ఎలెన్ టైష్ ముల్లర్ గా జర్మనీలో బెర్లిన్ నగరంలో అల్వినా ఫాన్ కెల్లర్ ,మాక్స్ టైష్ ముల్లర్ దంపతులకు శ్రీ మతి శర్మ 15-11-1898జన్మించింది .బాసెల్, బెర్లిన్ లలో చదివి ఎం. ఏ. ఎం ఎడ్.పాసైంది .ఒడెన్ వాల్డ్ అనే ప్రఖ్యాత అంతర్జాతీయ స్కూల్ లో టీచర్ గా పని చేసింది .ఆంధ్ర దేశానికి చెందిన ముక్తి నూతలపాటి వేంకట నారాయణ శర్మ ఉన్నత విద్యకు జర్మని వెళ్ళినప్పుడు ,ఆమెకు ఆయన పరిచయమై 1931లో వివాహం జరిగి ,భర్త వెంట 1936 లో ఇండియా కు ఆంధ్రుల కోడలుగా వచ్చింది .తెల్లని శరీరం, నెమ్మది మాట ,చల్లని చూపు, గంభీరం తాండవించే ముఖం ,మెడమీదకు వేసుకొన్న మామూలు జుట్టు ముడి ,మోచేతుల వరకు ,చీలమండలవరకు నిండిన ఫ్రాక్ ధరించి ,చూసే వారికి మహా గౌరవం ,అభిమానం కలిగిం చేది శ్రీమతి ఎలెన్ శర్మ .
జర్మనీలో గురు పీఠం ఎక్కి ఎందరికో చాలాకాలం విద్యా భిక్ష పెట్టిన ఆ అపర సరస్వతి ,మద్రాస్ లో భర్తతో కాపురం ఉండి ఆమె చుట్టుప్రక్కల ఉన్న పేద బాలబాలికలకు చదువు నేర్పి, తీర్చి దిద్దాలని భావించి కేవలం 7గురు పిల్లలతో మాంటిసోరి స్కూల్ ప్రారంభించింది .ఇప్పుడు రెండు వేలకు పైగా బాలబాలికలతో శోభాయమానం గా వర్ధిల్లి విరాజిల్లుతోంది .భర్త శర్మ గారికి దగ్గరలో ఉన్న అడయార్ థియోసాఫికల్ సొసైటీతో సన్నిహిత సంబంధాలు ఉండేవి .అడయార్ మర్రి చెట్టు ప్రపంచ ఆకర్షణ . శర్మ దంపతులు ఆ మర్రి చెట్టు సూక్ష్మ రూపాన్ని తమ స్కూలు చిహ్నంగా ఏర్పాటు చేసుకొని ,గొప్ప ఆదర్శానికి దారి చూపారు .ఆమర్రి ఊడలు విస్తారంగా విస్తరించి చల్లని నీడనిస్తూ ‘’చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్ ‘’అయింది .
మద్రాస్ ద్వారకా కాలనీలో శర్మ దంపతులు ,దుర్గాబాయ్ దంపతులు ప్రక్కప్రక్క ఇళ్లల్లోనే1937లో ఉండేవారు .ఇక్కడే మొదటి సారిగా శర్మ దంపతులు కిండర్ గార్టన్ స్కూల్ ప్రారంభించారు. అప్పుడే దుర్గాబాయ్ తన ఇంట్లో ‘’బృందావన గోపికలు’’ అనే పేరుతొ చిన్న పిల్లల ను చేర్చి ‘’ ఆంధ్ర మహిళా సభ’’కు నాంది పలికింది .ఇద్దరు తెలుగు వారు స్థాపించిన ఈసంస్థలలో తెలుగు వారు ఎక్కువగా కనిపించే వారు .తర్వాత కొంచెం దూరంలో ఉన్న భవనం లోకి మారి ,ఆతర్వాత శాఖోపశాఖలు మహిళాసభ విస్తరిల్లింది .
శ్రీమతి ఎలెన్ శర్మ కు అంతస్తుల ప్రాధాన్యత లేడు .అనాధలు ,అనదలు,పరిత్యక్తలు అనేకులు వచ్చి ఆమె ఆశ్రయం కోరేవారు .ఆమె మనసు ద్రవించేది .వెంటనే ఆశ్రయం కల్పించేది .తర్వాతే నిర్వహణ కోసం డబ్బు విషయం ఆలోచించేది .వెంటనే పుట్టిల్లు జర్మని గుర్తుకు వచ్చి ,తన పలుకుబడి ఉపయోగించి విరాళాలు సేకరించేది .తమ ఆడపడుచు భారత దేశంలో పేదలకు చేస్తున్న సహాయానికి మెచ్చి ఎవరికి తోచింది వారు పంపుతూ ఆమె కార్యక్రమాలకు అంతరాయం లేకుండా సహకరించేవారు .ఇప్పటికీ ఆ వదాన్యత అలానే కొనసాగుతోంది .వ్యక్తులు ,సంస్థలు డబ్బు రూపంగా పంపితే ,మెడికల్ కంపెనీలు మందులు టానిక్కులు వగైరా పంపేవారు .హాస్టలు నిర్వహిస్తూ రోజూ పిల్లలకు విటమిన్ బిళ్ళలు తప్పక అందించేది శర్మ .జర్మని నుంచి కంపెనీలవారు ఎలెక్ట్రిక్ బాయిలర్స్ ,వాషింగ్ మిషన్లు , కుట్టు మిషన్లు పంపేవారు తమ ఆడపదచుకు సారెగా గౌరవంతో . కనుక హాస్టల్ పిల్లలకు సదుపాయాలు సమృద్ధిగా ఏర్పడ్డాయి.కానీ ఆఫీసు రూం మాత్రం డొక్కు కుర్చీలు బల్లలతోనే ఉండేది. అక్కడ ఆడంబరం దర్జాకు శర్మ చోటివ్వలేదు .సాను భూతి, సాయం, కృషి అనేవి ముఖ్యం అని భావించేది .
చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్ లో చిన్నపిల్లలకు మాంటిసోరి ,ప్రాధమిక ,ఉన్నత పాఠ శాలలున్నాయి .అయిదవ క్లాస్ వరకు అబ్బాయిలు కూడా అక్కడే చదువుతారు .ఆతర్వాత అన్ని తరగతులలో అమ్మాయిలే ఉంటారు .వీరిలో చాలా మందకి శ్రీమతి శర్మ ఉచిత విద్య తోపాటు పుస్తకాలు బట్టలు భోజనం సమకూరుస్తుంది .పేద విద్యార్ధులకు ఉచిత మధ్యాహ్న భోజనం పెడతారు .పిల్లలకు అన్ని అవకాశాలు కల్పిస్తుంది .జర్మన్లు చాలామంది ఇక్కడి అనాధ పిల్లలను పెంచుకొంటారు .అమెరికా ఆస్ట్రేలియా దేశాలుకూడా గొప్ప సాయం చేస్తున్నాయి ఇక్కడి విద్యార్ధులకు .శ్రీమతి శర్మ నిస్వార్ధ ప్రేమ పూరిత సేవకు ఉన్న ప్రభావం అన౦త౦ .ఇవన్నీ సేకరించి ‘’సిస్ట లాజ్జి ‘’అనే విద్యావేత్త పేరిట ఒక కేంద్రం స్థాపించి దానిద్వారా దాన ధర్మాలు ఉచిత వేతనాలు స్కాలర్షిప్ లు అందిస్తోంది .మరీ బీదగా ఉన్న విద్యార్ధుల కాలేజీ చదువులకు కూడా గొప్ప సాయమందిస్తున్న జగజ్జనని శ్రీమతి శర్మ .ఆస్కూలు వాతావరణం సేవ చూసిన ధనికులు ,పెద్ద హోదాలో ఉన్నవారు తమ పిల్లలను అక్కడే చదివించి స్పూర్తి పొందుతున్నారు .
వయోజన స్త్రీలకూ మాంటిసోరి టీచర్ ట్రెయినింగ్ ,క్రెష్ నిర్వహణ ట్రెయినింగ్ నెలకొల్పి గొప్ప అవకాశాలు కల్పించింది .పెద్దగా చదువుకొని స్త్రీలు స్వంత కాళ్ళపై నిలబడటానికి వీలుగా యాభై ఏళ్ళ క్రితమే ఆమె కుట్లు అల్లికలు చేతిపనులు నేర్పి ఆదర్శ ప్రాయమైనది .శ్రీమతి అద్దంకి సుందరమ్మగారి సాయంతో ‘’స్ట్రీ సేవా మందిర్ ‘’నెలకొల్పి గొప్ప మహిళాసేవ చేసింది . ఉద్యోగాలు వృత్తులు తో సతమతమవుతున్న మధ్యతరగతి వారి మూడు నెలల నుంచి నాలుగేళ్ల వరకు ఉన్న పిల్లల సంరక్షణ కోసం ‘’క్రెష్ ‘’స్థాపించి ఉదయం 8నుంచి సాయంత్రం 6వరకు తమ సంరక్షణలో ఉంచుతూ కంటికి రెప్పలాగా కాపాడే ఏర్పాటు చేసింది .వీరిలో పేదవారూ ఉంటారు వీరికి రాష్ట్ర సంక్షేమ సంస్థ సాయం చేస్తుంది .సంఘ సేవ అనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో శ్రీమతి శర్మ వీటన్నిటిని ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నిర్వహిస్తోంది .ఆమె ఏనాడూ పైసాకూడా అపేక్షించని త్యాగమయి .స్కూలు ప్రారంభించిన 1937లోనే ఆమె మద్రాస్ యూని వర్సిటిలో లెక్చరర్ గా జర్మన్ భాష ను 32ఏళ్ళు 1969 వరకు అంతే 72 ఏళ్ళ వయసు వరకు బోధించిన విద్యాదాత .విదేశాలలో జర్మన్ భాషా సేవ చేసిన౦దుకు శ్రీమతి శర్మకు ‘’గోథేపురస్కారం ‘’అందించి గౌరవించింది పుట్టిన దేశం జర్మని .80 సంవత్సరాల నిండు ముత్తైదువు శ్రీమతి ఎలేన్ శర్మ 9-6-1978 న దైవ సాన్నిధ్యం చేరింది .
-గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~