ఒకరివెంట ఒకరు అతని చేయి పట్టుకుని విష్ చేస్తుంటే శరీరం మొత్తం నరికేసినట్లైంది. భూమిని చీల్చుకొని పాతాళంలోకి జారుతున్నట్లు అన్పించింది.
ఇన్ని రోజులు తను జయంత్ గానే బ్రతికాడు. జయంత్ గానే ఎదిగాడు. జయంత్ గానే ఆఫీసులో కష్టపడుతున్నాడు. కారుంది. ఇల్లుంది. ఈ గౌరవం చాలు తనకి. కొత్తగా రచయిత్రి భర్తగా తనకి గుర్తింపు రావడం ఏంటి? తనకెందుకీ గుర్తింపు. ఇది తన మనస్తత్వానికి విరుద్దమైనది. వ్యక్తిత్వాన్ని పాతిపెట్టేది.
“ఏంటండీ ఆలోచిస్తున్నారు?” భర్తనే చూస్తూ అడిగింది సంలేఖ.
చేతిని నుదుటి మీద పెట్టుకొని “ఏం లేదు” అన్నాడు.
“ఏదో వుంది. మీరెప్పుడూ ఇంత డిస్టర్బడ్ గా లేరు” అంది.
“నువ్వనేది నిజమే! నేను సంలేఖ భర్తనట. అంతా అంటున్నారు నా ముందే” అన్నాడు.
ఆమె నవ్వి ”కాదని ఎవరన్నారు? మీరు మామూలు సంలేఖ భర్త కాదు. ద గ్రేట్ గ్రేటెస్ట్ వర్త్ ఫుల్ రైటర్ భర్త” అంది.
అతను నవ్వకుండా సీరియస్ గా చూసాడు. లేచి కూర్చున్నాడు.
“నువ్వు కూడా ఆ మాట అన్నావంటే చెంప పగిలిపోద్ది. నాకలాంటి గ్రేట్ గ్రేటెస్ట్ లు అవసరం లేదు” అన్నాడు.
అదిరిపడి చూసింది సంలేఖ.
“చూడూ! నువ్వు ఈ జయంత్ కి భార్యవి. ఆఫీసులో కాని, బయట కాని నేను జయంత్ గానే ప్రజెంటవ్వాలి. సంలేఖ భర్తగా కాదు” అన్నాడు.
ఏం మాట్లాడాలో తెలియక అలాగే చూస్తోంది.
“ఏంటా చూపు? నేను చెప్పేది అర్థం కావటం లేదా?”
“మీరిలా మాట్లాడతారంటేనే నమ్మలేకపోతున్నాను. ఒక చార్టెర్డ్ అక్కౌంటెంట్ గా మీకుండే గుర్తింపు మీకుంది. నావల్ల కొత్తగా మీకొచ్చేదంటూ ఏం లేదు. ఆకలిగా వుంది. రండి! భోంచేద్దాం!” అంది.
ఆమె ఎంత సౌమ్యంగా మాట్లాడినా అతని అహం సంతృప్తి చెందటం లేదు.
“నీ భార్యకి నీ ఇంట్లోనే కాక బయట కూడా చాలా గుర్తింపు వచ్చింది జయంత్” అన్న ఫ్రెండ్ మాటలు గుర్తొచ్చి బాధపెడుతున్నాయి.
“ఎంతయినా రైటర్స్ కి ఓ ఇమేజ్ వుంటుంది జయంత్! వాళ్లు మాట్లాడకుండా అక్షరాలతో మాట్లాడిపిస్తారు. ఏం చేయాలన్నా అక్షరాలతోనే చేస్తుంటారు. అందుకే ఆ అక్షరాలు వాళ్ల పేరును వెంటేసుకొని ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంటాయి. ఆపటం కష్టం. మనం ఎంత కష్టపడి పనిచేసినా అలా వుండదు. వున్నచోటే వుంటాం! అలా అని వాళ్లు చేస్తున్న వర్క్ ని మనం చెయ్యలేం” అన్న వాళ్ల సుపీరియర్ మాటలు గుర్తొచ్చాయి.
పక్కవాళ్లు ఏమైనా పర్వాలేదు నేను మాత్రమే ఎదగాలనుకునే జయంత్ ఇప్పుడు తన భార్యకి పేరొస్తే తనకి వచ్చినట్లే అని ఎలా తృప్తిపడతాడు? అసలు సంలేఖను పెళ్లి చేసుకోవడం వల్లనే తనకి ఈ తలనొప్పి అనుకున్నాడు. తనకి వున్న ప్రశాంతత అంతా సంలేఖ వల్లనే పోయిందనుకున్నాడు. కట్టెలు కాలేకొద్ది మంటలు ఎగసినట్లు అతని మనసంతా కొద్దికొద్దిగా మంటలు ఆక్రమించుకుంటున్నాయి. ఆమె పేరు బయట విన్పించకుండా మంత్రించినట్లు ఆగిపోతే బావుండని కూడా మనసులో అనుకుంటున్నాడు.
“రండి! భోంచేద్దాం!” మళ్ళీ పిలిచింది సంలేఖ.
“పార్టీకి వెళ్లినట్లు చెప్పాను కదా! నువ్వెళ్లి తినేసిరా!” అన్నాడు లోపల రగిలే అగ్నిని పైకి కన్పించనీయకుండా.
“కనీసం కంపెనీ కోసమైనా నాతో వచ్చి కూర్చోండి! ఇవాళ సభలో జరిగిన విశేషాలను మీతో చెప్పుకుంటూ తింటాను. అసలు వాళ్లంతా నా రచనల్ని ఎంత పొగిడారో తెలుసా? ఒక్కో అక్షరాన్ని పేర్చుకుంటూ నేను రాసిన వాక్యాలు చెక్కిన శిల్పాల్లా వుంటాయట. వాటిని చదువుతుంటే ప్రాణం పోసుకున్న పక్షిపిల్ల మనసులోతుల్లోకి వెళ్లి గిలిగింతలు పెట్టినట్లు అన్పిస్తాయట. నాలోంచి వచ్చే ప్రతి అక్షరం చాలా విలువైందట” అంది.
జయంత్ అసహనంగా చూసాడు.
“అవన్నీ ఎవరిక్కావాలిప్పుడు? అవతలకిపో!” అని కసురుకున్నాడు.
అతను నెట్టకపోయినా నెట్టినట్టే వెళ్లింది. ఆమె మనసంతా మబ్బులు నిండిన ఆకాశంలా మసగ్గా మారింది.
ఒకప్పుడు ఇదే జయంత్ పుస్తకాల పురుగు. ఏమాత్రం ఆదమరచినా చదివిన అక్షరాలు అవతలకెళ్లి పోతాయని చదువుతున్నంత సేపు తపస్సు చేస్తున్నవాడిలా వుండేవాడు. పక్కవాళ్లను పట్టించుకునేవాడు కాదు.అదంతా కేవలం ర్యాంక్ కోసమే! ఉద్యోగం వచ్చాక ఆ అక్షరాలతో అతనికి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడున్న ఈ స్థాయి అతనికి ఆ అక్షరాలు ఇచ్చిందే అన్నది పూర్తిగా మరచిపోయాడు. అలాంటి అతని ముందు కూర్చుని అక్షరం బ్రహ్మస్వరూపమని, అండపిండాది అనేకం నిండిన ఈ మహా బ్రహ్మాండమంతా అక్షరం నుండే ఆవిర్భవించిందని. అందులో తనలాంటి వాళ్ల అక్షరాలు కూడా వుంటాయని చెబితే వినటానికి అతనేమైనా తన పాఠకుడా? తన రచనల్ని ఆరాధించే అభిమానా? అనువుగానిచోట అధికులమని ఎప్పుడూ చెప్పుకోకూడదట.
ఆమెకు ఆకలి పూర్తిగా చచ్చిపోయింది.
ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసి, అందులో వున్న నీళ్లను గడగడ తాగి ఆ నీళ్లతోనే కడుపు నింపుకుంది.
వెళ్లి భర్త పక్కన పడుకుంది. నిద్రరావడం లేదు. లేచి కూర్చుని రాసుకుందామన్నా మనసు బాగా లేదు. ఎందుకో ఏమో ప్రపంచం మొత్తం మెచ్చుకున్నా భర్త దాన్ని గుర్తించకపోతే స్త్రీ హృదయం తృప్తిపడదు.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~