కోలాటం పాటలు – మనో విశ్లేషణ (సాహిత్య వ్యాసం ) -ఇనపనూరి కిరణ్ కుమార్


మానవ స్వభావం గురించి తెలియజేసేది మనస్తత్వశాస్త్రము. ఈ మనస్తత్వశాస్త్రం దాదాపు అన్ని మానవ కార్యకలాపాలతో సంబంధం కల్గి ఉంటుంది. అంటే మనస్తత్వశాస్త్ర ప్రభావంలేని మానవ కార్యకలాపాలు ఏమీ ఉండవన్నమాట. కాబట్టి మానవ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న ప్రతి రంగంలోనూ మనస్తత్వశాస్త్ర ప్రమేయం ఉంటుందనేది స్పష్టమైన విషయం. విద్య, వైద్యం, సాహిత్యం, పరిశ్రమలు మొదలైన అనేక రంగాలలో మనస్తత్వశాస్త్రం నేడు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచ సాహిత్యంలోని అనేక అంశాలను మనోవిజ్ఞానశాస్త్ర దృక్పథంతో అధ్యయనం చేయడం విస్తృతంగా జరుగుతుంది. ఇటీవల తెలుగు సాహిత్యంలో అనగా శిష్ట, జానపద సాహిత్యాలలోని అనేక ప్రక్రియలను మనస్తత్వశాస్త్ర కోణంలో పరిశీలన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జానపద విజ్ఞానంలో కథ, పొడుపు కథ, గేయం, సామెతలు మొదలైన అంశాలపై మనస్తత్వశాస్త్ర విశ్లేషణలు చేశారు కొంతమంది. ఈ నేపథ్యంలోనే జానపద సాహిత్యంలో ప్రధానాంగమైన జానపద గేయాల విభాగంలోని కోలాటం పాటలను మనోవిశ్లేషణ సిద్ధాంతం ఆధారంగా పరిశీలించి, విశ్లేషణ చేసి వాటిలోని మనస్తత్వ సంబంధమైన విశేషాలను తెలియజేయడం ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం.

‘‘మానవ ప్రవర్తన, అనుభవాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం’’. మనోవిజ్ఞాన శాస్త్రంలో మానవ స్వభావాన్ని గురించి వివరించే సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. వాటినే మూర్తిమత్వ సిద్ధాంతాలు అని అంటారు. వ్యక్తి మూర్తిమత్వం అనగా వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలన్నిటితో కూడిన సంపూర్ణ ప్రవర్తన. ఇలాంటి మూర్తిమత్వంను గురించి వివరించడానికి మూడు రకాలైన సిద్ధాంతాలున్నాయి. అవి 1. రూపురేఖా సిద్ధాంతాలు, 2. లక్షణాంశ సిద్ధాంతాలు, 3. నిర్మితి సిద్ధాంతాలు. వీటిల్లో వ్యక్తి యొక్క మనస్సును సమగ్రంగా వివరించే సిద్ధాంతాలుగా ప్రసిద్ధి చెందినవి నిర్మితి సిద్ధాంతాలు. ఈ నిర్మితి సిద్ధాంతాలలో ప్రధానమైనది. మనో విశ్లేషణ సిద్ధాంతం. ఈ మనో విశ్లేషణా సిద్దాంతాన్ని ప్రతిపాదించినవాడు ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక వైద్యుడు సిగ్మండ్‌ ప్రాయిడ్‌. దీనిని మొదట మానసిక రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగించినా తర్వాత తర్వాత అది వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడానికి ఉపయోగపడుతుంది. వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడంలో ఈ సిద్ధాంతం సమగ్రమైనదిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.
సిగ్మండ్‌ ప్రాయిడ్‌ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మూడు అంశాలుంటాయి. అవి 1. మూర్తిమత్వ నిర్మాణం, 2. మూర్తిమత్వ గతిశీలత, 3. మనోలైంగిక వికాసం.

I. మూర్తిమత్వ నిర్మాణం :

ప్రాయిడ్‌ మూర్తిమత్వ నిర్మాణ సిద్ధాంతం అనేది మూర్తిమత్వంను వివరించే సిద్ధాంతాలలో ప్రధానమైనదిగా చెప్తారు. దీనిలో 1. ఇడ్‌ (అచిత్తు), 2. ఈగో (అహం), 3. సూపర్‌ఈగో (అధ్యహం) అనేవి ఉప అంశాలు ఉంటాయి. వీటిల్లో మొదటిది ఇడ్‌ దీనినే అచిత్తు అంటారు. ఇది ప్రతి మనిషికీ పుట్టుకతోనే వచ్చే గుణం. దీనిలో సహజసిద్దమైన జంతు స్వభావం, విచక్షణలేని కోర్కెలు, దౌర్జన్యశీల గుణాలు మొదలైనవి ఉంటాయి. ఇది చాలా చెడ్డది. ఆనందం, సంతృప్తి దీని ధ్యేయాలు. అనైతికంగానైనా సరే వాటిని పొందుకోవాలని ప్రేరేపిస్తుంది. ఇది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. రెండవది ఈగో. దీనినే అహం అని అంటారు. సాంఘిక అనుభవాల ద్వారా, శిక్షణ ద్వారా, అచిత్తు మార్పు చెంది అహంగా మారుతుంది. అహం కోరికలను అచిత్తువలె మొరటుగా, విచక్షణారహితంగా కాకుండా సమయానుకూలంగా, సందర్భానుసారంగా వాస్తవికత ఆధారంగా సాధిస్తుంది. అచిత్తును నియంత్రిస్తూ వ్యక్తిలో కార్యనిర్వాహకుడిగా పనిచేస్తుంది. ఇక మూడవ దానిని సూపర్‌ ఈగో లేదా అధ్యహం అని అంటారు. ఇది అహంను పర్యవేక్షిస్తుంది. ఇది ఆదర్శ సూత్రాన్ని పాటిస్తుంది. దీనిని వ్యక్తిలోని అంతరాత్మ అని చెప్తారు. ఇది నైతిక విలువలను పాటిస్తుంది. విద్యవలన కాని, ఉపాధ్యాయ, పెద్దల శిక్షణ వలన లేదా సాంఘిక అనుభవాల వలన గాని ఇది వికసిస్తుంది.

II. మూర్తిమత్వ గతిశీలత :

వ్యక్తి మూర్తిమత్వంను వివరించడానికి ఈ సిద్ధాంతం ఎంతగానో దోహదపడుతుంది. వ్యక్తి మనసులో ఉండే మూడు రకాలైన విభాగాల ద్వారా కలిగే అనుభవాలు వ్యక్తి మూర్తిమత్వ గతిశీలతకు కారణమౌతాయి అవి.
1. చేతనం (Concious)) : ఇది వర్తమాన అనుభవాలను కలిగి ఉండే మనస్సు. ఇది తక్షణమే గుర్తు తెచ్చుకోగల అనుభవాలను కలిగి ఉంటుంది.
2. ఉపచేతనం (Sub Concious) : ఇది వ్యక్తి అనుభవాలను దాచుకుంటుంది. గతంలో పొందిన అనుభవాలను కొంచెం ప్రయత్నంతో గుర్తుకు తెచ్చుకోగల మనస్సు.
3. అచేతనం (Un Concious) : అవసరం ఉన్నా, ఎంత ప్రయత్నించినా, గుర్తుకురాని అనుభవాలు, విషయాలు దీనిలో ఉంటాయి. దీని ప్రభావం వ్యక్తిమీద ఎక్కువగా ఉంటుంది. సాధించలేనివి, తీరని కోరికలు, బాధాకరమైన అంశాలు, అనుభవాలు దీనిలోకి బలవంతంగా నెట్టివేయబడి అణచి వేయబడి ఉంటాయి. ప్రాయిడ్‌ సిద్ధాంతానికి ఈ అచేతనే మూలాధారం. వ్యక్తి మూర్తిమత్వంలో ఎక్కువశాతం అచేతనపాత్ర ఉంటుంది. చేతన, అచేతనల్లో అచేతనానిదే ప్రధానపాత్ర అంటాడు ప్రాయిడ్‌.

III. మనోలైంగిక వికాస సిద్ధాంతం :

మానవునికి పుట్టుకతోనే లిబిడో అనే లైంగిక సహజాతం ఉంటుంది. ఈ లిబిడో అనేది ప్రాయిడ్‌ చెప్పిన ఐదు దశల గుండా ప్రయాణం చేస్తుంది. ఆయా దశలలో లిబిడో స్థిరీభవనం చెందినట్లయితే మంచి వ్యక్తులుగా పరిణితి చెందుతారు. లేదంటే వారిలో చెడ్డ లక్షణాలు చోటు చేసుకుంటాయని చెప్పాడు. ఈ సిద్ధాంతంలోనే ప్రాయిడ్‌ ఈడిపస్‌ కాంప్లెక్స్‌, ఎలక్ట్రా కాంప్లెక్సు అనే సిద్ధాంతాలను ప్రతిపాదన చేశాడు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందినవి. ఈ సిద్ధాంతంలో లిబిడో అంటే లైంగిక వాంఛను స్త్రీ, పురుష సంబంధంగానే కాక వాత్సల్యం, అభిమానం, అనురాగం అనే ప్రేమతత్వంగా విస్తృతమైన అర్థంలో ఉపయోగించాడు.

ఈ విధంగా ఇలాంటి సిద్ధాంతాలతో మనిషి మనస్తత్వ లోతుల్ని తరచి చూసి మానసిక విశ్లేషణ చేసి మూర్తిమత్వంను గురించి సమగ్రంగా చెప్పవచ్చునని క్రొత్త మార్గాన్ని ప్రపంచానికి చూపించాడు ప్రాయిడ్‌.
మనస్తత్వ విశ్లేషణలో ప్రాయిడ్‌ శిష్యులైన అలెఫ్రెడ్‌ అడ్లర్‌, కార్ల్‌, జె.యాంగ్‌లు చేసిన సిద్దాంతాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. ఆల్‌ఫైడ్‌ అడ్లర్‌ మానవ జీవితంలో ఏర్పడే మానసిక సంఘర్షణలకు కారణం అతని ప్రేరేణలు (డ్రైవ్స్‌) కారణమౌతాయని చెప్పాడు. మనిషిలో అంతర్గతంగా అందరికన్నా తాను ఉన్నతుడై ఉండాలని, ప్రత్యేకంగా కన్పించాలనే కోరిక ఉంటుంది. నిజ జీవితంలో అది సాధ్యంకాకపోతే అతడు సంఘర్షణకు లోనౌతాడని, తద్వారా అసంతృప్తి ఏర్పడుతుందని అడ్లర్‌ వివరించాడు. మనో విశ్లేషణకు మనిషిలో కలిగే ఆధిక్యతాభావం, న్యూనతాభావాలు ప్రధానమైనవని తెలియజేశాడు.
కార్ల్‌యాంగ్‌ సైకో ఎనాలిసిస్‌ (విశ్లేషణాత్మక మనో విజ్ఞానం) అని అంటారు. దీని ప్రకారం అచేతన విభాగాన్ని వైయుక్తిక అచేతన, సామూహిక అచేతన అని రెండు విభాగాలుగా విభజించాడు. ఈ అచేతనలో పశు వృత్తికి సంబంధించిన, అవినీతికి సంబంధించిన భావాలే కాక నైతికతకు, సంస్కృతికి సంబంధించిన ఎన్నో భావాలు ఉంటాయని చెప్పాడు.

జానపద గేయాలను మనో విశ్లేషణ సిద్ధాంతాలతో, పరిశీలన చేయడం ద్వారా ఆ గేయాలలో ప్రతిబింబించే వ్యక్తిగత, సామూహిక ప్రవర్తనలను, అనుభవాలను, మనస్తత్వాలను, అధ్యయనం చేసి వారి వ్యక్తిత్వాలను తెలుసుకోవచ్చు. కోలాటం పాటల్లోని సంవాద గేయాలు, కథా గేయాలను పరిశీలన చేసినప్పుడు జానపదుల హృదయగతమైన సంఘర్షణలు, అందుకు కారణమైన అంశాలను విశ్లేషణ చేసి తెలుసుకోవచ్చు. ‘‘ఏడుగురు అన్నలకు సెల్లెలొకతె’’ అనే కోలాటం కథాగేయంలో ఏడుగురు అన్నలతోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలని ఎక్కడో దూరదేశాన ఇచ్చారు కొన్నాళ్ళకు పూరిగుడిసెలో ఉంటున్న చెల్లెలి ఇంటికి అన్నలొచ్చారు చూడ్డానికి. వచ్చిన అన్నలకు అన్ని మర్యాదలు చేసింది. ఎందుకో గాని ఉన్నట్టుండి ఒక్కతే ఇంటెనక్కు వెళ్ళి ఏడవసాగింది. అందులోనున్న వాళ్ళ చిన్నన్న చూసి తన చెల్లెలి ఆవేదనకు కారణమడిగాడు. కాని చెల్లెలు దాటవేసింది కారణం చెప్పకుండా. ఏదో సమస్యను ఊహించిన తన అన్నలు చెల్లెలను పుట్టింటికి తీసుకెళ్ళి మెల్లగా విషయం తెలుసుకుందామని పుట్టింటికి పంపమని అత్తమామల్ని అడగమని చెప్తారు. అప్పుడు ఆ చెల్లెలు.

అరుగుమీదనున్న ఓ అత్తగారు గుమసారి గుండమ్మ
మా అన్నలొచ్చారు మము పంపగలరా గుమసారి గుండమ్మ
అట్లయితే నేనెరుగ మీ మామనడుగు గుమసారి గుండమ్మ
మంచంలో బడుకొన్న ఓ మామగారు గుమసారి గుండమ్మ
మా అన్నలొచ్చారు మము పంపగలరా గుమసారి గుండమ్మ
అట్లయితే నేనెరుగ మీ బావనడుగు గుమసారి గుండమ్మ
బారతాలు సదివేటి ఓ బావగారూ గుమసారి గుండమ్మ
మాయన్నలొచ్చారు మము పంపగలరా గుమసారి గుండమ్మ
అట్లైతే మీ తోడి కోడల్లనడుగు గుమసారి గుండమ్మ
తోటకూర కోసేటి ఓ తోడికోడల్లారా గుమసారి గుండమ్మ
మా అన్నలొచ్చారు మము పంపగలరా గుమసారి గుండమ్మ
ఎలితే ఎల్లేవు గాని మల్లెపుడొత్తావు గుమసారి గుండమ్మ
మెల్లోని తాలిబొట్టు పెరిగిన నాడు గుమసారి గుండమ్మ
నుదుట కుంకుమ సెరిగిననాడు గుమసారి గుండమ్మ

పై గేయంలో చివరి రెండు పాదాలలో ఏ భార్యా అనని, అనకూడని మాట అనేసింది గుమసారి గుండమ్మ. పుట్టింటికి వెళ్ళడానికి భర్త లేదా ఇంటి పెద్దలైన అత్తమామమల అనుమతిని తీసుకోవడం జానపద సమాజంలో పరిపాటి. మర్యాద, గౌరవం కూడా. అలా అని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా తోటికోడళ్ళ వద్ద ఒక వేళ అలా అడగవలసి వచ్చినా అది అంత పెద్ద బాధాకరమైన విషయమేమి కాదు. ఇక్కడ గుమసారి గుండమ్మకు అదే పరిస్థితి ఎదురైంది. కాని ఈ మాత్రం దానికే తన భర్త చావును నిర్ద్వంద్వంగా కోరడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అలా అనిపించానికి కారణం గేయంలో యదార్థంగా జరిగిన దానిని బట్టి మనకు గుమసారి గుండమ్మ చేతన మనస్సులోని అప్పటి ప్రవర్తన మాత్రమే తెలిసే అవకాశం ఉంది. అసలు కారణాలు మనకు పైకి కన్పించవు. అవి తన అచేతన మనస్సులో దాచబడి, అణచబడి ఉన్న సంగతులు ఎంతో కాలంగా తన భర్తపై తన అచేతనంలో గూడుకట్టుకొని ఉన్న తీవ్రమైన అసంతృప్తి, కసి, ఉక్రోషం, కోపం, బాధ మొదలైన భావోద్వేగాలెన్నో ఆ సందర్భంలో బ్రద్దలై అంత పెద్ద నిర్ణయానికి ప్రేరేపించినాయి. అందుకే ప్రాయిడ్‌ మనకు బయటకు కన్పించే చేతనం, కన్పించని అచేతనాల గురించి ఇలా ఉదహరిస్తాడు. ఐస్‌బర్గ్‌ సముద్రంలో తేలుతున్నప్పుడు పదింట ఒక వంతు మాత్రమే పైకి కన్పిస్తుంది. మిగతా తొమ్మిది వంతులు కనబడకుండా ఉంటుంది. అదే విధంగా మనిషి చేతనలోని మనస్తత్వం అతి స్వల్పంగా మాత్రమే మనకు తెలుస్తుంది. ఎక్కువభాగం అచేతనలో ఉండిపోతుంది.

అడ్లర్‌ ప్రకారం మనిషిలో ఆధిక్యతాభావం, న్యూనతాభావాలు ఉంటాయి. వాటిమధ్య జరిగే సంఘర్షణలు అంత:ప్రేరణలకు కారణాలవుతాయి. ఈ భావాలు మనిషి వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తాయి. మనిషిలో అందరికన్నా తాను ఉన్నతుడై ఉండాలని, అందులో ప్రత్యేకంగా కనబడాలనే కాంక్ష బలంగా ఉంటే అది నిజ జీవితంలో సాధ్యం కాకపోతే అతడు సంఘర్షణకు గురై అసంతృప్తికి లోనవుతాడు అని అంటాడు. ఏడుగురు అన్నలకు తోడబుట్టిన ఒక్కతే చెల్లెలు కాబట్టి ఎంతో గారాబంగా పెరిగి ఉండటాన ఆమెలో చిన్నప్పటి నుండి ఆధిక్యతాభావం చోటు చేసుకుని ఉండొచ్చు. లోకరీతిలో ఒక సామెత ఉంది. ‘‘మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోడికోడలు తొంగి చూసినందుకు’’ అని. ఈ సామెత వల్ల తోడికోడళ్ళ మధ్య ఆధిక్యతా భావాలు తప్పనిసరిగా ఉంటాయని స్పష్టమౌతుంది. అడ్లర్‌ చెప్పినట్లు గుమసారి గుండమ్మ తన తోడికోడళ్ళ వద్ద అనుమతి తీసుకోవాల్సి వచ్చినందుకు ఆమెలోని ఆధిక్యతాభావం దెబ్బతినడం వల్ల (అంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుని ఉండవచ్చు) మానసిక సంఘర్షణకు, అసంతృప్తికి గురై విపరీతమైన ప్రవర్తనను కనబరిచి ఉంటుంది.

ప్రాయిడ్‌ ఈగో నాణ్యతపై వ్యక్తి యొక్క స్వభావం ఆధారపడి ఉంటుంది అంటారు. ఇడ్‌, సూపర్‌ ఈగోల మధ్య ఎల్లప్పుడూ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ రెండిరటి మధ్య రాజీని కుదిర్చి ఎప్పుడు ఏమి చెయ్యాలో నిర్ణయించేది ఈగో. అందుకే ఈగోని కార్యనిర్వాహకుడు అని అంటారు. వ్యక్తిలోని ఈగో నాణ్యత కలిగి ఉంటే సూపర్‌ ఈగోను అనుసరిస్తూ ఎల్లప్పుడూ మంచి నిర్ణయాలు, మంచి పనులు చేస్తూ మంచివాడుగా ఉంటాడు. ఈగో నాణ్యత లేనిదైతే ఇడ్‌ను అనుసరిస్తూ చెడ్డపనులు చేస్తూ చెడ్డవాడుగా మిగిలిపోతాడు.

ప్రాయిడ్‌ చెప్పిన మనో విశ్లేషణ విధానంలోని మూర్తిమత్వ సిద్ధాంతానికి అద్దం పట్టే సంవాద గేయాలు కొన్ని కోలాటంలో ఉన్నాయి. ఈ క్రింది కోలాటం పాటలో ఇడ్‌, ఈగో స్వభావాలకు విటుడు, సూపర్‌ఈగో స్వభావానికి సెంచిత నిలయాలుగా కన్పిస్తారు.

‘‘పొద్దు సేలోబోయె పావాలె పల్లెలకు
దారిసూపు మిత్రమా స్వామి గోడుగోడునా సీకటి
సన్నబియ్యమిస్త ఈ పార్వతడవిలో
ఉండరాదా సెంచీతా నువ్వు నిలువలేవా సెంచీతా
బొంగుబియ్యం తినే మా సెంచు వారలము
సన్నబియ్యమబ్బునా సామి గోడు గోడునా సీకటి
మేడమిద్దెలిస్తా ఈ పార్వతడవిలో
ఉండరాదా సెంచీతా నీవు నిలువలేవా సెంచీతా
పూరి గుడిసెలో ఉండే మా సెంచువారలము
మేడమీద్దెలబ్బునా సామి గోడుగోడునా సీకటి
పట్టుసీరలిస్తా ఈ పార్వతడవిలో
ఉండరాదా సెంచీతా నువ్వు నిలువలేవా సెంచీతా
నారసీరలు గట్టె మా సెంచువారలము
పట్టుసీరలబ్బునా సామి గోడుగోడున సీకటి’’

మనుచరిత్రలోని ప్రవరుడి అవస్థలా ఉంది ఈ పాటలోని సెంచిత పరిస్థితి. వరూధినిని పోలినట్టు విటుడు ఉంటాడు. సిగ్మండ్‌ ప్రాయిడ్‌ ప్రకారం మనిషి వ్యక్తిత్వం అతని ఈగో నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఈగో నాణ్యతను కల్గి ఉంటే అది సూపర్‌ ఈగోను అనుసరిస్తూ వ్యక్తిని మంచివైపు నడిపిస్తుంది. ఈగోకి నాణ్యత లేనట్లయితే అది బలహీనపడి ఇడ్‌ను అనుసరిస్తూ మనిషిని చెడువైపు నడిపిస్తుంది. అక్కడ వరూధిని ఈగోలో నాణ్యతలేమి కారణాన ఇడ్‌ను అనుసరించి తన కోరికను తీర్చమని ప్రవరుణ్ణి అనేక విధాలుగా ప్రలోభపెడుతూ ఒత్తిడి చేస్తుంది. వేదాధ్యయనం వలన, ధర్మశాస్త్రాలను అవపోషణ పట్టడం వలన ప్రవరుడిలోని ఈగో నాణ్యతను కలిగి ఉండడాన అది సూపర్‌ ఈగోను అనుసరించడంతో వరూధినీ ప్రలోభాలకు, ఒత్తిడులకు అతనిలోని సూపర్‌ ఈగో చలించలేదు.

అలాగే ఇక్కడ విటుడులో కూడా నాణ్యతలేని ఈగో తన ఇడ్‌ను అనుసరించడం మూలాన తన వాంఛను తీర్చుకునేందుకు సెంచితను అనేక విధాలుగా ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తాడు. కానీ సెంచితలోని ఈగో నాణ్యతను కలిగి ఉండటం వలన అది తనలోని సూపర్‌ఈగోకి సహకరించి విటుడి ప్రలోభాలకు చలించకుండా, నైతికత నుండి తొట్రిల్లకుండా దోహదపడుతుంది.

రక్షక తంత్రాలు :
మనో విశ్లేషణ సిద్ధాంతంలో భాగంగా రక్షక తంత్రాలు అనే భావనలను మొదటిసారిగా ప్రతిపాదించినవాడు సిగ్మండ్‌ ప్రాయిడ్‌. మనిషి నిత్యజీవితంలో వివిధ సందర్భాలలో ఎన్నో మానసిక సంఘర్షణలను, ఒత్తిడులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ ఒత్తిడులు, వ్యాకులతలు, సంఘర్షణలను తగ్గించుకోవడానికి మానవుడు అనేక రకాలైన పద్ధతులను అవలంభిస్తుంటారు. ఇవి వ్యక్తిలోని అహం దెబ్బతినకుండా మనస్సు, మూర్తిమత్వం తాత్కాలికంగా విచ్ఛిన్నం కాకుండా రక్షించే తాంత్రికమార్గాలు. వీటినే రక్షక తంత్రాలు అని అంటారు. ఇవి తాత్కాలిక ఉపశమన మార్గాలే కాని శాశ్వత పరిష్కారాలు కావు. ‘‘రక్షక తంత్రం అనేది ఒక ప్రవర్తనా నమూనా. ఇది వ్యక్తి అహన్ని తాత్కాలిక అగౌరవం, అపరాధ భావన నుండి రక్షిస్తుంది’’ అని డిక్షనరీ ఆఫ్‌ సైకాలజీ నిర్వచిస్తుంది. ప్రాయిడ్‌ ప్రతిపాదించిన తొమ్మిది రకాలైన రక్షక తంత్రాలలో ‘‘తాదాత్మీకరణం’’ అనే రక్షక తంత్రానికి అద్దం పట్టే కొన్ని కొలాట గేయాలున్నవి. వాటిని గురించి విశ్లేషణ చేద్దాం.

తాదాత్మీకరణ అంటే ‘‘వ్యక్తి తానుగా సాధించలేనవి, అనుభవించలేనివి, తన కోరికలుగా మిగిలిపోయినవి తన ఆత్మీయులు, తనకిష్టమైనవారు సాధించినపుడు, అనుభవించినపుడు, వారిలో తనను తాను చూసుకుంటూ తానే సాధించినంతగా, అనుభవించినంతగా సంబరపడిపోవడం, సంతృప్తిచెందడం తాదాత్మీకరణం అంటారు.’’ ఇక్కడ తమ ఆలోచనలు, కోరికలను తమకిష్ణమైన వ్యక్తి లేదా నాయకునిలో చూసుకొని మురిసిపోవడం జరుగుతుంది. ఉదాహరణకు తమకు ఇష్టమైన పురాణ పురుషులు రాముడు, కృష్ణుడు లేదా ఎవరైనా చారిత్రక వీర పురుషులు చేసే పనులు తమ ఆలోచనలకు, కోర్కెలకు అనుగుణంగా ఉంటే వాటిని పదే పదే కనివిని ఆనందించడం. జానపదులు ఎక్కువగా తమలోని ఇడ్‌ను సంతృప్తిపరచే విధంగా ఆయా సందర్భాలలో కృష్ణుడు చేసే కొంటె పనులు, ప్రణయ కార్యకలాపాలు, సరసాలు మొదలైన వాటిని కథలు, పాటల రూపంలో పదే పదే తలచుకొంటూ, పాడుకొంటూ సంతృప్తి చెందడంను తాదాత్మీకరణగా చెప్పవచ్చు. ఇంకా కొంతమంది జానపద కవులైతే తమ మనసులోని ఇడ్‌ తాలూకు భావనలను కృష్ణుడికి ఆపాదించి తాము సృష్టించిన గేయాలలో కృష్ణుడిని మొరటు సరసాలు ఆడటం, గోపికల దారికి అడ్డునిలిచి, ముద్దులు, ఆలింగనాలు అడగడం, వారిని కొంగుపట్టి లాగడం, సంభోగానికి రమ్మని పచ్చిగా అడగటం మొదలైన రాసలీలలు ఆడే కృష్ణుడిగా చిత్రించి, పదే పదే పాడుకొని పారవశ్యం చెందడం తాదాత్మీకరణమే. జానపదులు తమలోని ఇడ్‌ (అచిత్తు)కు ప్రతీకగా శ్రీ కృష్ణుడిని ఊహించుకుని సృష్టించిన శృంగార గేయాలు కోకొల్లలుగా ఉన్నాయి. కోలాటం పాటల్లోని…

‘‘గొల్లవారి వాడలకు క్రిష్నమూర్తి
నీవు మెల్లమెల్లగొచ్చుటేల సిన్ని మాదవా
మురిపాల నవ్వులొలికె గొల్లదాన
ఒక్క ముద్దునిచ్చిపోవే పల్లెవాదరి’’
అంగాంగ సృంగారి గొల్లబామ
నాకో ఆలింగనమివ్వరాదె పల్లెవాదరి’’ (పాట 62. పాడినవారు : బొల్లినేని వెంకటేశ్వర్లు)

అలాగే ‘‘సల్లలమ్మబోయేటి గొల్లదాన, ఒక సంగతుంది గంపదింపె పల్లెవాదరి’’1 మరొక గేయం ‘‘గొల్లవారి వాడలకు క్రిష్నమూర్తి నీవు ఏమి పనికి వచ్చినావు క్రిష్నమూర్తి’’2 మొదలైన శృంగార గేయాలన్నిటిలో శ్రీకృష్ణుడు ఇడ్‌కు, గోపికలు సూపర్‌ ఇడ్‌కు ప్రతీకలుగా కన్పిస్తారు. ఇటువంటి శృంగార భక్తి గేయాలను ప్రత్యేకించి పదే పదే పాడుకొనే కొంతమంది జానపదులలో స్వామికార్యం, స్వకార్యం అన్నట్లు స్వామిపై భక్తి పారవశ్యంతో పాటు తమలోని ఇడ్‌ను స్వామిలో ప్రతిక్షేపించి తాదాత్మ్యం చెందటం రెండూ కలిసొస్తాయి అని చెప్పవచ్చు.

సాహిత్యం, మనస్తత్వ శాస్త్రాలు అవినాభావ సంబంధం కల్గిన అంశాలు. మానవ హృదయం నుండి వికసించినది కావున సాహిత్యంలో మానవ మనస్తత్వం ప్రతిబింబిస్తుంది. ఆ మాటకొస్తే మనస్తత్వ శాస్త్రంలో కొన్ని సిద్దాంతాలు సాహిత్యాంశాల ఆధారంగానే పురుడుపోసుకున్నాయి. మరికొన్ని సిద్ధాంతాల వివరణలకు సాహిత్యంలోని అంశాలకు ఉపమానాలుగా ఎంచుకోవడం జరుగుతుంది. మనో విశ్లేషణ సిద్ధాంతంలో భాగంగా ప్రాయిడ్‌ ప్రతిపాదించిన ఈడిపస్‌ కాంప్లెక్స్‌, ఎలక్ట్రా కాంపెక్స్‌ భావనల ప్రతిపాదనలకు గ్రీకు సాహిత్యంలోని గాథలు మూలాధారాలు కావడం గమనార్హం. జానపద గేయాలు మొదలైన జానపద అంశాలను మనోవిశ్లేషణ సిద్ధాంతాల ద్వారా అధ్యయనం చేయడం వలన జానపదుల వ్యక్తిత్వ విశేషాలను తెలుసుకోవచ్చు.

ఉపయుక్త గ్రంథసూచి :
1. కృష్ణకుమారి నాయని ‘‘తెలుగు జానపద విజ్ఞానము – సమాజము-సంస్కృతి
2. ‘‘మనో విజ్ఞానశాస్త్ర ఆధారాలు’’ – తెలుగ అకాడమీ
3. వెంకటేశ్వర్‌రెడ్డి అన్నపురెడ్డి, ‘‘మనసుగతినే మార్చిన ప్రాయిడ్‌’’
4. వెంకటేశ్వర్‌రెడ్డి అన్నపురెడ్డి, ‘‘సిగ్మండ్‌ ప్రాయిడ్‌ వినో విశ్లేషణ సిద్దాంతం’’
5. వెంకటేశ్వర్లు బిట్లు ‘‘పల్నాడు సీమలో కోలాటం’’’

–ఇనపనూరి కిరణ్ కుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో