నేను పుడుతూనే
నాలుగు వేళ్ళు ముడిచి
చూపుడు వేలు తో ఈ లోకం లోకి వచ్చాను
అదే ప్రశ్నని తెలియదు నాడు
అమ్మ నాన్న అందరూ
అదే వేలు చూపెట్టి
భయపెట్టారు! భయం లేదిక!
అదే వేలు
బ్లాక్ బోర్డు మీద
అక్షరాన్ని నేర్పింది! అదే హేతువు ను బతికించింది!
త్రిభుజం లో కింది వాడిని
నాకో దిక్సూచి
ఆ నిలువెత్తు విగ్రహం ఎడమ చేతిలో రాజ్యాంగం
బోధనాధికారనిర్దేశిత చూపుడు వేలు
నాలో ధిక్కార ధ్వని ని నింపింది!
నీవేమో వద్దన్నావు విగ్రహం
ఆ విగ్రహమే లేకపోతే
ఏనాడో నిన్ను మరిచేట్లు చేసే
ఇజాల రాజ్యమిది!
ఎన్నికల వేళ
విగ్రహ తాకిడి
వెలివాడా! ఉక్కిరిబిక్కిరి కాకు సుమా!
ఆ చూపుడు వేలు మరువకు మా!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~