గిరిజన హక్కులను కాల రాసినపుడు,గిరిజన వీరుల నాయకత్వంలో పోరాటాలు జరిగినపుడు శత్రువుల చేతిలో మరణంచిన వీరులను దైవంగా భావించే గిరిజనులు నేటికీ ఉన్నారు. అలాంటి వారిలో గోండులకి కొమురం భీమ్, రాంజీ గోండు, సంతాల్ బీర్సా ముండా, తిల్కా మాజీ, టికేంద్ర జిత్ సింగ్, వీర్ సురేంద్ర చాయె, వీర్ నారాయణ సింగ్, రూప్ చంద్ కోన్వార్, లక్ష్మ ణ్ నాయక్ మొదలైన వారు. అదే విధంగా మన్నె దొర తెగకు అల్లూరి సీతారామరాజు ఆరాధ్యుడు.అల్లూరి సీతారామరాజు త్యాగాలు జాతి జనులకు తెలిసిందే. తెల్లవారి ఆగడాలని ఎదిరించి, లూథర్ ఫోర్డ్ జరిపిన కాల్పుల్లో నేలకొరిగాడు.. సమాజంలో ఎప్పుడైనా, ఎక్కడైనా బలహీనులపై బలవంతులు దాడి చేస్తూనే ఉంటారు. ప్రాచీన కాలం నుండి స్వాతంత్ర్యం రాక ముందు, వచ్చిన తర్వాత కూడా అధిక సంఖ్యాకులు బలవుతున్నది, వెనుకబడిన కులాలకు చెందిన వారే.
ఆంగ్లేయుల పాలనలో పీడింపబడి, స్వేచ్ఛా, స్వాతంత్రాల కోసం పోరాటాలు చేసిన మన్నె దొర తెగ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కు వగా జీవిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో బ్రిటీష్ వారిపై జరిగిన తిరుగుబాటును మన్యం విప్లవం, మన్నెం తిరుగుబాటుగా పేరు వచ్చింది. మల్లు దొర, గంటం దొర, అగ్గి రాజు మొదలైన గిరిజన నాయకులతో అల్లూరి మన్నెం విప్లవం సాగించి, ఆంగ్లేయుల గుండెల్లో సింహా స్వప్నం అయ్యాడు. అధిక పన్నులు, పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులైన, మూలికలు, తౌసు , పశువుల మేత వంటి వాటిపై కూడా పన్నులు విధించడంతో, ఆంగ్లేయుల పై తిరుగుబాటుకు గిరిజనులు శ్రీకారం చుట్టారు. పోడు వ్యవసాయం ద్వారా జొన్నలు, రాగులు, సజ్జలు మొదలైన పంటలు పండిస్తున్నారు.వీరి పంట, ఉత్పత్తులను తక్కువ ధరకు కొనడం, అడవిపై నిషేధం, అటవీ సంపదను దళారులకు అప్పచెప్పడం మొదలైన దాష్టకాలు మన్నెం విప్లవానికి విపూవానికి కారణాలయ్యాయి. వీరి జనాభా 23,000 ఉండగా ఇందులో హిందూ మతం పాటించే వారు ఎక్కువ. క్రిస్టియన్ మతాన్ని కూడా కొంతమంది పాటిస్తున్నారు. ఈ తెగలో మత స్వేచ్చ ఉందని చెప్పవచ్చు. జంకిం దేవత, గంగా దేవి, సంకు దేవతలను పూజిస్తున్నారు. నిషాన్, నంది, జంకిరి, తాడో, సంకు దేవత, గంగా దేవి పండుగలను వైభవంగా చేస్తారు. వీరు తమను తాము మన్నె రాజులని చెప్పుకుంటారు. సాంప్రదాయాలు, ఆచారాలు మొదలైనవి ఇతర తెగల వలె ఉండి, సన్నిహిత తెగలతో సంబంధాలు పెంచుకుంటారు. వివాహ పద్ధతులలో చర్చలు పారితోషికం, వంటివి కనిపిస్తున్నాయి. భర్త చనిపోయిన స్త్రీ, భర్త సోదరుని పెళ్లి చేసుకోవచ్చు. అదేవిధంగా భార్య చనిపోతే ఆమె చెల్లిని పెళ్లి చేసుకుంటాడు. అడవిలో దొరికే పండ్లు, కాయలు, గడ్డలు లు మాత్రమే కాకుండా పంది, మొదలైన జంతువుల మాంసం వీరికి ఆహారం. వీరి భాష ద్రవిడ భాష, తెలుగుకి దగ్గరగా ఉంటుంది.ఒరిస్సాలో ఉండే వారు ఒరియా, తెలుగు ప్రాంతాలకు దగ్గరగా ఉండే వారు తెలుగు మాట్లాడుతారు. వీరికి తగువు వస్తే కుల పంచాయతీలో, కుల పెద్ద, తెగ పెద్దల సమక్షంలో పరిష్కారం చేస్తారు.
ఈ మద్య భారత ప్రభుత్వం గిరిజనులపై ప్రత్యేక దృష్టి సాగిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు 8 రాష్ట్రాలలో గిరిజన స్వాతంత్ర పోరాట యోధుల మ్యూజియం ఏరాు టు కోసం 195 కోట్లు కేటాయించమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మణిపూర్ లో రాణ గైదినలయ మ్యూజియం కోసం భూమి పూజ కూడా జరిగింది. ప్రభుత్వం చేపట్టే పథకాలు, కార్యశాలలు మన్నె దొరల అభివృద్ధిని సాధించవచ్చు.
– డా.తాటికాయల భోజన్న
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~