జ్ఞాపకం- 85– అంగులూరి అంజనీదేవి

 

 

 

 

 

ఆయన సంలేఖతో మాట్లాడుతూ మాటల మధ్యలో “ఏమ్మా! సంలేఖా! మీ నాన్నగారికి సమాధి కట్టిస్తారా? లేక అలాగే వదిలేస్తారా? ఇది మాట్లాడదామంటే రాజారాం కన్పించలేదు. నువ్వొకసారి మీ అమ్మగారిని కదిలించు. ఏమంటారో! ఎందుకంటే మీ నాన్నగారు పాపం వాళ్ల నాన్నగారి సమాధి కట్టించకుండానే వెళ్లిపోయాడు. కొన్ని కోరికలు పుడతాయేకాని తీరవు” అన్నాడు.

సంలేఖ వెంటనే “అలాగే మాష్టారూ! నేనిప్పుడు హైదరాబాద్ వెళుతున్నాను. మీరు చెప్పిన విషయం ఒకసారి అమ్మతో మాట్లాడతాను. అదిగో నా బస్ కదులుతోంది. వెళతాను” అంటూ గబగబా వెళ్లి కదులుతున్న బస్ ఎక్కింది.

హైదరాబాదులో బస్ దిగి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్లినప్పటి నుండి సంలేఖ తండ్రిని గుర్తుచేసుకుంటూనే వుంది. ఆ దిగులుతో తిండి సరిగా తినడం లేదు. జయంత్ లేనప్పుడు పడుకొని ఏడుస్తూనే వుంది.

ఆ రోజు తిలక్ వచ్చి వెళ్లినప్పటి నుండి శ్రీలతమ్మ పూర్తిగా మారిపోయింది. అతని మాటల్ని, బెదిరింపుని ఇంకా గుర్తు పెట్టుకునే వుంది. “వాడికెన్ని గుండెలు? నన్నే ఎదిరించి మాట్లాడతాడా?” అని తిలక్ ని తిడుతూనే వుంది.

తిలక్ మీద కోపంతోనే రాఘవరాయుడు చనిపోయినప్పుడు కూడా ఆమె వెళ్లలేదు. భర్తను వెళ్లనివ్వలేదు. తండ్రి చనిపోయి బాధలో వున్న కోడల్ని కూడా ఓదార్చలేదు.

“ఎలా చనిపోయాడు? అసలేం జరిగింది?” అని కూడా అడగలేదు. సానుభూతి, ప్రేమ, మానవత్వం కొంచెం కూడా చూపించలేదు.

పైగా “నువ్వు ఈ ఇంటి కోడలివి. కళకళలాడుతూ తిరగాలి. చావు ఇంట్లో తిరిగినట్లు ఏమిటా ఏడుపు ముఖం. ఎన్నిరోజులు ఏడుస్తావు?” అంటూ కసురుకుంది.

ఎంత ప్రయత్నించినా తండ్రి పిలుపులోని ప్రేమను, ఆప్యాయతను మరచిపోలేకపోతోంది. అసలా ప్రేమ, ఆ అనుబంధమే వేరు. అది ఒక్క తండ్రికి మాత్రమే ప్రత్యేకమైనట్లు ఆ లోటు స్పష్టంగా కన్పిస్తోంది.
ఒక్కోసారి తండ్రిని తలుచుకుంటే గుండెను పిండినట్లవుతుంది. తనకి పెళ్లి చెయ్యాలని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. పెళ్లయ్యాక తన అత్తగారి నోటివెంట ఎన్నో తిట్లు పడ్డాడు. అవన్నీ ఆయనకు తెలియకపోవచ్చు. తను వింటూ గడిపింది. బాధపడుతూ విన్నది. ఎదురు తిరిగి మాట్లాడలేక మౌనంగా భరించింది.

అదే సమయం లో ఆడపడుచు వచ్చి “ఆవిడకి వాళ్ల నాన్నగారు అక్షరబిక్ష పెట్టాడటమ్మా! అది కూడా మొన్నో నవలకి తన పరిచయంలో రాసుకుంది. అందుకే ఆ ఏడుపు. ఏడవనీ! మనకేం? నువ్వెందుకాపాలి ఆ ఏడుపుని?” అని వ్యంగ్యంగా మాట్లాడింది. జయంత్ కూడా ఇంచు మించు అలాగే వుంటుంటాడు.
అప్పటి నుండి లోపల ఎంత బాధ వున్నా పైకి ఏడవటం మానేసింది. తనని తను కంట్రోల్ చేసుకుంటూ తిరుగుతోంది. హస్విత ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఊరట కలిగే మాటలు మాట్లాడుతుంటుంది. దిలీప్ కూడా వీలుచూసుకొని మాట్లాడుతుంటాడు. పుస్తకాలు చదువుతూనో, లేక ఏదైనా రాస్తూనో తండ్రిని మరచిపొమ్మని చెబుతుంటారు. ఇలాంటప్పుడే మరుపు మనిషికి అవసరం అని కూడా అంటారు.
అయినా సంలేఖ మనసు తండ్రి స్పృహలోంచి బయటికి రాలేకపోతోంది.

తండ్రి జ్ఞాపకాలను, ఆయన తనపట్ల చూపిన ప్రేమను, జయంత్ ని భర్తగా ఇచ్చి ఏర్పరచిన భద్రతను చూస్తుంటే అసలు తండ్రంటే ఏంటీ? ఎలా వుండాలి? తండ్రి స్థానంలో వున్నప్పుడు ఆ తండ్రి పిల్లల పట్ల ఎలాంటి త్యాగాలను చెయ్యాలి? చేసిన త్యాగాల వల్ల అనుక్షణం నలిగిపోతూ కూడా పిల్లల క్షేమమే తనకి బలం అన్నట్లు తన తండ్రి ఎలాంటి జీవితం గడిపాడు అన్నది ఆమెకు తెలుసు. అందుకే ఆయన జ్ఞాపకంగా ప్రతి క్షణాన్ని అక్షరరూపంలోకి తెచ్చుకోవాలి అనుకుంది.

