మాడభూషి వ్యాకరణ విజ్ఞానము – పరిశీలన(సాహిత్య వ్యాసం) – బలరామమహంతి శశికళ.

ప్రముఖ పరిశోధకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు ఎందరో విద్యార్థులకు మార్గదర్శకులు. వృత్తినే దైవంగా భావించి, తన జీవితాన్ని తెలుగు భాషా వ్యాప్తికి అంకితం చేస్తున్న ఆదర్శమూర్తి. సంపత్ కుమార్ గారు గొప్ప కవి, వ్యాసకర్త, విమర్శకుడు, అనువాదకుడు, భాషావేత్త. తెలుగు లిపికి అంతార్జాతీయ ఖ్యాతి తెచ్చిన పరిశోధకులు.

వ్యాకరణ విజ్ఞానం అందకుండా భాషకు సంబంధించిన జ్ఞానార్జన పరిపూర్ణంకాదు, అంటూ మనవి చేస్తూ ఈ గ్రంధాన్ని ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే వ్యాకరణంపై అవగాహన అవసరం. ఋగ్వేద కాలం నుండి వ్యాకరణానికి సంబంధించిన అంశాలు కనిపిస్తున్నాయి. మనుషుల్లో అంతర్లీనంగా ఉన్న పరబ్రహ్మం ఒక విచిత్రమైన వృషభంలాంటింది. ఆ వృషభానికి నాలుగు కొమ్ములు, మూడుకాళ్ళు, రెండుతలలు, ఏడు చేతులు ఉంటాయి. నాలుగు కొమ్ములు నామ, ఆఖ్యాత, ఉపసర్గ, నిపాతాలకు ప్రతీకలు. మూడు కాళ్ళు భూత, భవిష్యత్, వర్తమానమనే మూడు కాలాలను సూచిస్తాయి. రెండు తలలు నిత్యానిత్య శబ్దాలకు చిహ్నాలు. ఏడు చేతులు ఏడు విభక్తులకు నిదర్శనాలు. ఈ విషయాలను శ్లోక రూపంలో ఋగ్వేదం ప్రస్తావించింది. అంటే వ్యాకరణానికి సంబంధించిన ఆనవాళ్లు వేదకాలంలో ఉన్నాయన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా గుర్తించవచ్చు.

వ్యాకరణాన్ని బ్రహ్మ దేవుడు సృష్టించి, రాసి బృహస్పతికి చెప్పాడు. బృహస్పతి ఇంద్రునికి, ఇంద్రుడు భరద్వాజునికి, భరద్వాజుడు ఋషులకు, ఋషులు బ్రహ్మణులకు చెప్పారు. ఇలా ఒకరి నుండి ఒకరికి వ్యాకరణం వ్యాప్తి చెందుతూ వచ్చి లోకంలో స్థిరపడింది అని రుక్తంత్రంలో ఒక శ్లోకం ద్వారా వివరించడం జరిగింది.

వ్యాకరణం = వ్యుత్పత్తి :–

సంస్కృతంలో ‘కృ’ అనే ధాతువునకు వి, ఆజ్ అనే ఉపసర్గలు చేరడంతో పాటు కరణార్థంలో ల్యుట్ ప్రత్యయం చేరి వ్యాకరణం అనే శబ్దం ఏర్పడింది.

నిర్వచనం:–

 పతంజలి తన మహా భాష్యంలో ‘వ్యాక్రియంతే శబ్దా అనేనేతి వ్యాకరణం ‘ అని వ్యాకరణ శబ్ద వ్యుత్పత్తిని వివరించారు. అంటే శబ్దాలను వ్యాకరించేది వ్యాకరణం అని అర్థం. వ్యాకరించడమనే మాటకు ‘ ప్రకృతి ప్రత్యయాది విభాగేన వ్యుత్పాదనం తత్ వ్యాకరణేన సాక్షాత్ క్రియతే ‘అని భావం. అంటే ఒక శబ్దంలో ప్రకృతి ప్రత్యయాలను విడదీసి వ్యుత్పత్తులను చెప్పడాన్ని వ్యాకరించడమంటారు. అందువలన వ్యాకరణానికి శబ్దానుశాసనం, శబ్దశాస్త్రం అనే పేర్లు కూడా ఉన్నాయి. వ్యాకరణం లక్ష్యాన్ని లక్షణాన్ని వివరిస్తూ పదంలోని వివిధ భాగాలను వేరుచేసి అవి ఎలా కలుస్తాయి. ఎలా విడిపోతాయి, వాటి సాధు, అసాధుత్వాలు మొదలైన విషయాలు విశ్లేషించి చెప్పేది అని అర్థం. దీన్నే పతంజలి ‘ఏవంతర్హి లక్ష్య లక్షణే వ్యాకరణం లక్ష్యంచ లక్షణం చైతత్సముదితం వ్యాకరణం భవతి కిం పునర్లక్ష్యం కి వా లక్షణం శబ్దా లక్ష్య: నూత్రం లక్షణం’ అన్న సూత్రంలో వివరించారు. కేవలం సూత్రాలు, ఉదాహరణలు మాత్రమే కావు, వ్యాఖ్యానాలు కూడా వ్యాకరణం విభాగంలోనే చేరుతాయన్నది పతంజలి కాలం నాటికే స్థిరపడిన అభిప్రాయం.

వ్యాకరణ ప్రయోజనం:

మాట్లాడే భాషకు ఆయుష్షు తక్కువ. మాట్లాడిన తక్షణం దాని ప్రయోజనం ముగిసిపోతుంది. కానీ లిఖిత రూపం ధరించినపుడు దాని ప్రయోజనం చాలా ఎక్కువ. అది భవిష్యత్తరానికి వెళ్తుంది. రాసిన వ్యక్తి దానిని చదివిన వ్యక్తి దగ్గర ఉండకపోవచ్చు. అందువలన నియమానుసారంగా భాషా ప్రవాహం కొనసాగాలి. రాసిన వ్యక్తి లేకపోయినా, తరాలు గడిచినా చదువరులు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. వ్యాకరణమనేది కేవలం భాషను నియంత్రించడానికి మాత్రమే ఏర్పడింది కాదు. భాషలో కలిగిన మార్పులు సరైనవా కావా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి సరియైన మార్గంలో పయనించడానికి వ్యాకరణం ఉపయోగపడుతుంది. పతంజలి వ్యాకరణ ప్రయోజాలు ఐదు రకాలని చెప్పారు. రక్ష, ఊహ, ఆగమం, లఘ్వర్థం, అసందేహం, వ్యాకరణం వల్ల వర్ణ క్రమం తెలుస్తుంది. అప శబ్దాలు ఉచ్చరించకుండా, రాయకుండా ఉ ౦డడానికి ఆయా శబ్దాలకు సరియైన రూపాలను తెలుసుకోవడానికి వ్యాకరణం అవసరం.

స్వజనం అనే మాటకు మనవాళ్ళు అని అర్థం. శ్వజనం అంటే కుక్కల సమూహం అని అర్థం. సకలం అంటే మొత్తం అని అర్థం. శకలం అంటే మిగిలిపోయినది అని అర్థం. సకృత్ అంటే కాకి, శకృత్ అంటే మలం. రెండు, మూడు శబ్దాలు కలిపి సమాసం చేసినప్పుడు ఆ సమాసాన్ని ఎక్కడ విరావాలి అన్న విషయాన్ని గ్రహించడానికి వ్యాకరణం ఉపయోగపడుతుంది.   ఉదా: ధీర + హితుండు అంటే ధీరులకు హితుడని అర్థం. ధీ + రహితుండు అంటే బుద్ధి లేని వాడని అర్థం. ఏ అక్షరాన్ని ఏ అక్షరంతో కలపాలన్న జ్ఞానం ఉంటేగాని సరియైన అర్ధాన్ని సాధించలేము. దానికి వ్యాకరణం ఎంతైనా అవసరం. ప్రత్యయాలు ఎక్కడ ఎలా ఉపయోగించాలి, అప శబ్దం, సుశబ్దం, వ్యాకరణ నియమాలను వ్యాకరణం ద్వారానే తెలుసుకోగలము. సీతారాములు అడవికి వెళ్లారు. బహువచనంతోనే అంతమవుతుంది. (ద్వంద్వ సమాసం) సీతారాముడు అడవికి వెళ్ళాడు. సీత యొక్క రాముడు (షష్ఠీ తత్పురుష సమాసము) ఏకవచనం అవుతుంది.

విద్యావంతులు సరియైన ఉచ్చారణ శబ్దశుద్ధితో, శబ్ద సౌందర్యంతో మాట్లాడి ఇతరులను ఆకట్టుకోవాలనుకుంటారు. అందుకొఱకు వ్యాకరణ బద్దమయిన భాష అనివార్యం.

తెలుగు వ్యాకరణాల పరిచయం:

సంస్కృత భాషలోని వ్యాకరణాలు శ్లోక రూపంలోనూ, సూత్ర రూపంలోనే ఉన్నాయి. తెలుగులో వచ్చినవి పద్యాల, సూత్రాల రూపంలో వచనాత్మకంగాను ఉన్నాయి.

ఆంధ్రశబ్ద చింతామణి:-

 దీనిని 11వ శతాబ్దం నన్నయ రచించారు. దీనిలో సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ అనే ఐదు పరిచ్చేదాలున్నాయి. 270 సూత్రాలున్నాయి. ఆర్యావృత్తాల రూపాల్లో ఉన్నాయి. ఏడు విభక్తులుగా విభజించారు. దీనిపై ఎన్నో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. సి.పి బ్రౌన్ దీనిని ఆంగ్లంలోనికి అనువదించారు.

కవి జనాశ్రయం :-

తెలుగులో వెలువడిన మొట్టమొదటి ఛందో గ్రంధం. 12 వ శతాబ్దానికి చెందిన వేములవాడ భీమకవి రచించారు. ఛందో గ్రంధమే అయినప్పటికీ వ్యాకరణాంశాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనిలో ‘సంజ్ఞ, వృత్త దోషాధికారాలున్నాయి. దోషాధికారాల్లో కుసంధి, దుస్సంధి, విసంధి అనే మూడు.

ఆంధ్రభాషా భూషణం: –

 దీని కర్త 13వ శతాబ్దానికి చెందిన మూల ఘటిక కేతన. ఇందు 192 పద్యాలున్నాయి. అవతారిక శార్దూలం, ఉత్పలమాల పద్యాలు రాశారు. వ్యాకరణాంశం చెప్పే పద్యాలన్నీ కందం, గీతం, ఆటవెలది, సీస పద్యాలే రాశారు. వర్ణాలను స్వర, వ్యంజనాలుగా విభజించారు. తెలుగు భాషను తత్సమ, తద్భవ, అచ్చ, దేశ్య, గ్రామ్యమని విభజించారు. సంబోధనతో ఎనిమిది విభక్తులుగా విభజించారు. దీనిని తొలి వ్యాకరణ గ్రంధంగా పరిగణిస్తారు.

 కావ్యాలంకార చూడామణి :

 దీనిని 15వ శతాబ్దానికి చెందిన విన్నకోట పెద్దన రాశాడు. ఆంధ్ర ఛందోలంకార వ్యాకరణ లక్షణ గ్రంధాల్లో ఇది మొదటిది. మొత్తం తొమ్మిది ఉల్లాసాలు ఇందులో ఉన్నాయి. మొదటి ఆరు       ఉల్లాసాల్లో అలంకార శాస్త్రాన్ని ఏడెనిమిది ఉల్లాసాల్లో ఛందస్సును, తొమ్మిదో ఉల్లాసంతో వ్యాకరణాన్ని గురించి వివరించాడు. కేతనను అనుసరించి వ్యాకరణం రాశాడు. వ్యాకరణ అనుషంగికాంశమైన 171 గద్య, పద్యాలున్నాయి. ఇందులో సంజ్ఞ, తత్సమ, అజంత, హలంత, సంధి, విభక్తి, సమాస, తద్ధిత ప్రకరణాలున్నాయి.

దీనికి ముందు, వెనుక వచ్చిన వ్యాకరణ గ్రంధాల్లో లేని విషయాలు ఇందులో ఉండడం విశేషం.

 ఛందోదర్పణం.:-

15వ శతాబ్దంలో అనంతామాత్యుడు సమకూర్చాడు. ఛందస్సు కోసం ప్రత్యేకంగా రాసిన గ్రంధమిది. అయినా ఇందులోని నాలుగో ఆశ్వాసంలో దోష, సంధి, సమాస, వర్ణాలకు సంబంధించిన అంశాలను వివరించారు. సంధి గురించి వివరమైన ప్రస్తావన ఉంది. సాంస్కృతిక సంధులు, విసంధిని గురించి విపులమైన చర్చ చేశాడు.

కవి చింతామణి:–

 వెల్లంకి తాతంభట్టు 15వ శతాబ్దంలో రచించారు. ఇందులో 4 అధికారాలున్నాయి. 1. భాషా లక్షణాధికారం  2. వర్ణనీయాధికారం 3. వళి ప్రసాధికారం 4. దోషాధికారం. దీనిలో పోతన భోగినీ దండకం, నారాయణ శతకం, శ్రీనాధుని కాశీఖండం, పినవీరభద్రుని శృంగార శాకుంతలం గ్రంధాల్లో పద్యాలను ఉదహరించాడు.

ఇతర వ్యాకరణ గ్రంధాలు:-

16 శతాబ్దంలో చిత్రకవి పెద్దన రాసిన లక్షణ సార సంగ్రహం, 17 వ శతాబ్దానికి చెందిన వార్తాకవి రఘునాథయ్య రచించిన లక్షణదీపిక 17వ శతాబ్ది గణవరపు వేంకటకవి సీసమాలికలో రచించిన ఆంధ్ర కౌముది, ఆంధ్ర ప్రయోగ రత్నాకరం. 18వ శతాబ్దంలో కూచిమంచి తిమ్మన రాసిన సర్వలక్షణ సారసంగ్రహం. 18 వ శతాబ్దంలో అడిదము సూరకవి రచించిన కవి సంశయ విచ్ఛేదం. ఉప్పులూరి వేంకటరెడ్డి రచించిన సకలలక్షణసారసంగ్రహ చింతామణి. కస్తూరి రంగకవి రాసిన ఆనంద రంగరాట్చందం. 19వ శతాబ్దంలో పట్టాభిరామ శాస్త్రి రచించిన పటాభిరామ పండితీయం, చిన్నయసూరి పద్యాంధ్ర వ్యాకరణం. నరసింహకవి లక్షణనవరత్నమాలిక, మల్లంపల్లి మల్లికార్జున శాస్త్రి పద్యాంధ్రవ్యాకరణం మొదలగు వ్యాకరణ గ్రంధాలు వెలువడ్డాయి. పాఠకుల దగ్గరకు వెళ్లిన వ్యాకరణ గ్రంధాలు కందుకూరి వీరేశలింగం రచించిన సంగ్రహ వ్యాకరణం, వావికొలను సుబ్బారావు సులభ వ్యాకరణం, నేలటూరి పార్థ సారథి అయ్యంగార్ రాసిన ఆంధ్ర వ్యాకరణ సర్వస్వం, మల్లాది సూర్య నారాయణశాస్త్రి రాసిన ఆంధ్ర భాషానుశాసనం, వేదం వేంకటరామశాస్త్రి, శిశు వ్యాకరణం, వడ్లమూడి గోపాలకృష్ణయ్య రాసిన వ్యావహారిక భాషా వ్యాకరణం మొదలైనవి.

