“వీర గంధం తెచ్చినారము
వీరుడెవ్వడో తెల్పుడీ”
తెలుగు గ్రంథము తెచ్చినారము
శూరు డెవ్వడో తెల్పుడీ
కండ పట్టిన పదాలు
కలకండ రుచులు
తేనెలొలుకు పలుకులు
శోయగాల కవితలు
పనస తొనల కన్నా
పాలబువ్వ కన్నా
చెరకు గడల తీపికన్నా
మధురమైనది నా తెలుగుని
గొప్పలు చెప్పే
ఓ ! తెలుగోడా !!
నా గుండె ఘోస వినిపిస్తోందా
పరాయి పంచన చేరి
వంచన చేస్తావేందుకురా
పరభాషీయులను ఆకర్షించే
ప్రకాశమాన తేజోమయ దీపం మన తెలుగు
మృత భాషకు జోలపాడుతూ
మాతృభాషకు ముల్లు గుచ్చుతావా
చీనా దేశానికెళ్లారా
స్వభాషా ప్రధాన్యమేట్టిదో
వివరిస్తారు
మాదిరాజు ప్రాంతానికి వెళ్ళారా
మాతృభాష మమకారం రుచిచూపిస్తారు
ఓహో !మాతృభాషా
మా చదువులతల్లీ
పేదోడి ఆయుధమా
గగన శిఖరమెక్కావా
తళ తళ మెరిసే అక్షరాలను చూసా
పెళ పెళ గర్జించే ఉద్యమ పాటను చూసా
కానీ నేడు కాల గర్భంలో కలిసి
కనుమరుగైపోతున్నావా తల్లీ!
‘అన్య భాషలు నేర్చు ఆంధ్రంబు రాదనుచు
సకిలించు ఆంధ్రుడా చావ వేటికిరా’
భాష దూరమైతే
శ్వాస దూరమైనట్లే రా
-వెంకటేశ్వరరావు కట్టూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~