గాల్లోంచి విభూది
నోట్లోంచి లింగాలు తీసినోడి
పేరు పెడితే సమ్మగా బజ్జున్న మను వ్యవస్థ
గారడీలు జేసిన బాబా
సచ్చినంక కుళ్ళిందాకా ఆస్తుల జాడా లేకపాయే
ముఖం నిండా పౌడర్ పూసుకున్న ఆటగాడి పేరు పెడితే
నోరుమూసుకుని ఓహ్ అన్న
కాలక్షేప సమాజం! టూరింగ్ టాకీస్ ల సొల్లు గార్చుకుంటుంది
భక్తి పేర
సామాన్యునికి అర్థం కాని భాషల
శృంగార క్రీడలో మునిగి తేలుతున్న
ఊహా జనిత విగ్రహాల కొలిచినోడి పేరు పెడితే
మంచం మీద రసకందాయంలో మైమరిచిన జనం
బాలా బౌద్ధ భిక్షువు
విగ్రహానికి పూలమాలలు నగలు తొడిగి
బాలాజీ ని జేసిన దొంగల సాక్షిగా
పేరు పెడితే తన్మయత్వం లో మౌఢ్యం
మనిషిని మనిషిగా బతక నిచ్చే
ఓ సంపదని ఓ కాయితాల కట్ట లో
భద్ర పరచి ఇచ్చినోడి పేరు పెడితే
మంటల్లో పట్టణం వెనుక
మనుషుల్లో పాతుకు పోయిన మనువే కారణం
చూపుడు వేలు పై సిరా మరక
నీ బతుకు ను మారుస్తుందని
ఓటు హక్కు ను ఇచ్చినోడి కులమే
కళ్ళకు కనబడిందే!
మా వూరికి మా ప్రాంతానికి మా భాషకి
మా యాసకి మా వాడకి సంబంధం లేని ఎన్నో
మాపై రుద్దినప్పుడే తిరగబడితే
రాజ్యమే మా చేతుల్లో పదిలంగా
ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా
కళ్ళు ఇప్పటికైనా తెరిస్తే
భావి తరమైనా క్షేమంగా!!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~