ఆ కిటికీ తలుపులను
ద్వారపు తెరలను మూసివేయండి
పలకరిస్తున్న
సుగంధ దుర్గంధాలకు
ప్రకంపించగల మనస్సిప్పుడు ఖాళీగా లేదు
ఆనందాల్లారా నా వాకిట్లో నిలవకండి
ఇప్పుడీ దశ మీకే ఆత్మీయ ఆహ్వానం అందించలేదు
దుఃఖపు సుడుల్లారా పైపైకి దూసుకొచ్చి పలకరించకండి
తనివితీరా వాటేసుకుని నన్ను నేను
మరచే ఘడియలిప్పుడు నా దగ్గర కానరావు…
నేనిప్పుడు
బిజీ బీ ని
ఏ పువ్వుపైనా
ఏ మరందపు తీపి పైనా
ఏ నవ్వు కొసన
ఏ ఏడుపు కడగట్టున
క్షణ కాలమైనా నిలువలేని
ఉరుకుల పరుగుల జీవితాన్ని
ఒక్కో చేయీ
పదో పాతికో పనుల్లో తలమునకలు అయ్యి వుంది
ఒక్కో కాలూ
తీరిక లేని ప్రయాణాన సతమతమవుతోంది
ఒక్కో ఆలోచనా
ఆది అంతాల మధ్య ఎటూ పాలుపోక
నసనసగా నీలుగుతోంది
చుట్టూ చిక్కబడిన
వెలుగూ చీకటి మిశ్రమం
ఓ కన్నును కలవైపు
ఓ చూపును మెలుకువ మాయ వైపు
తిప్పుతూ డోలూ మద్దెల వాయిస్తోంది
సన్నాయి నొక్కులు నొక్కి
దిక్కు తోచిన చోట
తలదాచుకోమని
నడమంత్రాన వదిలేసి చల్లగా జారుకుంటోంది
అన్నిన్నాళ్ళూ మనవి కావన్న స్పృహ వున్నా
నిలువని కాలం నిట్టనిలువునా ముంచేస్తున్న చోటులో
నిలదొక్కుకోలేక, ఎదురీది గెలిచే ఓపిక నామమాత్రం లేక
బతుకు రెక్క ఓ వైపుకు ఒరిగిపోతోంది
తొండి ఆట ఆడుతున్న అతి తెలివి ఊహల్ని తిట్టుకోలేక
చదరంగపు పావులపైకి నెపం నెట్టి
తాత్కాలిక సుఖాన్ని పొందుతోంది…
మూసుకుపోతున్న స్పందనలను
మరింత మన్నుతో కలిపి
శాశ్వత సమాధి కట్టమంటోంది……
-సుధా మురళి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~