పుట్టింటి మట్టి…(కథ ) – హేమావతి బొబ్బు

నా కూతుళ్ళు హరిజా, విరిజా దిగులు మొహాలతో బుజాలు భూమిలోకి వంచుకొని మరీ నడుస్తున్నారు,  ఇంటి వైపు. నాకు వాళ్ల దిగులు మొహాలు చూస్తుంటే ఏడుపు ఆగడంలేదు. నా కన్నీళ్ళను వాళ్ళకి కనిపించకుండా దాయడానికి నేను చాలా కష్టపడుతున్నాను.

విరజా చిన్నగా పిలిచాను…………ఏంటమ్మా అంది వంచిన తల ఎత్తకుండా. ఇక్కడ జరిగిన విషయాలు నాన్నతో చెప్పకండమ్మా అన్నాను. విరజా చటుక్కున తల పైకి ఎత్తి ఎలా చెప్తామని నీవనుకున్నావమ్మా అంది. చిన్న పిల్లలు, రంగుల ప్రపంచాన్ని ఇప్పుడే తమ విప్పారిన కళ్ళతో చూస్తున్నవారు, బాధను, అవమానాన్ని దిగమింగుకొంటున్నారు.  హరిజా వంచిన తల ఎత్తకుండా నడుస్తున్నది మా ఇంటి వైపు. ఆయన గడప దగ్గర ఇంకా మేము రాలేదేమని ఎదురు చూస్తున్నాడు.

మేము దగ్గరకు వెళ్ళగానే, హరీ ఏంటమ్మా చీకటి పడే లోపే ఇల్లు చేరవచ్చుగదా. ఊ………… ఫంక్షన్ బాగా జరిగిందా అంటుంటే వంచిన తల ని బలవంతంగా పైకి ఎత్తి ఆ….అ………….నాన్న చాలా బాగా జరిగింది నాన్న, అంటూ ఎక్కడలేని సంతోషాన్ని తమ కంఠంలో చూపుతూ, నాన్న నీవు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. అమ్మమ్మ, తాతయ్య నిన్ను మరి మరి అడిగారు తెలుసా…….. అని అంటూ హరిజా వాళ్ళ నాన్న భుజాల చుట్టూ చేతులు వేసి అయన్ని ఇంట్లోకి తీసుకొని పొతూ నా వైపు చూసి నవ్వింది.  నాన్న అంటే అంత ప్రేమ దానికి.

మేము నిశ్శబ్దంగా ఇంట్లోకి నడిచాము. హరిజా ఆ క్షణం ఎంత పెద్దదైపొయిందో నా కంటికి . ఆయనకు, అదే మా బావకు పిల్లలంటే ప్రాణం.  వాళ్ళకి కూడా ఆయనంటే అంత అనురాగం. ఆయన వాళ్ళతో, రండి భోజనం చేద్దాం అంటూ పిలుస్తున్న మాటలు లోపల బట్టలు మార్చుకుంటున్న నాకు వినబడుతూనే ఉన్నాయి. విరిజా, నాకు ఆకలి లేదు నాన్న అంటుంటే, బంగారం నువ్వు తినకపోతే నేను కూడా తినను అని ఆయన మారాం చేస్తున్నాడు.

అమ్మా తొందరగా రా , భోజనం వడ్డిస్తున్నాను అని హరిజా గట్టిగా కేక వేసి నన్ను పిలిచింది. ఆ వస్తున్నా అంటూ నేను వెళ్ళగానే, మా బావ నా వైపు చూస్తూ, ఈ రోజు షాప్ కి కస్టమర్లు చాలా మంది వచ్చారు, చాలా ఆర్డర్లు వచ్చాయి, పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకే పెళ్లి కార్డుల ప్రింటింగ్ వేగంగా జరుగుతోంది, లేకపోతే నేను మీతోనే వచ్చేవాడిని. నేను మీ ఇద్దరిని చాలా మిస్ అయ్యాను తెలుసా.  ఒక్కరోజైనా నా బంగారు తల్లులు నాకు కనబడకపోతే నా కెంత దిగులు, అంటూ ఆకలి దంచేస్తోంది ఈరోజు…………  ఇంకా కొంచెం వడ్డించు హరీ అంటూ తినసాగాడు. దిక్కులు చూస్తున్న విరజాని, హరిజా కళ్ళతోటే బెదిరించింది, తినమని అంటూ. నేను మనస్సులో నువ్వు రాకపోవడమే మంచిదైంది, వచ్చి ఉంటే……….ఆ తర్వాత ఆలోచించడానికి నాకు మనస్కరించలేదు.

హరిజా వాళ్ళ నాన్న మాటలకి గట్టిగా నవ్వుతూ నాన్న నీకు మా మీద దిగులా లేక అమ్మ మీద. నాన్నా నాకు తెలుసు ……………  అంటూ వాళ్ళ నాన్నను చూసి కిసుక్కున నవ్వింది. మా బావ కూడా తన నవ్వుతో జత కలిపాడు.

మా పిల్లలను చూస్తే నాకు, మా బావకు కూడా ఎప్పుడూ చాలా గర్వం. మొదట్లో అందరూ అనేవారు “మీకిద్దరూ ఆడపిల్లలేనా అని” ………. కానీ మా పిల్లలు ఎదిగేకొద్ది వాళ్ళ అందాన్ని, అణకువని చూసి ముచ్చటపడని వాళ్ళు లేరు. నాకు ఇంటిపని, వంటపని లో ఎంతో సాయంగా  ఉంటారు. ఇద్దరూ చదువులోనూ ముందంజలో ఉండేవాళ్ళు. మా హరిజా తన పదవ తరగతి పరీక్షలలో టౌన్ ఫస్ట్ వచ్చి ఇప్పుడు చైతన్యాలో ప్రీ సీట్ తెచ్చుకొని మెడిసన్ కి తయారవుతోంది.

ఇక మా బావ స్వయంగా నాకు మేనత్త కొడుకు. బావది డిగ్రీ అవ్వగానే, మా నాన్న తన అక్క కొడుక్కి కూతురునిచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం నేను సుఖంగా ఉంటుంది అని తలచి మాకు   పెళ్ళి చేశాడు.  మా బావకి చిన్ననాటి నుండి నేనంటే ఎంతో ఇష్టం. అందుకే మా అత్తయ్య వచ్చి అడగ్గానే మా నాన్న ఒప్పుకున్నారు.

మా అత్తకి తన తమ్ముడి కూతుర్ని చేసుకుంటే తన తమ్ముడు తనకు మరింత దగ్గర అవుతాడు. రెండు కుటుంబాలు మరింత కలసిపోతారు. తమ్ముడు బాగానే సంపాయించాడు గనక పెట్టుపోతలు బాగానే ఉంటాయి, అని పెళ్ళికి రాయబారిగా వచ్చింది. ఎలాగో అయితేనేమి మా బావ కోరిక నన్ను చేసుకోవాలని, పెళ్ళయ్యాక మా బావ నన్ను ప్రాణంగా చూసుకున్నాడు.

మా బావ చేసేది చిన్న ఉద్యోగం అయినా నేను ఏమడిగినా అది తెచ్చి పెట్టాడు. మా బావ వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమి లేకపోయె. అందుకే మా అమ్మకి అల్లుడిని చూస్తే కొంచెం చిన్న చూపు. ఆఖరికి మా నాన్న కూడా నేను పుట్టకముందు బ్రతుకుకి చాలా కష్టాలు పడినవాడేనంట. నేను పుట్టాక అదృష్టం కలిసి వచ్చి వ్యాపారంలో బాగా ఎదిగాడు. అందుకే మా నాన్న నా ముగ్గురు అన్నయ్యలకంటే నన్ను బాగా గారం చేసేవాడు. కాలేజీలో సీటు రాగానే  నాకు స్కూటీ తెచ్చిచ్చాడు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి డ్రెస్స్ అమ్మ నాకు వెంటనే తెచ్చేది.

అమ్మా, నాన్న, అన్నయ్యలు పంచిన మమతానుబందాలను, మా పుట్టినింటి మట్టిని పెళ్ళయ్యాక నా వెంట తీసుకు పోయాను మా మెట్టినింటికి.  ఏంటిది ఇందులో మట్టి ఉంది అని మొదట్లో మా బావ ఆశ్చర్యంగా  నా వైపు చూసినప్పుడు నేను సిగ్గుపడుతూ నవ్వాను. ఇప్పటికి ఎప్పుడైనా నా పుట్టింటి వాళ్ళు గుర్తుకు వస్తే వెండి భరిణె లోని చిటికెడు మట్టిని నా గొంతులో వేసుకొని నా గుండెను ఆ ప్రేమతో నింపుకొంటా మనస్సునిండా.   ఏమేమి దాచావు నువ్వు ఆ వెండి భరిణె లో మాకు తెలియకుండా, అద్బుత దీపంలా దానిని రుద్దితే ఏదైనా భూతం ప్రత్యక్షం  అవుతుందా మీ ఆఙ్ఞ అంటూ, పకపక నవ్వుతూ నా పిల్లలు, మా బావ నన్ను అప్పుడప్పుడూ ఆటపట్టిస్తుంటారు.  అన్నయ్యలు  నాకోసం ప్రేమగా బాంబే నుండి తెచ్చిన పూసల గొలుసులు, వెండి పట్టీలు నా కూతుళ్ళకు అలంకరించి నన్ను నేను మరుస్తూ ఊహల్లో  నా చిన్న తనానికి వెళ్ళిపోతుంటాను ఒక్కొక్కసారి.

పెళ్ళయ్యాక మా బావకి వ్యాపారం కూడా పెట్టించాడు మా నాన్న. మా బావకి కాలం కలసి రాక బిజినెస్ లో చాలా నష్టం వచ్చింది, అయినా మమ్మల్ని ఏనాడూ పస్తులుంచలేదు. నన్నూ, పిల్లలని, నా పుట్టింటివాళ్ళని ఏనాడు పుల్లవిరుపు మాటలతో పలుచన చేయలేదు. తన స్నేహితుని షాప్ లో గొప్పకి పోక పనిచేస్తూ మమ్మల్ని పోషిస్తున్నాడు. కొంచం నిలదొక్కుకున్నాక మళ్లీ  బిజినెస్ చేసి బాగా సంపాయిస్తాలేవే అంటూ నా పిల్లలే నాకు ఆస్తి అంటూ ఉంటారు.

ముందు సంవత్సరం పెద్దది హరిజా పుట్టినరోజుకి బట్టలు కొనలేదని ఆయన దిగులుతో ఉంటే చూడలేక నా పెళ్ళినాటి పట్టుచీరని గాగ్రాగా దానికి కుట్టించి ఇస్తే, నాన్నా చూడు నేనెంత అందంగా ఉన్నా ఈ డ్రస్స్ లో అంటూ ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొంది తన పుట్టినరోజునాడు. మా బావ ఆ డ్రస్స్ లో తనని చూసి ఆనందం పట్టలేక నా కూతుర్లు ఎప్పటికీ  యువరాణులు అంటూ నన్ను చాటుగా పిలిచి నా బుగ్గ మీద చిటికె వేసి నువ్వెంత మంచిదానివి అన్నప్పుడు ఆయన కండ్లల్లో కోటి దీపాల కాంతి.

ఆ రోజు అత్తయ్యకి ఒంట్లో బాగోలేక హాస్పిటల్ బిల్లు విపరీతంగా పెరిగిపోతుంటే  నాన్న నా కోసం చేయించిన మక్కువతో నేను దాచుకున్న బంగారు మిరియాల గొలుసు మా బావ చేతికి ఇచ్చిన రోజు, మా బావ నోట మాట రాక తీసుకోలేక సతమతమైపోతున్నపుడు తన మొహాన్ని నా రెండు చేతుల్లోకి తీసుకొని బావా నువ్వే నా బంగారం…….  అని నేను చెప్పినప్పుడు తన పెదాల్లో కోటి మల్లెలు విరిసిన నవ్వు.  అది చాలు నాకు ఈ జన్మకి తనతో కలిసి జీవించడానికి.

ఈ రోజు నాన్న తన మనవడి బారసాల అని అందరూ తప్పక రావాలని వచ్చి పిలిచినప్పుడు మేనల్లుడి బారసాల కి వెళ్లాలని నేనెంతో ముచ్చటపడి మా తాహతుకు అందకపోయినా సవరంలో గోలుసుకొని నేను నా కూతుళ్ళు మా అన్నయ్య ఇంటికి వెళ్ళాము.  ఇల్లంతా పూలతో అగరొత్తుల వాసనలతో చుట్టాల రాకపోకలతో కళకళలాడుతోంది.నా మేనల్లుడికి దగ్గరుండి నేనే స్నానం చేయించి, సాంబ్రాణి వేసా. నేను తెచ్చిన డ్రస్సు అమ్మ వానికి వేసింది. వాడెంతో ముచ్చటగా ముద్దుగా ఉన్నాడు. బంగారు రంగులో ఉన్న వాడు ఆ ఆకాశం రంగు నీలిడ్రస్స్ లో ఎంత మెరిసిపోతున్నాడో, దానిపై ఉన్న రోజా రంగులోని పూలు, ఎగిరే బెలూన్లు ఎంత అందంగా ఉన్నాయో. నా పిల్లలు వాడిని గారం చేస్తూ ముద్దులాడుతున్నారు.

