అస్సాం లో కామరూప్ జిల్లాలో డోయి సింగిరి గ్రామం లో చంద్ర ప్రియా మజుందార్ గా చంద్రప్రభ సైకియాని 16-3-1901న పదకొండు మంది సంతానం లో ఏడవ పిల్ల గా జన్మించింది .చెల్లెలు రజని ప్రియా సైకియాని తో కలిసి ,మోకాళ్ళ లోతు బురదలో నడిచి బాలుర స్కూల్ లో చదవటానికి రోజూ వెళ్ళేది .ప్రభ పట్టుదల గ్రహించి, స్కూళ్ళ ఇన్స్పెక్టర్ చంద్రప్రభకు నాగోవా మిషన్ స్కూల్ లో స్కాలర్షిప్ మంజూరు చేశాడు .అక్కడ హాస్టల్ లో చేరాలంటే క్రిష్టియానిటి తీసుకోవాలనే నిబంధనపై చంద్రప్రభ తీవ్ర నిరసన తెలిపి ఉద్యమం చేయగా ,చివరికి అధికారులు లొంగి వచ్చి ఆమె ను హాస్టల్ లో చేర్చుకొన్నారు .
స్కూల్ వదలగానే రోజూ స్కూల్ దగ్గరలో ఉన్న ఒక షెడ్ లో నిరక్షరాస్యులైన పిల్లలకు తాను స్కూల్ లో నేర్చుకొన్నది అంతా బోధించేది .హాస్టల్ సూపరి౦ టెండ్ హిందూ విద్యార్ధులపై వివక్షత చూపడం పై ధైర్యంగా నిరసన ,అసమ్మతి తెలియ జేసి,తన సాంఘిక సంస్కరణాభిలాషను మొదటి సారిగా తెలిపింది.తర్వాత తనకంటే వయసులో చాలాపెద్ద వాడైన వాడికిచ్చి పెళ్లి చేయాలని తలిదండ్రులు భావిస్తే ధైర్యంగా తిరస్కరించి తన వ్యక్తిత్వాన్ని చాటింది .దండీనాథ్ కాలితా అనే అస్సామీ రచయిత తో పరిచయమై .ప్రేమ తో ఒకటై,ఫలితంగా గర్భం దాల్చి ,అతడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోగా ,జీవితాంతం అవివాహితగా నే ఉండిపోయింది .నాటి సాంఘిక పరిస్థితులలో తనకొడుకును పెంచటానికి చాలా వ్యతిరేకతకు లోనై ,ఆతర్వాత తేజపూర్ కు చేరి, అక్కడి సాంఘిక సాంస్కృతిక నాయకులైన చంద్రనాథ శర్మ ,ఒమియో కుమార దాస్,జ్యోతి ప్రసాద్ అగర్వాల్ ,లాఖిందర్ శర్మ ల ప్రోత్సాహం పొందింది .
నాగోం లో స్కూల్ టీచర్ గా జీవితం ప్రారంభించిన చంద్రప్రభ తేజపూర్ ము నిసిపల్ ఎలిమెంటరి స్కూల్ హెడ్ మిస్ట్రెగా ఎదిగింది .1918లో తేజపూర్ లో జరిగిన అఖిలభారత క్షాత్ర సమ్మేళనం లో ,ఏకైక మహిళా ప్రతినిధిగా హాజరై అశేష జనాన్ని ఉద్దేశించి ధైర్యంగా’’ నల్లమందు ‘’ కు బానిసలౌతున్న వారిని రక్షించటానికి ప్రభుత్వం నల్లమందుపై నిషేదం పెట్టాలని ఎలుగెత్తి చాటింది .
క్రమంగా జాతీయ భావాలు అలవర్చుకొని గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొని ,తేజపూర్ మహిళలలో చైతన్యం కలిగించింది .1925లో నాగోం లో జరిగిన అస్సాం సాహిత్య సభకు ఆహ్వానం అందుకొని ,మహిళా సభ్యులు వేరుగా ఒక కంచె లాంటి ప్రదేశం లో ఉండటం చూసి వారిని ఆ హద్దులు దాటి ముందుకువచ్చి అందరితో కలిసి కూర్చోమని ప్రబోధిందిచగా , వారంతా ఆమాట పాటించి ఉవ్వెత్తున దూకి వచ్చి అందరిలో కలిసిపోయి కూర్చుని ఆనందాన్ని పొందారు . తర్వాత కైజర్ పారా స్కూల్ లో టీచర్ గా చేరి ,గౌహతిలో జరుగుతున్న నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ కు వెళ్ళటానికి అధికారులు పర్మిషన్ తిరస్కరిస్తే,ఉద్యోగానికి రిజైన్ చేసి హాజరైంది .1926లో అస్సాం ప్రాదేశిక్ మహిళా సమితి స్థాపించి బాల్యవివాహాలు బహుళ వివాహాలు ,దేవాలయాలలో స్త్రీలను అనుమతించకపోవటం ,మహిళా విద్య ,మహిళాసాధికారత ,స్వయం ఉపాధి మొదలైన సాంఘిక విషయాలలోస్త్రీ జాతికి న్యాయం చేయటానికి తీవ్ర కృషి చేసింది .ఆమె కృషి ఫలించి గౌహతి దగ్గర హజో లో ఉన్న హయగ్రీవ మాధవ దేవాలయం లో మొట్టమొదటిసారిగా మహిళా భక్తులకు ప్రవేశం లభించింది .
జాతీయ సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొన్న చంద్ర ప్రభను 1930లో ,1943లో అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.1947 ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక ఆమె సోషలిస్ట్ పార్టీలో చేరి నచ్చక మళ్ళీకాంగ్రెస్ లో చేరి ,1957అసెంబ్లీ ఎన్నికలలోపోటీ చేసి ఓడిపోయింది .ఆమె కొడుకు అతుల్ సైకియా అసెంబ్లీకి ఆతర్వాత ఎన్నికయ్యాడు .
చంద్రప్రభ సైకియాని స్థానిక మాగజైన్ బాహి లో 17వ ఏట మొదటి కథను 1918లో రాసింది .ఆతర్వాత వరుసగా ‘’పితృభిత’’-పితృగృహం ,సిఫాయి బిద్రోహత్-సిపాయీ తిరుగుబాటు ,దిల్లీర్ సింహాసన్ –ఢిల్లీ సింహాసనం ,కవి ఆనవ ఘోష్ నవలలు రాసింది .అభిజాత్రి అనే మహిళా పత్రికకు ఏడేళ్ళు ఎడిటర్ గా పని చేసింది .అఖిలభారత అస్సాం రైతు సభకు అధ్యక్షత వహించింది .1972లో భారత ప్రభుత్వం చంద్రప్రభకు మరణానంతర పద్మశ్రీ పురస్కారం అందించిగౌరవించి౦ది .ఆమె గౌరవార్ధం కేంద్ర ప్రభుత్వం 2002లో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది .
అస్సా౦మహిళాచైతన్యం కోసం హక్కులకోసం విద్యా వ్యాప్తికోసం ఉద్యమించి సాధించిన చంద్రప్రభాసైకియాని 72వ పుట్టిన రోజు న 16-3-1972న మరణించింది .గౌహతిలోని కామరూప్ లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కు ఆమె పేరుపెట్టి గౌరవించారు .తేజపూర్ లో’’ చంద్రప్రభా సైకియాని సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీ’’ ను 2009లో ఈశాన్యరాష్ట్రాలలో మహిళా విద్యా వ్యాప్తికోసం నెలకొల్పారు .ఆమె జీవిత చరిత్రను ప్రముఖ అస్సామీ నవలారచయిత హోమేన్ బోర్గోహైన్ భార్య నిరుపమా బోర్గో హైన్ ‘’అభియాత్రి –వన్ లైఫ్ -మెని రివర్స్’’నవలగాఅస్సామీభాష లో రాసింది .దీనిని ఇంగ్లీష్ లోకి ప్రదీపో బోర్గాహాని అనువాదం చేసి ముద్రిస్తే, కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభిచింది .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~