ISSN – 2278 – 478
మానవ జీవితం ప్రస్తుతం భాషపై ఆధారపడి ఉంది. ఈ భాషే నేటి మానవ జీవన విధానాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత విద్యా విధానంలో మాతృ భాష బోధన లేకుండా విద్యార్థులు చదువులపై ఒకింత భయం చేత పాఠశాలలకు దూరం అవుతున్నారు లేదా భారంగా విద్యను అభ్యసిస్తూ చదువులోనూ, జీవితంలోనూ వెనుకబడిపోతున్నారు. ఇలాంటి వాతావరణం షెడ్యూల్డ్ క్యాస్ట్ లోను, షెడ్యూల్డ్ ట్రైబ్ లోను కనిపిస్తుంది. షెడ్యూల్ క్యాస్ట్ లో వెనకబాటుతనం తక్కువగా కనిపిస్తే, షెడ్యూల్డ్ ట్రైబ్ లో ఎక్కువగా ఉంటుంది.
అక్షర జ్ఞానం కోసం ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు చేస్తున్న గిరిజనులకు ఇతర భాషల్లో బోధన కొరకరాని కొయ్యగా తయారైంది. దీనిని గమనించిన మేధావులు ఎవరి మాతృ భాషలో వారికి బోధనను అందుబాటులోకి తేవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందనే ఆలోచన చేశారు. వివిధ గిరిజన తెగల్లో ఇప్పటికే మాతృ భాషలో బోధన మొదలు పెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో గోండి భాషలో, విజయనగరం జిల్లా పార్వతీపురం ITDA పరిధిలోని పాఠశాలల్లో సవర భాషలో విద్యాబోధను కొనసాగిస్తున్నారు. ఈ విధానం వలన పాఠశాల చదువులు మానివేసిన వేల మంది సవర గిరిజన విద్యార్థులు తిరిగి పాఠశాలల్లో చేరుతున్నారు. విభిన్న భాషల విద్యా బోధన కార్యక్రమం ఆధారంగా తొలి విడుతగా జియ్యమ్మ వలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో సవర తెగకు చెందిన వారినే బోధకులుగా తీసుకొని 128 పాఠశాలల్లో బోధనను అమలు చేస్తున్నారు. తెలుగు ఆధారంగా సవర భాష ఉధ్రృతిని సాధించడానికి ఉపాధ్యాయులు, విద్యావాలంటర్లు, విద్యార్థులు కృషి చేస్తున్నారు.
సవర భాషపై గిడుగు రామమూర్తి పంతులు గారు విశేష కృషి చేసి తన కాలాన్ని, ధనాన్ని ధారపోసి తెలుగు – సవర నిఘంటువులు తయారు చేశారు. వీటికోసం 30 సంవత్సరాలు కష్టపడ్డారు. బ్రిటిష్ ప్రభుత్వం గిడుగు వారిని 1934లో కైజర్-ఇ- హింద్ అనే సువర్ణ పతకంతో, 1913లో రావు సాహెబ్ బిరుదులతో సత్కరించింది. 1930 లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం” A manual of savara Languge’ రాశారు. వీరు రాసిన సవర వర్ణనాత్మక వ్యాకరణం తొలి అంతర్జాతీయ ధ్యని లిపితో రాయబడింది అని ప్రొఫెసర్ డెవిడ్ సొంప్ గారంటారు. 1892లో సవర భాష నేర్చుకోవడం కోసం కొండ కోనల్లో నెలల తరబడి తిరుగుతూ మలేరియా బారిన పడ్డారు. సవర భాషకి లిపిని కనిపెట్టడమే కాకుండా వాచకాలు, పాటలు, కథలు రాశారు. గిడుగు వారు గిరిజన ప్రాంతాలలో ఉపాధ్యాయునిగా పని చేయడం వలననే సవరలకు చక్కని అవకాశాలు లభించాయని చెప్పవచ్చు. సవరల కోసం తాను రాసిన పుస్తకాలే మొదటివని గిడుగు రామమూర్తి పంతులు గారు స్వయంగా తెలియజేశారు.
గిడుగు వారు సవర పాటలను, కథలను వారి భాషలోనే రాసి పెట్టుకున్నారు. వీరికి మామిడల్లం కుమార స్వామి పంతులు గారు సహాయపడ్డారు. సవరల సాంప్రదాయ జానపద నృత్యం కని సొర తొంక్సెంగ్ అనే నృత్యాన్ని తరాతే అనే సన్నాయి, సిర్ర సిటికెన పుల్ల, పకోగా మొదలైన వాయిద్యాల సహాయంతో కార్తీక మాసంలో ఎక్కువగా ఆనందంగా నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ సంబరాలు చేసుకొంటారు. ఈ పాటలను, ఆటలను, నృత్యాలను నేటి తరం తల్లిదండ్రుల నుండి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల నుండి నేర్చుకుంటున్నారు.
ఒడిషాలోని గంజాం జిల్లా, ఆంధ్రలో శ్రీకాకులం జిల్లాలలో సవర జనాభ ఐదు లక్షలకు పైగా ఉంటుంది. సవరలు పోడు వ్యవసాయాన్ని ఎక్కువగా పాటిస్తారు. సవరలు రసాయన ఎరువులు వాడకుండా ఆవు పేడ, ఆవు మూత్రం, పశువుల వ్యర్థాలతో వ్యవసాయం చేస్తారు. ఒకసారి విత్తిన పంట నుండి వచ్చే పంటకు విత్తనాలను సిద్ధం చేసుకుంటారు. ప్రభుత్వం తరువున నీటి పంపులు, అన్నపూర్ణ మోడల్స్ మొదలైన వెన్నో వీరి జీవితంలో వెలుగులు నింపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
వీరు అంటువ్యాధులు, అగ్ని ప్రమాదాలు, పులి మొదలైన వాటి కారణంగా ఎవరైన చనిపోతే ఆ గ్రామాన్ని ఖాళీ చేసి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతారు. వివాహ వ్యవస్థలో దేవర న్యాయం (తన సోదరుడు చనిపోతే అతని భార్యను వివాహం చేసుకోవడం ) కనిపిస్తుంది. అంతే కాకుండా వినిమయ వివాహం (Marriage by Euchange) వధూవరుల ఇంటి నుండి ఆడ పడుచులు అటు, ఇటుగా వివాహం జరుగుంది. అనగా అబ్బాయి ఇంటి నుండి అమ్మాయిని అమ్మాయి సోదరుడికి పెండ్లి చేస్తారు.
సవర భాష దక్షిణ ముండా భాషకు చెందినది. ముండా భాష ఆస్ట్రో ఏషియన్ భాషా కుటుంబంలో ఒకటి. నమ్మకాల పరంగా గమనిస్తే వీరింక నవ సమాజానికి చాలా దూరంలో ఉన్నారని అర్థమౌతుంది. మనిషికి ఆత్మకి సంబంధం ఉంటుందని, మనిషిలోకి ఆత్మ ప్రవేశించ గలదని నమ్ముతారు. వీరి నిత్య వ్యవహారంలో ఎన్నో భూతులను అవలీలగా మాట్లాడుకుంటారు. వీరి భాషణలో ఇది ఒక భాగం మాత్రమే. వెనుకబడి ఉన్న సవర తెగలో ప్రస్తుతం కొంత అభివృద్ధి కనిపిస్తుంది. గిడుగు మొదలైన పండితుల కృషి ఫలితంగా వీరికి లిపి, మౌఖిక సాహిత్యం లిఖిత సాహిత్యంగా పొందుపరచబడింది.
-భోజన్న
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~