ఇంతలో మా వదిన అక్కడకు వచ్చి మొహం చిట్లించి చిరాగ్గా పెట్టి ఏంటి అత్తయ్య ఈ డ్రస్స్ వేసావు వీనికి అంటూ దానిని విప్పి పడేసి తను తెచ్చిన డ్రస్స్ వేసింది. నా పిల్లల మొహం చిన్నబోయింది. నేను వాళ్ళని కళ్ళతోనే గదమాయించాను నోరు తెరవవద్దని. నిన్న మేము పది షాపులు తిరిగాము దానిని సెలక్ట్ చేయడానికి.బంధువులందరూ వచ్చేసారని వాడిని పూలతో అలంకరించిన వెండి ఊయలలో వేసారు. నా చిన్నతనంలో నాన్న నేను పుట్టినప్పుడు చేయించిన ఊయల. అందరూ దాన్ని చుట్టుముట్టి వాడిని చూసి మురిసిపోతున్నారు. వాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మా అన్నయ్యా వదినా వాని చెయ్యి పట్టుకొని వాడి పేరుని బంగారపు పల్లెంలోని బియ్యపు గింజలపై రాపించారు. వానికి పేరు పెట్టడానికి మేనత్త ముందుండాలని, మేనత్త ఆశీర్వాదం కావాలని, మా నాన్న నన్ను పిలచి నా అల్లుడి పేరుని ఆదిత్యా అని నాచే మూడుసార్లు పలికించారు. అందరూ వాడిని చూసి మురిసిపోతూ ఆదిత్యా అంటూ గారాలు పోతున్నారు. నేను తెచ్చిన గొలుసుని మా హరిజా వాని మెడలో వేసింది. మా విరిజా వాడిని ఎత్తుకొని మురిసిపోతూ ఇల్లంతా కలియ తిరుగుతుంది.

భోజనాలు కాగానే బంధువులందరూ ఒక్కొక్కరూ బయలుదేరారు. మేము ఇక బయలుదేరతాము అన్నయ్య అన్నా. అన్నయ్య హరిజా, విరిజాల భుజాల చుట్టూ చేతులు వేసి బాగా చదవండమ్మా, మీకు ఎప్పుడు ఏమి కావాలన్నా ఈ పెద్దమామయ్య ఉన్నాడని మరవకండి అంటూ చెరో వేయి రూపాయలు ఇవ్వబోయాడు. ఇంతలో వదిన నవ్వుతూ లోపలి గదిలో నుండి వచ్చి ఒకసారి ఇటు వచ్చి వెళ్ళండి అని అన్నయ్యను పిలిచింది. అన్నయ్య ఉండమ్మ ఇప్పుడే వస్తా  అంటూ గది లోనికి వెళ్ళాడు. గంట గడిచినా ఇంకా రాలేదని అన్నయ్యకి చెప్పి వెళ్దామని అక్కడికి వెళ్ళాము, ఆ గదిలోనుండి వదిన సన్నటి లో గొంతు తో,  దానికి రాసిచ్చిన ఆస్తి తో నాలుగు తరాలు గడపొచ్చు. మొగుడూ పెళ్ళాలిద్దరూ కలిసి మొత్తం ఆస్తి హారతి కర్పూరంలా ఖర్చు చేసేసారు. ఇంకా ఏమి కావాలంట అంటూ అమ్మని, అన్నయ్యని గద్దిస్తోంది. నాకు ఒక్కసారిగా కళ్ళు గిర్రున తిరిగాయి. ఈ ఇంటిలోనే నేను పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడున్న ప్రతి వస్తువూ నాకు పరిచయమే. ప్రతి మనిషి నా రక్తమే. మేము నిశ్సబ్దంగా వెనుతిరిగాము.ప్రాపంచిక విషయాలు ఏవి పట్టక నాన్న బాధ్యతలన్నీ అన్నయ్యలకు అప్పగించి ఇంటి బయట మనవరాలిని ఆడిస్తూ,  మనవళ్ళని ముద్దుచేస్తూ…….. నాన్నకి వెళ్ళొస్తానని చెప్పి అన్నయ్య వెనుక నుండి పిలుస్తున్నా మా కన్నీళ్ళు కనబడగూడదని కొంగున కొంచెం మట్టిని మూటకట్టుకుని మా ఇంటి వైపు నడిచాను.

— హేమావతి బొబ్బు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో