స్త్రీలందరూ ఒక్కటేనా?!
స్త్రీలెందరో
ఎన్ని రకాలో! వాడెవడో చెప్పిన జాతులు కాదు సుమీ!!
హక్కుల ఊసే ఎరుగని వారెందరో
దాష్టీకానికి బలి లో అంతరాలెన్నో ఏళ్ళుగా!
చూసే చూపుల్లో
వస్త్ర ధారణలో
చిరుగు పాతరల చీరల్లో
రూపు రేఖల్లో
ఊరి మధ్య ఊరవతల
గడీల్లో గడీ బైట
పొలాల్లో చెలకల్లో
వాగుల్లో వాగొడ్డుల్లో
ఎక్కడన్ని ఎన్నన్నీ
వెలుగులోకి ఎన్ని చీకట్లోనే సమాధి ఎన్నో
సమిధలు గా ఎందరో!
ఓ సమస్య
ఓ హత్య
ఓ ఆత్మహత్య
ఆమెకే జరుగు అన్యాయం!!
రకరకాలు గా న్యాయం
రచ్చబండ నుండి న్యాయ స్థానం దాకా
వెల నుండీ వెలి దాకా
చిల్లి గవ్వ లేని ఆమెలు చెర లో
మగతనపు ప్రదర్శనల మంచాలెన్నో
కొట్టాలెన్నో మూగ గా రోదన
ఆమెల్లో ఆమెలు వేరనేది కళ్ళముందు!
ఏల?! అలా?!
ఏమిటీ వ్యత్యాసం?!
అదే హత్య!
అదే అంగాంగ దోపిడీ!
అదే చట్టం!!
ఆమె మారితే మారు చట్టం! మార్చురీ దాకా!!
సత్వర న్యాయం ఆమె ను బట్టి!
న్యాయం లో ఆమె కు తొలి శత్రువు సామాజిక నేపథ్యం
ఆమె బాహ్య ప్రపంచం ఓ కల
ఆమె నిటారుగా తల నిలిపితే అసహనం
ఆమె అక్షరం నేర్చితే ఆమె జాతినే ఉటంకించే నేల
ఆమె గళం విప్పితే విషం కక్కే సంఘం
ఆమెలందరూ ఒక్కటేననే రోజెన్నడో?!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~