తేనీటి పానీయాలతో
మద్యపానంతో మాదకద్రవ్యాలతో
సమకూరే ఉత్తేజం తాత్కాలికమే…!
నీ అభిరుచులకు సానపెట్టు
సువ్యాపకాలకు శ్రీకారం చుట్టు
నూతనమైన ఆలోచనలు సాగించు
కొత్తదారిలో ఉత్తేజంతో పయనించు…!
నీకోసం ఏకాంతసమయం కేటాయించు
నీలోని నైపుణ్యాలకు పదునుపెట్టు
నీదైన ఆశయపు బాట పట్టు…!
దేశభవితకు సోపానాలై
ఉరకలెత్తే జలపాతపు
ఉత్తేజం నింపుకుని
ఉత్సాహంతో ఉరకలేసే యువతా…!
తాత్కాలిక ఉత్తేజాన్నందించే
చెడు వ్యసనాల తిమిరాన్ని తరిమివేసి
ఆరోగ్యకర అలవాట్లు వ్యాపకాలు కలిగి
శాశ్వత వెలుగులు పంచే
విద్యాజ్ఞాన భాస్కరుని నమ్ముకో…!!!
-చంద్రకళ. దీకొండ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~