గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్

6-3-1899 న శ్రీ మల్లవరపు శ్రీరాములు ,శ్రీమతి సీతమ్మ దంపతులకు విశ్వ సుందరమ్మ మొదటి సంతానంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉండి గ్రామం లో జన్మించింది .తొమ్మిదవ ఏట ఆమెకు వివాహం ఉంగుటూరు గ్రామానికి చెందిన తల్లాప్రగడ నరసింహ శర్మతో జరిగింది .బాల్య వివాహం కనుక ఆమె దాదాపు స్కూలు చదువుకు నోచుకోలేదు. కానీ మహా పండితుడైన తండ్రి సహాయ సహకారాలతో ఆమె అంతులేని పాండిత్యం సాధించింది. ఆ రోజుల్లో ప్రచురింపబడుతున్న విజ్ఞాన చంద్రికా మండలి, ఆంధ్ర ప్రచారిణీ గ్రంథాలయం వారి గ్రంథాలను చదివి జీర్ణం చేసుకొన్నది. చిలకమర్తి, కందుకూరి రచనలు, భారత భాగవత రామాయణాలు పూర్తిగా చదివింది. ఇక విజ్ఞానానికేం తక్కువ ఆనంత విజ్ఞాన సంపన్ను రాలై౦ది, విజ్ఞాన చంద్రికా మండలి, ప్రోగ్రెసివ్ యూనియన్ వారు నరసాపురంలో నిర్వహించే ఉభయ భాషా ప్రవీణ , సాహిత్య శిరోమణి పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది .

16వ ఏట విశ్వ సుందరమ్మ కాకినాడకు కాపురానికి వెళ్ళింది. ఆమె భర్త శర్మ అప్పుడు పిఠాపురం రాజా గారి అనాథ శరణాలయానికి సహాయ సూపరిం టెండెంట్ గా ఉండేవాడు. భర్త సాహచర్యంతో ఆమెకు సంస్కార భావాలు దయ సానుభూతి, వాత్సల్యం వంటి ఉత్తమగుణాలు ఆ లేత వయసులోనే కలిగి వట వృక్షంలాగా విస్తరించాయి .అయిదేళ్ళు కాకినాడలో ఉన్నది .

1920లో గాంధీ పూరించిన స్వాతంత్ర్య శంఖారావాన్ని విని, తల్లాప్రగడ దంపతులు ,భారత రాజకీయాలవైపుఆకర్శితులై 1921లో బెజవాడ లో జరిగిన చారిత్రాత్మక కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు .తర్వాత కాకినాడలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా రాజకీయ సభలో విశ్వ సుందరమ్మ ‘’శాసనోల్లంఘన తీర్మానాన్ని’’ ప్రవేశ పెట్టింది .మొదటి దశ శాసనోల్లంఘన జరిపే వారిలో తన పేరు రాయి౦చుకొని ,మార్గ దర్శి అయింది .అప్పటినుంచి విదేశీ వస్త్ర దహనం, బహిరంగ సభలలో ప్రసంగించటం, కాంగ్రెస్ సమావేశాలకు హాజరవటం నిత్య కృత్యమైంది .1921లో అహమ్మదాబాద్ లో కాంగ్రెస్ సమావేశాలు జరిగినప్పుడు హాజరై ,సబర్మతీ ఆశ్రమం లో మహాత్మాగాంధీని దర్శించింది .ఆయనతో కొన్ని విషయాలు చర్చించి కొన్ని సలహాలు స్వీకరించింది .

రాజమండ్రిలో కొంతకాలం ఉండి విశ్వ సుందరమ్మ వీరేశ లింగం గారి వితంతు శరణాలయం నిర్వహణలో తోడ్పడింది .1923లో బెంగాల్ లో పర్యటించింది .కలకత్తాలోని బ్రహ్మ సాధనాశ్రమం ,చంద్ర నాగోర్ లోని ప్రవర్తకాశ్రమం ,బోల్పూర్ లోని విశ్వకవి రవీంద్రుని శాంతినికేతన్ మొదలైనవి చూసింది .నెల్లూరు దగ్గర పల్లెపాడు లోని పినాకిని ఆశ్రమం లో కొంతకాలం గడిపింది .

విశ్వ సుందరమ్మ, శర్మ దంపతులు ఇక రాజమండ్రి లో స్థిర పడి,తమదైన విధానం లో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి గట్టున ఆర్యాపురం లో 1923లో ‘’ఆనంద నికేతనాశ్రమం ‘’స్థాపించారు. అస్పృశ్యతా నివారణ, స్త్రీ సంక్షేమం, నూలు వడకటం, ఖాదీ వస్త్రాలు నేయటం వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆసక్తిగా నిర్వహించారు. కుల మత విచక్షణ లేకుండా అందరూ ఒక్కటై మెలిగారు. విశ్వదాత కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారు చాగల్లులో ఈ ఆశ్రమ భవనానికి తోడ్పడ్డారు. అప్పటి నుంచి శర్మ దంపతులు చాగల్లు వచ్చి ఆశ్రమ౦లోనే ఉన్నారు .

1929లో గాంధీజీ ఆంద్ర దేశ పర్యటన జరుపుతూ వీలు చూసుకొని చాగల్లు వచ్చి విశ్వసు౦దరమ్మ దంపతులు నిర్వహిస్తున్న ‘’ఆనంద నికేతన ఆశ్రమ౦ ‘’సందర్శించి, అక్కడి అస్పృశ్యతా నివారణ, జాతికులమతాలకు అతీతంగా, హరిజన బాలబాలికలకు ఆశ్రయం కల్పించి విద్య నేర్పటం చూసి మహాత్ముడు మురిసిపోయాడు. అప్పటికి ఆయన అస్పృశ్యతా ఉద్యమం చేబట్టలేదు. ఒక రకంగా విశ్వ సుందరమ్మ దంపతులు ఈ విషయంలో ఆయనకు మార్గ దర్శులయ్యారు .చాగల్లు జాతీయోద్యమం లో పాల్గొనే ఉద్రేక ఉత్సాహ పూరిత యువతకు కేంద్ర స్థానంగా ఉండేది .ఇవన్నీ గాంధీని బాగా ఆకర్షించాయి .మహా సంతోషం తో మహాత్ముడు ఆరాత్రి ఆ ఆశ్రమంలో విశ్రమించాడు. పిల్లల ఆటపాటలకు మురిసిపోయి దీవించాడు .శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య ,శ్రీ కంభం పాటి సత్యనారాయణ ,శ్రీ మల్లవరపు వెంకట కృష్ణారావు వంటి యువకులు మహాత్మునితో సంభాషించి ప్రేరణ పొందారు .వారు గాంధీని ‘’శాంతి సమరం అంటున్నారు మీరు బాపూ .కాని సాయుధ పోరాటం వెంటనే విజయం చేకూరుస్తు౦ది కదా ?’’అని ప్రశ్నిస్తే బోసి నవ్వులబాపు ‘’ఒక ఖైదీని వార్డర్ గా నియమిస్తే ,కాలక్రమం లో తాను ఖైదీనని మర్చిపోయి తోటి ఖైదీలను హింసిస్తాడు. మీరు విద్యావంతులు, వివేకమున్నవారు మీరే ఆలోచించండి ‘’అని జవాబు చెప్పాడు గాంధీజీ. విశ్వ సుందరమ్మ తీర్చిదిద్దిన ఆమె సోదరుడు మల్లవరపు వెంకట కృష్ణారావు పూర్తిగా గాంధీజీ శాంతి ప్రియత్వాన్నే అనుసరించారు ..

1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం దేశం నలుమూలలా ప్రాకింది .ప్రజలు ఉత్సాహ ఉద్రేక,ఆవేశాలతో ఆనందంగా పాల్గొని దిగ్విజయం చేకూర్చారు .1930ఏప్రిల్ 13న తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ, శర్మ పతులు, తమ్ముడు చెల్లెలు ,శ్రీతల్లాప్రగడ ప్రకాశ రాయలు వంటి బంధువులు, మిత్రులు అభిమానులు పెద్ద దళంగా ఏర్పడి చాగల్లు ‘’ఆనంద నికేతన ఆశ్రమం ‘’నుంచి సత్యాగ్రహం చేయటానికి, శాసన ధిక్కారం చేయటానికి బయల్దేరారు. ఆమె నిర్వహించని పికెటింగ్ లేదు. పాల్గొని ప్రసంగించని సభ లేదు . పశ్చిమ గోదావరి జిల్లాకు ఆమె నాయకత్వం వహించి నిర్వహించింది. ఆశ్రమం లోని పిల్లలు బాలభటులై ఉద్యమలో ఉత్సాహంగా పాల్గొనటం గొప్ప విశేషం.

1930 మే నెలలో ఆమెను అరెస్ట్ చేసి విచారణ జరిపి ఆరు నెలలురాయవెల్లూరు జైలు లో బి క్లాస్ జైలు శిక్ష విధించారు .విచారణ సమయంలో ఆమె కోర్టులో ఇచ్చిన వాగ్మూలం ఒక విశిష్టతను పొందింది .అందులో ఆమె షేక్స్పియర్ నాటకం జూలియస్ సీజర్ లోని మార్క్ ఆంటోని స్పీచ్ ను గుర్తు చేస్తుంది .అందులో సజ్జన స్తుతి, కుజన నింద.మిత్రులకు అభినందనలు, ప్రభుత్వ దమన నీతి వర్ణనలు మొదలైన కావ్య సామగ్రితో తన సాహితీ వైదుష్యాన్ని జోడించి, కవితామృతాన్ని చిందించి దేశీయుల ప్రశంసలు పొందింది ఇది చిరస్మరణీయ ఘట్టం అని ఆనాటి వారంతా కథలు గాథలుగా చెప్పుకొనేవారు . చివరికి ఫినిషింగ్ టచ్ గా ‘’వందేమాతరం ‘’అంటూ చిరునవ్వుతో జైలులోకి ప్రవేశించింది విశ్వసు౦దరమ్మ.1930 నవంబర్ 7న జైలునుంచి విడుదలైంది .

ఆ తర్వాత ఏలూరులో శ్రీమతి శృంగారకవి లక్ష్మీ నరసమ్మ ఇంట్లో ‘’మీరాబాయి చరఖా పాఠశాల నిర్వహణకు తోడ్పడింది .శ్రీమతి కంభం పాటి మాణిక్యాంబ వంటి యువతులకు మార్గ దర్శనం చేసింది .1932 శాసనోల్లంఘన ఉద్యమం లో ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి 6-7-1932న గుంటూరు జిల్లా తెనాలిలోమండల కాంగ్రెస్ సభను తన అధ్యక్షతన జరిపిన ధీరురాలు సుందరమ్మ.సభ తర్వాత విజయోత్సాహంగా ఊరేగింపు జరుపుతుంటే, పోలీసులు వచ్చి, లాఠీ చార్జి చేసి, ఆమెతోపాటు 26మందిని అరెస్ట్ చేశారు. పోలీసు దెబ్బలకు ఒళ్ళంతా రక్తం కారుతుండగా ‘’శ్రీ గాంధీ నామం మరువాం మరువాం, సిద్ధాము జైలుకు వెరువాం వెరువాం ‘’అని పాడుతూ జైలు శిక్ష అనుభవించటానికి రెండవసారి రాయవెల్లూర్ జైలుకు వెళ్ళింది ఆ స్వాతంత్రోద్యమ నాయకురాలు .

1942 క్విట్ ఇండియా ఉద్యమం లో ఆన౦ద నికేతన ఆశ్రమాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్నది .అయినా చలించని ఆ ధీర వీర దంపతులు నిడదవోలు లో కాలువ గట్టుపై పర్ణకుటీరం వేసుకొని ఉన్నారు. ఇంతటి కల్లోల జీవితం అనుభవిస్తూ అసంఖ్యాక కవితలురాసి 1920-49మధ్య విశ్వ సుందరమ్మ 125గీతాలను ‘’కవితా కదంబం ‘’పేరుతొ 235పేజీల పుస్తకంగా ప్రచురించింది. ఆధునిక ఆంద్ర కవయిత్రులలో విశ్వ సుందరమ్మ ప్రధమురాలు .ఆమె కవన శక్తినికూడా సంఘం కోసం దేశం కోసమే వెచ్చించింది. మద్యపానాన్ని వివిధ కోణాలనుంచి పరిశీలించి తాగుడును నిరశిస్తూ అనేక కవితలు రాసింది. ’’కల్లు స్వదేశీయే, కనుక త్రాగవచ్చు అనెడి దుర్వాదమును వినకుమయ్య ‘’అని హెచ్చరించింది. ఈ పాయింట్ అంతకు ముందు ఎవరికీ తోచినట్లు లేదు. బాలవితంతువుల గోడు వినమని, స్త్రీ జనాభ్యుదయానికి కృషి చేయమని గేయాలలో కోరింది. సంస్కరణల సేవతో సమాజ సేవ చేసిన గాంధీ , వీరేశలింగం గార్లను కీర్తించింది.

సి క్లాస్ ఖైదీల బాధలకు కలత చెందేది .జైలు పారుశుధ్యం అవసరం గురించి ‘’గృహ లక్ష్మి ‘’పత్రికలో ఇంజనీర్ లాగా ప్లాన్ తో సహా సుదీర్ఘ వ్యాసం రాసింది .ఆమె కవితలన్నీ అప్రయత్నంగా హృదయపు లోతుల్లోంచి తమకు తామే పెల్లుబికి వచ్చినవి కనుక అత్యంత సహజంగా, ఆమె కీర్తి, త్యాగం అంత స్వచ్చంగా బహు సుందరంగా ఉంటాయి. భారత దేశ స్వాతంత్ర్యాన్ని కనులారా చూసి ,30-8-1949 న 51 ఏట ఆత్యాగమయి నిస్వార్ధ సేవకురాలు, వీర ధీర వనిత ,అధోజగత్ సహోదరులకు అండగా నిలిచి ,మహాత్మునికే అస్పృశ్యత నివారణకు మార్గదర్శనం చేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు, విదుషీమణి కవితా కల్పవల్లి శ్రీమతి తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ తనువు చాలించి, శాశ్వత యశస్సును పొందింది .శ్రీ ఆచంట జానకి రాం ఈమెపై అత్యద్భుతమైన జ్ఞాపకాలు రాశాడు .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో