంది
గుండె లోతుల్లోంచి ప్రేమగా పిలుపు రాట్లే
వడివడిగా అడుగులు పడాల్సిందే
మనం అనుకుంటూ గడపాలని వున్నా
ఉద్యోగాల వేటు వేసే వేలాడే కత్తులు కళ్లముందు
కాలం మన చేతుల్లో లేదు
స్వేచ్ఛగా పొద్దు పొడుస్తుంది కుంగుతుంది
మనిషి సమయం మాత్రం పెట్టుబడి చేతుల్లో
రాత్రి పగలు మధ్య కలిసి చెప్పుకునే ఊసులకి
చేతిలో చెయ్యేసి చెట్టాపట్టాలకి
మొహం వాచింది
ద్రవ్యం సమయాన్ని కబళించింది
మానసిక అనారోగ్య హేతువిది
శారీరక వ్యాయామం కనుమరుగు
ఆట పాటల్లేవ్
సానుకూల వైఖరి ఆట లో మనిషి
వ్యక్తిత్వం చంప బడుతుంది
మనిషి సమయం కోసం పోరాడాల్సిన తరుణమిది
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~