నేను ముందా?!
నువ్వు ముందా!!
తెలియదు కదూ! నేనే ముందు!
నేను సజీవం అప్పుడూ ఇప్పుడూ
నేను వున్న చోటే వున్నా!! నన్ను నేను కాపాడుకుంటూ!!
నేనేమీ నీ ఇలాకా ను కబ్జా చేయట్లే!!
నీవే నన్ను తరుముతావు
నన్ను తొలగిస్తున్నావూ!
నీ స్వార్థం కోసం నన్ను బలి చేస్తున్నావు!
నా ఇలాకాలోకి ప్రశాంతత కోసం వస్తే
అక్కున చేర్చుకున్నా!!
నువ్వు వస్తుంటే నేను కాదనలే
ఆహ్వానించా!
నా సంపద పై నీ శీతకన్ను!
కొల్లగొట్టేందుకు పథక రచనలూ!!
నా మధ్యలో విహారమో
విగ్రహమో పెట్టావ్!
నన్ను తొలుస్తూ దారేసుకున్నావ్ !
చరిత్ర నాది
మనోభయం నీది!
నువ్వు ఏ దారిన వెళ్తున్నా
నీడ ను ఇచ్చా!
బతుకును ఇచ్చా!
నన్ను ఆసరా గా చేసుకుని
నాలో జీవ వైవిధ్యం
సమస్త జీవరాశులు
సమతుల్యం తో!!
నా జోలికి నీవు రానంత కాలం
నీ జోలికి నాలోని ఎవరూ రాలే!!
నా మరణం
నీ మరణానికి మార్గం!
నీవు పెట్టిన శిల్పాన్ని నీవే పూజించుకో! నేనేం కాదనలే!
అదో మానసిక బలహీనత!
ధైర్యం లేని వైకల్యం!
నన్నెందుకు బందీ చేయ చూస్తావు
కంచె పరిష్కారం కాదు సుమా!
నీ నేలన ఇనుపకంచెల తో నేలను చెర బట్టావ్!
మళ్ళీ నన్ను కూడానా!!
ఆవు పులి కథ
కర్ర చిరుత వర్తమానం!
ఎంతటి అపహాస్యపు పంథా!
ఇన్నాళ్ళు మనిషి వైపు చూడని చిరుత
జనావాసాలకు తరలుతున్న జంతు సముదాయం
కోతులు సైతం పంట పొలాల పైబడి….
ఇప్పుడేల నరుడా?!
నీవే కారణం !! ముమ్మాటికి నువ్వే!
నువ్వు బతుకు
నన్ను బతకనీ
పరస్పర సహకారం
సృష్ఠి కి అవసరం!!
కాదంటావా?! కర్రలే కాదు!!
ఏవీ కాపాడలేవు!! నరుడా! ఏలికా!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~