అది చదివి చెడు అలవాట్లకి బానిసలై తమ స్వసుఖాన్ని చూసుకునే తండ్రుల కళ్లు తెరుచుకోవాలి. ఎందుకంటే పిల్లలు తండ్రిని చూసి ధైర్యంగా వుండాలి కాని భయపడకూడదు. ‘వీడు మమ్మల్నేం పెంచుతాడు. మాకేం పెడతాడు?’ అన్న అభద్రతా భావం రాకూడదు. తండ్రి పిల్లల్ని కనటమే కాదు కాపాడగలగాలి. ‘ఈ తండ్రి కడుపున పుట్టి నేనేమీ కోల్పోలేదు. తండ్రిగా ఆయన నాకు అన్నీ అందించాడు’ అని పిల్లలు గర్వపడేలా తండ్రి ఎదగాలి. మనసును ఉన్నతంగా మలచుకోవాలి. తండ్రి అనేవాడు పిల్లలు తింటుంటే తృప్తిపడాలి. ఎదుగుతుంటే ఆనందపడాలి. పిల్లలతో ఓపిగ్గా మాట్లాడాలి. మంచిమాటలు చెప్పాలి.

ముఖ్యంగా మాట్లాడేముందు ‘ఈ మాటలు మాట్లాడొచ్చా’ అని నలుగుర్ని అడిగి తెలుసుకొని మాట్లాడమని పిల్లలకి తండ్రి నేర్పాలి. ఇవన్నీ తను రాయబోయే నవలలో రాసి దాన్ని ప్రతి బాధ్యతలేని తండ్రి చేతిలోకి వెళ్లేటట్లు చేయాలి. దానికి తన తండ్రే ప్రధాన వస్తువు.

ఎందుకంటే ఎదుటివాళ్ళు మాట్లాడుతుంటే శ్రద్దగా వినటం తనకి అలవాటు చేసాడు. ఎదిగేకొద్ది జీవితంలో వ్యంగ్యపు మాటలు, వెటకారపు మాటలు మాట్లాడేవారు వుంటాయని చెప్పాడు. అంతేకాదు ఆ మాటల వల్ల మనల్ని మనం మలచుకోవాలని, మనం కూడా వాళ్లలాగా మాట్లాడకూడదని, ఒకరకంగా పర్సనాలిటీ డెవలప్ మెంట్ అనేది అలాంటి వాళ్ల ద్వారానే కొద్దికొద్దిగా డెవలప్ అవుతుందని చెప్పాడు. ఎలా మాట్లాడాలో. ఎలా మాట్లాడకూడదో చెప్పాడుముఖ్యంగా “నీ రచన ఏది బయటకి వచ్చినా దాన్ని ముందుగా ఒక మంచి విమర్శకుని చేతిలో పెట్టు అనేవాడు.

అలా ఎందుకంటే నీ రచన నీకు సమగ్రంగా వుందని అన్పించవచ్చు. కానీ ఒకసారి దాన్ని సమీక్ష కోసమో, విమర్శ కోసమో ఇచ్చినప్పుడు వారి స్పందన నీకు విన్పిస్తుంది. అప్పుడు లోపాలను గమనించి నీ రచనల్ని నువ్వు మెరుగుపరచుకుంటావు. శైలిలో, శిల్పంలో, రచనా విధానంలో మార్పులు చేసుకుంటావు. అందుకే విజ్ఞులైన పాఠకులతో పాటు విమర్శకులు, సమీక్షకులు నీ సాహితీ ప్రయాణంలో సమీక్షకులు, నీకెంతో అవసరం. వాళ్లనెప్పుడూ తూలనాడవద్దు. విమర్శ చిన్నదయినా, పెద్దదయినా మనస్ఫూర్తిగా స్వీకరించు. అదే నిన్ను తీర్చిదిద్దే ఆయుధం. విమర్శను స్వీకరించలేని వారెప్పుడూ సాహితీరంగంలో నిలబడలేరు. నువ్వు రాసిందే తిరుగులేనిదనీ ఎప్పుడూ భావించకు. అహం వద్దు. గర్వం వద్దు. ఇవి రెండూ మనిషిని తొందరగా దిగజార్చే గుణాలు. ఏది చేసినా నీకు ఆత్మతృప్తి కలిగిందా లేదా అన్నది చూసుకొని చెయ్యి!” అనేవాడు.

అంతేకాదు ఎప్పటి కప్పుడు తన రచనల్ని భరద్వాజ మాష్టారి చేత చదివించి అందులో “మా అమ్మాయి ఏం చెప్పింది మాష్టారు?” అని వివరాలు అడిగేవాడట. భరద్వాజ మాష్టారి చేత తన నవలల గురించి ఎక్కువగా మాట్లాడించేవాడట. ఆయన మాట్లాడుతుంటే ఆకళింపు చేసుకుంటూ ఆనందించేవాడట. మొన్న తండ్రి శవం దగ్గర ఈ మాటలే చెప్పాడు భరద్వాజ మాష్టారు. ఆయన పిల్లల కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పాడు. అది గుర్తొచ్చి సంలేఖ కళ్లు చెమర్చాయి.

ఆఫీసు నుండి జయంత్ వచ్చాడు.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో