“కోలాటం పాటలు – హాస్యం”(సాహిత్య వ్యాసం ) – ఇనపనూరి కిరణ్ కుమార్, పరిశోధక విద్యార్ధి,

కోలాటం అనేది ఒక అద్భుతమైన జానపద ప్రదర్శన కళారూపం. ఇది ఆట (నృత్యం), పాట (సాహిత్యం), సంగీతం అనే మూడు లలిత కళల సంగమం. చూడ్డానికి ముచ్చటగొలిపే ఆట, వినసొంపైన పాటలు, లయాత్మకమైన కోలల సవ్వడితో చూపరులకు వింతైన విశేషమైన అనుభూతిని కల్పించడం కొలటంలోని ప్రత్యేకత. ఒకప్పుడు రాజుల నుండి బంట్లు వరకు పండితుల నుండి పామురుల వరకు, పెద్దల నుండి పిల్లల వరకు అన్ని వర్గాల, వయస్సుల వారిని ఆకట్టుకున్న కోలాటం ఇప్పటికి అన్ని తరగతుల వారిని ఆకర్షిస్తూనే ఉన్నది. అన్ని తరగతుల వారు ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే అనాది కాలం నుండి తన అస్థిత్వమును, కళను కోల్పోకుండా మనుగడను కొనసాగిస్తున్న అరుదైన కళగా ప్రత్యేకతను సంతరించుకున్నది. అటు ఆడే వారిలోనూ ఇటు చుసే వారిలోనూ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపే కోలాటం పాటలలో ఉండే సాహిత్యంలో ఎంతో వస్తు వైవిధ్యం ఉంటుంది. వాటిల్లోని ప్రతిబింబించే హాస్యాన్ని గురించి పరిశీలించడం ఈ వ్యాసముఖ్యోద్దేశ్యం.

జానపద విజ్ఞానం :
ఆంగ్లంలోని “Folk Lore” అనే మాటకు సమానార్ధకంగా ‘జానపద విజ్ఞానం’ అనే మాటను వాడుతున్నాం. Folk Lore అనే రెండు శబ్దాల కలయిక వల్ల ఈ పదం ఏర్పడింది. ఈ పదాన్ని ఆంగ్లంలో విలియంథాంస్ (Willium Thoms) అను నతడు క్రీ.శ. 1846 సం,,లో “ది అథేనియం అనే పత్రికలో సూచించాడు. Folk అంటే నిరక్షరకుక్షులైన రైతులు, Lore అంటే విజ్ఞానం, Folk Lore అంటే అక్షర జ్ఞానం లేని పల్లె ప్రజల సాంప్రదాయ విజ్ఞానం.

“జనానామ్ పదమ్ జానపదమ్” జానపదం అనేది సంస్కృత శబ్దం. ఈ పదానికి పల్లె, గ్రామము, దేశము, జనులుండే తావు అనే అర్ధాలు గలవు. జానపదాలందు నివసించే వారే జానపదులు. వారికి సంబంధించిన విజ్ఞానమే జానపద విజ్ఞానం. “జానపద విజ్ఞానములో జానపదులకు సంబంధించిన విజ్ఞానమంతయు వచ్చి చేరుతుంది”.

నిర్వచనాలు :
కోలాట అనే పదానికి ‘కోల+ఆట’ అనేది వ్యుత్పత్తి. తమిళంలో ‘కోల+ఆట్టం’ –కోలట్టం’ అనేది వ్యుత్పత్తి. దీని నుంచి కోలాటం అనే పదం ఏర్పడింది. దండనర్తనం, దండరాసకం, దండలాసకం కోలంట్లు అనేవి కోలాటానికి పర్యాయపదాలు. కోలాటాన్ని తమిళంలో కోలాట్టం అని కన్నడంలో కోలాటం అనీ మలయాళంలో కోల్ కేళి అని వ్యవహరిస్తారు.

’కోల’ అనే పదానికి కర్ర, పుల్ల, దండము, కట్టే, కట్టియ, పుడక అనేవి పర్యాయపదాలు.
‘ఆట’ అనే శబ్దానికి క్రీడ,విహారం, లాస్యం, తాండవం, నటన, నర్తనం, నృత్యం, నాట్యం, విహారం అనేవి పర్యాయపదాలు.

“కోలాటం స్త్రీలు మరియు పురుషులు చేతి కొలలతో తాళము వేయుచు పాడుచు చుట్టును తిరిగి ఆడెడు ఒక విధమగు ఆట” – అని సూర్యరాయాంధ్ర నిఘంటవుతో నిర్వచించబడింది.

కోలాటం పాటల్లో హాస్యం:
కోలాటం పాటలన్నీ జానపద గేయాలే. జానపద గేయాలలో కన్పించే వస్తువైవిధ్యం, కోలాట పాటల్లోనూ కన్పిస్తుంది. కోలాటం పాటల్లోని హాస్య గేయాలు ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయని చెప్పవచ్చు.

నవరసాలలో ఒకటైన హాస్యం అనేది నవ్వును పుట్టించే, వినోదం కలిగించే ఒక కారకం. అది జీవితంలో ఎదురయ్యే నిస్తేజాన్ని, స్తబ్ధతలను పారద్రోలి మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పుట్టించే అపురూప సాధనం. అందుకే అది సాహిత్యంలోనూ, వ్యక్తుల దైనందిన జీవితంలోనూ, వ్యవహారాల్లోనూ, సినిమా, సామాజిక ప్రసార మాధ్యమాల్లోనూ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

హాస్యాన్ని మన అలంకారికులు “వికృతాకార వాగ్వేషచేష్టాదేర్నర్త కాద్భవేత్ హాస్యో హసస్థాయి భావ” అని నిర్వచించారు. వికృతమైన ఆకారము, వాక్కు వేషము, చేష్టలు మొదలైన వాటి యొక్క వేడుక వలన హాస్యము కలుగుతుంది. దానికి హాసము స్థాయి భావము. ఇటువంటి హాస్యము మన సాహిత్యములోనే కాదు ప్రపంచములోని అన్ని రకాల సాహిత్యాలలో స్థానాన్ని కల్గి ఉంది. మన శిష్ట సాహిత్యంతో పాటు జానపద సాహిత్యంలో కూడా హాస్యానికి సముచిత స్థానం కల్పించబడింది. కాకపొతే శిష్ట సాహిత్యంలోని హాస్యంతో పోల్చి చూసినప్పుడు సున్నితత్వంతో పాటు కాస్త మొరటుతనం ఎక్కువగా ఉంటుంది. జానపద సాహిత్యంలో జానపదుల జీవితాలలో కలిగే నవ్వు యే యే సందర్భాలలో, ఎలా పుడుతుందో అనే విషయం జానపద సాహిత్యంలో ప్రస్పుటమవుతుంది. కోలాటం పాటల్లో జానపదుల హాస్యం ఏ మేరకు ఉందో ఈ అధ్యాయంలో పరిశీలన చేద్దాం.

సాధారణంగా ఎవరైనా తీర్చలేని పెద్ద పెద్ద కోర్కెలను గాని, శక్తికి మించిన కోర్కెలు కోరితే వాటిని గొంతెమ్మ కోర్కెలు అని అంటాం. అలా కాకుండా కొంతమంది ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకనో లేక అడగడం తెలియకనో, అమాయకత్వం వల్లనో చిన్న చిన్న కోర్కెలు కోరుతుంటారు. కాని కొంతమంది పైకి అమాయకంగా కన్పిస్తూ చిన్న చిన్న తేలికైన కోరికలు కోరుతున్నట్లు అన్పించినా తీర్చే విషయానికొచ్చె సరికి ఎంతో మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి సర్వస్వం త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకు మంచి ఉదాహరణలుగా పురాణాలలో బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి ఉదంతాలను ఉటంకిస్తుంటాము. దీనికంతటికి కారణం పైకి అమాయకంగా కన్పించే గ్రహిత యొక్క మాయకత్వాన్ని అంచనా వేయలేకపోవడమే. దానివల్ల దాత మోసపోవడం జరుగుతుంది. అటువంటి అ’మాయక’ చక్రవర్తుల పట్ల చాలా జాగ్రత్త అవసరం అనేది గమనార్హమైన విషయం. ఈ క్రింది కోలాటం పాటలో కూడా పైకి మాత్రం ఏమి అడగడం తెలియని అమాయకురాలిగా కన్పించే మాయావి యొక్క స్వభావాన్ని వ్యగ్యంగా పాటరూపంలో వివరించే సందర్భం హస్యస్పోరకంగా ఉంటుంది. ఇది చక్కటి హాస్య గేయం కావడం వలన మంగళహారతి పాటను కోలాటంలో పాడుకుంటూ ఆటగాళ్ళు ప్రేక్షకులు కలిసి ఆనందిస్తుంటారు. పాటలోని పెండ్లి కొడుకు తరపున వారు ఏం కావాలో మీ పెండ్లి కూతురిని కోరుకోమనండి అనగానే, పెళ్లి కూతురు తరపున వారు ఇలా అడుగుతారు. మా పెళ్లి కూతురు చాలా అమాయకురాలు. ఖరీదైన వస్త్రాలు, పట్టుచీర, జకేట్టును కోరడం రాదు కాబట్టి పెళ్ళికొడుకు చొక్కా, పైపంచె లిప్పిస్తే వాటితో ఈ జాకెట్టు కుట్టించుకుంటుంది. వడ్డాణం కొనివ్వాల్సిన పనిలేదు, పెళ్లి కొడుకు మొలకున్న మొల్తాడిస్తే చాలు. దాన్ని చెడగొట్టి వడ్డాణం చేయించుకొంటుంది.

“అందరాల అడగనేరదు మా పెల్లి కూతురు
కొందరాల కొసరనేరదు మా పెల్లి కూతురు
నీ జుట్టు జునపాలు కోయించిపోరాదు సెడగొట్టి సవరాలు చేయించుకుంటాది
నీ కాళ్ళకున్న చెప్పులిచ్చిపోరాదు సెడగొట్టి జోళ్ళు చేయించుకుంటాది
నీ మొలకున్న మొలతాడు యిచ్చిపోరాదు సెడగొట్టి వడ్డానం సేయించుకుంటాది
నీ లాంచీపై పంచెలిచ్చిపోరాదు సెడగొట్టి జాకెట్లు కుట్టించుకుంటాది”

అంటూ తన కోర్కెల చిట్టాను తెలియజేస్తాడు. ఇప్పుడు ఈ పెళ్ళికూతురు కోర్కెలు తీర్చాలంటే పెళ్ళికొడుకు ఒంటిమీద ఉన్నవన్నీ విప్పి ఒట్టి దిసమొలతో నిలబడాల్సిందే. ఆ విషయం ఊహించుకుంటే, నవ్వు తన్నుకు వస్తుంటది ప్రేక్షకులకు. ఈ పాటలో ఉన్న వ్యంగ్యం వలన సున్నితమైన హాస్యం జనిస్తుంది. అనుకోని వంచన, ఊహించని పరిణామాలు ఎదుర్కొనడం వలన కూడా వికృతి పుట్టి నవ్వును తెప్పిస్తాయి. ఇటువంటి వాక్చాతుర్యాన్నే ‘ఛల’ అని అంటారు. “అన్యార్ధమేవ వాక్యం చలమభి సంధాన హస్యరోషకరం” శృంగార గేయాల కోవలోని ఈ పాటలో మోసం చేసిన వాళ్ళు తిరిగి మోసగించబడతారనే మాటకు అద్దం పడుతుంది. మొదట పరాయి పురుషుడి మాటలకు ఆకర్షితురాలైన వివాహిత తన ప్రియుడి కోసం అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలనే ఆలోచనతో ఒక ప్రణాళిక వేసి భర్తను చంపుతుంది. భర్తను అడ్డు తొలగించుకొని ప్రియుడి కోసం వచ్చినప్పుడు ప్రియుడి నుండి వచ్చిన ఊహించని సమాధానం ఈ పాటలో కొసమెరుపు. దీని వల్ల వికృతి పుట్టి హాస్యం జనించింది.

“ఆకు వక్క, గన్నేరు చెక్క
కల్లులోన గలిపిపోయమ్మో మాలపిల్లా
పోయనైతే పొసా సావనైతే సచ్చిండు
నా బతుకేంటయ్యో రొంపరయ్యా
చిప్ప, కర్ర చేతబట్టి అడుక్కొని తినమో మాలపిల్లా”
చివరకు ‘ఉండదిబోయే, ఉంచుకున్నది బోయే’ అనే సామెతలా ఉంది వివాహిత పని.
హాస్యాన్ని పుట్టించడంలో అధిక్షేప విధానము కూడా ఉత్తమమైనది. ఒక వ్యక్తిని గాని, ఒక సంస్థను గాని, ఒక సంఘమును గాని, జాతిని గాని, మూడాచారములను గాని హేళన చేయడం అదిక్షేప రచనలని అంటారు. అధిక్షేప సాహిత్యము మన సాహిత్యము కంటే పాశ్చాత్య సాహిత్యంలో ఎక్కువ శాతం ఉంది. తెలుగులో చాలా తక్కువ సాహిత్యం ఉందనేది అందరికీ విదితమే. జానపద సాహిత్యంలో అక్కడక్కడ కొన్ని కన్పిస్తుంటాయి. కోలాటంలో ఈ క్రింది అధిక్షేప గేయం ఒకటి హస్యస్పోరకంగా ఉంటుంది.
సాధారణంగా జానపదుల్లో పెండ్లి విషయంలో ఎంత ఎక్కువ కట్నం తీసుకుంటే పెండ్లి కొడుకుని అంత గొప్పగా, విలువగా భావిస్తుంటారు. ఒక వేళ ఎవరైనా కట్నం తక్కువ పుచ్చుకుంటే వారిని విలువ తక్కువగా పరిగణిస్తారు. వారిని అసమర్ధులుగా జమ కడతారు. ఈ గేయంలో తమ సోదరిమణులే తమ్ముడు కట్నం మరియు ఆడబిడ్డ కట్నం సరిగా తెచ్చుకోలేని అసమర్ధుడు, అమాయకుడు అనే భావనతో హేళన చేస్తూ ఉండటం కన్పిస్తుంది.

“తమ్ముడా మీ యత్తగారు యేమేమి కట్నాలు యిచ్చిరి
ముల్లులేని వాచీ పెడితే అంతేచాలు ననుకుంటివా
ఆడబిడ్డ కట్నమేమో అడగలేకపోతివా
తమ్ముడా మీ అత్తగారు ఏమేమికట్నాలు ఇచ్చిరి
అంచులేని పంచ పెడితే అంతేచాలు ననుకొంటివా”
అత్తగారు పెట్టిన వస్తువులు ఏ ఒక్కటి సరిగాలేవు. వాచీకి అసలు ముల్లేలేదు. పంచెకేమో అసలు అంచే లేదు అయినా వాటిని స్వికరించావు అమాయకత్వంతో, అనే అవహేళన చేశారు. ముల్లులేని వాచితో, అంచులేని పంచెతో ఆకార వికృతి వలన హాస్యం పుడుతుంది. ఇది ఆలంబన వర్ణనము వలన కలిగే హాస్యము. అమాయకత్వం అనే ఆలంబనము వలన కలిగే వికృతి ఫలితాలు వలన హాస్యం పుట్టింది.

చమత్కారం వలన (విట్) హాస్యము కల్గుతుంది. సంవాద శృంగార గేయంలో ప్రియుడితో తప్పు చేసిన వివాహిత తన భర్తకు దొరికిపోకుండా తనకు ఎదురు కాబోయే ప్రశ్నలకు అతికే సమాధానాలను ఎంత తెలివిగా చమత్కారంగా సిద్దం చేసుకుంటుందో క్రింది గేయంలో చూస్తే నవ్వు పుట్టక మానదు. అందుకు తన ప్రియుడు సహకరించడం, సమాధానాలను సిద్ధం చేసుకోవడం అనేవి ఉన్నాయి.

“నొసటి కుంకుమ సెరిగెర సెలికాడ
రాజడిగితేమందును
సిరిసేమటబోసేననవె సినదాన
కుంకుమా సెరిగిననవే
“కళ్ళు కాటుక సెరిగెరా సెలికాడ
రాజడిగితేమందును
కన్నదారోచ్చేననవే సినదాన
కన్నీరు వొలికెననవే
వొల్లంత రక్తమాయే సెలికాడ
రాజడిగితేమందును
మన యిల్లు సీకటనవే సినదాన
మన పిల్లి గీరేననవే’
“రంకు నేర్సినమ్మ బొంకు నేరుస్తుంది” అనే సామెతకు అద్దం పడుతుంది ఈ గేయం.

కోలాటం అనేది సమాజానికి వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచి ఇచ్చే కళ. కోలాటంలో పాడుకొనే ప్రతి గేయం జానపద గేయమే. కాబట్టి కోలాటం పాటలు నిష్కల్మమైన జానపదుల హృదయాన్ని, కల్లాకపటం తెలియని, వాస్తవికమైన జీవితాన్ని తెలియజేస్తాయి. వారి జీవితాలలో తొంగిచూసే హస్యస్పోరక సన్నివేశాలు, చమత్కార సంభాషణలను కోలాటంలో హస్యగేయలు అద్దం పడతాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ఉపయుక్త గ్రంథాలు
1. ఎల్లోరా “జానపద సాహిత్యం” 1982 హైదరాబాదు
2. కృష్ణకుమారి నాయని “తెలుగు జానపద విజ్ఞానం – సమాజం – సంస్కృతి – సాహిత్యం”
3. మోహన్ జి.యస్. “జానపద విజ్ఞానాధ్యయనం”
4. రామరాజు బి. కృష్ణకుమారి, నాయని “జానపద గేయాల సాంఘిక చరిత్ర”
5. సుందరం, ఆర్.వి.యస్. తెలుగు కన్నడ “జానపద గేయాలు”
6. గంగప్ప యస్ – “జానపద సాహిత్య సంపద – కోలాటం పాటలు”
7. రామయ్య పంతులు, జయంతి “సూర్యరాయాంధ్ర నిఘంటువు”

-ఇనపనూరి కిరణ్ కుమార్,

పరిశోధక విద్యార్ధి,

ఉస్మానియా విశ్వ విద్యాలయం,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

సాహిత్య వ్యాసాలు ​, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో