చెమట చెలక నా నొసట….
పొర్లి పోతున్న మట్టపొరల వరద నా దేహం….
ఎంత పోరినా పొద్దు గడవదు..
ఎంత దేవినా నా బతుకు గిన్నెలో మెతుకు దొరకదు…
నన్ను పొదుగును చేసిన వ్యవస్థలో…
ఎండిన కళేబారాన్ని నేను….
రేపటి నన్ను
ఈ రోజే తాకట్టు పెట్టి…
వ్యూహాత్మకంగా నా ఉపాదిని కొల్లగొట్టి….
పాలకుల పెట్టుబడి దారుల పెనవేతల్లో….
కొంప కూలగొట్టబడి … కడుపు కాలబెట్టబడి..
పతనమైన తరానికి ప్రతినిధిని నేను…
కరువు బతుకును బరువుగా మోసుకుంటూ
వాలిన చోటల్లా నిలువనీయని
ఏదో ఒక అగంతక సంక్షోభానికి అలుసును నేను….
విమోచన లేని శాపంలా…విరామమెరుగని గమనంలా….
రెక్కలవిస్తున్న ద్వీపాంతర పక్షిని నేను….
చీకటింట చిట్లుతున్న ఆలు బిడ్డల్ని…
మంచాన మగ్గుతున్న ముసలి తల్లిదండ్రుల్ని..
యాదికి తెచ్చుకున్న క్షణాల్లో….
దుఃఖం వలపోసుకున్న ఎన్నో విషాద రాత్రులు నేను….
చావలేక బతకలేక సగం తెగిన వానపాము దుస్థితి నేను…
లోలోపల అగ్ని సెగలు ఎగజిమ్ముతున్నా…
పచ్చని కలలకోసం..
క్షణాల్ని కన్నీళ్ళుగా రాల్చుతున్న నిరీక్షణ నేను…
తెల్లవారితే మట్టి పొరల్లోకి ఓ త్రోవను
వెదుక్కునే అనివార్యపు జీవన పోరాటం నేను….
-కలమట దాసుబాబు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~