
శాంతి
“అయ్యో .. అయ్యో ఎంత పని చేసింది?
కోడిని కోసినట్టు కుత్తుక కోయడానికి చేతులెట్లా వచ్చాయో ..” గొంతు చించుకుంటూ గుండెలు బాదుకుంటూ వచ్చింది గాడిద
ఎందుకే మా మీద అంత కక్ష కట్టావ్? ఒక్కరోజన్నా కంటి నిండా నిద్రపోనిచ్చావా అనుకున్నది మగమేక.
అసలే వేసవి కాలం, చెట్టునీడన వచ్చే చల్లగాలికి కళ్ళు మూతలు పడుతున్నాయి.
ఉలిక్కిపడి కళ్ళు తెరిచి దీనికి ఇదేం మాయరోగం ఇట్ లా కళ్ళు అంటుకోగానే కొంపలంటుకుపోయినట్టు.. లోలోన విసుక్కుంది అప్పటి వరకు ఎండలో తిరిగొచ్చి వేపచెట్టుకింద సేదతీరుతున్న ఆడమేక.
ఎవ్వరూ తను చెప్పేది వినే స్థితిలో లేరని డీలా పడింది కాలు నొప్పి లెక్కచేయకుండా హైరానా పడుతూ లేస్తూ వచ్చిన గాడిద. ఒళ్లంతా పట్టిన చెమట తుడుచుకుంటూ అసహనంగా అటు ఇటు కదిలింది. అంతలో చెట్టు కొమ్మలపై గెంతుతున్న కోతి కనిపించింది.
“ఘోరం జరిగిపోయింది. ఎన్నడూ వినని ఘోరం, ఎక్కడ చూడని ఘోరం జరిగిపోయింది..”ఉత్సాహాన్ని దాచడానికి యత్నిస్తూ మొహం బాధగా పెట్టి చెప్తున్న గాడిదను చూస్తూన్న కోతి ” నాన్చకుండా అసలు విషయమేంటో చెప్పు ” కసిరింది.
“మనువాడబోయే పిల్లగాడిని మాట్లా డాలని పిలిచి కుత్తుక తెగ్గోసిందట. ఆడది ప్రాణాలు పోస్తుంది కానీ తీస్తదా? అసలు ఆమె ఆడదేనా?
ఇంత క్రూరమైన బిడ్డను కన్న ఆ తల్లిదండ్రులకు ఎంత నామర్దా .. ” అంటూ బాధపడిపోయింది గాడిద.
“నువ్వసలు ఆత్రం ఆత్రం.మనిషివి. సరిగ్గా విన్నావా ?
ఇవాళ రేపు ఎక్కడ చూసినా కల్తీ. అన్నింటా కల్తీ. ఆహారం కల్తీ . పర్యావరణం కల్తీ .
నువ్వు చెప్పే వార్తలు నిజమైనదో కల్తీవో ఎవరికెరుక ? ” అన్నది రెండు రోజుల క్రితమే కెమికల్స్ తో మగ్గబెట్టిన అరటిపళ్ళు తిని జబ్బుపడిన కోతి.
“నిజమే, పనిగట్టుకుని అబద్దాలు పుట్టించి నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఈ మధ్య ఎక్కువయ్యారు. ఈ చెట్టు ఎన్నింటికి సాక్ష్యమో” అన్నది ఉడుత
“ఏ ప్రయోజనం ఆశించో అబద్దాలు.. ” సాగదీసింది గాడిద
“అసలు ఎవరిని నమ్మాలో, ఎవరి ముచ్చట నిజమో .. ఎవరు అబద్దమో తెలియట్లేదు. ఏది తినాలో ఏది తినొద్దో అర్ధం కావట్లేదు” అన్నది కోతి
“కల్తీ ఏంటి? కాలుష్యం ఏంటి ?
మగవాళ్ళు ఆడవాళ్ళ మీద యాసిడ్ పోయడం, పెట్రోలు పోసి బుగ్గిచేయడం, కొట్టడం , పీకనులమడం, కత్తితో కసక్ అనిపించడం రకరకాలుగా హత్యచేయడం ఎన్నో విన్నాం. ప్రతి రోజు ఎక్కడో దగ్గర వింటూనే ఉన్నా.
ఓ ఆడపిల్ల, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల కత్తి పట్టి కుత్తుక తెగ్గొయ్యడం ఎక్కడ వినలేదు. అబద్ధం కాదు. అసలు వార్తే .
టీవీలో అయితే మసాలా ఫుల్ గా దట్టించి చెబుతున్నారు. అది వింటుంటే ఆవేశం పెరిగిపోయిందనుకో.. పరిగెత్తుకొ చ్చా” గడగడా చెప్పింది గాడిద
“ఎంత విషాదం.” అన్నది మగమేక కళ్ళు తెరిచి
“పీక ఎందుకు కోసిందట? ” అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలన్న ఉత్సు కతతో ఆడమేక
“ఏ గాలి తిరుగుళ్ళు తిరిగే రకమో .. ” అనుమానం వ్యక్తం చేసింది కోతి
“పెళ్లి చేసుకోనన్నా వినకుండా పెద్దలు పెళ్లి కుదిర్చారట. అతని పీడ వదిలించుకోవడం కోసం పిలిచి పీక కోసిందట ” మిత్రులంతా తను చెప్పింది విన్నారన్న ఉత్సాహంగా చెప్పింది గాడిద
“తన తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి కుదిరిస్తే శిక్షించాల్సింది వాళ్ళని, పీక కోయాల్సింది తల్లిదండ్రులది కదా.. పాపం . ఆ పిల్లాడికి శిక్ష వేసిందా.. ఎంత క్రూరురాలు మతి లేకుండా ..” ఆవేశంగా అన్నది మగమేక
” మొన్నామధ్య ఆ నేరేడు చెట్టు ఇంటి పక్క పిల్లకు పది పన్నెండేళ్ళుంటాయేమో.. అయిన సంబంధం బయటికి పోవద్దని తల్లి దండ్రులు పెళ్లి నిశ్చయం చేశారు. ఆ పిల్లకి పెళ్లి ఇష్టం లేదు. ఐదో తరగతి చదువుతున్నది. పెళ్లి చేసుకోను అని ఎదురు తిరిగింది. అయినా పెద్దలు వినలే. ఆమెను కట్టడి చేసి పెళ్లి ముహూర్తం పెట్టారు.
ఈ విషయం మిత్రుల ద్వారా టీచర్ కి పోలీసులకు తెలిపింది. పెళ్లి ఆగింది. ఆ పిల్లకు ఉన్న ధైర్యం ఆ యువతికి లేదా ..” అన్నది రామచిలుక
“నిజమే, ఆమెకు పెళ్లి ఇష్టంలేదు అనుకుందాం. అయితే అబ్బయిని చంపడమే పరిష్కారమా? ప్చ్ .. పాపం అతని కన్న తల్లిదండ్రుల ఆశలు కలలు కాలరాసే అధికారం ఆమెకెక్కడిది ? శిక్షించడానికి ఆమె ఎవరు ? ఆవేశపడింది గాడిద.
ఆ మిత్ర బృందం ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండి ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
“చదివిస్తే ఉన్న మతి పోయినట్లుంది ఇవాళ రేపు ఆడపిల్లల పరిస్థితి
ఆ.. స్వేచ్ఛ ఎక్కువై.. విపరీత పోకడలు పోతున్నారు. చంపితే జైలు ఊచలు లెక్క పెట్టాలని తెలియదా” ఎగతాళిగా నవ్వింది గాడిద.
“ఇంతకన్నా పెద్ద పెద్ద ఘోరాలు, నేరాలు మగవాళ్ళు ఎన్ని చెయ్యట్లేదు. వాళ్లెవరి గురించి మాట్లాడకుండా ఆ పిల్లని ఆడిపోసుకుంటున్నారు” జాలి పడింది ఉడుత.
“ఆ అబ్బాయిని చూసి తెగ జాలి పడుతున్నారు. బాధ పడుతున్నారు. ఆమెకు ఏదో పెద్ద గాయం చేసే ఉంటాడు అందుకే చంపాలని అనుకుందేమో” అన్నది ఆడమేక
” ఆ పిల్ల పెళ్లి వద్దని మొత్తుకున్నప్పుడు ఆ పెద్దలైనా కారణాలేంటో తెల్సుకోవాలిగా.. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అనుకుంటే ఫలితం ఇట్లాగే ఉంటుంది” అన్నది ఉడుత.
“నిజమే, ఆ పిల్లకి పిచ్చి ఉందేమో” అనుకుంటున్నారు అన్నది అప్పుడే వచ్చిన కాకి.
“మొన్నా మధ్య మొదటిరాత్రికి భయపడి ఆ ఉత్తరాన చివరింటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడట. విడ్డురంగా లేదూ ..” నవ్వింది గాడిద.
“ఇతరుల గాయం మనకెప్పుడూ హాస్యమే ” గొణిగింది కోతి.
“నిజంగా ఆ అమ్మాయికి పిచ్చా.. ” అడిగింది రామచిలుక.
“దేవుని పిచ్చిలో ఉందట. పెళ్లి వద్దని దేవుని భక్తురాలిగా ఉంటానని చాలా సార్లు చెప్పిందట. రెండు మూడు సార్లు పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయట . తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నాలు ఆపకుండా ముహూర్తం కూడా పెట్టించారు. ఆ డిప్రెషన్ లో ఉన్నదట. గిఫ్ట్ ఇస్తాను గుడికి రమ్మని పిల్చి, చున్నీతో అతని కళ్ళకు గంతలు కట్టి గొంతుపై చాకు పెట్టిందట” వివరించింది కాకి.
“ముందునుంచి అదే అనుకుంటున్న. ఆ పిల్ల తేడాగా ఉందని అదే నిజమైంది.” అన్నది గాడిద.
“మానసిక సమస్య తీవ్రత తెలియక ఏదో మాట్లాడేసుకుంటున్నాం” అన్నది కోతి.
“ఆడపిల్లల అభిప్రాయాల్ని గౌరవించని సమాజం. పురుషాహంకారం బుసలు కొట్టే ప్రపంచం ఇంతకన్నా గొప్పగా ఏం మాట్లాడుతుంది?
నేనైతే ఆ అమ్మాయి కంటే ముందు నేరస్థులు ఆమె తల్లిదండ్రులు అంటాను. ఎంత మూర్ఖులు వాళ్ళు . వాళ్ళ బలవంతం వల్లనే కదా ఆ పిల్ల చివరికి ఆ పరిస్థితుల్లోకి నెట్టివేయబడిం ది . హంతకురాలిగా మిగిలిపోయింది. ఆ అమ్మాయి కూడా బాధితురాలే” అన్నది ఆడమేక.
“తల్లిదండ్రులది నేరం ఎట్లా అవుతుంది ? కన్న కూతురికి పెళ్ళి చేయాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది” కోపంగా ప్రశ్నించింది మగమేక.
“తన ఇష్టాన్ని, అభిప్రాయాన్ని నిర్బయంగా చెప్పలేని నిస్సహాయత, తక్షణ చర్య నుండి విముక్తి పొందలేని అసహాయతలో ఉన్న ఆడపిల్ లని కాదు తప్పు పెట్టాల్సింది.
ఒకవేళ చెప్పినా ఆడపిల్లల ఇష్టాయిష్టాలు పట్టించుకోని సంప్రదాయాన్నీ తప్పు పట్టాలి.
ఆ పిల్లకి ఆ పరిస్థితి కల్పించిన, ఆ పరిస్థితుల్లోకి నెట్టేసిన సమాజాన్ని తప్పు పట్టాలి” స్థిరంగా అన్నది ఆడమేక.
“భక్తి మైకంలో ఉన్మాద స్థితిలో ఆలోచనా రహితంగా ప్రవర్తించినట్లుంది” నెమ్మదిగా అన్నది మగమేక.
“సాటి మనుషుల్ని ప్రేమించలేరు . కులం మతం అడ్డువస్తుంది . కానీ జంతువుల్ని మాత్రం ప్రపంచంలో ఎవరు ప్రేమించనంతగా ప్రేమిస్తున్నా మని నటిస్తారు” ఏసీ కారులో పోతున్న కుక్కను చూస్తూ అన్నది కోతి.
“నువ్వమాట ఏం చూసి అన్నావో కానీ అది అక్షరాలా నిజం. ఆవుదూడకు ఊయల వేసి పెద్ద ఎత్తున బారసాల పండుగ చేయడం చూశా ” సమర్ధింపుగా అన్నది కాకి.
“పని పాట లేనివాళ్లు. వాళ్లకు ఆకలి తెలియదు. కడుపునిండా తిన్నది అరగాలంటే ఏం చేయాలో తోచక ఈ పనులు చేస్తారు. కన్న బిడ్డ కులం కానివాళ్ళని పెళ్లి చేసుకుంటే ముక్కలు ముక్కలు చేస్తారు. తల్లిదండ్రులను వృద్దాశ్రమాల్లో వదిలేస్తారు. కానీ జంతువుల్ని ప్రేమిస్తారట ” ఎగతాళిగా అన్నది మగమేక
“ఏంటో ఈ మనుషులు. నేల, నీరు, నింగి కలుషితం చేసేశారు. మనుషులు కలుషితం..మనసులు కల్తీ..
మనిషి ప్రాణాలకంటే పరువు ప్రతిష్ట ముఖ్యం అంటారు. వాళ్ళ ప్రవర్తన ఆ గోడమీద సూదంటు గాజు పెంకులు గుచ్చుకున్నట్లు గచ్చుతున్నది. ఎప్పుడు మారతారో..” అన్నది కోతి