కానీ ఎందుకు!?
అని కొన్నింటిని అడగాలని వుండదు
ఎలా ఇలా!?
అని కొందరిని నిలదీయాలనీ అనిపించదు
రెక్కలు పుచ్చుకు లాగుతున్న
బంధాలతో కలిసి వెళ్ళిపోలేనప్పుడు
అతుకుల బొంతలాంటి
జీవనాన్ని సాగించలేనప్పుడు
మధ్యే మార్గంగా మౌనాన్ని ఆశ్రయించాల్సిందే
కాదూ కూడదని
కన్నీరు కలలను కడగడం ప్రారంభించినప్పుడు
మనసుకు మనసుకు
దూరం పెంచుకుంటూ
మనిషికీ మనిషికీ నడుమ
కాస్త కాస్తగా కంచెను వేసుకుంటూ
అల్లుకుపోయిన ప్రేమలను
పాతుకుపోయిన అభిమానాన్ని
లోతుకు పోయిన ఆత్మీయతను
పెకలించవలసిందే
నూనూగు హృదయ స్పర్శను
గరకుగా మార్చుకోవలసిందే….
-సుధా మురళి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~