జ్ఞాపకం- 78 – అంగులూరి అంజనీదేవి

అనంతరం ఆ వేదికపై సంలేఖను ఘనంగా సత్కరించే కార్యక్రమం మొదలైంది. ప్రేక్షక మహాశయులు ఉత్కంఠతో చూస్తున్నారు. ఆమెకు ముందుగా మెడలో పూలదండను వేశారు. ఆ తర్వాత ఖరీదైన దుశ్శాలువ, ఆమె పేరుతోపాటు ఆమె ఫోటో పక్కన నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు అని రాసివున్న మెమొంటోను ఇచ్చారు. అదంతా ముఖ్యమంత్రిగారి చేతుల మీదుగా జరగడం ఆనందంగా వుంది సంలేఖకు. జన్మ ధన్యమైనట్లే చూస్తోంది.

ఆ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా సభాసరస్వతికి నమస్కరించి సంలేఖ మాట్లాడుతూ “ఈరోజు నా జీవితంలో అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు వస్తుందని నన్నూ, నా రచనల్ని వెటకారం చేసిన వాళ్లకి తెలియక పోవచ్చు. తెలిసుంటే నా ముందు పొగుడుతూ నా వెనకాల నవ్వేవాళ్లు కాదేమో! ఎప్పుడు చూసినా వంకర నవ్వులు, వ్యంగ్యపు విసుర్లు, అసూయ చూపులు. సహకరించే సద్విమర్శలు కన్నా విరక్తి కల్గించే విమర్శలే ఎక్కువగా వుండేవి. బాగా చదివిన మేధావులు కూడా కొందరు నా ఉనికిని ఓర్చుకోలేకపోయేవాళ్లు. పక్కకెళ్లి ఏముంది ఆమె రాతల్లో అని ఎద్దేవా చేసేవాళ్లు. ఇవన్నీ దాటుకుంటూ వచ్చాను. ఎక్కడా భయపడి వెనకడుగు వెయ్యలేదు. ఆత్మవిశ్వాసంతో రాసుకుంటూ వెళ్లాను. ఈ ఆత్మవిశ్వాసం నాకు మా నాన్నగారు నేర్పిందే!

అదెలా అంటే! ‘ఒక చెట్టు కొమ్మ మీద పక్షి కూర్చుని వున్న సమయంలో పెద్ద గాలి వీచింది. కొమ్మ వేగంగా ఊగుతోంది. పక్షిమాత్రం అక్కడే కూర్చుని వుంది. ఎందుకంటే పక్షి కొమ్మమీద పూర్తిగా ఆధారపడలేదు. దాని రెక్కల మీద ఆధారపడింది. అందుకే కొమ్మ విరిగినా పక్షి కింద పడదు. చిన్న పక్షిలో వున్న ఆత్మవిశ్వాసం అన్నీ తెలిసిన మనకెందుకు వుండకూడదు?’ ఈ మాటలు మా నాన్నగారు నాకు ఏ క్షణాన చెప్పారో కాని, ఆ పక్షిని మించిన ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో నడిచి, నడిచి ఒక మేరుపర్వతాన్ని చేరుకున్న నత్తలా ఈ వేదికను ఎక్కాను. ఈ స్థానానికి చేరుకున్నాను” అంది. తన స్పందనను సభాముఖంగా ప్రేక్షకులతో పంచుకుంది. అంతవరకు నిశ్శబ్దంగా వున్న ఆ హాలంతా హర్షధ్వానాలతో మారుమోగింది.

వందన సమర్పణతో సభ ముగిసింది.

అభిమానులు ఆటోగ్రాఫ్ ల కోసం సంలేఖ చుట్టూ చేరారు. ఒకరి వెంట ఒకరు వస్తూనే వున్నారు. వాళ్ల మధ్యలోంచి నెమ్మదిగా సంలేఖను పక్కకి తప్పించి తమ కార్లో కూర్చోబెట్టుకున్నారు దిలీప్, హస్విత. కార్లో కూర్చున్నాక కళ్లు మూసుకుని వెనక్కి ఒరిగింది సంలేఖ.

హస్విత సంలేఖ చేతిని తన చేతిలోకి తీసుకుని ఎంతో ఉత్సాహంగా “ఒన్స్ ఎగైన్ కంగ్రాట్స్ లేఖా! సభ చాలా గ్రాండ్ గా జరిగింది” అంది.

వెనక్కి ఒరిగి కూర్చుని వున్న సంలేఖ మామూలుగా కూర్చుంటూ “థాంక్యూ! హస్వీ! మీ ఇద్దరి సమక్షంలో నేనిలా సత్కారం పొందటం ఓహ్! మాటలు రావడం లేదు” అంది.

డ్రైవింగ్ సీట్లో కూర్చుని వున్న దిలీప్ రోడ్డు వైపు చూస్తూనే సంలేఖనుఉద్దేశించి “రేపు ఈ వార్త అన్ని పేపర్లలో వస్తుంది. ప్రతి పేపర్ ని మూడు కాపీలు తెప్పించి వుంచుకో. ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రెస్ కి గాని మీడియాకి గానీ నీ పూర్తి ప్రొఫైల్ ఇచ్చేటప్పుడు పనికొస్తాయి” అన్నాడు.

దిలీప్ చెప్పేది నిజమే. అతను ప్రతిదీ తన వైపే ఆలోచిస్తుంటాడు. అంతేకాదు. అతను హాజరయ్యే ప్రతి సాహిత్య సభ గురించి సమాచారం ఇస్తాడు. తను ఆ సభకి వెళ్లలేకపోతే ఆ సభలో ఏ సాహిత్యకారుడు ఎలా మాట్లాడాడో! దేనిమీద ఎక్కువగా మాట్లాడాడో! శ్రోతల్లో ఏ మాటకి ఎలాంటి స్పందన వచ్చిందో ఫోన్లో చెబుతుంటాడు. అప్పుడప్పుడు సభలో కలుసుకోవటం, చనువుగా మాట్లాడుకోవడం, సందర్భాన్ని బట్టి ఫ్రెండ్లీగా సలహాలిచ్చుకోవడం జరుగుతుంటుంది.

ఆమెకు వెంటనే జయంత్ గుర్తొచ్చాడు. గతంలో ఆమెకు అవార్డులు వచ్చినప్పుడు, సన్మానాలు జరిగినప్పుడు పత్రికల్లో రావడం జరిగేది. దిలీప్ చెప్పినట్లే అవన్నీ కొని భద్రపరిచేది.

“ఎవరైనా చీరలు కొంటారు. నగలు కొంటారు. నీకిదేం పిచ్చి. పేపర్లు కొనుక్కొని అదేదో డైమండ్స్ లాగా దాస్తావ్? ఒక్క రూపాయి అయినా ఎలా వస్తుంది చెప్పు! అన్నన్ని పేపర్లు కొనటం డబ్పు దండగ అన్పించటం లేదా నీకు?” అనేవాడు జయంత్.

“ఇప్పుడు మిస్సయితే అవి మళ్లీ దొరకవండీ!” అని ఆమె ఎంత చెప్పినా వినలేదు.

“ఆ… ఇప్పుడు దొరికి మాత్రం ఏం చేస్తావ్ వాటిని? ఎప్పటికైనా పడేసేవేగా!” అని విసుక్కునేవాడు. అతనికి నచ్చనిపని చెయ్యాలంటే చెయ్యబుద్ధి కాదు. వదిలేసేది. ఇప్పుడు కొన్ని కటింగ్స్ తన దగ్గర లేవు. గుర్తొస్తే గుండెలో బాధతో కూడిన అలజడి. రేపు కూడా అంతే! పేపర్లు కొనాలంటేనే భయం. రోజురోజుకి అలాంటి పనుల మీద ఆసక్తి అంతరించిపోతోంది.

దిలీప్ ఆమె మాట్లాడకపోవడంతో “మీరు ఇంత కష్టపడి రాసేది ఆ పేపర్లలో చూసుకోవడం కోసమే లేఖా! అది గుర్తుంచుకోండి! దేనికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇవ్వాలి. నిర్లక్ష్యం చెయ్యొద్దు. మీకు సంబంధించిన న్యూస్ ఎలాంటిదైనా సరే జాగ్రత్తగా ఫైల్ చేసి పెట్టుకోండి!” అన్నాడు.

సంలేఖ సమాధానం చెప్పేలోపలే ఇల్లొచ్చింది. కారాపాడు దిలీప్. వాళ్లకి ”థాంక్స్” చెప్పి కారు దిగింది సంలేఖ.

“లోపలకి రండి!” అంటూ వాళ్లను ప్రేమగా ఆహ్వానించింది.

అందుకు దిలీప్ “మా జర్నలిస్టులంతా రవీంద్రభారతి నుండే నేరుగా ప్రెస్ కి వెళ్లారు. నేను కూడా ఈ న్యూస్ ని అర్జంట్ గా ప్రెస్ కి ఇవ్వాలి. మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్లొచ్చని వచ్చాం. ఈసారి ఎప్పుడైనా వస్తాం” అంటూ కారు స్టార్ట్ చేశాడు దిలీప్. కృతజ్ఞతగా చూసింది సంలేఖ. కారు కన్పించేంత వరకు అక్కడే నిలబడి, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళింది.

లోపలికి వెళ్లగానే శ్రీలతమ్మ చూపులు సంలేఖ చేతుల్లో వున్న పూలదండ, దుశ్శాలువ, మెమొంటోల మీద పడ్డాయి. ఏమాత్రం ఆసక్తి లేని దానిలా ఓ చూపు చూసి ముఖం మాడ్చుకుంది. వెంటనే తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుంది. ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా సన్మానం చేయించుకొని వస్తే కనీసం పలకరించనైనా పలకరించకుండా గదిలోకి వెళ్లిన అత్తగారిని అలాగే నిలబడి చూసింది. ఆ తర్వాత ఆమె కళ్లు జయంత్ కోసం వెదికాయి. అతనింకా ఇంటికి రాలేదు.

సంలేఖ అప్పుడే తన గదిలోకి వెళ్లకుండా తనకి వచ్చిన మెమొంటోని హాల్లో వున్న కబోర్డులో వుంచింది. ఇది తనకి వచ్చిన నాలుగో మెమొంటో. అన్నీ వరుసగా వున్నాయి. వాటిని చూస్తుంటే భాషకి అందని అనుభూతి కలుగుతోంది. కొద్దిసేపు అలాగే నిలబడింది. పూలదండను మాత్రం సోఫాకి ఎదురుగా వున్న టీపాయ్ మీద వుంచింది. అక్కడెవరూ లేకపోవడం వల్లనో ఏమో నిశ్శబ్దంగా, గంభీరంగా, ఒంటరిగా అన్పించి గదిలోకి వెళ్లింది.

శాలువాను బీరువాలో పెడుతూ, ఆమెకు వాళ్లిచ్చిన లక్షరూపాయలు చెక్ వైపు చూసుకుంది. దాన్ని చూస్తుంటే ఆమెకో చక్కటి ఐడియా వచ్చింది.

అంతలో జయంత్ వచ్చాడు.

జయంత్ తో కలిసి భోంచేశాక తనకి వచ్చిన ఐడియాను అతనితో చెప్పాలనుకుంది. చెక్కును బీరువాలో పెట్టి వెనుదిరిగి చూసేలోపలే జయంత్ బెడ్ మీద పడుకొని వున్నాడు.

అతను పడుకున్న తీరు చూస్తుంటే అతన్ని పలకరించాలంటేనే భయంగా వుంది. అయినా మెల్లగా భుజంపై చేయివేసి “జయంత్!” అని పిలిచింది. చాలా ప్రేమగా, మృదువుగా వుందా పిలుపు.

అతను కళ్లు తెరిచి ఆమెవైపు చూడలేదు. ఎప్పటిలా గబుక్కున గుండెల మీదకి లాక్కోలేదు. గంట క్రితం పార్టీలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. దాన్ని డైజస్ట్ చేసుకోలేక ఎప్పుడూ పడనంత అవస్థ పడుతున్నాడు. అసలు ఇవాళ ఆ పార్టీకి వెళ్లకపోయినా ఇంత బాధ వుండేది కాదేమో అని అనుకున్నాడు. అసలా పార్టీలో ఏం జరిగిందంటే!

పార్టీకి అటెండయిన ప్రతి ఒక్కరూ జయంత్ వెళ్లగానే ప్రత్యేకంగా చూశారు. ఈరోజు సంలేఖకు జాతీయ అవార్డు వస్తున్నట్లు ఉదయాన్నే పేపర్లో చూశామని కంగ్రాట్స్ చెప్పి కరచాలనం చేశారు. అంతటితో వూరుకోకుండా “ఎప్పుడైనా నీ ఆలోచనలే డిఫరెంట్ జయంత్! నీ పెళ్లిలో మేమంతా “ఇంత దూరం వచ్చి వీడీ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? కనీసం వీళ్లకో కారు లేదు. మంచి ఇల్లు లేదు. ఎప్పుడైనా వస్తే ఇలాంటి చోట వీడికేం మర్యాదలు జరుగుతాయి అని.

కానీ సంలేఖ గారు రచయిత్రి అని నీకు ముందుగా తెలిసే ఈ పెళ్లి చేసుకున్నట్లు ఆరోజు వూహించలేకపోయాం? ఇప్పుడు చూడు ఒక రచయిత్రి భర్తగా బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నావ్! మేమే కాదు, నువ్వు ఎక్కడికెళ్లినా నిన్ను సంలేఖ గారి భర్తగా చాలా గౌరవిస్తారు. ఈ గౌరవం ఎన్ని కార్లు కొంటే వస్తుంది? ఎన్ని ఇల్లులు కొంటే వస్తుంది? ఎన్ని స్థలాలు కొంటే వస్తుంది? నిజంగా నువ్వు గ్రేట్ జయంత్!” అన్నారు.

జయంత్ నవ్వాడే కాని మనస్పూర్తిగా నవ్వలేకపోయాడు.

-అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో