కలిమిలేములు కావడికుండలు,
కష్టసుఖాలు కారణరుజువులు!
జన్మలో ఇవన్నీ
జతకలసే జీవిత సత్యాలు!
ఔనన్నా కాదన్నా మనకు తారసపడే
తప్పించుకోలేని జీవన మార్గాలు!
ఋతువులన్నీ ఈ మార్గాలకు మూలాలు!
వసంత ఋతువు ఆనందడోలికలలో
ఓలలాడించిన వేళ
జనజీవనం చిగురులు తొడిగి
పచ్చదనాన్ని నులివెచ్చగా అందించి
ఆహ్లాదాలను మన ముంగటిలో
గుమ్మరించి పోయింది!
పోతూపోతూ గ్రీష్మాన్ని తెచ్చి
ఉలుకూ పలుకూ లేకుండా
మనచెంత వదిలేసిపోయింది!
ఉష్ట్ణతాపాన్ని కోపతాపంగా
మనపైరుద్ది
చిగురుల ప్రకృతి పచ్చదనాన్ని
మోడువారించి
వేడివేడి నిట్టూర్పులమధ్య
స్వేదజలాలను నిలువెల్లా
గుమ్మరించి గ్రీష్మం
చోద్యం చూస్తుంది!
నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ
మద్యాహ్నానికి నిర్మానుష్యమై
సగటుమనిషి జీవితాలను
ఎండగడుతుంది!
వసంతంలో నిత్యానందాన్ని
అనుభవించిన మనిషి గ్రీష్మంలో
దుఃఖభాజితుడౌతూ
దిక్కతోచని జీవుడౌతాడు!
మూగజీవాలు సైతం
అతలాకుతలమై కుదురులేని
గతిని స్థితిని అనుభవించడం
గ్రీష్మం యొక్కగొప్పేమరి!
వసంతం వెన్నంటి వచ్చే
గ్రీష్మం జీవిత సత్యాన్ని
బోధించే ధర్మచారిణి!
వెలుగు చీకటి నీడలమాదిరి
వసంతం గ్రీష్మం ఋతువుల రూపంలో
మనకు అందించే గుణపాఠాల ధర్మబోధలే!
సుఖాలైనా దుఃఖాలైనా శాశ్వతాలు కానేకావు!
వాటిని అనుభవిస్తూ సక్రమ మార్గంలో
ఆచరించడం మాత్రమే
మానవ కర్తవ్యం అని
ఋజువుచేస్తాయి బుుతువులు !
ఠారెత్తించే గ్రీష్మానికో సలామ్ !!
-బి.వి.వి. సత్యనారాయణ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~