జ్ఞాపకం- 86– అంగులూరి అంజనీదేవి

ఎప్పుడైనా అతను ఆఫీసు నుండి రాగానే తల్లి ఇచ్చిన కాఫీ తాగుతాడు. డ్రస్ మార్చుకొని, ఫ్రెషప్పవుతాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత తలకింద చేతులుంచుకొని ప్రశాంతంగా పడుకుంటాడు. తల్లి చెప్పే చాడీలు విన్నప్పుడు తప్ప మిగతా టైంలో రాసుకుంటున్న సంలేఖను ఏమాత్రం కదిలించడు. రాసుకోనీ నాకొచ్చే నష్టమేముంది అని అసలు పట్టించుకోడు. కానీ ఈరోజు అలా లేడు. చేతిలో వున్న పత్రికను ఆమె ముఖం మీద కొట్టాడు.

“నువ్విక ఈ సీరియల్స్ రాయటం ఆపెయ్!” అన్నాడు. నిర్ఘాంతపోయింది సంలేఖ. కోపమొచ్చినప్పుడు జయంత్ కాస్త చిరాగ్గా మాట్లాడినా రాయడం మానెయ్యమని ఎప్పుడూ అనలేదు. ఇప్పుడెందుకిలా మాట్లాడుతున్నాడో అర్ధం కాలేదు? పత్రిక పట్టుకుని గబగబ పేజీలను తిప్పింది. అందులో ఒక పేజీని చూడగానే అంత బాధలో కూడా ఆమె కళ్లు డైమండ్ కన్పించినట్లు మెరిశాయి. దానికి కారణం ఆ పత్రికలో ఆమె రాసిన సీరియల్ ‘ఈ వారమే ప్రారంభం’ అని వుంది. అది చూసి జయంత్ ఆమెను అభినందించలేదు. ఈసడింపుగా చూశాడు.

“మా ఆఫీసులో నీ సీరియల్ చదివి ఏమంటున్నారో తెలుసా?” అన్నాడు.
“ఏమంటున్నారు?” అడిగింది.

“నువ్వు రచయిత్రిగా బాగా పాపులర్ అవుతున్నావట. నన్ను నీ అసిస్టెంట్ గా వుండి ప్రూఫులు దిద్దివ్వమంటున్నారు. ఇంతకన్నా అవమానం వుందా? ఆఫ్ట్రాల్ నువ్వెక్కడా? ఈ జయంత్ ఎక్కడా? నేను నీ అసిస్టెంట్ గా వుండటమేంటి?” అన్నాడు.

సంలేఖ బలవంతంగా ఓ నవ్వు నవ్వింది.
“వాళ్లేదో సరదాగా అని వుంటారు. దాన్నింత సీరియస్ గా తీసుకోవాలా?” అంది.
ఆమెను జయంత్ ‘ఆఫ్ట్రాల్’ అన్నది ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు తెలుసు. ఆమె ఆకాశం అని. ఘర్జించేటప్పుడు ఘర్జించగలదు. వర్షించాల్సినప్పుడు వర్షించగలదు. అందుకే అనవసరంగా బాధపడి, ఘర్షణపడి భర్త ముందు చులకన కాదలచుకోలేదు.

“చూడు లేఖా! వాళ్లు సరదాగా అంటే నేను ఫీలవ్వటానికి నేనేమైనా చిన్నపిల్లాడినా? నెట్లో నీ ప్రొఫైల్ ని నేను చూడటం లేదనుకుంటున్నావా? నీ ఈ-మెయిల్ కి విదేశాల నుండి కూడా మెసేజ్ లు వస్తున్నాయి. ఇకచాలు. ఇంతటితో ఆపెయ్యి. భర్తగా ఇది నా డిమాండ్ అనుకో! ఆర్డర్ అనుకో! ఇంకేమైనా అనుకో! నువ్వు రాయడం మాత్రం మానెయ్యాలి” అన్నాడు.

