అప్పుడే తలనొప్పి కొద్దిగా తగ్గి మాగన్నుగా నిద్ర పట్టసాగింది . భుజం మీద ఏదో పడినట్టు అనిపించి దిగ్గున కళ్లు విప్పాను పక్కనే రవి పడుకొని చేయి భుజం మీద వేస్తున్నాడు . నేను చేయి పక్క కు తప్పించి ” రవీ తలనొప్పిగా ,అలసటగా వుంది. నన్ను నిదుర పోనీయి ” నెమ్మదిగా అన్నాను .
“తలనొప్పి తగ్గిపోయే మందు నేనిస్తాగా “
అంటూ నన్ను తన వేపుకు తిప్పుకోసాగాడు . ” ప్లీజ్ …రవీ ఇవాళ్టి కి నన్నొదిలేయ్ ” అతన్ని తప్పించుకొని పక్క కు ముఖం పెట్టి పడుకొన్నాను .
“ఒక్క పదినిముషాలు ఓపిక పట్టు . అలసట మొత్తం పోతుంది ” నన్ను బలవంతాన తనవైపు తిప్పుకున్నాడు .
” నాకు బాగా లేదంటే వినవేం … పీరియడ్స్ వచ్చే టైం అనుకుంటా … కొద్దిగా చికాకుగా వుంది …నన్ను రెస్ట్ తీసుకోనీయి ప్లీజ్ …” అసహనంగా అన్నాను . రవి వినకుండా తన చేతులతో నా వంటిపై తడుముతున్నాడు . నేను చటుక్కున లేచి కూర్చున్నాను . మంచం దిగబోతుంటే రవి నన్ను బలవంతాన వాటేసుకొని మంచం మీదకు తోసాడు .
నా ముఖంలో ముఖం పెట్టి ” నా కిప్పుడు నువ్వు కావాలి ” అంటూ పెదాలు కొరికాడు. తాగి ఉన్నాడేమో ఆ వాసన నా కడుపులో తిప్పినట్లయింది . కొరికిన చోట మంట అనిపించింది . నా చేతులు తన చెతులతో బంధించి ఒక పశువులా నా మీద పడ్డాడు . నా పెదాలు , బుగ్గలు, మెడ మీద ముద్దులు పెడుతున్నాడు .
నాలికతో ముఖమంతా తడిచేస్తున్నాడు . నాకు ఒళ్ళంతా కంపరంగా వుంది . విస్కీ వాసన పరమ ఛండాలంగా వస్తున్నది అతని నోటినుండి . కళ్లు తేలిపోతున్నాయి. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. నా చేతుల్ని వదిలి ఒకచేత్తో నా రొమ్ముని నలిపివేస్తూ ,మరోచేత్తో నా చీర కుచ్చిళ్ళను లాగసాగాడు . ఎప్పుడైతే నా చేతుల్ని వదిలాడో నేను నా రెండు చేతులతో నా మీద ఉన్న అతన్ని బలంగా నెట్టివేసాను . మంచం మీద నుండి కింద పడ్డాడు . ఒక్క ఉదుటున నేను లేచి మంచం దిగాను . రవి ” లంజా నన్ను తోసేస్తావా …చూడు నిన్నేం చేస్తానో ” అంటూ నా జుట్టు పట్టుకొని నా చెంపలు వాయించాడు . బూతులు తిడుతూ ” మంచిగా చెపితే వినవు . నిన్నిప్పుడు రేప్ చేస్తాను . ఏంచేస్తావే ? ” అంటూ నా బ్లౌజ్ పట్టుకొని లాగేసాడు . నా కొంగు లాగుతూ చీరను నా నుండి వేరు చేయటానికి చూస్తున్నాడు . నేను గట్టిగా పెనుగులాడుతు ” రేప్ చేస్తావా ? నువ్వసలు మొగుడివేనా ? రేప్ చేస్తే కంప్లైంట్ యిస్తే బొక్కలో తోస్తారు నిన్ను ” అరిచాను గట్టిగా . రవి పెళ్లున నవ్వాడు .
” నిన్ను కట్టుకున్నప్పుడే నీ మీద సర్వ హక్కులు నా కొచ్చాయి . మొగుడు పెళ్ళాన్ని …….” చెప్పలేని బూతుమాటల ప్రవాహం అతని నోటి నుండి వస్తున్నది .
” నువ్వెంత మొగుడివైనా పెళ్ళాం ఇష్టం లేకుండా వంటి మీద చెయ్యి వేయటానికి హక్కు లేదని చట్టాలున్నాయి . నేను మనిషిని . నాకూ ఇష్టాయిష్టాలు ఉంటాయి. నా మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన నన్నో ప్రాణం లేని బొమ్మలా చూస్తే ఊరుకోను .నీకు నా మనసు ,దానిలో ఉన్న బాధ ,వేదన ఇవేం నీకు అక్కరలేదు . నీకు కావాల్సింది నువ్వు పిలవగానే ప్రక్క మీదకొచ్చే ఆడది . సెక్స్ ,సెక్స్ ,సెక్స్ అది తప్ప నీకింకేం పట్టవు .ఎంతసేపు పశువులా పొర్లాడటం తప్ప మనిషిలా నన్ను లాలించావా ? నా ఇష్టాలు గ్రహించావా ? ఆడదాన్ని ప్రేమగా ఎలా చూడాలో ,ఎలావుంటే ఆడది తనంతట తానుగా అర్పించుకుంటుందో నీకసలు తెలియదు .ఎంత సేపు చిత్త కార్తె కుక్కలా ప్రవర్తించటం తప్ప ..” ఆవేశంతో అన్నాను. అంతే … ” నన్ను కుక్క అంటావా …..” బూతులు తిడుతూ నా వీపు మీద పిడిగుద్దులు గుద్ది నన్ను క్రింద పడేసి కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తన్నాడు . కోపం ,బాధ ,ఆవేదన ,ఆక్రోశం ,నిస్సహాయత నన్ను నిలువునా ముంచెత్తాయి .
స్పృహ ఉండీ లేని స్థితిలో నా మొగుడు నన్ను అతి దారుణంగా ,కిరాతకంగా రేప్ చేసాడు .
* * *
నేను కళ్లు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను . అమ్మా ,నాన్న యెదురుగా కనిపించారు . ఒళ్లంతా కుళ్ళపొడిచినట్లు ఒకటే నెప్పులు . తొడల మధ్యలో భరించలేని నొప్పిగా వుంది . కాళ్లు కదల్చలేకుండా ఉన్నాను . అమ్మ నా తలమీద చెయ్యి వేసి నిమురుతూ ఏడుస్తున్నది . నాన్న కళ్లల్లో నీళ్ళు . నేను అమ్మచేతిని గట్టిగా పట్టుకొని ‘నొప్పిగా ఉందమ్మా ‘ అని ఏడ్చేసాను .
డిగ్రీ అయిపోగానే మంచి సంబంధం అని రవికి ఇచ్చి పెళ్లి చేసారు . రవి బాంక్ లో జాబ్ చేస్తున్నాడు . అందగాడు ఆస్తిపరుడు అని అమ్మా నాన్నలు ఆనందించారు . కానీ రాత్రి అయితే రవిలో మరో మనిషి బయటకొస్తాడు .
సెక్స్ పర్వెర్టెడ్ , తాగుతాడు , సెల్ ఫోన్లో హేయమైన బ్లూ ఫిలిమ్స్ చూస్తాడు .
ఆడది సెక్స్ చేయటానికి పనికివచ్చే ఒక యంత్రం అతని దృష్టిలో . రోజూ రాత్రి కోరికలను ఆరు నెలలు పంటిబిగువున భరించాను. ఇక ఆ రోజుతో నేను పూర్తిగా అతనితో తెగతెంపులు చేసుకొవాలని నిర్ణయించుకొన్నాను.
తరువాత అమ్మ చెపితే తెలిసింది . తెల్లవారిన తరువాత రవి మా నాన్నకి ఫోన్ చేసి నాకు బాగా లేదని చెప్పాడట .మా అమ్మా,నాన్న నన్ను తీసుకొచ్చి హాస్పిటల్ లో చేర్చారు . డాక్టర్ నన్ను పరీక్షించి అన్ని వివరాలు చెప్పిందట . కోలుకోవటానికి పది రోజులు పట్టింది .
ఈ లోపునే నా బలవంతం మీద నాన్న పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు . రవిని అరెస్ట్ చెయ్యటం , బెయిల్ మీద బయటకి రావటం జరిగాయి . రవి లాంటి మృగంతో నేను కలసి ఉండలేను. నేను హాస్పిటల్ లో ఉండగానే డాక్టర్ సర్టిఫికెట్ సాయంతో కోర్టు లో విడాకులకు అప్లై చేసాను . నాన్నకి అంతగా ఇష్టం లేదు . పరువు కోసం ఆలోచించాడేమో . అమ్మ పూర్తిగా నాకే సపోర్ట్ . హాస్పిటల్ లో ఉన్నప్పుడు రవిగానీ ,అతని తల్లితండ్రులు గానీ నన్ను చూడటానికి రాలేదు . రవి మీద కంప్లైంట్ ఇచ్చానని వారి కి కోపం . భర్త రేప్ చేసాడని భార్య కేసు పెట్టటం ఊరంతా ఈ విషయాన్ని వింతగా చెప్పుకున్నారు . చుట్టుపక్కలవాళ్ళు , బంధువులు అనే మాటలను నేను లెక్కచేయలేదు .
మూడు నెలల తరువాత నన్ను ఢిల్లీలో ఉంటున్న పిన్ని దగ్గరకి పంపించారు .
* * *
ఢిల్లీ లో పిన్నీ ,బాబాయ్ ఇద్దరు మంచి జాబ్స్ లో ఉన్నారు .ఇద్దరు చిన్నపిల్లలు, యూకేజీ, ఫస్ట్ క్లాసు చదువుతున్నారు. ఢిల్లీ వచ్చాక నెల రోజులు అలోచించి సివిల్స్ కు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను . పిన్నితో చెపితే మంచి కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసింది. ఏక దీక్షగా ఒక తపస్సుగా చదవటం మొదలుపెట్టాను .
మధ్య మధ్యలో కోర్ట్ లో వేసిన విడాకుల కేసు హియరింగ్ కు వచ్చినపుడు వెళ్లి వస్తున్నాను .
కోర్టులో రవి కనపడినా డోంట్ కేర్ అన్నట్లుగా బిహేవ్ చేసాను . రెండు సంవత్సరాలకు విడాకులు మంజూరు అయ్యాయి . హాయిగా ఊపిరి పీల్చుకున్నాను . ఇప్పటి దాకా నా పేరే స్వేచ్చ .నా జీవితం లో అది లేదు కదా అనుకున్నాను . ఇప్పుడు స్వేచ్ఛకు స్వేచ్చ వచ్చింది అనుకొన్నాను .
నా గమ్యం వైపు దృష్టి సారించాను.
ఢిల్లీ లో జరుగుతున్న మహిళల అత్యాచారాలపై పత్రికలలో వ్యాసాలు రాసాను . మహిళా సంఘాలతో కలసి ఉద్యమాలు నడిపాను .ఆందోళనలలో
పాల్గొన్నాను . అయితే వీటన్నింటి మధ్య చదువును నిర్లక్ష్యం చేయలేదు .
సివిల్స్ లో టాప్ రాంక్ సాధించాను .
IAS కు నేను ఎలిజిబుల్ అయినా కావాలని IPS ను ఎన్నుకొన్నాను .
ట్రయినింగ్ పీరియడ్ ముగిసాక పోస్టింగ్ యిచ్చారు అసిస్టెంట్ సూపరింటెండెంట్
ఆఫ్ పోలీస్ గా .
* * *
పొద్దున్నే లేచి వాకింగ్ కు వెళ్లి వచ్చి కాఫీ తాగుతూ పేపర్లు తిరగేస్తున్నాను. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కనిపించిందా వార్త.
“A man is a man; an act is an act; rape is a rape, be it performed by a man the ‘husband’ on the woman ‘wife’,” a single-judge bench of Justice M Nagaprasanna of the Karnataka High Court said.
నేను వెంటనే నెట్ లో కేసు వివరాలు శోధించాను .
కర్ణాటక ర్రాష్టంలో పెళ్లి చేసుకున్న నాటి నుంచి తన భర్త తనను లైంగిక బానిసగా చూస్తున్నాడని, తనపై బలవంతంగా లైంగిక చర్యకు (Sexual Assault) పాల్పడుతున్నాడని, అసహజ లైంగిక చర్యలకు బలవంతం చేస్తున్నాడని, తన కుమార్తె ముందే లైంగిక చర్యకు పూనుకుంటున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.
భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 375 కి మినహాయింపు 2 అనేది
భార్యపై అత్యాచారం నేరం నుండి భర్తకు మినహాయింపునిస్తుంది.
కర్ణాటక హైకోర్టు ‘ఒక పురుషుడు నేరానికి (అత్యాచారం) పాల్పడినట్లయితే, అది భర్త అయినప్పటికీ శిక్ష విధించాల్సిందే’ అని పేర్కొంది.
ఈ నేపథ్యంలో భార్యపై లైంగిక దాడికి పాల్పడిన భర్తపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
వైవాహిక అత్యాచారం కేసులో భర్తపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం మద్దతు ఇచ్చింది.
కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది .
భార్యతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు ఐపీసీ సెక్షన్ 376 కింద భర్తపై వచ్చిన అభియోగాలను హైకోర్టు సమర్థించింది.
వివాహిత అత్యాచారానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరిస్తూ తీర్పునిచ్చింది.
ఈ మేరకు జస్టిస్ ఎం నాగ ప్రసన్నతో కూడిన సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
ఆ వార్తా వివరాలు నాకెంతో అనందాన్ని కలగచేసాయి .
* * *
ఆ సాయంత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవానికి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచిన సందర్భంలో మ్యారిటల్ రేప్ విషయంపైనే మాట్లాడాను .
“సెక్స్ విషయంలో భార్య ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా భర్త తనకు అన్నిటికీ అనుమతి ఉన్నట్లుగా వ్యవహరించి సంభోగిస్తే అది వైవాహిక అత్యాచారమే అవుతుంది. వైవాహిక అత్యాచారంపై చాలా కాలంగాచర్చ జరుగుతోంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని సుదీర్ఘ కాలంగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, 36 దేశాల్లో ఇది కేవలం చట్టంగానే మిగిలిపోయింది. అందులో భారత్ కూడా ఉంది. దాదాపు 75 దేశాలు మ్యారిటల్ రేప్ ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నాయి. 31 శాతం మంది వివాహితలు అంటే కనీసం ముగ్గురిలో ఒకరు… తమ భర్తల కారణంగా శారీరక, మానసిక హింసలకు గురవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.” అంటూ ప్రొద్దున నేను చదివిన కేసు వివరాలు కూడా వివరించాను . మన సమాజంలో పాతుకు పోయిన ఫ్యూడల్ సంస్కృతి ,మనుధర్మ శాస్త్రం భావజాలాల గురించి చెప్పాను . ఏ సమస్య వచ్చిన మౌనంగా ఉండక ఎదురొడ్డి పోరాడాలని పిలుపునిచ్చాను .
* * *
ASPగా జిల్లాలోమంచిపేరు సంపాదించాను .ప్రత్యేకంగా మహిళల కేసులు నేను శ్రద్ధతో పరిష్కరిస్తున్నాను .
ఆరోజు స్టేషన్ లో ఉండగా ఒక ఆడమనిషి నన్ను కలవాలని వచ్చింది . ఆమెను కానిస్టేబుల్స్ నాదగ్గరకు పంపించటంలేదు . ఆమె వారితో గొడవ పడుతున్నది . నేను ఆమెను లోపలికి తీసుకురమ్మన్నాను. ‘ఆమె బజారు వేశ్య’ అని కానిస్టేబుల్ నసిగాడు .
” అయితేనేం ,ఆమె మనిషే కదా ” అని ఆమెను నా దగ్గరికి రప్పించుకొన్నాను .
ఆమె డబ్బులకు ఒళ్ళు అమ్ముకునే వేశ్య. ఆమె దగ్గరకి ఒక విటుడు వచ్చి తన ఇంటికి తీసుకెళ్లి శృంగారం పేరుతో ఆమెను చిత్రహింసల పాలు చేసాడు . రొమ్ములపై పంటిగాట్లు ,గోరు గిచ్చుళ్ళు వాటినుండి రక్తం స్రవిస్తున్నది .బుగ్గలపై చెంపదెబ్బలు ఎర్రగా కనిపిస్తున్నాయి. తొడలపై సిగరెట్ తో కాల్చిన ముద్రలు, వెజీనా అంతా రక్తపుమయమై దారుణంగా కనపడుతున్నది. ‘ఎంత బజారు మనిషిని అయినా నేనూ మనిషి నేకదా! డబ్బులిచ్చినంత మాత్రాన ఇలా ప్రాణాలు తీయాలా ? ఒళ్లు కొవ్వెక్కి కాదు ఇలా బతికేది . పిడికెడు తిండికోసమే ఈ పని చేస్తున్నా ‘అంటూ ఆమె ఏడ్చింది. ఆమె వివరాలు, విటుడి ఇంటి వివరాలు రాసుకొని ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాను . అక్కడి లేడీ డాక్టరు తో వివరాలు చెప్పి ఆమెను పరీక్షించి సెమెన్ ,పంటిగాట్లు ,గోరు గిచ్చుళ్లు వీటన్నిటి ఆధారాలు సేకరించి ఆమెకు మంచి ట్రీట్ మెంటు జరిగేలా చూడమని చెప్పాను . ఆ విటుడి ఇంటికి కానిస్టేబుల్స్ ను పంపి అతన్ని అరెస్టు చేసి తీసుకురమ్మన్నాను.
కానిస్టేబుల్స్ అతన్ని తీసుకొచ్చారు . అతను ….అతను …రవి . వెంటనే FIR
ఫైల్ చేసి అతన్ని లాకప్ రూం లోకి పంపించాను .
-పారుపల్లి అజయ్ కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to స్వేచ్చ (కథ)-పారుపల్లి అజయ్ కుమార్