నిజమైన కవి నిష్క్రమించాడు
జీవితకాలమంతా బాధ లనుభవించాడు
బాధకు పర్యాయపదం కవిత్వమన్నారు అజంతా
తనకున్న పని తాను చేసుకుంటూ
కడుపులో నీళ్లు కదలకుండా ఉండలేనివారు
ఇతరులును బాధల బురదలోనుండి లాగి
కడగాలనుకునేవారు కవులవుతారు
కళా రవి అవుతారు
బాధల బస్తీలో పెరిగినా
దీనగాధలెన్నో కళ్ళ ముందు జరిగినా
ఆ అనుభవాలను వరికీళ్లుగా ఆరబెట్టి
కవిత్వపు ఆకలిని ప్రతీకలుగా నంజుకున్నాడు
‘వర్తమానం’లో శబ్ద చిత్రాలుసృష్టించి
‘నెత్తుటి ప్రశ్న’ల పరంపరను శత్రువుగుండెమీద
శూలంలా పొడిచాడు
మనిషి చెట్టుకు పురుగు పట్టని
ఒక కొత్త ఋతువుకోసం
కొత్త ఆకాశం కొత్త భూమికోసం స్వప్నించాడు
మల్లె మొగ్గల గొడుగుకింద మాదిగ బతుకుల్ని
ఆవిష్కరించి ప్రకాశం జిల్లా మాండలికానికి
ఎండ్లూరి వారి కుటుంబాల ‘పనితనపు’గనిని త్రవ్వావు
తెలుగు కవిత్వాన్ని ‘నల్లద్రాక్ష పందరి’గా నిలబెట్టి
మాధుర్యపు మాగాణంలో నీలిక సౌందర్యానికి పట్టాభిషేకం చేసావు
నీ కవిత్వ ప్రతిభకు ‘ఆటా’పిలిచి ఆహ్వానిస్తే
తేట తెలుగులో అనుభవాల్ని యాత్రా కవితగా మలిచి
చదవరులను మురిపించావు
గజళ్ల సౌందర్య గీతకల్లోనూ
రుబాయి రసరాగా వల్లికల్లోనూ
మీ ప్రేమ ముద్రను బలంగా నాటారు
మీ జీవనసఖి దూరమయ్యాక
నిద్రపట్టని రాత్రుల్ని చిత్రికపట్టిన పొట్టులా
రాలడాన్ని దుఃఖమయ బెంగను అక్షరాల్లో పొదిగారు
మానస మనోఙ్ఞల్ని రెండు కళ్లుగా చూసుకున్నారు
వారికి మీరే దారిదీపమై కనిపించారు
ఇప్పుడు మీ ఎడబాటుతో కవిగ ఎదుగుతున్న
కుమార్తెకు నాన్న ఆసరా ఏది?
దళిత సాహితీ సుధాకరుడా
ఎందరినో ప్రోత్సహించి ఎన్నోరచనలు చేయించావు
పరిశోధనలో నూరు మందికి పట్టాలిప్పించావు
భౌతికమైన మీ ఎడబాటు
గుండెల్ని పిండివేసినా
మీరు రచించిన కవిత్వం
మీరు వచించిన ఉపన్యాసాలు
నిత్య ప్రేరకాలు నీతికారకాలు
మీ ఆలోచనలను అందుకుంటే
అదే మేమిచ్చే కానుక
సమసమానత్వపు వేడుక.
(ప్రియ మిత్రులు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి స్మృతి లో….)
–డా.వూటుకూరి వరప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~