“మీ దగ్గర డబ్బులు తీసుకొని నేను రాయడం మానెయ్యాలా?” ఒక్కో పదాన్ని కూడ బలుక్కుంటూ బాధగా అడిగింది.
“అవును” అన్నాడు.
కాస్త తమాయించుకుంది.
“అయినా మీ దగ్గర డబ్బులెక్కడివి? మొన్ననేగా కారు కొనాలని నా దగ్గర తీసుకున్నారు. అసలు ఆరోజు ఆ డబ్బులు మీకు ఇవ్వకుండా మా నాన్నగారికి పంపివుంటే ఆయన చనిపోయేవారు కాదేమో!” అంది బాధగా.
“అంటే! మీ నాన్నగారు నావల్లనే చనిపోయారంటావా?”
“అలా అని నేను అన్నానా?”
“సరే! వాదించకు. నాకు అవసరం లేని విషయం గురించి క్షణం కూడా వృధా చేసుకోను” అన్నాడు.
“మా నాన్నగారి గురించి మాట్లాడటం మీకు అవసరం లేని విషయమా?”
“లేఖా! ప్లీజ్! ఏదేదో మాట్లాడి నన్ను విసిగించకు. అసలు విషయానికి రా!”
“ఏంటో! అసలు విషయం?”
“నీకు రచనలు చేసి సంపాయించాల్సిన అవసరం ఏముంది? డబ్బెందుకు నీకు? ఏం చేసుకుంటావ్? చీరలున్నాయి. నగలున్నాయి. ఇంకా ఏదైనా అవసరమైతే మా అమ్మ వుందిగా! అడిగి తీసుకో!” అన్నాడు.
“చూడండీ! మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. నా సమస్య కూడా వినండి! మా నాన్నగారు చనిపోయినప్పటి నుండి నేనేం రాయడం లేదు. ఇక రాస్తానో రాయనో కూడా తెలియదు. ముందు నేను కోలుకోవాలి. ఆ తర్వాతే ఏదైనా! నేను లోగడ పత్రికలకు పంపినవి మాత్రమే ఇప్పుడు అచ్చయి వస్తున్నాయి” అంది.
అతనింకేం మాట్లాడకుండా వెళ్లిపోయాడు. వెళ్లి తల్లి దగ్గర కూర్చున్నాడు.
రోజూ జయంత్ పెట్టే మెంటల్ టార్చర్ ని తట్టుకోలేకపోతోంది సంలేఖ. దాన్ని పైకి చెప్పుకోలేక మౌనంగా భరించలేక తనలో తనే కుమిలిపోతోంది.
జయంత్ ఆఫీసుకెళ్లాక హస్విత ఫోన్ చేసింది.
“నువ్వు ఎక్కువగా ఆందోళన చెంది ఆరోగ్యం పాడుచేసుకోకు” అని మందలించింది. అది వినగానే బోరున ఏడవాలనిపించింది సంలేఖకు.
వచ్చే ఏడుపును ఆపుకుంటూ “హస్వీ! నాకు ఏడవటానికి కూడా ప్రైవసీ వుండటం లేదే! నన్నేం చేయమంటావ్?” అంది.
“ఏడవటం ఇప్పుడంత ముఖ్యమా? రోజురోజుకి ఇలా మారిపోతున్నావెందుకే!” అంది హస్విత.
“సడన్ గా నాన్న చనిపోయారు. జయంత్ నన్నేమైనా పట్టించుకుంటున్నాడా? వాళ్లమ్మగారు సరే! అతను కూడా అలాగే వుండాలా? ఏ స్త్రీకైనా తండ్రి చనిపోయి బాధలో వున్నప్పుడు భర్త దగ్గర నుండి కొంచెం ప్రేమ, కొంచెం ఓదార్పు, కొంచెం లాలింపు అవసరం రాదా? వాటికోసం తపించరా? ఎంత రచనలు చేసినా నేను కూడా మనిషినే హస్వీ! నాక్కూడా అన్ని బంధాలు కావాలనిపిస్తుంది. అందరూ వుండి ఎవరూ లేని దానిలా ఎలా గడపాలి?” అంది.
వింటుంటే బాధనిపించింది హస్వితకి.
”దుఃఖం వచ్చినప్పుడు ఓదార్పుగా ‘ఇదిగో ఇక్కడ తల పెట్టుకో! నీ బాధ పోతుంది‘ అని భుజం చూపించాల్సిన జయంత్ పరాయివాడిలా చూస్తుంటే నాకెలా వుంటుంది చెప్పు! నేనేమైనా మణులడిగానా మాణ్యాలడిగానా? ఇంట్లో పెత్తనం అడిగానా? ఏదీ లేదే! నేను అతన్నుండి ఏం కోరుకుంటున్నానో అదే నాకు దూరమవుతోంది. అతను మనిషి మాత్రమే నాకు దగ్గరగా వున్నాడు కాని అతని మనసు నాకు దగ్గరగా లేదు. నాకు మనసు కావాలి హస్వితా! మనసుతో బ్రతికే బ్రతుకు కావాలి. మరీ ఇంత డ్రైగా బ్రతకటం నాకు నచ్చదు” అంది.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~