పేపర్లో అవార్డు వచ్చిందని పడితే
మీ ఫోటో బాగుందనే వాడు ఒకడు
సాహిత్యాన్ని పంచుకుంటానంటే
శరీరాన్ని అనుకునేవాడు మరొకడు
చూపులతో చుట్టేసేవాడు ఇంకొకడు
మాట్లాడుకుందాం రా అంటాడొకడు
ఒళ్ళంతా స్కాన్ చేస్తాడు మరో సన్నాసి
ఎన్ని అనుభవాలపుట్ట ఈ మేను
మనసు చూసే మనిషే లేడు
‘అమ్మా! అనే పిలుపే కరువాయె
కొడుకు వయసులో ఉండి కృష్ణలీలలుకు తయారు
అంతు తెలియని కలియుగ ప్రభావాలు
మాట మాటాడితే చాలు
ఎక్కడికో వెళ్ళి పోతాయి వారి ఊహలు
చెల్లి, తల్లి, భార్య గుర్తురారు ఆ క్షణంలో
భారత దేశంలోనే ఉన్నామా అని సందేహం
ఎప్పుడూ నా ఆలోచనలలో
విలువలు మరిచిపోయిన నా సోదరులారా
ఇప్పటి కైనా కళ్ళు తెరవండి
కాస్త పవిత్రతను ఆపాదించుకోండి
మంచి వాళ్ళు లేరా అన్నదే మీ ప్రశ్న అయితే
ఉన్నారన్నదే నా సమాధానం
ఆ శాతం వంద అవ్వాలన్నదే నా ఆకాంక్ష!
-యలమర్తి అనూరాధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~