జ్ఞాపకం- 72– అంగులూరి అంజనీదేవి.

నీ భార్య ఈరోజు నాసిరకం చీరె కట్టుకొని అందరి ముందు వ్రతం దగ్గర నా పరువు తీసిందిఅంది శ్రీలతమ్మ.

భార్య కట్టుకున్న చీరవైపు చూశాడు జయంత్. అతనికి ఆ చీర అంత చీప్ గా ఏం అన్పించలేదు. సంలేఖ శరీరాకృతికి ఆ చీర బాగా నప్పింది. విడిగా చూసేకన్నా ఆమె కట్టుకున్నందువల్లనే ఆ చీర ఇంకా బాగున్నట్లనిపించింది. జయంత్ చూపులు ఆ చీరమీద అతుక్కుపోయాయి.

చీర కొనుక్కోమని డబ్బులిస్తే సగం డబ్బులు వాళ్ల అమ్మగారికి పంపిందిరా! డబ్బులేమైనా ఫ్రీగా మార్కెట్లో దొరుకుతున్నాయా? పెళ్లిలో ఒప్పుకున్న సామాన్లు ఇవ్వకపోగా తిరిగి కూతురు దగ్గరనుండే డబ్బుల్ని ఆశిస్తున్నారు వాళ్లు. ఏం కుటుంబం? ఇలాంటి కుటుంబం ఎక్కడైనా వుంటుందా?” అంది.

సంలేఖ రోషంగా చూసింది.

నేను మా ఇంటి నుండి వచ్చినప్పటి నుండి సామాన్లు, సామాన్లుఅంటూ ఒకటే గోల. అవి ఇవ్వకపోవటం వల్లనే మావాళ్లు మీకు చులకనైపోయారు. ఆడపిల్ల దగ్గర నుండి డబ్బులు ఆశించే నీచుల్లా కన్పిస్తున్నారు. కానీ మావాళ్లు అలాంటివాళ్లేం కాదు. నేను మీరిచ్చిన డబ్బుల్ని మావాళ్లకి పంపలేదుఅంటూ గబగబా లోపలికి వెళ్లి కొన్ని బుక్స్ పట్టుకొచ్చింది.

ఇవి కొన్నాను. ఇంకెప్పుడూ మా వాళ్లని అంత చిన్నచూపు చూసి మాట్లాడకండి!అంది.

శ్రీలతమ్మ రౌద్రంగా మారి ఏంటీ! నేనిచ్చిన డబ్బులతో ఆ పుస్తకాలు కొన్నావా? దేనికి పనికొస్తాయవి? అవేమైనా వచ్చి వ్రతం దగ్గర కూర్చుంటాయా?” అంది.

సంలేఖ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అవి కూర్చోవు. నన్ను తీసికెళ్లి ఉన్నతస్థానంలో కూర్చోబెడతాయి. ఇప్పటి నా ఈ గుర్తింపుకి కూడా ఆ పుస్తకాలే కారణం. అవి నా విలువను పెంచాయి. గౌరవాన్ని తెచ్చి పెట్టాయి. అందుకే వాటిని మీరలా ఎద్దేవా చేసి మాట్లాడకండి! పుస్తకాలంటే నాకు ప్రాణంఅంది.

నీ ప్రాణం తీసికెళ్లి పుస్తకాల్లోనే పెట్టుకో! ఎవరు కాదన్నారు. కానీ

వ్రతానికొచ్చినావిడ నా ముఖంమ్మీదే చీర ఎలావున్నా కోడలు బొమ్మలా వుందిఅంది. నాకెంత సిగ్గనిపించింది? నా కోడలు స్థానంలో వున్న నువ్వు కట్టాల్సిన చీరేనా ఇది. నువ్వు నా పరువు తియ్యటానికే ఈ ఇంటికి కోడలిగా వచ్చావా?” అంది శ్రీలతమ్మ..

మీరలా మాట్లాడితే నేనేం చెయ్యలేనుఅంది సంలేఖ.

శ్రీలతమ్మకు కోడలి సమాధానం నచ్చలేదు.

ఏం మాట్లాడుతున్నావ్ వదినా నువ్వు? మా అమ్మనే ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎంత పొగరు నీకు. ఏం చూసుకుని ఆ పొగరు? పుస్తకాలను చూసుకునేనా? మరి నీ విలువను ఆ పుస్తకాలు పెంచుతున్నప్పుడు మా అన్నయ్య, ఈ కుటుంబం, అత్తగారు, మామగారు ఎందుకు? పుస్తకాలతోనే వుండలేకపోయావా?” అంటూ అరిచింది ఆడపడుచు.

కిసుక్కున నవ్వింది తోడికోడలు. కళుక్కుమంది సంలేఖ మనసు.

జయంత్ నోరెత్తి ఏదో అనేలోపలే అక్కడ ఒక్కక్షణం కూడా వుండకుండా తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుంది సంలేఖ.

జయంత్ తలుపు కొట్టి పిలవగా వచ్చి తీసి అతనివైపు చూడకుండా వెళ్లి బెడ్ మీద పడుకుంది.

ఆరోజంతా అతనితో మాట్లాడలేదామె. చీరతో మొదలైన గొడవ చిన్నదిగా అన్పించినా చిరాకు కల్గించింది జయంత్ కి.

                                                                         ******

రోజులు పోటీపడి పరుగులు పెడుతున్నాయి.

ప్రపంచ సాహిత్యాన్ని ఔపాసన పట్టి తనదైన కొత్త దారిని ఏర్పరచుకునే ప్రయత్నంలో వున్న సంలేఖకు ఇంటి వాతావరణంలో వచ్చిన మార్పులు జీర్ణం కావటం లేదు. ఏదైనా ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు వ్యతిరేకత అనేది ఎక్కడైనా వుంటుందని ఆమెకు తెలుసు. ఎంత తెలిసినా నిత్యం పోరాడాలంటే కష్టంగా వుంది.

చుట్టూ ఎవరూ లేని సమయం చూసి హస్వితకి ఫోన్ చేసింది సంలేఖ.

హస్విత వెంటనే సంలేఖ కాల్ లిఫ్ట్ చేసి చెప్పవే! లేఖా! ఎలా వున్నావ్? ఈ మధ్యన కాల్ చెయ్యట్లేదెందుకు? బిజీగా రాసుకుంటున్నావేమో కదా! అందుకే నేను కూడా నిన్ను డిస్టర్బ్ చెయ్యొద్దని కాల్ చెయ్యలేదుఅంది.

నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వి రాసుకోవటం కూడానా!అంది.

అదేం! ఏం జరిగిందే! ఆమధ్యన నీకు బెస్ట్ రైటర్అవార్డు వచ్చినప్పుడు ఆ సభలో కలిసిందే! మళ్లీ మనం కలుసుకోలేదు. ఈ మధ్యన ఇంట్లో ఏమైనా కొత్త గొడవలు మొదలయ్యాయా?” అడిగింది ఆందోళనగా హస్విత.

కొత్తవేం కాదు. పాత గొడవలే. రోజుకో కొత్త రకంగా రగులుకుంటున్నాయి. వ్రతం జరిగి ఇన్ని రోజులైనా మా అత్తగారు, మా ఆడపడుచు నన్ను వదలకుండా తిడుతున్నారు. దానికి తోడుగా మా తోడికోడలు అప్పుడప్పుడు వచ్చి నవ్విపోతుంటుంది. వెళ్లేముందు నా దగ్గరకొచ్చి కూర్చుని నీకెప్పుడూ ఈ రాతలేనా? నేను చెప్పేది కూడా వినుఅంటూ ఒకప్పుడు మా అత్తగారు ఆవిడనెలా నెత్తిన పెట్టుకొని చూసిందో. ఇప్పుడు నన్నెలా పాదాలకింద పెట్టుకొని చూస్తుందో చెబుతుంది. అది విని నేనేమీ అనకపోయినా అన్నట్లే తీసికెళ్లి మా ఆడపడుచుతో చెబుతుంది. మా ఆడపడుచేమో నామీద జయంత్ కన్నా తనకే ఎక్కువ అధికారం వున్నట్లు ప్రవర్తిస్తుంది. ఇదేం కర్మే నాకు? వ్యక్తిత్వం లేనిదానిలా ఎన్నిరోజులు నేనిలా వుండాలి?” అడిగింది సంలేఖ.

హస్విత మాట్లాడలేదు. డౌటొచ్చి వింటున్నావా? లేదా?” అడిగింది సంలేఖ.

వింటున్నాను. చెప్పవే!అంది హస్విత.

వీళ్ళు మా నాన్నగారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆయన పెళ్లిలో సామాన్ల కోసం ఇస్తానన్న లక్షరూపాయల్నే పట్టుకొని వేలాడుతున్నారు. నిజానికి మా నాన్న దగ్గర డబ్బులుంటే ఇన్నిరోజులు ఆగేవాడు కాదు. నేనిక్కడ ఇలా బాధ పడుతున్నానని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అయినా ఆ లక్షరూపాయలే డబ్బులా? ఇక వీళ్ల దగ్గర డబ్బులే లేవానే! డబ్బు ముఖమే చూడనట్లు ఎప్పుడిస్తాడట మీ నాన్న?’ అని అంటుంటారు. నాకు ఒకవైపు మా నాన్న గుర్తొచ్చి ఏడుపొస్తుంటుంది. ఆ డబ్బులు ఇచ్చేంత వరకు వీళ్లు నన్నిలాగే చూస్తారు హస్వితా!అంది సంలేఖ బాధపడుతూ..

ఏం మనుషులో ఏమో! ఇలాంటివాళ్ల దగ్గర ఎంత డబ్బుండి ఏం లాభం? వున్నదాన్ని వదిలేసి ఫ్రీగా వచ్చేదాన్ని గురించే తాపత్రయపడతారు. వాళ్లు మనశ్శాంతిగా వుండరు. ఎదుటివాళ్లను మనశ్శాంతిగా వుంచరు. దీనివల్ల ఏం సాధిస్తారో ఏమో!అంది హస్విత.

నన్ను సాధిస్తున్నారు. అది చాలు వాళ్లకి హాయిగా నిద్రపోవటానికిఅంది సంలేఖ.

అదేం నిద్రే! పాడు నిద్ర. ఇలాంటి వాళ్లను ప్రస్తుతం జైల్లో వుండే అవినీతిపరుల పక్కన కొద్దిరోజులు వుంచితేగాని మార్పు వచ్చేలా లేదు. ప్రభుత్వం కూడా మీ అత్తా, ఆడపడుచు లాంటి వాళ్లను కాస్త గమనించాలి. యాక్షన్ తీసుకోవాలి. అప్పుడా నిద్రేదో జైల్లోనే పోతారు వాళ్లుఅంది హస్విత.

ఈ మధ్యన హస్విత రోజూ పేపర్ చదవడం, కొత్త న్యూస్ ఏదైనా కన్పిస్తే దాన్ని దిలీప్ తో డిస్కస్ చెయ్యటం చేస్తోంది. అందుకే ఆమె మాటలు, ఆలోచనలు మెచ్యూర్డ్ గా అన్పించటం గమనిస్తోంది సంలేఖ.

 

– అంగులూరి అంజనీదేవి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకాలు, ధారావాహికలు, , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో