నీవు కవ్విస్తున్నావని
కలవరపడకు
నీకు మించిన వదన
చకోరాలున్నాయిక్కడ
నీవు వలపుల వల
వేస్తున్నావనుకోకు
నీకు మించిన రాగ
కుసుమాలున్నాయిక్కడ
నీది సొగసుల
సామ్రాజ్యమని సంబరపడకు
అంతకుమించిన
ప్రశాంత హంసంత
హంసికలున్నాయిక్కడ
నీలో ధారల ధారా
వంపులున్నాయని వగలుపోనీకు
అంతకుమించిన
గంగాఝరీ సమున్నత
రసమధురీ అక్షయ వంపులున్నాయిక్కడ
నీ కన్నులు కాంతులిడుతిన్నాయనో
నీ మేనిమెరుపులు తళుకులిడుతున్నాయనో
నీ అధర మధుకమలు రసధునిలనో అనుకోకు
ఇవి
కవిభావ అక్షతులు
కాళిదాసు కవనికలు
అన్నమయ్య పదనికలు
అందుకే చింతించకు
నేను సాహితీ భావ కుసుమాన్నే
– బాలాజీ దీక్షితులు పి.వి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~