“అది జరగని పని” అంది సంలేఖ.
జయంత్ అహం దెబ్బతిన్నది.

“అంటే నామాట వినవా? నన్నే ఎదురిస్తున్నావా?” అన్నాడు.

“ఇది ఎదిరించడం కాదు. నాకు చేతనైన పని రాయటమే కాబట్టి రాస్తానంటున్నాను. దాన్ని పనిగట్టుకొని ఆపటం ఎందుకు? దానివల్ల ఇంట్లో పనులు కూడా ఆగడం లేదే! నా పనులు, నా విధులు నిర్వర్తిస్తూనే వున్నాను. ఒక భార్యగా మీతో పంచుకోవలసిన జీవితాన్ని పంచుకుంటూనే వున్నాను. ఇంకెందుకు రాయడం ఆపడం?” అంది.

“రాసి ఎవర్ని ఉద్దరించాలి?”

“రాయడంతోనే కాదు. ఏ పనితోనూ ఎవర్ని ఎవరూ ఉద్దరించటం వుండదు. అలా వుండదని ఎవరైనా తాము చేసే పనుల్ని ఆపుకుంటున్నారా? నన్ను కూడా మొదట్లో కొందరు ‘నువ్వు ఎంత రాసినా మహాశ్వేతాదేవివి అవుతావా? ఎందుకు రాయడం?’ అన్నారు. అలా అన్నారని నేను రాయడం ఆపలేదే! రాసిన ప్రతి ఒక్కరూ మహాశ్వేతాదేవిలు కానక్కరలేదు. అలా అనుకుని రాసేవాళ్లంతా ఆగిపోతే పత్రికలు వుంటాయా? ప్రపంచ అభివృద్ధి వుంటుందా? అందుకే ఏదో ఒక పని చేసి ఎవర్ని వాళ్లు ఉద్దరించుకుంటే చాలు” అంది.

“నీకు కీర్తి దాహం పట్టుకుంది. నీ పేరును ప్రపంచవ్యాప్తంగా చూసుకోవాలన్న ఫ్యాన్సీ వుంది. అందుకే దాన్ని మానుకోలేకపోతున్నావ్!” అన్నాడు జయంత్.
ఆమె మాట్లాడలేదు. పేపర్లు అటుఇటు తిప్పుతోంది. ఆమె నిర్లక్ష్యం అతని మనసును, శరీరాన్ని ఉడికిస్తోంది.

“సమాధానం చెప్పకుండా పేపర్లు తిప్పుకుంటూ కూర్చుంటే ఏమిటి దాని అర్థం? వీడిలాగే వాగివాగి మరచిపోతాడనా?” అన్నాడు గట్టిగా.

అసలే సంలేఖ మనసు బాగాలేదు. పులిమీద పుట్రలా ఇదో సమస్య వచ్చిపడింది. జయంత్ దేన్నీ అంత సులభంగా వదలడు. అతను అనుకున్నది జరగాలంటాడు. జరిగేంత వరకు దాని గురించే ఆలోచిస్తూ వుంటాడు. అప్పుడంటే ఏదో తెలిసీ తెలియని వయసులో అతనిమీద వున్న వెర్రిప్రేమతో అతన్ని నెంబర్ 1 ర్యాంకర్ని చెయ్యటం కోసం నార్మల్ గా చదివింది. తనకి వచ్చే ర్యాంక్ ను కూడా వదులుకుంది. కొంతకాలం చదువుకే దూరమైంది. ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో తనకి వస్తున్న పేరును చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. అతనికన్నా ఒక మెట్టు తనని కింద వుండమంటున్నాడు. వెనకనే నడవమంటున్నాడు. లేకుంటే అతను వెనకబడిపోతాడట. ఎవరికీ కన్పించడట.

