ఓ సఖి …
నీవే సర్వమంటూ పబ్బం గడుపుకునే
పగటివేషగాళ్లను గుర్తించలేక,
ఎవరికోసమో నీ అస్తిత్వాన్ని సమాధిలో
నిక్షిప్తం చేసుకుంటున్నావా..?
ఆశల చెట్టును కూకటి వేర్లతో కూల్చేసుకుని,
నిరాశల మొక్కలను పెంచి పోషిస్తున్నావా…!
మిగిలేందటని నిన్ను నీవు ఎప్పుడైనా
ప్రశ్నించుకున్నావా..?
నీ చెంపలపై చారికలు తుడిచేవారు లేరు.
మరి నీ మనస్సు కార్చే రుధిరజలధార
కనబడేదెవరికి..?
గోచరమయ్యే పచ్చదనాన్ని ప్రేమ అనే
ఊహలజగతిలో నీ బానిసత్వానికి నువ్వే
రాచబాట ఏర్పరుచుకున్నావు
లోకం లోతంత ఉబ్బలిలో దిగబడిపోయావు.
ఇప్పుడు
ఎన్ని రాత్రులు నీలో నువ్వే
తలదాచుకుంటావు..!
ఉషోదయాలన్నీ చీకటి గోళం వెనుక
ఛాయలే…!
ఒక్కసారి అవలోకించు …
అభిమానమనే నిస్సహాయ లోకంలో
అభిసారికవై
ఎన్నాళ్ళు నీ ఈ అలుపెరుగని గమనం…!!
-రాధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~