
అమ్మాయీ!!
కొంచెం పైలం బిడ్డా!
కాళ్ళు కనబడనీయకుండా
నడువు
పాదాలు చూసి సొల్లు కార్సుకుంటారమ్మా
పక్క మీద పడుకున్నా కాళ్ళు ముడుచుకో
కాళ్ళు వూపినా కనబడినా
శృంగార కోణ వీక్షక
నిలువు బొట్లు
కీర్తన నో
పద్యమో
ఓ దృశ్యం కళ్ళ ముందుకు
భావుకత కీ శృంగారానికి బూతుకి
వ్యత్యాసమెరుగని పామరులు
వాళ్ళే పాడుకోవాలవి
నీ లాంటోళ్లు పాడితే
సహించని పురుషాధిక్యత
నిండు చీరలో
నడుస్తున్నా పాదాలకు
తొడుగులు వేసుకో
తన్మయత్వంతో కాళ్ళు
వూపాలనుకుంటే దుప్పటి కప్పుకో
పట్టీలకి గజ్జెలుంటే తీసేయ్
చాటుమాటుగా ఏమైనా చేసే కళ్ళు
గర్భ గుడి లో రసికత హృదయాలు
నీలో ఏం కనబడినా
అక్కడికే వెళ్ళే మనుషులు
వాళ్ళకవి బూతు పద్యాలే
వాళ్ళకవి కామోద్రేక ప్రేరేపిత కీర్తనలు
నీవేమో పద్దతి గా చిత్రీకరిస్తివి
ఎవడు ఎవడికి వారసులు
ఓ పద్యం కాగితం పై జనంలోకి వచ్చాక
జనం నాలుకలపై నాట్యం
రంగస్థలం పై తెరంగేట్రం
ఓ చలన చిత్రం నిండా
పడరాని చోటల్లా
ఆపిల్ ద్రాక్షలు పడుతుంటే
లొట్టలేసుకుంటూ చూసిన కళ్ళు
నీ పై అక్కసుతో
నిలువెత్తు పితృస్వామ్య వ్యవస్థ నిదర్శనమే
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~