ఉద్యమాల గడ్డ
నాటి నుండి నేటి దాకా!!
కాగడాలై
ఎగసిపడే విప్లవ జ్వాలల
ఆపతరం ఎవరి వల్ల!
పురుడు పోసుకున్న పసికందు
ఎదిగే క్రమంలో చిదమ బడుతుంటే
ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని
చూస్తూ ఊరుకుంటారు లే!!
అణచి వేతను
దురహంకారాన్ని సహించలేని నేల
ఉద్యమాల పునాదుల మీద
రాచరికాన్ని ఎలా భరిస్తుంది లే!
నిరంకుశత్వం నైజాం నే మట్టు బెట్టినే
నియంత లెందరో నేలకొరిగిన చరిత్ర సాంతం
మనం నుండి నేను ఉద్భవించిన నాడే
పతనం ఆరంభం!!
ప్రజల కోసం వ్రాయబడిన
ప్రజాస్వామ్యం కాల రాయబడుతుంటే
వనరులన్నీ వ్యక్తుల చిట్టాలో
పొందు పరచబడుతుంటే
భూమి కంచెల చెరలో చెరచ బడుతుంటే
వున్న ఒకే ఒక్క ఆయుధాన్ని
సమయ స్ఫూర్తి తో వాడారు లే!!
కాగడాలై నేల కొరిగిన తరం
భవిష్యత్తు ఉపాధి ఆశల తీరం కాన రాక
పెల్లుబుకుతున్న అసంతృప్తి యే
మార్పు దిశగా కదిలింది లే!
పాటలన్నీ కొనబడుతుంటే
వ్రాతలన్నీ అబద్దాల వల్లె వేస్తుంటే
ప్రశ్నలన్నీ చెరసాల లో బంధించ బడుతుంటే
మాధ్యమాలను అదిరించి బెదిరించి వశం చేసుకుంటుంటే
అదను చూసి వేసిన విత్తనమే ఈ తీర్పు!
బేశరం బేరసారాల్లో
రాజకీయం వ్యభిచరిస్తుంటే
చూడలేని కళ్ళల్లో బడబాగ్ని
చేతిలో ఓ ముద్రే
రాజముద్ర నే మార్చెను లే!
పిడికిళ్ళు
బిగించి బిగించి కొట్లాడి వేసారి
ఏదో ఒక ప్రత్యామ్నాయ వేటలో
కొడవళ్ళు వదిలేసి
చేతి వైపు కదిలాయి లే!
ఏమీ లేని చెట్టు కాడ జొన్న యే వృక్షమనుకున్నారు లే!
మౌలిక మార్పు కాదు లే!
మార్పు అయితే జరిగింది!
నిరీక్షణ లో నిగ్గు తేలుతుంది
ఆశలో జనం! ఆశిద్దాం స్వేచ్ఛ కనీసం!
ఓ ప్రశ్న బతికినా చాలు!
ఉనికి సజీవం!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~