‘ఆడవాళ్లు మన పక్కటెముకతో తయారుచేయబడ్డవాళ్లురా! ఎందులో పోల్చుకున్నా మనకన్నా వాళ్లు తక్కువే. అందుకే

అణిగి వుంటారు. శక్తి అంశలో పుట్టిన వాళ్లు మాత్రం అణగరు. వాళ్లను మనమే అణచాలి’ అని వాళ్ల నాన్నగారు చెబుతుంటారట.

”మాట్లాడవేం?” బెడ్ మీద కూర్చుని సూటిగా ఆమెనే చూస్తూ అడిగాడు.

“నన్నెందుకిలా టార్చర్ పెడుతున్నారు? ప్రశాంతంగా వుండనివ్వరా?” అంది. ఆమెకు రాయడం మానడమంటే చావుతో సమానంగా అన్పిస్తోంది.

“నువ్వు నా మాట విని రచనలు చెయ్యటం ఆపకుంటే నేను రేపటి నుండి ఆఫీసుకి వెళ్లను. మరి నువ్వు సంపాయించి నన్ను పోషిస్తావా?” అన్నాడు.
సంలేఖ సన్నగా అర్థవంతంగా ఓ నవ్వు నవ్వింది.

“ఇప్పటికే మీలో వుండే ఈగో మిమ్మల్ని స్థిమితంగా వుండనివ్వటం లేదు. ఇక నేను సంపాయిస్తే మీరు తిని వుండగలరా? మీరు మీకోసం కన్నా చుట్టూ వున్న జనం కోసమే కదా ఎక్కువగా బ్రతుకుతుంటారు. వాళ్లు మీకిచ్చే సర్టిఫికేట్లే కదా మీకు వూపిరి. పైగా మీ పక్కన వున్నవాళ్లు మీకన్నా చాలా తక్కువగా వుంటేనే మీకు తృప్తి” అంది.

“అవును నేనంతే! నా చిన్నప్పుడు నా పక్కన ఆడేవాడు గెలుపుకు ఏమాత్రం దగ్గరలో వున్నాడని తెలిసినా వాడ్ని ఓ తన్ను తన్ని కింద పడేసి నేనే ముందుకెళ్లేవాడిని” అన్నాడు.

“అదీ మీ గొప్పతనం! మీ సంస్కారం!” అంది ఒక రకంగా నవ్వి.
“నువ్వు ఎలా నవ్వినా పర్వాలేదు. నేను పదిమంది దృష్టిలో చవటలా కన్పించటం నాకు ఇష్టం వుండదు. నేనలా వుండలేను. అసలు నీవల్ల నాకు ఇలాంటి సమస్య వస్తుందని నేను అనుకోలేదు. లేకుంటే పెళ్లయిన కొత్తలోనే ‘నేనిక్కడ కూర్చుని రాసుకుంటానండీ’ అని నువ్వు నన్నడిగి ఓ కుర్చీ తెచ్చుకొని ఇక్కడ వేసుకున్నప్పుడే ఆ కుర్చీని వేసుకోనిచ్చేవాడిని కాదు. అదిప్పుడు చూడు నాకెంత తలనొప్పి అయ్యిందో!” అన్నాడు.

“తలనొప్పి ఎందుకు? రాస్తే డబ్బులొస్తాయిగా?” అంది.
“ఆ డబ్బులు ఎవరిక్కావాలి? ముందు నువ్వు రాయడం మానెయ్యి. వాళ్లు నీకు నవలకి ఎంతిస్తారో అంతకన్నా ఓ పదివేలు ఎక్కువే ఇస్తాను” అన్నాడు.
ఆకాశం ముక్కలై తలమీద పడి వక్కలైనట్లు విలవిల్లాడింది సంలేఖ.

“మీ దగ్గర డబ్బులు తీసుకొని నేను రాయడం మానెయ్యాలా?” ఒక్కో పదాన్ని కూడ బలుక్కుంటూ బాధగా అడిగింది.
“అవును” అన్నాడు.
కాస్త తమాయించుకుంది.

 

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

జ్ఞాపకం, ధారావాహికలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో