బావి గడ్డ లేదు
బావి దరి లేదు
బావి మెట్లు లేవు
మోటా లేదు
మోట కొట్టే ఎడ్లు లేవు
మోట తోలే బిడ్డడు లేడూ
బావే లేదు
వేయికి పైగా అడుగుల బోర్లు మింగిన బావి ఓ జ్ఞాపకం
బావి గడ్డ మీదెక్కి
సద్ది కోసం చూసే కళ్ళు లేవు
సద్ది గంప దిగగానే గంప చుట్టూ మూగే
బిడ్డలూ లేరూ
ఉమ్మడి కుటుంబ వ్యవసాయం కుదేలు
సద్ది మూట విప్పీ విప్పగానే
ముక్కు పుటాలు తాకే రాములక్కాయ పచ్చడి లేదు
చింత కాయ పచ్చడి లో గానుగ పచ్చి నూనె కలిపి
వేడి వేడి అన్నం తినే అదృష్టమూ లేదిప్పుడు
మోదుగాకుల కి చిన్న గడ్డిపొరక పుల్లలు గుచ్చితే
సిద్దమయ్యే విస్తారి మోటైంది
తినగానే పారే మోట నీళ్ళు దోసిళ్ళ తో తాగే స్వచ్ఛతను కాటేసిన కాలుష్యం
ఒర్రె లో ఇసుక
అటూ ఇటూ
చేత్తో అరడుగు తీస్తే ఊరే చెలిమ లేదు
ఇసుక యాడ కనబడితే ఆడ కబళించే కబ్జా కోరుల రాజ్యం లో
నీరు దిగేదెలా పొరల్లోకి
నేల తల్లి దాచేదెలా నీటిని భావి తరాలకు
పశువుల మేత కి వదిలే కంచెలు బీళ్లు లేవు
పంట పండే మళ్లు కంచెలతో
విపణి లో సరుకులా
చుట్టూ నేల
పండించే నేలా కరువు
కర్షకుడూ ఇక కానరాడేమో!!
దిగుమతుల దినుసుల కాలం
చూడ బోయే తరం
నీరంతా మద్యమై
పల్లె నిండా పారి
పట్టుగొమ్మలన్నీ వల్లకాడుల్లా
తెరిచే కళ్ళు లేవు
తెరిపించే గళాలను తూలనాడే నాలుకలు
చివరాఖరికి వీధుల్లోకి అన్నమో!! అంటూ వచ్చే దాకా!!
ఇలాగే!! ఇంతే!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~