అగ్రరాజ్యంలో అధికారికంగా
అందలమెక్కి బ్యాలెట్ పై కూర్చొని
‘ఆటా’లాడుతూ ‘తానా’తోడ్పాటుతో
మంగళ కైసికీ రాగమాలపిస్తోంది
ఆస్ట్రేలియాలో అందరినోటా
‘తెలుగు పలుకు’లతో పలకరిస్తానంటూ
సింగపూర్లో సింగారించుకుని
సింహళ ద్వీపంలో తెలుగుదీపం
వెలిగించి
బంగ్లాలో బలంగా నిలబడి
బర్మాలో బాటలు వేస్తూ
బలపడతానంటోంది
నా తెలుగు
మరీచుని దీవిలో భాషాక్షరాలతో
వెండి వెన్నెల గిన్నెలో పరమాన్నపు
పాల బువ్వ కలిపి
తందననా భళా తందనానా అంటూ
అన్నమాచార్య రాగమాలపిస్తూ
మురిపిస్తూ మైమరపిస్తూ
అందరినోటా తేనె(తెలుగు) పలుకులు
పలికిస్తూ
పరాయి దేశాలలో తలఎత్తుకు నిలబడిన నా తెలుగు
నేడు మూలిగే నక్కపై
తాటికాయ పడ్డట్టు
మాతృభూమిలో మరణశయ్యపై
మూలుగుతోంది
అహో! ఎంతటి దుస్థితి కల్గినది
నా మాతృభాషామతల్లికి
రెక్కలొచ్చిన పక్షిపిల్లల్లా
అమ్మ(భాష)ను వదిలి
పరభాషపై వ్యామోహంతో
పండితుని నుండి పామరుడి వరకూ
పాలకుడి నుండి పాలేరు వరకూ
ఆంగ్ల మాయా లోయలో పడి
అందమైన తెలుగుపూల తోటను
నరికేస్తున్నారే….
ఏది ఏమైనా ఎంతమంది
క్షేత్రాన్ని కుళ్ళగించినా
ఎంతలా ఎండ గట్టినా
అమ్మతనంలా సస్యబీజమై పాతుకుపోతానంటోంది
నా తెలుగు
వేల ఏండ్ల ఘన చరిత్ర
కలిగిన నా తెలుగు
నేడు కనుమరుగవుతుందంటారా
పరిపాలకుల్లారా ఆలోచించండి
ఆంగ్లం అవసరమే
మాతృభాషను మరవొద్దు.
-వెంకటేశ్వరరావు కట్టూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~