ఒక్కడినే
నా లోపలికెళ్లి తలుపేసుకున్నాను..
అలంకార అహంభావాలను
బరువు,పరువులని ఒలిచి పక్కన పెట్టి
నిజాలతో నగ్నంగా
మూల మూలలో కెళ్లి పారేసుకున్నవి
పోగొట్టుకున్నవి వెతుకుతుంటే
గుట్టల జ్ఞాపకాల మధ్య
స్పృహ కోల్పోయిన కట్టల కొద్ది కలల్లో
ఒక్కో కల ఒక్కో కవితగా
గూడుకట్టుకున్న సంకలనం
చీకటి తుపానుకు
మూలకు విసరకొట్టబడటం చూసాను..
తెరిచేకొద్దీ ,నోటికి తగిలే
పగిలిన పదాలపై నా కంటి ముద్రలే
నా కళ్ళను గెలి చేశాయి
విరిగిన వాక్యాలపై నా కాలి ముద్రలే
నా నడకను తప్పుపట్టాయి.
ముఖంలోకి అపరిచిత ప్రశ్నలు దూకి
మెదడులో దుమ్ము రేపుకుంటూ
జవాబులు నేరుగా చొక్కాపుచ్చుకుని
గతంలోకి వర్తమానాన్ని ముంచి కడుగుతుంటే……
కళ్ళ వెంట కారే మలినాలకు
రెప్పల రెక్కలు శుభ్రపడి
నిన్న ఆగిన కల
రాత్రికి కబురు పంపింది..
మంచి నిద్రను వండిపెట్టమని….
బాగా బరువైన పేజీకి వ్రేలాడే
నా కోరిక బొట్లు బొట్లుగా కరిగి
నల్లని మంచుగడ్డలా మారి
సెగలు కక్కి చల్లని మంటలకు
కొంగర్లు పోతున్న వాక్యాలు
నుదుట కోరికలై దర్జాగా నడుస్తుంటే
మసకపడేలోగే వెలుగు వాకిలి
తెరుచుకుని నా నుండి బయటకొచ్చా…
-చందలూరి నారాయణరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~