రంగరించిన మెళకువలు…
నూతన ఆలోచనలు…
పట్టుదల, దీక్షలు…
కార్య నిమగ్నత,దక్షతల…
లక్షణాల సమన్వితమై…
సమున్నతంగా సాకారమయ్యే
లలితకళా సృజన రూపాలు!
శ్రవణ ఇంద్రియముల ద్వారా మనసును
పరవశింపజేసే సుమధుర రాగాలతో
శిశువులను,పశువులను,
పాములను సైతం
అలరించే సంగీతగానం!
రసాశ్రయం,సాత్విక కావ్యార్థాభినయంతో
మనోల్లాసం కలిగించు అభినయ నాట్యం!
ఆంగికాభినయంతో
ముడిపడి చక్షు ప్రీతి
కలిగించు నృత్యము!
చక్షురింద్రియానందము కలిగించు
కనువిందు చేసే చిత్తరువు!
సంపూర్ణాకృతితో
అంధులు సైతం
స్పర్శచే నిమ్నోన్నత
భాగముల పరిశీలన చేయగల
అబ్బురపరిచే కళాఖండ శిల్పం!
శబ్దమయమై
శాశ్వతమగు అక్షర
లక్షణ సమన్వితమై
సప్తసంతానములందును
మిన్నగా భావించబడిన కవిత్వం!
లీనమై… వినీలమై ఆస్వాదిస్తే
మనోఫలకంపై సాక్షాత్కారమై
మనోవికాసం పెంపొందించే కవిత్వం…
మానసికానందాన్ని అందించే
లలిత కళల సృజన కళారూపాలు…
రస సిద్ధికి సోపానాలు!!!
-చంద్రకళ. దీకొండ,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~