బాలవ్యాకరణం వైశిష్ట్యం : –

 చిన్నయసూరి 1840లో పద్యాంధ్ర వ్యాకరణం, 1842లో శబ్దశాసన పద్యాంధ్ర వ్యాకణం, 1853లో శబ్ద లక్షణ సంగ్రహము మొదలైనవి బాలవ్యాకరణానికి ముందుగా రాశాడు. చిన్నయసూరి అంతకు ముందు వచ్చిన వ్యాకరణ గ్రంధాలను పరిశీలించి వాటిలోని లోపాలను సవరిస్తూ సూత్రబద్దంగా బాలవ్యాకణాన్ని రాశాడు. శృతి సుభగమైన సూత్రరచన, ఉచితమైన ప్రయోగాలు ప్రాచీన వ్యాకరణాలను అనుసరిస్తూనే కొత్త పంథాలో భాషను వ్యాఖ్యానించడం మెదలైన సుగుణాలు బాలవ్యాకరణంంలో ఉన్నాయి. వెయ్యేళ్ల తెలుగు కావ్య భాషకు సంబంధించిన వర్ణనాత్మక వ్యాకరణం. దీనిని వర్ణనాత్మక వ్యాకరణంగా పరిగణించకుండా నిర్ధేశాత్మక వ్యాకరణంగా బోధించడం వల్ల అనేక విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. విమర్శల వల్ల దాని ప్రాధాన్యం మరింత పెరిగి తిరుగులేని వ్యాకరణంగా నిలిచిపోయింది. దీనిలో 1. పరిచ్ఛేదాలు 2. సూత్రాలు 3. వృత్తులు 4. లక్ష్యాలు 5. సంజ్ఞలు 6. ఇత్సంజ్ఞలు 7. పరిభాషలు 8. వార్తికాలు 9. గణాలు 10. కార్య విధానాలు.

బాలవ్యాకణంలో పది పరిచ్చేదాలు భాషకు సంబంధించిన పది అంశాలు వివరిస్తాయి.

బాలవ్యాకరణంము లక్షణాలు:-

సూత్రాలన్నీ సంక్షిప్తంగా సూటిగా ఉంటాయి.

సందిగ్ధత ఉండదు.

ఏ సూత్రము నిస్సారంగా ఉండదు.

ఒక ప్రయోగం కోసం చేసిన సూత్రం మరో చోట కూడా ఉపయోగపడుతుంది.

ఏ సూత్రం కూడా అర్థరహితముగా ఉండదు.

నిర్దుష్టంగా ఉంటుంది.

మాటలు సౌమ్యంగా ఉంటాయి.

సూత్రాలు చదువుతు ఉంటే శ్రవ్యంగా ఉంటాయి.

చదువరులకు మరీ మరీ చదవాలనిపిస్తుంది. ఇన్ని లక్షణాలున్నాయి. కనుక ఈ వ్యాకరణానికి అంత ప్రాధాన్యత వచ్చింది. బాలవ్యాకరణానికి ఎంతోమంది వ్యాఖ్యానాలు రాశారు.

బాల వ్యాకరణం పరిచ్చేద పరిచయం.:-

11వ శతాబ్దం నుండి 17 వశతాబ్దం వరకు వచ్చిన కావ్యాల్లోని భాషను వర్ణించిన వ్యాకరణమిది. ఇందు పది పరిచ్చేదాలు 465 సూత్రాలు, వివిధ కావ్యాల్లోని 3193 ప్రయోగాలున్నాయి.

సంఖ్యా పరిచ్ఛేదం :-

దీనియందు వర్ణ విజ్ఞానమున్నది. 23 సూత్రాలున్నాయి. మొదటి నాలుగు సూత్రాలు సంస్కృత, ప్రాకృత, దేశ్య వర్ణాలను గురించి తెలియజేస్తాయి. ఈ సూత్రాలను బట్టి ఏవి సంస్కృత వర్ణాలు, ఏవి తెలుగు వర్ణాలు అనే విషయాలు తెలుసుకొవచ్చును. పరుష, సరళాలు, దంత్య, తాలవ్య భేదం గురించి ప్రత్యేకంగా చెప్పాడు. యకారంబు, వు, వూ, వొ, వో లు తెలుగు మాటలకు మొదట ఇవి రావ తెలియజేశాడు. ఆర్య వ్యవహారంబు దృష్టంబు గ్రాహ్యంబు. లక్షణ విరుద్ధాలైన ప్రయోగాలను ప్రయోగించి ఉన్నట్లయితే వాటిని సాధువులుగా గ్రహించాలని చెప్పాడు.

సంధి పరిచ్ఛేదం:

 ఒకటి కంటే ఎక్కువ పదాలు కలిసినప్పుడు జరిగే పరిణామాలను సంధి అంటాము. ఇందు సంధి విశేషాలు తెలిపే 55 సూత్రాలు చెప్పాడు. కావ్య భాషను తెలుసుకోవడానికి, భాషా చరిత్రను అధ్యయనం చేయడానికి భాషలో వచ్చిన మార్పులను గుర్తించడానికి బాలవ్యాకరణానికి మించిన సాధనం లేదు.

‘ధా’ అనే ధాతువుకు పూర్వం ‘స’ చేరడం వల్ల సంధి అనే రూపం ఏర్పడుతుంది. దీనికి చేరిక కూడిక అని అర్థం. దీనిలో మొదటి సూత్రం “ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధియగు’

నాలుగో సూత్రంలో అత్తు గురించి, ఐదో సూత్రంలో ఇత్తు గురించి చెప్పారు. ఉత్వ సంధి నిత్యం కనుక దాన్ని మొదట చెప్పారు.

సంధి జరుగు విధానం:

1.అచ్చునకు అచ్చు పరమైనపుడు.

2.అచ్చునకు హల్లు పరమైనపుడు

3.హల్లునకు హల్లు పరమైనపుడు

4.హల్లునకు అచ్చు పరమైనపుడు

ఒక్క సంధి పరిచ్ఛేదంలో అత్తు, ఇత్తు, ఉత్తు, బహుళం, వైకల్పికం, ద్రుత ప్రకృతికం, ద్రుతం, కళలు, క్వార్థం, ఆమ్రేడితం, అవసానం, అవ్యయం, ఆకృతి గణం, ఆగమం, ఆదేశం, ఏకాదేశం మొదలైన పారిభాషిక పదాలున్నాయి.

వ్యాకణం భాషా శాస్త్రంలో భాగమే. మనం చిన్నయ సూరిని భాషా శాస్త్రవేత్తగా గుర్తించాలి. తత్సమ పరిచ్చేదంలో

వ్యాకణం భాషా శాస్త్రంలో భాగమే. మనం చిన్నయ సూరిని భాషా శాస్త్రవేత్తగా గుర్తించాలి. తత్సమ పరిచ్ఛేదంలో 87 సూత్రాలున్నాయి. తెలుగు కావ్య భాషలో సంస్కృత పదాలు అపారంగా ఉన్నాయి. అవి తెలుగులో చేరినప్పుడు జరిగే మార్పులను గురించి ఈ పరిచ్ఛేదం తెలియజేస్తుంది.

సంస్కృత పదాలను తెలుగులోనికి తీసుకునేటప్పుడు పాటించాల్ని నియమాలను తెలుసుకోవడానికి ఈ పరిచ్ఛేదం ఉపయోగపడుతుంది.

అచ్ఛిక పరిచ్ఛేదం:-

ఇందులో మొత్తం 38 సూత్రాలున్నాయి. అచ్చ తెలుగు పదాలకు సంబంధించిన విశేషాలున్నాయి. మొదటి సూత్రంలో అచ్చ తెలుగు అంటే ఏమిటో వివరించాడు. ఔపవిభక్తికాలు పనిచేసే తీరును వివరించాడు. నామవాచకాలను ఉపయోగించునపుడు విభక్తులు ఉపయోగిస్తారు. ఆ విభక్తులకు ముందు ఔప విభక్తికాలు వస్తాయి. ఇ,టి,తి అనే ఔపవిభక్తికాలు ఏ ఏ సందర్భంలో వస్తాయో దీనిలో వివరించడం జరిగింది.

కారక పరిచ్ఛేదం :

దీనిలో 37 సూత్రాలున్నాయి. ఈ పరిచ్చేదంలో ప్రత్యయాలు ఎలా ప్రవర్తిల్లుతాయన్న విషయాన్ని వివరించారు. కర్త, కర్మ, కరణం, సంప్రదానం, అపాదానం, అధికరణం అనే కారకాల్లో ఏ ఏ విభక్తులు చేరుతాయో చెప్పారు.

కర్తృ:- ప్రధమ (డు) – రాముడు రావణుని చంపెను

కర్మ :- ద్వితీయ(ను) రాముడు రావణుని చంపెను

కరణం: – (తోడ) రాముడొక్క కోల తోడ వాలిని కూలవేసే

సంప్రదానం:-(కొఱకు) జనకుడు రాముని కొఱకు గణ్యనిచ్చెను

అపాదానం: – (అందు) ఘటము నందు జలమున్నది. కారక నిర్మాణాన్ని గూర్చి విపులంగా వర్ణించారు.

సమాన పరిచ్ఛేదం:

ఈ పరిచ్ఛేదంలో 26 సూత్రాలున్నాయి. సమాసాలు సంస్కృతికం, అచ్ఛికం, మిశ్రమం అని మూడు రకాలు. ‘సమర్ధంబులగు పాదంబులేక పదంబగుట సమాసంబు’ అను నిర్వచనాన్ని మొదటి సూత్రంలోనే ఇచ్చాడు. ఈ పరిచ్ఛేదం ద్వారా సమాసాలు ఏర్పడే విధానాన్ని సమగ్రంగా తెలుసుకోవచ్చు.

తద్ధిత పరిచ్ఛేదం:

ఇందులో 28 సూత్రాలున్నాయి. ఏ అర్థంలో ఏ ప్రత్యయం చేరుతుందో తెలిపేది ప్రత్యయం. తెలుగులో తనం, రికం మొదలైన భావార్థాల్లో ఏ ప్రత్యయాలు చేరుతాయో ఇందులో వివరించారు.

కృదంత పరిచ్ఛేదం :-

ఈ పరిచ్ఛేదంలో 22 సూత్రాలున్నాయి. ధాతువు మీద కృత్ ప్రత్యయం చేరినప్పుడు కృదంతాలు ఏర్పడుతాయి. కృత్తులంటే ఏమిటో ప్రయోగాన్ని బట్టి తెలుసుకోవాలని చెప్పాడు. ఇందు 24 ప్రత్యయాలున్నాయి.

క్రియా పరిచ్ఛేదం:–

 బాలవ్యాకణంలో అతి దీర్ఘమైన పరిచ్ఛేదమిది. ఇందులో 124 సూత్రాలున్నాయి. భాషలో క్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడం వల్ల ఈ పరిచ్ఛేదానికి ప్రాధాన్యత పెరిగింది.

సమాపక, అసమాపక క్రియా నిర్మాణం, ధాతుజ విశేషనిర్మాణం, సకర్మక ధాతునిర్మాణము, ప్రేరణాత్మక ధాతు నిర్మాణం, తత్సమ, ఆచ్చిక ధాతు నిర్మాణము మొదలైన అంశాలకు సంబంధించిన వివరణలు ఇందులో ఉ న్నాయి. తెలుగు భాషలో క్రియా స్వరూపాన్ని సంపూర్ణంగాను, సమగ్రంగానూ ఈ పరిచ్ఛేదం ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రకీర్ణ పరిచ్ఛేదం:– ఇందులో 25 సూత్రాలున్నాయి. మిగిలిన అంశాలను ఈ పరిచ్ఛేదంలో చెప్పడం జరిగింది.

బాల – ప్రౌడ వ్యాకరణాలు :-

బాలవ్యాకరణం అంత ప్రసిద్ధిపొందిన వ్యాకరణం త్రిలింగ లక్షణ శేషమనే ప్రౌఢవ్యాకరణం. దీన్ని 1885లో బహుజనపల్లి సీతారామాచార్యులు రాశారు. బాలవ్యాకరణంలో చెప్పని అంశాలను, సరిదిద్దవలసిన అంశాలను ఇందులో చెప్పినందువల్ల దీన్ని బాలవ్యాకరణ పూరక గ్రంధంగా పండితులు భావిస్తారు.

సంజ్ఞ, సంధి, కారక, సమాస, తద్ధిత, క్రియ, కృదంత అన్న ఏడు పరిచ్ఛేదాల పేర్లు రెండు వ్యాకరణాల్లోనూ సమానంగా ఉన్నాయి. బాలవ్యాకరణం అన్న పేరులోనే అది ఎవరిని ఉద్దేశించిందో తెలుస్తోంది. తన కన్నా ముందు వచ్చిన వ్యాకరణ గ్రంధాల్లో లోపాలున్నందువల్ల చిన్నయసూరి సంస్కృతంలో ఒక సూత్ర గ్రంధాన్ని రాశారు. కానీ అది బాలురకు అంటే వ్యాకరణ శాస్త్రాన్ని చదవడం ప్రారంభించిన వాళ్లకు సుసాధ్యంగా లేదు. అందువల్ల బాల వ్యాకరణం రాయవలసి వచ్చింది. అంటే బాల వ్యాకరణం వ్యాకణాన్ని చదివే ప్రారంభకులకు పనికి వచ్చే గ్రంధమన్నమాట.

బాలవ్యాకరణం ప్రారంభకులకు, బాల వ్యాకరణం చదివిన వాల్లకు ఈ ప్రౌఢ వ్యాకరణం చదవాల్సిన గ్రంధమన్నమాట.ప్రౌఢ వ్యాకరణంలో విశేష లక్షణ ప్రయోగాలున్నాయి. సామాన్య ప్రయోగాలన్నీ బాల వ్యాకరణంలోనే వచ్చేశాయి. ప్రౌఢ వ్యాకరణానికి త్రిలింగ లక్షణ శేషంబు అని పేరు పెట్టారు. శేషంబు అనే మాట బాలవ్యాకణంలో మిగిలిపోయిన ప్రయోగాలకు సంబంధించిన లక్షణాలు ఇందులో ఉన్నాయన్నమాట.

కనుక కారక, సమాస పరిచ్చేదాలు పరిశీలిస్తే…..

కారక పరిచ్ఛేదం :-

 ఈ పరిచ్ఛేదం వాక్యంలో ఏ పదానికి ఏ సందర్భంలో ఏ ప్రత్యయం చేరుతుందో తెలుపుతుంది. ఒక విభక్తి రావలసిన చోట ఏయే ఇతర విభక్తులు రావచ్చో ఈ పరిచ్ఛేదం తెలుపుతుంది. సంస్కృతంలాగే తెలుగులో కూడా ఏడు విభక్తులను తీసుకోవడం వల్ల సంస్కృత విభక్తులకున్న అర్థాలనే తెలుగులో కూడా తీసుకోవలసి వచ్చింది. ద్రావిడ భాషల్లో స్వతంత్ర్య పదాలు కూడా విభక్తులుగా భావించలేము. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవలసిందేమిటి అంటే బాలవ్యాకరణం కావ్య భాషను సమగ్రంగా విశ్లేషించడం ద్వారా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

కారకానికి సంబంధించి ఈ రెండు వ్యాకరణాలను పరిశీలిస్తే… బాలవ్యాకరణంలోని కారక పరిచ్ఛేదంలో 37 సూత్రాలున్నాయి. ప్రౌఢ వ్యాకరణంలో 27 సూత్రాలున్నాయి.

1.బాల వ్యాకరణం కారకాన్ని క్రియా జన్యమంటే ప్రౌఢ వ్యాకరణం కారకాన్ని క్రియాన్వయం అంటుంది. మహా భాష్యం “కరోతీతి కారకం” అన్నది. దీన్ని బట్టి కారకమనేది క్రియా జనకమే. కారకానాం క్రియాన్వయ: అన్నది కుదరదు. కనుక ప్రౌఢ వ్యాకర్త చెప్పిన “కారకంబునం గర్మాదులు అన్న మొదటి సూత్రమే వివాదాస్పదమైంది.

2.బాలవ్యాకరణం సమాస పరిచ్ఛేదంలో 26 సూత్రాలున్నాయి.

ప్రౌఢ వ్యాకరణంలో 43 సూత్రాలున్నాయి. బాలవ్యాకరణానికి మినహాయుంపుగా సవరణగా, పూరణగా ప్రయోగాలు సేకరించి బహుజనపల్లి సీతారామాచార్యులు వ్యాకరణం రాసినా అది బాల వ్యాకరణానికున్న ప్రసిద్ధిని తగ్గించలేకపోయింది. ఇంకా పెంచింది. దానిక్కారణం బాల వ్యాకరణంలోని విశిష్టమైన రచనావిధానం. ప్రౌఢ వ్యాకరణం సాధారణ ప్రయోగాలకు సంబంధించినది.

బాలవ్యాకరణం సాధారణ ప్రయోగాలకు సంబంధించినది.

సాధారణ ప్రయోగాలకు విశేష ఆదరణ లభించింది. అందువలన బాలవ్యాకరణం 150 ఎళ్లయినా అగ్రస్థానంలో

ఉంది.

బాల వ్యాకరణ సంజ్ఞలు :-

(పారిభాసిక పదాలు) ఏ శాస్త్ర గ్రంధ రచనకైనా సంజ్ఞలు లేదా సాంకేతిక పదాలు లేదా పారిభాషిక పదాలు అవసరము. శాస్త్ర గ్రంధాల్లో అన్ని చోట్లా విషయాన్ని వివరించి చెప్పడం కష్టం. ప్రత్యేకించి వ్యాకరణాన్ని సూత్ర రూపంలో రాస్తున్నప్పుడు సంజ్ఞలు అనివార్యం. అందువలన వ్యాకర్తలందరూ తమ లక్షణ గ్రంధాల్లో పారిభాషిక పదాలను ఉపయోగించుకున్నారు. అలాగే చిన్నయసూరి కూడా బాలవ్యాకరణంలో అనేక పారిభాషిక పదాలను ఉపయోగించాడు.

వ్యాకరణ గ్రంథాల్లో పారిభాషిక పదాలు

అష్టాధ్యాయి:

ఆమ్రేడితం, నామం, విభక్తి, ఉపధ, అధికరణం, ప్రధమ, మధ్యమ, ఉత్తమ, కృత్తు, తద్ధితం మొదలైనవి ఉపయోగించడంజరిగింది.

ఆంధ్రశబ్ద చింతామణి: –

 వక్రం, వక్రతమం, పరుషాలు, సరళాలు, స్థిరాలు, సవర్ణం, ద్రుతం, ద్రుత ప్రకృతికం, కళ, తత్సమ, తత్భవ, దేశ్య, గ్రామ్యాలు, సంధి, సంశ్లేష, వర్ణకం, మహత్తు, ఔపవిభక్తికం మొదలైనవి.

అధర్వణీయం :=

 శబ్దపల్లవ, సంజ్ఞ మొదలైనవి.

ప్రాకృతం :-

వర్గులలోని సరి వర్ణాలకు యుక్కులు, యుగ్మాలు అని, వర్గులలోని బేసి వర్ణాలకు అయుక్కులు, అయుగ్మాలు అనీ ప్రాకృత వ్యాకరణంలో ప్రయోగం. దీన్ని బట్టి చిన్నయసూరి వర్గ యుక్కులు అనే సంజ్ఞ తెచ్చుకున్నాడు.

చిన్నయసూరి- డుమంతం, త్రికం, ముత్తు మొదలైనవి. బాలవ్యాకరణంలో సుమారు 150కి పైగా పారిభా షిక పదాలు కనిపిస్తాయి.

పారిభాషిక పదాల-వివరణ: –

అకర్మకం:- కర్మను కాంక్షించకుండా ఉండేది.

ఆగమం:- ఉన్న వర్ణాలకు తోడుగా మిత్రునిలా వచ్చి చేరేది.

ఆదేశం:- ఉన్న వర్ణాన్ని తొలగించి శత్రువులా వచ్చి చేరేది.

ఉపధ:- తుది వర్ణానికి ముందున్న వర్ణం.

ఉత్తమ పురుషః – తనను గురించి చెప్పుకోవడం.

ఔపవిభక్తికం:- విభక్తి కారణంగా ఆదేశంగా గానీ ఆగమంగా గాని విభక్తుల ముందు చేరే ఇ, టి, తి అనే వర్ణాలు.

కరణం: – ‘క్రియా సిద్దిం ప్రకృష్ణోప కారకంబు కరణంబు’ అనేది నిర్వచనం. క్రియా సిద్ధికి ఎక్కువగా ఉ పకరించేది కరణం. క్రియ నెరవేరడానికి పనికి వచ్చే సాధనాల్లో ఏ సాధనం ఆ క్రియను నెరవేరుస్తుందో దాన్ని కరణం అంటారు. కారణార్ధంలో ప్రాతిపదికకు చేత, తోడ, అనే ప్రత్యయాలు చేరతాయి.

కర్త: – ‘థాత్వర్ధ వ్యాపారాశ్రయశంబు కర్తనాబడు ‘ అని చిన్నయసూరి నిర్వచనం. ధాతువుకు రెండర్థాలున్నాయి. 1. ఫలం 2. వ్యాపారం ఫలాన్ని ఆశ్రయించేది కర్మ. ఉదా:- దేవదత్తుడు వంటకము వండెను. వండుట అనే క్రియ వల్ల సిద్ధించిన ఫలంవంటకము. కర్మార్ధంలో ప్రాతిపదికకు ద్వితీయా విభక్తి ప్రత్యయం చేరుతుంది. మహతి:- స్త్రీలను తెలిపే విశేష్యాలు.

విధి:- చేయమని ఆజ్ఞాపించడం.

శబ్ద పల్లవం:- ధాతువులు మొదలైన వాటికి ధాతువులు అనుప్రయుక్తాలై విలక్షణమైన అర్థాన్ని బోధించే శబ్దాలను శబ్ద పల్లవం అంటారు. పల్లవం అంటే చిగురు, రెండు దళాలు ఒకటై చిగురు అయినట్లు. రెండు శబ్దాలు కలిసి ఒక శబ్దంగా ఏర్పడడం వల్ల శబ్ద పల్లవం అనే పేరు వచ్చింది. లక్షణాలు:- 1. మొదటి రూపం ధాతువు గానీ, మరోకటి గానీ అయి ఉండాలి.

2.రెండోరూపం తప్పనిసరిగా ధాతువే అయి ఉంటుంది.

3.ఇవి కలిసి ఏర్పడిన రూపం విలక్షణమైన అర్థాన్ని బోధిస్తుంటుంది.

4.శబ్ద పల్లవాలు ఏర్పడేటప్పుడు ఆగమం, ఆదేశం. లోపం మొదలైన వ్యాకరణ కార్యాలు జరుగుతాయి. పాణినిని పాశ్చాత్యులు భాషా శాస్త్రవేత్తగా గుర్తించి ఆయన అష్టాధ్యాయికి విశ్వస్థాయి గుర్తింపును తెచ్చిపెట్టారు. పాణిని బాటలో నడిచిన చిన్నయసూరికి కనీసం దేశస్థాయిలోనయినా గుర్తింపు తీసుకురావలసిన అవసరాన్ని మనం గుర్తించాలి. ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు వ్యాకరణ విజ్ఞానం గ్రంధం ద్వారా సంపూర్ణమైన జ్ఞానాన్ని అందించారు. ముందుగా వ్యాకరణాన్ని పరిచయం చేసి, వ్యాకరణం ఎంత ప్రాచీనమైనదో తెలిపి వ్యాకరణం వ్యుత్పత్తి, నిర్వచనం, ప్రయోజనాలు, వ్యాకరణ చరిత్రను పరిచయం చేశారు. బాలవ్యాకరణంలోని పది పరిచ్ఛేదాలను చక్కగా విశ్లేషించారు. బాల, ప్రౌఢ వ్యాకరణాలను తులనాత్మకంగా పరిశీలించి, చివరకు పారిభాషిక పదాలను వివరించారు.

వ్యాకరణ సముద్రంలో మునిగి తేలి ఆ ముత్యాలను మనకు అందించిన విజ్ఞాని మాడభూషి సంపత్ కుమార్ గారికి మనము ఎంతో రుణపడి ఉన్నాము. ఈ వ్యాకరణ విజ్ఞానం గ్రంధాన్ని ప్రతీ ఒక్కరూ చదివి

వ్యాకరణ సముద్రంలో మునిగి తేలి ఆ ముత్యాలను మనకు అందించిన విజ్ఞాని మాడభూషి సంపత్ కుమార్ గారికి మనము ఎంతో రుణపడి ఉన్నాము. ఈ వ్యాకరణ విజ్ఞానం గ్రంధాన్ని ప్రతీ ఒక్కరూ చదివి వ్యాకరణాన్ని అవగాహన చేసుకొని ఆస్వాదించి భాషపై ఆధిపత్యాన్ని పొంది తరువాత తరాలకు ఈ విజ్ఞానాన్ని అందించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. వ్యాకరణ విజ్ఞానాన్ని చదివి జ్ఞాన పరిధులను విస్తృత పరుచుకొని తెలుగుభాషను ఇంకా సుసంపన్నం చేద్దాం. భాషాశాస్త్రవేత్త సంపత్ కుమార్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు

తెలుపుకుంటూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.

ఆధార గ్రంథాలు:

  1. లలిత. జి -తెలుగు వ్యాకరణ చరిత్ర

  2. రామకృష్ణరావు. వంతరాం – ప్రౌఢవ్యాకరణం ఘంటాపదం,

  3. రామకృష్ణరావు. వంతరాం పున్నారావు. ఆకురాతి – సంస్కృతంలోని ప్రసిద్ధాంద్ర వ్యాకరణాలు పురుషోత్తం. బొడ్డుపల్లి తెలుగు వ్యాకరణ వికాసము రాజేశ్వరశర్మ. ఎ. ఆంధ్ర వ్యాకరణ వికాసము.                                                                                                                                                                            బలరామమహంతి శశికళ.

  4. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్ధిని~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో