స్త్రీవాద సాహిత్యం` ఒక పరిశీలన(సాహిత్య వ్యాసం)-వడ్డేపల్లి సంధ్య

ISSN – 2278 – 478

నేపథ్యం:

ఆదిమసమాజం కాలంలో సమాజంలో మాతృస్వామిక వ్యవస్థనే ప్రధానంగా కొనసాగేది. ఇప్పటికీ కొన్ని ఆదిమ తెగలలో ఆ లక్షణాలను మనం చూడవచ్చు. అయితే కుటుంబం, సొంత ఆస్తి, గణరాజ్యాల ఆవిర్భావం తరువాత మాతృస్వామిక వ్యవస్థ స్థానంలో క్రమంగా పురుషాధిక్యత పెరిగిపోయింది. పురుషాధిక్య సమాజం వేళ్లూనుకుంది. స్త్రీలపై పురుషులు పెత్తనం మొదలైంది. ఆడవారి స్వేచ్ఛకు, స్వాంతంత్య్రాలకు కళ్లెం వేశారు. అందుకు మనుధర్మశాస్త్రమే ఒక ఉదాహరణ. చదువుకు దూరం చేశారు. ఆడవాళ్లు ఎలా జీవించాలి? పురుషుడికి లొంగి ఎలా ఉండాలి? ఆచారాలను ఎలా పాటించాలి? కట్టుబొట్టు ఇలా ప్రతి అంశంలోనూ పరిమితులు, పరిధులు.. ఆంక్షలను విధించారు. విద్యకు దూరం చేశారు. హక్కులను నిరాకరించారు. ఇది చివరకు ఎక్కడి వరకు చేరుకున్నదంటే ఇంట్లోని పిల్లలు పుట్టినప్పటి నుంచే ఈ వివక్ష కొనసాగడం వరకు మొదలైంది. కొడుకు అంటే వారసుడు. కూతురు అంటే గుండెల మీద భారమన భావనలా మారిపోవడం విషాదకరం.

పెంపకంలోనూ వివక్షత. ఇది తరతరాలుగా కొనసాగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలోనే స్త్రీవాదం మొదలైంది. దేశంలోకి బ్రిటీష్‌ వలసపాలన మొదలైన తరువాత అందుబాటులోకి వచ్చిన తరువాత, అంతకు ముందుకు కూడా విద్యనభ్యసించిన మహిళలు హక్కుల కోసం గళమెత్తారు. సమాజ ప్రగతిలో, కుటుంబంలో స్త్రీ పోషిస్తున్న పాత్రను సమాజానికి తెలియ పరచడమే గాకుండా, హక్కుల కోసం నినదించారు. విద్యాజ్ఞానాన్ని సముపార్జించిన కొంత మంది స్త్రీలు తమ జీవితానుభవాలను, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను, వారి హక్కులపై గళం వినిపించడం మొదలుపెట్టారు. కలాలతో కవనం సాగించారు. ఇదే తరువాతి క్రమంలో స్రీవాద సాహిత్యంగా వెలుగులోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం ఇది మరింత జోరందుకుందుకుంది. అనేక మంది కవియిత్రులు వెలుగులోకి వచ్చారు. అయితే స్త్రీవాద రచనలపై కూడా అనేక విమర్శలు? అనేక నిందలు? రచయిత్రులపైనా దాడులు జరగడం మొదలైంది. ఇది కూడా పురుషాధిక్యతకు మరో నిదర్శనం. మరి స్త్రీ వాద సాహిత్యం ఎలా విస్తృతి పొందింది. అన్నిరంగాలను ఎలా విస్తరించింది? వెలుగులోకి తీసుకొచ్చిన అంశాలేమిటీ? సాధించిన ఫలితాలు ఏమిటీ? తదితర అంశాలపై తెలుసుకోవాల్సఇన అవసరముంది. చర్చించాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది.

వివరణ: దేశంలో అనేక వాదాలు వచ్చాయి. బహుజనవాదం, దళితవాదం, మైనార్టీ వాదం, అభ్యుదయవాదం, సంస్కరణ వాదం ఇలా అనేక వాదాలు వెలుగులోకి వచ్చాయి. అందులో స్త్రీవాదం కూడా ఉంది. అయితే మొదటగా అసలు స్త్రీవాద సాహిత్యమంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పటి వరకు సమాజంలో ఒక అపోహ నెలకొని ఉన్నది. అదేమిటంటే స్త్రీవాద సాహిత్యమంటే పురుషులను విమర్శించడమేనని భావన నెలకొని ఉండడమే శోచనీయం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే స్త్రీవాద సాహిత్యంలో వెలువడే నిరసన, అసహనం కేవలం పురుషాధిక్య సమాజంపైన కానీ పురుషులపైన కాదని అర్థం చేసుకోవాల్సి ఉంది. వ్యక్తులుగా సమాజంలో ఆడ, మగలో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నవారు ఉంటారు. వారి ఆలోచనలనీ, వారి భావజాలనాన్ని నిర్దేశించిన అంశం ఏదయితే ఉందో దాని దృష్ట్యానే ఆ కాలం నాటి సమాజాన్ని, అందులో విలువలను అంచనా వేస్తాం.

సమాజంలోని అన్ని రంగాల్లో నిరాటకంగా కొనసాగుతున్న చెలామణి అవుతున్న పురుషాధిక్యత స్వభావాన్ని ప్రశ్నిస్తూ, దాని మార్చే దిశగా ఆడవాళ్లనీ, మగవాళ్లనీ కూడా చైతన్యవంతులను చేసి ఒక మంచి మానవ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా నడవాలన్నదే స్రీవాద సాహిత్యం అంతిమ లక్ష్యం. ఇక స్రీవాద సాహిత్యంలో స్నేహం, ప్రేమ, శృంగారం, పోరాటం ఇలా అనేక పార్శ్వాలు ఉన్నాయి. సమాన హక్కులు కావాలని పోరాడుతున్న అంశాలలను, వాటి ప్రాధాన్యతలను వివరిస్తున్న రచనలు, వ్యాసాలు కూడా ఉన్నయి. ఇలా సుమారు వందేళ్ల తెలుగు సాహిత్యాన్ని పరిగణలోకి తీసుకుంటే గతంతో పోల్చితే 70వ దశకం తరువాత ఈ స్త్రివాద సాహిత్యం దేశవ్యాప్తంగా చాలా విస్తృతి పొందింది. అందుకు ప్రత్యేక కారణాలున్నయి. ప్రపంచ వ్యాప్తంగా పెల్లుబుకిన విప్లవాలు కావచ్చు. మరొక కారణం భారత్‌లోని చదువుకున్న స్త్రీల ఆలోచన విధానంలో, రాజకీయ పరిజ్ఞానంలో అనేక మార్పులు వచ్చాయి. వాటి నీడలు మన తెలుగు రాష్ట్రాలపైనా కూడా ప్రసరించాయి. అయితే మరీ ముఖ్యంగా 1975ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా పక్రటించారు. ఈ నేపథ్యంలో స్త్రీలకు సంబంధించిన అంశాలు ఎన్నో ప్రధాన స్రవంతి చర్చల్లో భాగమయ్యాయి.

ఈ పరిణామాలు తెలుగు సాహిత్యాన్ని తద్వారా తెలుగు సమాజాన్ని తాకాయని వివరించాయి. ఈ స్ఫూర్తితో తెలుగు సాహిత్య చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ దశాబ్దంలోనూ కనబడనంతగా అనేక మంది స్త్రీలు స్త్రీవాద స్ఫూర్తితో, స్త్రీవాద ఉద్యమాల ప్రేరణతో పెద్దఎత్తున సాహిత్య ప్రపంచంలోకి దూసుకొచ్చారు. ఉద్వేగాలు అతి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఆ ఉద్రే కం కవిత్వంలోనే గాఢంగా ఆవిష్కృతమవుతుందని నిరూపిస్తూ వందల సంఖ్యలో స్త్రీలు కవిత్వం రాయడం మొదలుపెట్టారు. కలాల కవనం సాగిస్తూ అక్షరసేద్యం చేయడం మొదలుపెట్టారు. అవి క్రమేపీ విస్తరిస్తూ సంకలనాలు వెలువడ్డాయి. కొత్త బాటలను వేశాయి. ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయనే అంశాన్ని చర్చించుకోవాల్సి ఉంది. ఇక్కడ కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో స్రీవాద సాహిత్యం ఆవిర్భావం.. విస్తృతి, ప్రస్తుతం సమాజంలో పోషిస్తున్న పాత్రను అంచనా వేయాలి. స్త్రీవాద సాహిత్యం పోషించిన పాత్రను, స్పృశించిన కోణాలను తెలుసుకోవాల్సి ఉంది.

దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే తెలంగాణ ప్రాంతం ప్రత్యేకమైనది. రాజకీయ ఆలోచనలు భిన్నమైంది. సుదీర్ఘకాలం పాటు నిజాం పాలన కింద మగ్గిపోయింది. అదీగాక దొరలు, దేశ్‌ముఖ్‌లు ఇలా పెత్తందారుల ఉక్కుపాదాల కింద గ్రామాలు నలిగిపోయాయి. అందులో మరీ ముఖ్యంగా మాన ప్రాణాలను కోల్పోయింది.. నరకయాతనను అనుభవించింది స్త్రీలేనని చెప్పాలి. అయినప్పటికీ సమాజంలో వారు ఎదుర్కొన్న వివక్షతలను, భరించిన అవమానాలను, నరకయాతనను అద్దం పట్టిన రచనలు చాలా తక్కువేనని చెప్పాలి. వెలుగులోకి వచ్చిన ఆ రచనలు ఏమైనా ఉన్నాయంటే లేవనే చెప్పాలి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపిన కమ్యూనిస్టు అగన్రేతలకు కూడా స్త్రీల ఆలోచనల మీదా కానీ, వారి సమస్యలపైనా ఒక ప్రణాళిక కానీ లేవనే చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే నాటి ఉద్యమంలో స్త్రీలు పోషించిన పాత్రను, వారి సేవలను ఎవరూ అద్దం పట్టంలేదు. సాయుధపోరాటం నేపథ్యంలో వచ్చిన సాహిత్యంలోనూ స్త్రీల ఊసే లేదు. ఇక్కడ పురుషాధిక్యత ఒక కారణమైతే ఆంద్ర వలసాధిపత్యం కూడా ఒక భావన కూడా. ఇక తెలంగాణ ప్రాంతంలో ఆ సమయానికకి చదువుకున్న స్త్రీలు చాలా తక్కువ మంది. కాబట్టి నాటి ఉద్యమంలో వారు పోషించిన పాత్ర ఏ మాత్రం వెలుగులోకి రాలేదు. కానీ స్త్రీ శక్తి సంఘటన అనే స్త్రీవాద సంస్థ గొప్ప కార్యాన్ని చేపట్టింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న ఆడవాళ్ల అనుభవాలను ‘‘మనకు తెలియని మన చరిత్ర’’ పేరిట పుస్తకం తీసుకొచ్చింది. సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆడవాళ్లను నేరుగా కలిసి వారి అనుభవాలను తెలుసుకుని, వారి మాటల్లోనే అందులో ముద్రించడం విశేషం.

ఒర పాటి తమ ఉద్యమంలో భాగస్వాములైన స్త్రీలంతా ఆ ఉద్యమం గురించి వారేమనుకున్నది బహుశా కమ్యూనిస్టులు కూడా ఊహించి ఉండరు. అదీగాక స్త్రీ శక్తి సంఘటన ఇక్కడ మరొక విషయాన్ని కూడా నొక్కి చెప్పింది. అదేమంటే ఆడవాళ్ల సేవలను, సహకారాన్ని తీసుకోవడంలో కమ్యూనిస్టు పార్టీలు చూపిన శ్రద్ద వారిని కుటుంబపు ఆధీనం నుంచి, ప్యూడల్‌ భావజాలం నుంచి ఆడవాళ్లకు విముక్తి కల్పించేందుకు ఏ ఆలోచనలు చేయకుండా, ఉన్న విలువలను ఉన్నట్టుగానే అట్టేపెట్టాలని చూశారని చాటింది. స్త్రీల విషయంలో పార్టీ ఒక విధమైన తేడాను పాటించిందని స్పష్టం చేసింది.

ఈ ఒక్క పుస్తకం ఒక పక్క స్త్రీల దృక్పథాన్ని ఉద్యమంలో పాల్గొన్న ఆడవాళ్లు ఎదుర్కొన్న సాదకబాధల్ని, అవమానాలను, అభద్రత భావాలను తెలియపరిచింది. స్త్రీల దృక్పథం ఎందుకు అవసరం? స్త్రీవాద సాహిత్యం ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. మరోవైపు ప్రజాస్వామ్యలు, సమాన హక్కులు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పార్టీల నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. నాడు ఆ పత్రిక లేవనెత్తిన ప్రశ్నలకు ఆటు తరువాతి కాలంలో కమ్యూనిస్టు నేతలు సమాధానాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడిరదంటే ఇక్కడ స్త్రీవాద సాహిత్యం ఆవశ్యకతను అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఈ పుస్తకంపై దుమ్మెత్తిపోసిన వారు ఉన్నా వారంతా పురుషాధిక్య ప్రపంచానికి ప్రతిబింబాలు మాత్రమే.

అటు తరువాత స్వాతంత్య్రం వచ్చిన తరువాత తెలంగాణ స్త్రీల పరిస్థితి ఏమంత మెరుగుపడిరదా అంటే లేదనే చెప్పాలి. కానీ స్త్రీల బాధలు, ఎదుర్కొంటున్న సమస్యలు ఏవీ కూడా సాహిత్యంలో ప్రతిబింబించాయా? అంటే లేశమాత్రమేనని చెప్పాలి. ఎవరో చదువుకున్న, ఉన్నత కుటుంబ స్త్రీలు రచించిన సాహిత్యం మాత్రమే వెలుగులోకి వచ్చింది తప్ప సామాన్య స్త్రీల దృక్పథంలోంచి వచ్చిన రచనలు ఏ మాత్రం లేవు. ఉన్న కవయిత్రులు కూడా అప్పటికే ఉన్న పరిమితులకు లోబడి మాత్రమే రచనా వ్యాసంగాన్ని కొనసాగించారే తప్ప ఆ పరిధిని ధాటి, పురుషాధిక్యతను కలాలను ఎక్కుపెట్టిన వారు మాత్రం లేకపోవడం గమనార్హం. వారి రచనల్లో ఒక అశాంతి, దిగులు, అంతర్మథనం, చెప్పుకోలేని అసహనం ప్రతిబింంబించేవి.

అందుకు రేవతీదేవీ రచించిన ‘‘శిలాలోహిత’’ సంకలనం ఒక నిదర్శనం. ఇది ఒక పరిస్థితి అయితే మరోవైపు అప్పటికీ పరిస్థితి ఏమిటంటే స్త్రీల సమస్యలను కూడా మగవాళ్లే మాట్లాడాలి అన్నంతగా కొనసాగింది. 1981లో ఖమ్మంలో ఖమ్మం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం వాళ్లు ‘సాహిత్యంలో స్త్రీ’ అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. అందులో ప్రాచీన కాలం నుంచి అప్పటి కాలం దాకా స్త్రీల పరిస్థితి వివిధ రంగాల్లో ఎలా ఉన్నది? అనే అంశాలను చర్చించింది. ఆ పుస్తకంలోని మొత్తం వ్యాసాల్లో స్త్రీవాద రచయితలివి ఓ మూడు ఉంటే మిగతావన్నీ రాసింది మగవాళ్లే కావడం గమనార్హం. స్త్రీల సమస్యలను కూడా మగవారే వారి కోణంలోనే రాయడం ఇక్కడ మరింత ఆశ్చర్యాన్ని, అప్పటికీ స్త్రీవాద సాహిత్యం పరిణతి దుస్థితిని, రచయిత్రుల ఉనికిని తేటతెల్లం చేస్తున్నది. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెలుగునాట ఉవ్వెతున్న రైతాంగ, కూలీల పోరాటం, విప్లవోద్యమం జడత్వం ఆవహించిన స్త్రీలను ఒక కుదుపు కుదిపింది. తట్టిలేపింది. అక్షరాయుధాలను పురుషాధిక్యతపై సూటిగా ఎక్కుపెట్టేలా ప్రేరణ ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆ విప్లవ చైతన్యం స్త్రీవాద సాహిత్యానికి మేలుకోలుపుగా నిలిచింది. కొత్త పుంతలను తొక్కించింది.

అందులో మొట్టమొదటగా 1984లో రచయిత సావిత్రి రాసిన ‘‘బంధిపోట్లు’’ వెలువరించిన కవితా సంకలనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. రేవతీదేవీ సాహిత్యానికి భిన్నంగా సావిత్రి తన అక్షరాలను ఎక్కుపెట్టడం స్త్రీవాద సాహిత్యంలో వచ్చిన స్పష్టమైన మార్పునకు సంకేతం. ‘‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్లి చేస్తానని/ పంతులుగారన్నప్పుడే భయమేసింది/ఆఫీసులో నా మొగుడున్నాడు/ అవసరమొచ్చినా సెలవివ్వడని/ అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది! వాడికేం మగ మహారాజని ఆడా,మగా వాగినప్పుడే నాకు అర్థమైంది/ పెళ్లంటే పెద్దశిక్షని మొగుడంటే స్వేచ్ఛ భక్షకుడని / మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందని! ఇలా సూటిగానే అక్షరాలను ఎక్కుపెట్టింది. విప్లవోద్యమం అందించిన చైతన్యంతో స్త్రీవాద సాహిత్యం మరింత రాటుదేలింది.

జయప్రభ రాసిన ‘‘వామనుడి మూడో పాదం’’ రచన స్త్రీవాద సాహిత్యాన్ని మరో పైమెట్టుకు తీసుకెళ్లింది. ఆ పుస్తకంలో రచయిత వ్యక్తం చేసిన ఏ భావంలోనూ సందిగ్ధతలు, శషబిషలకు తావులేదు. ఒక స్పష్టమైన రాజకీయ దృక్ఫథంతో, స్త్రీ కోణంలో ఒక స్త్రీగా సమాజంలోని పురుషుల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిర్మోహమాటంగా, నిష్కర్షగా చర్చకు పెట్టింది. రచయిత జయప్రభ సూటిగా అనాదిగా కొనసాగుతున్న లింగ వివక్షతను ఎలుగెత్తి చాటారు. ఆ సంకలనంలోని ‘చూపులు’ అనే కవితలో కామంతో చూసే మగవారి చూపులు ఆడదానిని ఎంతగా గాయపరుస్తాయో చాలా లోతుగా విడమరిచి చెప్పారు. ఇది ఇతర భాషల్లోకి కూడా అనువాదం కావడం ఇక్కడ విశేషం.

‘‘రెండు కళ్లనించి చూపులు సూదుల్లా వచ్చి
మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి
చూపులెప్పుడూ ముఖంలోకి చూడవు
మాట ఎప్పుడు మనసులోంచి పుట్టదు
కనిపించినప్పుడల్లా కంపరం పుట్టేలా
వంటిమీదా చూపులు చెదల్లా పాకుతూ ఉంటాయి

ఆ కళ్లలో లక్ష వర్గాలున్నాయి
కానీ చూపులకు మాత్రం వర్గ విబేధాలు లేవు
ఆ చూపుల్లో ఎప్పుడూ ఒకే సంకేతం ఉంటుంది
చొంగ కార్చే కుక్కలాంటి ఆకలుంటుంది
వికృతమైన భల్లూకపు పట్టులాంటిదేదో విడవక
కలల్లో సైతం వెంటాడుతుంది

చిక్కని ఈ అడవిలో వెలుగుకీ చీకటికీ తేడానే ఉండదు
చూపుల నుంచి దాటుకోవడానికి స్థలమనేదే ఉండదు
రోడ్డుమీదా,, బస్సులోనూ.. క్లాసులోనూ
వేసే ప్రతి అడుగు వెనకా

శరీరంలో ఏదో ఒక భాగాన్ని గాయం చేస్తూ
విషపు చూపులు గుచ్చుకుంటూనే ఉంటాయి
ఒక్కోసారి భయమేసి
సుదూర ఆకాశంలోకి.. శూన్యంలోకి..
మాయమయి పోవాలనిపిస్తుంది
కానీ,
పలాయనం పరిష్కారం కాదని
విషపు చూపును నెదుర్కొనే ముళ్లలాంటి తీక్షణతని
కళ్లకి నేర్పటం మొదలెట్టాను
ఇప్పుడు ఆ కళ్లను వెంటాడడానికి
కళ్లతోనే యుద్ధం చేస్తాను
సూటిగా రెండు క్షణాలు కళ్లలోకి చూడలేని
పిరికి చూపులు
పాతాళంలోకి పారిపోతాయి
అప్పుడనుకుంటాను కళ్లకే కాదు ఆ దేశంలో ఆడదానికి
వళ్లంతా ముళ్లుండే రోజు ఎప్పుడొస్తుందా అని!

అలా అప్పటి వరకు సాహిత్యంలో అంటరాని వస్తువులుగా ఉండి, పురుషుల కంటికి కనబడని అన్ని వస్తువులనూ తీసుకుని స్త్రీలు కవితలను అల్లారు. కథలను రాశారు. నవలలను వెలువరించారు. తెలుగు సాహితీ ప్రపంచం విస్తుపోయేలా, విభ్రాంతికి గురయ్యేలా బాణం ములుకంతా సూటిగా తాకే కవితలు వెల్లువెత్తాయి. అదేవిధంగా 1990లో వసంతా కన్నభిరానే సారథ్యంలో ‘కఠోర షడ్జమాలు’ అనే వ్యాస సంపుటి వచ్చింది. స్త్రీవాద సాహిత్యానికి సంబంధించి చెప్పుకోవాల్సిన పుస్తకాలలో ఇది కూడా ఒక ముఖ్యమైనది. త్రిపురనేని శ్రీనివాస్‌ కవయిత్రుల కవితా సంకలనాన్ని ‘‘గురి చూసి పాడే పాట’’ను ప్రచురించారు. మొత్తంగా ఇవన్నీ ఆడవారీ ఆలోచనల్లో వచ్చిన పెను మార్పును, విప్లవచైతన్యం నింపిన స్ఫూర్తిని అద్దం పడతాయి. సమస్యల పట్ల ఆడవాళ్లు నిశ్శబ్దంగా, తటస్థంగా ఉండే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. మొత్తంగా చెప్పాలంటే స్త్రీవాద సాహిత్యం అనేక ఒడిదొడుకులను తట్టుకుంటూ, విమర్శలను ఎదుర్కొంటూ నిలబడగలిగింది. వాణిని ప్రబలంగా వినిపించగలిగింది. తుదకు సమాజంలోనూ, సాహిత్య వర్గాలలోనూ స్త్రీల సమస్యలపై ఒక ప్రత్యేక అవగాహనను కల్పించడంలో కీలకపాత్రను పోషించిందని చెప్పక తప్పదు.

పాటిబండ్ల రజనీ, ఘంటశాల నిర్మల, మందరపు హైమావతి తదితర ఎంతో మంది కవయిత్రులు తమ కలాలను ఎక్కుపెట్టారు. గృహ హింస, చాకిరీ, సామాజిక కట్టుబాట్లు, పురుషాధిక్యతపై కవనం సాగించారు. అటుతరువాత దేశంలోకి ప్రవేశపెట్టబడిన నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మార్పులు, ఆడవారీ దైనందిక జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీకి స్త్రీలు ఏవిధంగా బలవుతున్నారు? ఆడది ఎలా అంగడి బొమ్మగా మారిపోతున్నది? తదితర అంశాలను కూడా ప్రధాన ఇతివృత్తాంతంగా తీసుకుని రచయిత్రులు సాహిత్యాన్ని సృష్టించడం మరో విశేషం. ప్రపంచీకరణ కల్పిస్తున్న భ్రమల్ని తొలగించేలా, వెలుగు జిలుగుల తెరలను చీల్చిలా రచనలు చేస్తున్నారు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్త్రీవాద సాహిత్యం ఏక కాలంలో రెండు బృహత్కార్యాలను నిర్వర్తించింది. అవేమిటంటే.. ఒకవైపు స్త్రీల ఆలోచనలను, అనుభవాలను అక్షరబద్ధం చేయడమేగాక, మరోవైపు పురాణగాథలను స్త్రీల దృక్ఫథం నుంచి పున:విశ్లేషణ చేయడం. ఇది ఒక్క స్త్రీవాద సాహిత్యానికి మాత్రమే చెల్లింది. స్త్రీవాద కవిత్వంతో పోలిస్తే స్త్రీవాద సాహిత్యం కలిగించిన ప్రభావం తక్కువేనని చెప్పాలి. ఓల్గా రాసిన ‘స్వేచ్ఛ’ నవలిక, ‘అయోని’ వంటివి కొత్త చర్చకు తెరలేపవచ్చు కానీ చాలా వరకు వెలువడిన స్త్రీవాద నవలలు అ పనిని పరిపూర్ఱం చేయలేకపోయాయి. కాకపోతే ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. 1993 తరువాత స్త్రీవాద సాహిత్యానికి వంకలు పెట్టే అవకాశం విమర్శకులకు లేశమాత్రమైనా దక్కకపోవడం అతిశయోక్తి ఏమీ కాదు. అటు తరువాత స్త్రీవాద సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపుతోపాటు పత్రికలలో చోటు కూడా లభించింది. అదీగాక మైనార్టీ, దళితులు, ఆదివాసీ స్త్రీలు కూడా తమ అనుభవనాలను, ఆలోచనలను, తమ సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షతను అక్షరబద్ధం చేయడం మొదలు పెట్టడం స్త్రీవాద సాహిత్యం సాధించిన పెద్ద విజయం.

ముగింపు:
చిన్న పాయగా మొదలైన స్త్రీవాద సాహిత్యం ఒక స్రవంతిలా మారింది. అయితే ఇప్పుడది మరో పెను ప్రమాదాన్ని ఎదుర్కొనబోతున్నది. అందులో ముఖ్యంగా ప్రపంచీకరణ పురికొల్పుతున్న అభివృద్ధి నమూనా. దీని ఫలితంగా ముఖ్యంగా బలవుతున్నది స్త్రీలే. ఆర్థిక అవసరాలు పెరగడంతో స్త్రీలు కూడా ఇప్పుడు పురుషులతో సమానంగా పనిచేయాల్సిన దుస్థితి. తప్పని పరిస్థితుల్లో వారిని ఆ స్థితిలోకి నెట్టివేయడం జరుగుతున్నది. దీని మూలంగా స్త్రీలు ఇప్పుడు ఆవిశ్రాంతంగా శ్రమ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇటు పొద్దంతా కార్యాలయాల్లో, అటు తరువాత కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణ, వృద్ధుల ఆలనా పాలన బాధ్యతలతో పెనుభారాన్ని మోస్తున్నారు. ఈ కోణంలో మరింత సాహిత్యం వెలువడాల్సిన అవసరముంది. మరొకమైన పెను ప్రమాదం ఏమిటంటే అతివాద మతోన్మాదం. మతం ఏదయినా సరే. ఆ చాందసవాదాన్ని ఆదిలోనే అడ్డుకోకపోతే దాని ప్రభావానికి లోనయ్యేది.. బలయ్యేది మొదల స్త్రీలేనన్నది నిర్వివాదాంశం. ఇటీవల కాలంలో లవ్‌ జిహాద్‌ పేరిట పలు బీజేపీ రాష్ట్రాలు తీసుకొస్తున్న ప్రత్యేక మత చట్టాలు అధిక శాతం స్త్రీలనే ప్రభావితం చేస్తాయని చెప్పతప్పదు. తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛను హరించి వేస్తున్నది. రేపు ఈ అతివాద మతోన్మాద శక్తులు మరింత రెచ్చిపోయే అవకాశం వుంది. ఒకవేళ అదే జరిగితే దశాబ్దాలుగా స్త్రీలు సాధించిన హక్కులను, ఆదర్శాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. గతకాలం నాటి మనుధర్మాలను పున:పత్రిష్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అప్పుడు స్త్రీలు చదవాలా వద్దా? ఉద్యోగాలు చేయాలా వద్దా? ఎలా మాట్లాడాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఏం రాయాలి? ఏం రాయకూడదు? వంటి అన్ని అంశాల్లోనూ పరిధులు విధించే అవకాశముంది. ఈ మతోన్మాదాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి. ప్రపంచీకరణ వికృత రూపాన్ని, పెను ప్రభావాన్ని స్త్రీల కోణంలో మరింత బలంగా వినిపించాలి. అది స్త్రీవాద తక్షణ కర్తవ్యం. అదే రేపటి భవితవ్యం.

 ఆధార గ్రంథాలు:
1) సాహిత్యాకాశంలో సగం (కాత్యాయని విద్మహే)
2) కఠోర షడ్జమాలు (వసంత)
3) నిర్వచనం (ఘంటసాల నిర్మల)
4) అసమానత్వం నుంచి అసమానత్వంలోకి (రంగనాయకమ్మ)
5) విమల (వంటిల్లు, సౌందర్యాత్మక హింస
6) స్వేచ్ఛ (నవలిక), రాజకీయ కథలు (ఓల్గా)
7) నల్లపొద్దు (గోగు శ్యామల)

-వడ్డేపల్లి సంధ్య
తెలుగు అధ్యాపకురాలు
తెలంగాణ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల
రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో